ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.
Showing posts with label సోషల్. Show all posts
Showing posts with label సోషల్. Show all posts

Monday, 19 January 2015

కవిత: తెలుగమ్మాయి

జడలో మల్లెలతో
పట్టుపరికిణితో కాటుక కళ్ళతో
కాటికేగేవాడికీ ఎదలో కలల్ని
మదిలో ఆకళ్ళను రేపే
దివ్య నయనాల సురసవి
నీవే ఓ తెలుగమ్మయీ
జూకాల లోలకులతో
మెరిసేటి మేని వంపుసొంపులతో
జులాయినీ జీనియస్ గా
తీర్చిదిద్దే సత్తువున్నశ్రీనిధివి
పరువాల పట్టుకొమ్మ స్నిగ్ధవి
నీవే ఓ తెలుగమ్మాయి
శిశిరపు చలిచ్చే
తొలితొలి శీతల పవనుడి హాయివి ధనుర్మాసపు నీరెండిచ్చే
నులి వెచ్చని సౌఖ్యసుఖానివి
తలపులతో హృదిని తరిమి తడిమేది
నీవే ఓ తెలుగమ్మాయి

ప్రేమల్నికాచి ఎగదోసే
మదనుడి చేతిలోని ప్రేమాయుధానివి
చిత్తాన్ని దోచే
చెరుకువింటయ్య సుమధనువు ఘనకీర్తివి
వలపు వరసల్ను కట్టిపాడి మురిపించింది
నీవే ఓ తెలుగుమ్మాయి
అరవిరిసే బ్రతుకుసుఖాన్ని
దేశదిమ్మరలకూ నేర్పే ప్రియరాణివి దేవి
భవబంధాలకు బంజారాలను సైతం
బద్దుల్ని చేసింది నీవే దేవి
అందానికే అసలు సిసలైన తెలుగర్ధము
నీవే ఓ తెలుగమ్మాయీ
నీ హృదయనిర్మలతను
సుందరతను కీర్తింప చేతకాక
తెలుగు భాషా తెల్లబోయే చిన్నబోయే
తెలుగమ్మాయి అందాన్ని సంపూర్తిగా వర్ణించబోవ
కృష్ణరాయల అష్టదిగ్గజాలే చిత్తైతిరి ఓడిరి
నిన్ను శ్లాఘించ నా తరమా తెలుగమ్మాయి 

Thursday, 18 December 2014

కవిత: ప్రకృతి.....సుందరి....అందాలు

పచ్చపావడ పూల పరికిణితో
ప్రకృతిరమణి నవ్యంగా భవ్యంగా శోభించే
కదిలే సెలయేరులపై చిలికిన
తరగల నురగలే నవ్వుతూ పలకరించే
పచ్చని ఆకుల తరువులకు
పూచిన విరులు గాలికి ఊయలూగసాగే
వళ్ళువిరుస్తూ నిద్రలేచిన క్రొత్తందాలు 
కోమలికి నవలావణ్యపు దివ్య శోభలనిచ్చే
విరంచి ఆర్తిగా తీర్చిదిద్దిన తరుణిమణిలో కొత్తసిగ్గులు అల్లర్లు ఏవోచేసే

అలుపెరుగక జవ్వనాల యామిని
ఆటపాటల తోటలలో తృప్తిగా విహరించే
సుమనోహర భువనైక సౌందర్యానికి
తానే సరితూగుగల సురసని (అందాలరాసిని) రూజువుచేసే
అన్నీచేసి మాయలేవోచేసి మనోహరి
నాతో చెప్పకనే నాలోదూరి నాకు నన్నేదూరంచేసే
చెప్పలేనీ తీపిబాధల గాధలను
ఎదచాటునుండి కవితగా తప్ప ఎదుటకురాకపోయే 

