ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 12 March 2013

"ముగ్ధమోహనం" (15th chapter)
(09-02-2013)
........
"మౌనం ఎంతందంగా వుంటుంది. స్పర్శ ఎంత గొప్పగా వుంటుంది. మండువేసవిలో మంచు గదిలో విశ్రమిస్తున్నట్టు వుంది..బీడు భూమిలో కుంభ వృష్టిగా వర్షం కురిసినట్టు...ఓదార్పు మేఘం తన మది చుట్టూ పరిభ్రమిస్తున్నట్టు..."
కాలంతో పని లేదు...ఒంటరి తనం జాడ లేదు....వేదనల ఊసు లేదు".
"రామాలాలీ మేఘశ్యామా లాలీ...వటపత్రశాయికి వరహాల లాలీ" చిన్నప్పుడెప్పుడో అమ్మ లీలగా పాడి తనని నిద్ర పుచ్చిన జ్ఞాపకం. ఇప్పుడు కార్తికేయను నిద్రపుచ్చాలని కాదు.. కాదు అతని అలసటను తరిమేయాలని ప్రయత్నిస్తోంది ముగ్ధ. చిత్రంగా తను పెళ్ళికాని అమ్మాయి అని గుర్తుకు రాలేదో....తన వాడే కదా..పెళ్లి అయితేనే తన వాడా? తాళి కడితేనే మనువాడినట్టా? అన్న భావమో...
ఆమె లేత పొట్ట మీద కార్తికేయ పెదాలు విశ్రమిస్తున్నాయి. ఎంత గొప్ప భద్రతా భావం?
ముగ్ధ తన కోసం ఎంతగా తాపత్రయ పడింది. తనను కాపాడుకోవాలన్న ఆ ఫీలింగ్ గొప్పగా వుంది.
అతనిలోని ఆ భావాలను అతని పెదవులు కమ్యూనికేట్ చేస్తున్నాయి.
అసలు జరిగింది వేరు. ఇన్ స్పెక్టర్ తనని అరెస్ట్ చేయడం...తను ఆడిన నాటకమే...కొద్ది గంటలు వెనక్కి వెళ్తే అసలు ఏం జరిగిందో తెలుసుకోవచ్చు.
కార్తికేయను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడ...అప్పుడు ..జరిగిందేమిటి?
******************** ************************ **********************
పోలీస్ స్టేషన్
కార్తికేయ లోపలి అడుగు పెట్టగానే సెంట్రీ డ్యూటీ చేస్తోన్న గార్డ్స్ ని పిలిచి మరో గంట వరకు ఎవ్వరినీ లోపలికి రానివ్వ వద్దని చెప్పాడు. కార్తికేయ దగ్గరికి వెళ్లి సెల్యూట్ చేసాడు.
సారీ సర్ అంత మంది ముందు మిమ్మల్ని...ఇంకా ఏదో అనబోతుండగా "నో నో మిస్టర్ శ్రీ మీరు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ..ఇంతకు ముందు వున్న వాళ్ళు డబ్బుకు ఆశ పడ్డారు. గూండాలకు సాయపడ్డారు. పోలీసుల్లో మీ లాంటి నిజాయితీ పరులు ఉంటారని నిరూపించారు.ఆ ఏరియాలో గత ఇరవై సంవత్సరాలుగా ఈ దారుణం జరుగుతుంది. అది ప్రభుత్వం స్థలం..రాజకీయ నాయకులు,గూండాలు కలిసి చేసిన కుట్ర.ఎప్పుడైతే మీడియా దృష్టి ఫోకస్ అయిందో...రాజకీయ నాయకులు సైలెంట్ అవుతారు. ఇదే టైం లో అక్కడ అన్ని, ఆక్రమిత కట్టడాలను కూల్చేస్తే...సమస్య సగం సాల్వ్అవుతుంది చెప్పాడు, కార్తికేయ. ఎక్సలెంట్ సర్...ఎప్పుడూ ఎవరో ఒకరి ఒత్తిళ్లకు తలోగ్గుతూ వ్రుత్తి పరమైన ఆనందాన్ని కోల్పోతున్నాం సర్..ప్రతీ ఒక్కరూ మమ్మల్ని వేలెత్తి చూపేవారు..మాకు వుండే ప్రెషర్స్..మీ లాంటి వాళ్ళకే తెలుసు. నా నిజాయితీకి గుర్తింపుగా ప్రభుత్వం సస్పెన్షన్ ఇస్తే..మీరు తిరిగి నా పోస్ట్కు ఓ విజయాన్ని ఇచ్చారు..సిన్సియర్ గా చెప్పాడు శ్రీ .