కవిత:ఆత్మార్పణం

ఆలుమగల అనురాగ సంగీతంలో 
సరసాలసరిగమల వాణివై
ఆత్మీయత అనుభంద భాంధవ్యాలలో 
స్వచ్ఛమైన శ్రీరంజనివై
ఆర్ద్రతతో బ్రతుకును తడిమే వాత్సల్యాల
మురిపాల మూలపుటమ్మవై
ఆలికి తనువులో అర్ధభాగం పంచిన
భోళాశంకరుడి కాత్యాయినివై
ఆత్మకు ప్రతిరూపమై లోకపావనియై
జగపాలికకు ఆలియై
ఆదరణకు అణుకువకు ఆలవాలమై
మహాదేవుని సాధ్వియై
ఆకృతిలో భవ్యరూపలావణ్యాల స్నిగ్ధవై
మహేశుని మొహినివై
ఆక్రోశపు ఆవేదన పర్వంలోనూ హిమశీతలమై
గరళహరుని గంగవై
ఆది మధ్య అంతము తనే జగానికి
జాహ్నవిపతికి అస్సలర్ధమై
ఆదుకోవమ్మని వేడెద అంబాభవానీ
ఆత్మార్పణ దీనులను
భవతాపహరులను తల్లివై

కవిత: బాకీ

జీవితమా
కాస్త మెల్లగా సాగుమా
ఇంకా తీర్చాల్సిన 
బాకీలు వున్నాయి సుమా
కొన్ని బాధలకు
ఉపశమన లేపనాలు పూయాలి
కొన్ని బాధ్యతలకు
ఉపయుక్తపు మాటలు నేర్వాలి
నీవు జీవనంలో వేగంగా సాగువేళ
బ్రతుకున కొత్తపొద్దు పొడుచు వేళ
నీ వేగపు వడికి సవ్వడికి సందడికి 

కొందరు మూతి ముడిచారు 
కొందరు నీ తోడు వీడేరు
మరి మూతి ముడిచిన వారిని
బుజ్జగించాలి దార్లోకి తేవాలి
మతిలేక ఊరికూరికేడిచే వారిని
ఉడికించి కవ్వించి నవ్వించాలి
గుండెల్లో నిలవున్న
పూర్తవ్వని కోరికలను
పూడ్చిపెట్టి మట్టిపోసి
శాశ్వతంగా నిద్రపుచ్చాలి
పూర్ణమయ్యే కలలరంగులను
జీవితపు కాన్వాస్ పై అద్దుకోవాలి
వీలయితే తీరని కొన్ని కోరికలు తీర్చుకోవాలి
చేతనైతే పూర్తి కాని కార్యాలు పూర్తిచెయ్యాలి
వీలైతే కొన్ని వీడిన బాంధవ్యాలను
కలపాలి కలుపుకోవాలి అన్నీ మనవనుకోవాలి
వీలైతే కొన్ని తిరస్కార పురస్కారాలను
వినమ్రంగా అందుకోవాలి ఎదలో దాచుకోవాలి
బ్రతుకా ఒక్కచాన్స్ యిచ్చి చూడుమా
శ్వాసపై నేను తీసే ఊపిరిపై
హక్కున్న వాళ్ళను ఒక్కమారు కలవాలి
కలిసి నచ్చచెప్పి నా హృదిమూట అప్పచెప్పాలి
జీవితమా...
కాస్త మెల్లగా సాగుమా
ఇంకా తీర్చాల్సిన
బాకీలు వున్నాయి సుమా!!

కవిత: ఔను కదా

సురభామిని మేని మెరుపంటి కిరణాలతో పలుకరిస్తూ
సుప్రభాతముతో నవజీవన సుప్రభాతాన్ని ముడిపెడుతూ
సుధామయమగు తెనుగుభాష అమృతాన్నిత్రావిస్తూ
సుస్మితవై కాలిగజ్జెల ఘల్లుఘల్లులతో నడచిరావే అలరిస్తూ
సురుచిర సరసివే అప్సరసలకు సొగసులో అప్పచెల్లిలివే
సునయని రసరమ్య లావణ్యాల ఒడిలో ఎదిగిన శ్రీనిధివే
సున్నిత మనస్వినివే కనుసైగల భాషను చూడవేమే
సుహాసినివే మనసును తట్టిలేపి సరసకు చేరరావేమే

కవిత:జీవన పోకడ

ప్రతినిత్యం రంగు హంగులు
మారుస్తున్న జగాన్ని నేను చూశాను
అనునిత్యం తీరు తెన్నులు మారుస్తున్న 
తప్పొప్పులు ఎంచుతున్న జీవితాన్ని నేను చూశాను
నాడు కొదమ సింహంలా నడుస్తూ
హుందాగా అడుగులు వేసే ఆహర్యపు గర్వాన్ని
నేడు కాళ్ళేత్తి అడుగు వేయ సాయంకై
అర్దింపుల ఆక్రందనల పర్వాన్ని చూశాను
నాడు కళ్లల్లో ఎరుపు మెరుపుతో 
లోకాన్ని శాసించి నిలబెట్టిన వదనమే 
నేడు అదేపనిగా ఏడుపుల కావిళ్ళు
అస్తస్తమాను మోస్తుండడం నేను చూశాను
నాడు చెయ్యెత్తి చేసిన చిన్నిసైగతోనే
పర్వతాలు కదిలించే దమ్ముంటే
నేడు వడిలి రాలిపోయే అకులల్లే
ఆ చేతుల వణుకుల వేణుగానం నేను విన్నాను
నాడు కంఠంతోనే కరెంటు ఉత్పత్తి
కావిస్తున్నారాననిపించే స్వరవిన్యాసమే
అట్టి గట్టి గొంతుకకు బలవంతపు
తాళపు గొళ్ళేన్ని వేసివుంచడం నేడు చూశాను
ఈ ప్రాయం బలం ధనం అన్నీ
కానరాని దేవదేవుని దయచే అందినవైనా
అన్నీతెలిసి కూడా కళ్ళేదుటే జరుగు
తప్పులనడ్డలేని మౌనమొనగాళ్ళను నేను చూశాను
ఇంత వింత పోకడలదేలా చోద్యాలేలా
నేటి అస్థిరమైన అస్తిత్వపు వెలుగులపై మిత్రుల్లారా
ప్రతినిత్యం రంగు హంగులు
మారుస్తున్న జగాన్ని నేను చూశాను
అనునిత్యం తీరు తెన్నులు మారుస్తున్న
తప్పొప్పులు ఎంచుతున్న జీవితాన్ని నేను చూశాను
మహామహులే సమయ వాహిని వరదల్లో
కొట్టుకుపోతూ విలవిల్లాడుతూ తల్లడిల్లడం నేను చూశాను
నేడు రేపు సర్వదా వీలైనంతమందిని సంతోషపెట్టండి నేస్తుల్లారా
కష్టాలన్దిస్తూ మరొకరి కష్టాలపై ఖుషీయ్యే ఎందరినో నేను చూశాను 

కవిత:మధురాతి మధురాలు

పసిపాప బోసినవ్వులు
లేగదూడ గంతులాటలు
జాబిలమ్మ వెన్నెలందాలు
చూడడం మధురం మధురాతి మధురం
వేమన పద్యరససూక్తులు
పోతన భాగవతపధ్యార్దాలు
వాల్మీకి రామాయణనీతులు
నేర్చడం మధురం మధురాతి మధురం
యద్దనపూడి నాయకా వర్ణనలు
యండమూరి నవ్యకధానా రీతులు
యెర్రంశెట్టి హాస్యామృత చెణుకులు
చదవడం మధురం మధురాతి మధురం
ఉదయపువేళ అరుణోరణ కాంతులు
ఆమనివేళ తరువుల పూనవ్వులు
వ్యాహాళివేళ పక్షుల కువకువకబుర్లు
వినడం మధురం మధురాతి మధురం
ఎస్వీర్ అద్వీతీయ నటనావైదుష్యాలు
యన్టీఆర్ నవరస నటనామృతముద్రలు
ఏన్నార్ దివ్యభవ్య సుందరనాట్యాలు
చూడడం మధురం మధురాతి మధురం
ఆత్రేయ మనసుగీతాల మాలికలు
వేటూరి నవరసగీతికల సుమాలు
సిరివెన్నెల చిన్నిపదాల చెమక్కులు
వింటుండడం మధురం మధురాతి మధురం
ఆత్మీయ మిత్రుల ఆలింగనాలు
అనుచర గణాల అభివాదాలు
అచ్చెరవు పరచే అభివ్యక్తాలు
అనుభూతే మధురం మధురాతి మధురం
అమ్మఅమ్మాంటూ తొలి తొలి పిలుపులు
నాన్న కొసవేలు పట్టుకుని నడవడాలు
బామ్మ తాతలు నేర్పే జీవిత చదువులు
మధురం మధురం మధురాతి మధురం 