"ఓకే ...ఇంతకీ యాసిక్ ఎక్కడ...అతడి కోసమే మనం ఇంత డ్రామా ఆడింది. వాడి ద్వారా నిజాలు కక్కించడానికే ..." చెప్పాడు కార్తికేయ
"యస్ సర్ .వాడి మొహం కొంత కాలిపోయింది.ఈ పరిస్థితుల్లో ...వాడు..?
"మాట్లాడాలి శ్రీ...మనం మాట్లాడించాలి .."అన్నాడు.
"అంబులెన్స్ లోనే యాసిక్ కు చికిత్స జరుగుతుంది. ఇంకాసేపట్లో అంబులెన్స్ వస్తుందని చెప్పాడు.
సరిగ్గా పది నిమిషాల్లో అంబులెన్స్ వచ్చింది. కార్తికేయ అంబులెన్స్ లోకి ఎక్కాడు. డాక్టర్స్ చికిత్స చేస్తున్నారు.
"ఎలా వుంది డాక్టర్ ?..ఓ డాక్టర్ ని ఉద్దేశించి అడిగాడు కార్తికేయ.
"క్రిటికల్ గానే వుంది...కాకపొతే యాసిడ్ ని ఎక్కడ పోస్తే తీవ్రత తగ్గుతుందో అక్కడే ప్లాన్డ్ గా పోశారు.
లేక పొతే ఈ పాటికి మేజిస్ట్రేట్ రావాల్సి వచ్చేది" ఆ డాక్టర్ చెప్పాడు.
"యస్...డాక్టర్ ..అని యాసిక్ వైపు తిరిగాడు.మొహం లో విపరీతమైన పెయిన్. అంత బాధలోనూ, తన మీద యాసిడ్ పోసి పలకరించడానికి వచ్చిన కార్తికేయ వంక భయంగా చూసాడు .
"హలో మిస్టర్ యాసిక్ ...ఎలా వున్నావ్? అంటూ కుడి చేతిలో వున్న యాసిడ్ బాటిల్ తీసి "అన్నట్టు నువ్వు బాత్ రూమ్స్ క్లీన్ చేయడానికి కాకుండా, అమ్మాయిల మొహాలు కాల్చడానికి, జనాన్ని భయబ్రాంతులను చేయడాని స్పెషల్ యాసిడ్ తయారు చేస్తావటగా...కుటీర పరిశ్రమ అన్న మాట...
వెరీ గుడ్...నీకో విషయం తెలుసా...అంటూ తన చేతిలో వున్న యాసిడ్ బాటిల్ చూపిస్తూ...ఇది నీ తయారీనే...బోల్డు డబ్బులు పోసి కొన్నాను.. ఈ యాసిడ్ పని చేస్తుందా? లేదా, అన్నది చెక్ చేయాలిగా...అందుకే" అంటూ యాసిడ్ బాటిల్ మూత తీసాడు.
అదంతా చూస్తోన్న డాక్టర్ షాక్ అయ్యాడు."ఏమిటిది? మీరేం చేస్తున్నారు? ట్రీట్ మెంట్ ఇప్పించేది మీరే...యాసిడ్ పోసేదీ మీరేనా?