కవిత:ప్రియమణి ప్రభలు

సిరి కన్నియ అందాలు
ధరణమ్మ సొబగు సహనాలు
నా సొగసుకత్తెకే సొంతాలు
అష్ట భామల వయ్యారాలు
కృష్ణరాధ హోయల సిరుల ఝరులు
నా వలపుగత్తెకే సొంతాలు
రుక్మిణమ్మ భక్తి భావ ప్రియసేవలు
సత్యభామ వాడి వేడి వాగ్భాణాలు
నా ప్రియదేవేరికే సొంతాలు
ద్రౌపదమ్మ రోషపు ఉచ్చ్వాస నిశ్చ్వాసాలు
సుభద్రమ్మ వలపు నయగారాల నజరానాలు
నా హృదయేశ్వరికే సొంతాలు
హరింద్రపు సహజ ఔషద పోషక గుణాలు
హిరణ్యపు వన్నెతగ్గని విలువల ప్రమాణాలు
నా తలపులసుందరికే సొంతాలు
రాణిఝాన్సి వీరప్రదర్శన స్థైర్యపు చేవ్రాలు
రాణిరుద్రమ పోరాటపు ప్రజ్ఞా పాటవాలు
నా ప్రాణేశ్వరికే సొంతాలు
అతివల అతిశయపు మోమాటాల సిగ్గులు
కలువల సున్నితత్వపు లేలేత సౌకుమార్యాలు
నా రమణీలలామకే సొంతాలు
పెక్కు తీర్లుగను వర్ణించినను వీలవ్వగునే
నాదు మనమును మంత్రించిన చిన్నదాని అందాలు
టక్కు టమారుల విద్యలేమైన నేర్చేవేమిటే సుందరీ
నీదు పురుషుడును గావించుకుని ఏల ఈ దాగుడు మూతలు
 

కవితా : అక్కరకొచ్చేవారు

అక్కరకు రారు చుట్టాలు
అస్సలు ఆస్తులు లేనప్పుడు
అక్కున చేర్చుకుంటారు బలిమి కలిమి కలిగి వున్నప్పుడు
అక్కడని ఇక్కడని ఏమిటి
అన్నిచోట్ల మేమున్నామంటారు
అలవి లేని ఆత్మీయత కల్లబొల్లి మాటల్తో కురిపిస్తుంటారు
అనుపమాన నటనా పటిమను
అవిశ్రాంతముగా ప్రదర్శిస్తుంటారు
అబద్దమైన అనురాగ వల్లరులను మధురంగా గానం చేస్తుంటారు
అభిలాషను ఆశల ఆకృతులను
సూటిపోటి మాటల అంకుశంతో పొడిచేస్తారు
అరుణ కిరణ కాంతిని సైతం తమ తేనేపూరిత మోసపు మాటలలో తొణికిస్తారు
అమ్మకానికి ఈ చుట్టాల వ్యాపారులు
నమ్మకాన్ని సైతం పెడతారు విపణిలో
అందుకే పెద్దలు ఎప్పుడూ చెబుతారు మనసైన మితృలనునమ్మి ముందుకుసాగు జీవితంలో 

కవిత: ప్రకృతి కన్నెచెర...కన్నెర్ర

నరుడే ఖరమై కృరూడై
హరుడై వానరుడై కాలుడై
ప్రగతి పురోగతంటూ దిగంతాల
అగమ్య సీమల పాదచారుడై
ప్రకృతి కాంత శోభలను
కబంధ హస్తాలతో హరించినవాడై,
పచ్చని అందాలనేల పరుపుపై
నిప్పుల పాదం మోపినవాడై,
హరితాన్ని హరించి కబళించి
ఉపద్రవానికి ఆవాంతరాలకు కారకుడై ,
కడకు ప్రకృతి ప్రకోపాన
నిస్తేజపు అస్తిత్వపు సాక్షిగా
విగత జీవుడై నిర్జీవంగా మిగిలే
వేదనకు రోదనకు కారకుడై
ఏగిపోయే అందిరాని గగనాలకు 

Wednesday, 17 December 2014

కవిత: హృది రవం

నిన్న మించిన అందమేదో
చెలి నేడు నీలో అగుపించినే
మల్లి జాబిల్లి తారకలందాలు
చెలి నీదు వదనంలో దర్శించవచ్చునే
అమావాస చీకటి జీవితంలో
చెలి నవ్వే పున్నమై విరిసినే
మతి అతి గతులన్నీ 
చెలి ప్రియ సన్నిధిలో అందివచ్చినే
ఆమని హరివిల్లు పుప్పోడిజల్లుచెలి రాకకు ముందుగా కానవచ్చునే

తలపు వలపు బ్రతుకునోదార్పు
చెలి ఇంటి ప్రాంగణంలో కొలువుండేనే
గవ్వల్లో గువ్వల్లో గల్లీలల్లో
చెలి నీవే సర్వత్రా కనిపిస్తున్నావే
మమతలో సమతలో సబూరిలో
చెలి సాటి జగతిన ఎవ్వరులేరనవచ్చునే
సన్నుతిలో సౌహార్ధ్రతలో సౌశీల్యతలో
చెలి నీకు పోటీ నిఖిలజగమునేవ్వరే
శోభలో సోయగంలో సుందరతలో
చెలి నీకు ఇంద్రరంభైన పోటీకీతగునే
మది లలిత భావాలన్నీ పేర్చికూర్చితే
హృది దేవతే ప్రియమారగ సాక్షాత్కరించినే
నాదు చెలికే పేదహృదయం అంకితమిస్తినే
కృప చూపుతూ నామనసును అందుకోవే

కవిత:స్నేహామృతమ్

గత స్మృతులన్నీ మధురాలే తీయని స్నేహంలో
స్నేహిత పలుకులన్నీఅమృతాలే నిజ జీవితంలో
గుండెలలో తనపై మొదటగా మొలకెత్తిన అలవిలేని అభిమానమే
అనురాగరహిత కరుకు గుండెను సైతం ఆత్మీయత కదిలించే
హర్షమే వర్షమై నింగినంటిన హరివిల్లు రంగులే అలరిస్తే
మౌనమే వరమై బ్రతుకున మల్లియల అత్తరులే అందిస్తే
నీ చిరునగువులే నల్లనయ్య సమ్మోహనపు నవ్వులైతే
మనగలనా భువిపై నీ సాంగత్యం అందక స్నేహితమా
కరుణతో కరుణించి వేదన నిండిన నాదు హృదయాన్ని
చెలిమితో చెయ్యందించి సంతోషాల నదులలో స్నానించవా 

Tuesday, 16 December 2014

కవిత: నేనొక 'బాల్యాన్ని' చూశాను

బాల్యంపై కవితను ఎట్లా అల్లటమానని ఆలోచిస్తూ సాగుతున్నాను ...
అంతరిస్తున్న ఆ బాల్యాన్ని ఈరోజు మేల్కొనడం స్పష్టంగా చూశాను
..
పుట్టించిన బ్రహ్మకు ప్రాణం పోసిన అమ్మకు అక్కరుకురాని నాన్నకు
అక్కర్లేకపోయిన ఓ పసివాడి బాల్యన్ని అక్కున చేర్చుకున్నచెత్తకుప్పను చూశాను
రోడ్ పక్కన చెత్తకుప్ప దగ్గర వారగా భయం భయంగా
ముడుచుకున్న ఓ పసివాడి బాల్యం మూగగా ఆవేదన చెందటం చూశాను
అమ్మ ఆప్యాయత కోసం నాన్న ఆలంబన కోసం 
ఎదలోనే సంఘర్షిస్తున్న ఆ బాల్యం మరీ మరీ అల్లాడిపోవటం చూశాను
నిర్భీతిగా స్వచ్చంగా తుళ్ళుతూ ఆడి పాడాల్సిన వయసులో
ఒంటరైన ఆ బాల్యం మౌనంగా రోదించటం చూశాను
పసిప్రాయంలోనే పాలబుగ్గల వయసులోనే
బ్రతుకుకై ఆ బాల్యం ఒంటరిపోరాటం చెయ్యడం చూశాను
భుజాన బ్యాగులతో చదువుకునేందుకు తన తోటివాళ్ళు స్కూల్ కి వెడుతుంటే
భుజాన సంచీలకు ఆ బాల్యం చెత్తలోని పనికొచ్చేవాటిని ఏరడం చూశాను
రేతిరి చీకలట్లో సద్దుమణిగి ఊరు మస్తుగా నిద్దరోతుంటే
చీకటి దెయ్యపు భయంతో ఆ బాల్యం నిద్దురకై చేయు పోరాటం చూశాను
శీతాకాలపు సందేళ వణుకుడు వేళ అందరు శాలువాలు/రగ్గులు కప్పుకునివుంటే
బట్ట కరువై బ్రతుకు బరువై ఆ బాల్యం వణికించే చలిలో గడ్డకట్టటం చూశాను
గర్వంగా తలెత్తుకుని తోటి ఈడువాళ్ళు కిలకిలలతో తిరుగాడుతుంటే గర్వంగా బ్రతుకుంటే
తన తప్పేంటో తెలియని ఆ బాల్యం తలదించుకుని జీవచ్చవంలా బ్రతకటం చూశాను
మురిపించే మైమరపించే అందరు అందుతున్నఆనందాల పలకరింపులకు బదులుగా
ఈసడింపుల శాలువాలు అవహేళన దుప్పట్లతో ఆ బాల్యం తిరుగుతున్న సంగతి చూశాను
అందరిమల్లే తనకెందుకు ఈ సౌఖ్యాలు అందలేదని ఆలోచించకుండా
ఎదురైనా సమస్యలకు ఎదురొడ్డిన ఆ బాల్యం వజ్రపు ఆత్మవిశ్వాసాన్ని చూశాను
మనషుల మనస్సులో మమతలు కరువైతే ఎదురయ్యే తార్కాణపు
తప్పిదాల్ని ఆ బాల్యం కల్ముషషరహితంగా ఎత్తిచూపడం చూశాను
సమాజపు వీధుల్లో ఎందుకో తప్పిపోయిన బ్రతుకు మనుగడనూ మంచిని
నైరాస్యత వీడిన ఆ బాల్యం తిరిగి గుర్తుచేసి సరియైన స్థానాన్ని ఇవ్వడం చూశాను

కవిత: పెళ్లి ప్రభలు

ఇంద్ర సభను వీడి ధరను చేరిన సురభామిని దివ్యందాలల్లే 
నడత కలిమితో ధగ ధగా వెలుగు పడతి అరవిరిసిన మోమల్లే 
వలపు తరువు ఆర్తితో ఎదను పూయించిన సిగపువ్వే నవ్వినవేళ 
బుగ్గన సిగ్గులే ఎర్రగా పూసి బిడియపుకనులే నేల చూపులు చూసేవేళ
ఆహా ఏమి ఈ కన్యకామణి అదృష్టమని అందరూ అసూయపడేలా 
జిలుగు సొగసుల కన్యకామణి అద్వీతీయ హోయల ప్రభలతో 
వలపు వారధిగా కోరిన వరుడితోనే వివాహపు వేదిక ఎక్కినవేళ 
చెప్పుకున్న ఊసులు చేసుకున్న ఆత్మీయ బాసలను నిజం చేస్తూ 
'మాంగల్యం తంతునామేనా' అంటూ సాగే సనాతన వేదమంత్రమే 
ఈ చక్కటి చూడముచ్చటైన కుర్రజంటను తాళిసాక్షిగా ఒక్కటి చేసే 
కాముడి రూపమే అతనిదైతే పుష్పించిన తరుణీలతయే రమణీలలామ
లోకాన విలసిల్లే సంసారాంభుదికి ఈ yదీపపు స్తంభాలు 

కవిత: నేటి 'జన' పోకడ

కామెంట్స్ పెట్టం గానీ పోస్ట్స్ అన్నీ చదువుతాం సుమ్మీ
పాజిటవ్స్ పై దృష్టిపెట్టం అన్నింట్లో నెగటివ్స్ చూస్తాం సుమ్మీ
ప్రవృత్తి మాదిదే మారం మేం మార్చుకోం నడతను సుమ్మీ 
నిన్నైనా రేపైనా మాలో మార్పులును కోరడం ఆశనిపాతం సుమ్మీ
భజనలు చేస్తాం పల్లకీలుమోస్తాం పక్కకి తిరగంగానే దెప్పుతాం సుమ్మీ
విషయాలు చెప్తాం ఈర్ష్యాసూయలను కానుకగా ఉత్తినే అందిస్తాం సుమ్మీ
సొల్లులో స్పెషలిస్ట్లం కూసింతైతే కొండంతగా ఊహల్ని పంచుతుంటాం సుమ్మీ
సోల్ లేని సేల్ఫులం నిందాస్తుతిలో ఆగ్రాణ్యులం అత్మకరువైన మనుజులం సుమ్మీ
మచ్చ లేనట్టు చెప్పుకుంటాం అందరి మచ్చలను ఎత్తిచూపుతాం సుమ్మీ
మతి కరువై మమత మరుగై గురివిందగింజలల్లే బ్రతికేస్తుంటాం సుమ్మీ 
స్నేహ కలువ సౌహార్ద్ర విలువ విడిచినబట్టలల్లే విసర్జిస్తుంటాం సుమ్మీ 
నేనే ఉత్తమం మరందరు అధమం పనికిరానివాళ్ళని ప్రచారంచేస్తుంటాం సుమ్మీ
మేం మారం మారనిమనషులం మాలో ఉత్తమసంస్కారం వెతక్కండి సుమ్మీ

కవిత: ధేనువు ప్రభోధ/బాధ

పచ్చని బయళ్ళే బీడు భూమిగా మరు భూమిగా మారిపోతే
హలం పట్టి అన్నం పెట్టే రైతే (పొట్టకూటికై) వలస వెళ్ళిపోతే
అంబాయనెడి మూగధేనువుల ఆకలి ఆక్రందనలు వినేదెవ్వరు 
పూర్తిగా లోకం చూడని దూడనైనా కనికరించండని వేసే వెర్రికేకలు
ఎండిన డొక్కలతో బక్క చిక్కిన మేనుతో
బేల చూపులతో రాని యజమానికై ఎదురుచూపులు
సగంచచ్చి బ్రతికే ధేనువులు కబేళకే అంకితాలు 

పూర్తిగా వికసించని (దూడ) పువ్వుని తుంచేయడం హేయమని పెట్టే మూగకేకలు
పాలిచ్చి మిమ్ము బ్రతికిస్తాం పొలం పండించి మీకు సమృద్ది అందిస్తాం
కబేళకెళ్ళి మీకు చెప్పులై మీ డప్పులై తరలోస్తాం చచ్చినా బ్రతికినా మీ సేవే చేస్తుంటాం
భూతదయ హరిత ప్రకృతిపై కూసింత అభిమానమూ లేని వ్యర్ధులు
అయినా బాధ్యతగా ప్రశ్నిస్తున్నా మీకివేమి పట్టవని తెలిసినా 

కవిత:మాతృప్రేమ

కని పెంచిన బిడ్డలకే భారమయ్యాను గానీ 
పనికి భారం కాదని రుజువు చేస్తున్నావా 
వీపుపై కట్టెల మోపుతో ముడతల మోముతో 
అయినా కన్నపేగుపై కోపం రాదుగా అదేమీ ప్రేమో 
ఓ జననీ స్తన్యమిచ్చి పెంచి పెద్దచేసిన బుడ్దోడే
నీ రక్తమాంసాల స్వేదంతో ఎత్తులకు ఎదిగిన పిల్లోడే
విడిచి నిన్ను వెళ్ళిపోతే యిట్టా బ్రతుకు వెళ్లదీస్తున్నావా
అయినా అబ్బాయి కనబడితే తిట్లురావుగా (తన) బాగోగూసులు తప్ప 
తోడుండే మగడే నీచేయి వదిలేసి నింగికిపోతే
చెయ్యాడితే గానీ డొక్కాడని పరిస్థుతులే పలకరిస్తే 
నాకేమిటీ ఖర్మమని బెంగపడక పొద్దువాలినవయసునే దిక్కరిస్తూన్నావా
అయినా బిడ్డలనేమనని నీ పాలగుండే (జననీ) ఏ పదార్దంతో తయారయిందోగా
మల్లెల మనసులు స్వప్న
అలిసిన తనువు ..మళ్ళిన వయసు ..
సోలిసిన మనసు సోమ్మసిల్లిపోతుంది ..
పెంచిన బంధాలు గూడు వదిలి పోయారు ..
మమతలెరిగిన మనసు కదా ..పని మీద ధ్యాస కదా ..
కాయ కష్టం చేసి కష్టాలను ఎదురీదుతున్నాను ..
నడి వయసులో మోసిన కట్టెల బరువు తేలికే ... 
మలి వయసులో వంగిన నడుములో కట్టెల మూపులు 
మోయలేక మోస్తూ బ్రతుకు బాటలో పయనిస్తున్నాను ..
ఈ జీవిలో ప్రాణం పోయే క్షణం