సారీ..దీనికి నేను ఎంత మాత్రం ఒప్పుకోను" సీరియస్ గా చెప్పాడు .
"డాక్టర్ కపర్థి...లాస్ట్ ఇయర్ మీ అమ్మాయి ల్యాబ్ లో ప్రాక్టికల్స్ చేస్తుండగా యాసిడ్ మొహం మీద పడి మీ అమ్మాయి మొహం కాలిపోయింది కదూ" అడిగాడు కార్తికేయ.
"అవును ఆ విషయం మీకెలా తెలుసు?
"ఆ యాసిడ్ పోసింది ఓ రాజకీయ నాయకుడి కొడుకు..భయంతో మీరు ఆ నిజం దాచారు.
ఆ యాసిడ్ ని తయారు చేసి వాడితో కలిసి మీ అమ్మాయి మీద యాసిడ్ దాడి చేసింది వీడే...
వదిలేయమంటారా? అడిగాడు కార్తికేయ.
"ఆ డాక్టర్ కి కాలిపోయిన కూతురు మొహం గుర్తొచ్చింది. కోపం తన్నుకు వచ్చింది".
"చంపేయండి సార్...ఈ నా...(ఓ బూతు మాట మాట్లాడి ) కాల్చేయండి." ఏడుస్తూ అన్నాడు.
కార్తికేయ ఆ డాక్టర్స్ బృందం వైపు చూసి "ప్లీజ్ అయిదు నిమిషాలు వాన్ బయట వెయిట్ చేయండి ..
అంతా కిందికి దిగారు. కారికేయ యాసిక్ వైపు తిరిగి, "నేను అడిగే ఒకే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పు...
తెలిసి చెప్పక పోయినా, తెలియక చెప్పక పోయినా నీ మొహం, నువ్వు తయారు చేసిన యాసిడ్ లో కాలిపోతుంది, అంటూ యాసిడ్ బాటిల్ మూత తీసి, పైకి లేపి అతని మొహానికి కాస్త ఎత్తులో పెట్టాడు.
"ఏ..ఏం చెప్పాలి? కార్తికేయ అన్నంత పని చేస్తాడని అర్ధమైంది .
"మోహన ఎక్కడుంది?
షాక్ అయ్యాడు..అంటే కార్తికేయ సామాన్యుడు కాదు.
"సారీ మిస్టర్ యాసిక్...నువ్వు ఎక్కువ ఆలోచించి ఏదో చెప్పి ప్రయోజనం లేదు.నేను నమ్మేలా చెప్పాలి"
"రాణా" సర్కిల్ లో ఏషియన్ లాడ్జ్ లో వుంది.
వెంటనే కార్తికేయ మెదడు పనిచేయడం మొదలు పెట్టింది. అది చాలా చవక లాడ్జ్...అక్కడ ఆడవాళ్ళు వుండే అవకాశం లేదు. అదే ప్రశ్న కార్తికేయ అడిగాడు.
"మోహన మగవాడిగా ఆ హోటల్ లో రూం తీసుకుంది "యాసిక్ చెప్పాడు.
"అంటే మరో హత్య తప్పదన్న మాట" అనుకున్నాడు.
నిజం చెప్పానుగా..నిజం చెబితే వదిలేస్తానని అన్నారుగా? అడిగాడు యాసిక్.
"నేను మాట తప్పను ...వదిలేస్తాను...అంటూ.యాసిక్ మొహం పైన పెట్టిన యాసిడ్ బాటిల్ వదిలేసాడు యాసిక్ మొహం మీద పడేలా..."
అంబులెన్స్ నుంచి బయటకు వస్తోన్న కార్తికేయ సెల్ కు ఓ మెసేజ్ వచ్చింది.
భారత పార్లమెంట్ పై దాడి కేసులో "అఫ్జల్ గురుకు ఉరి శిక్ష అమలు" మెసేజ్ అది.

No comments: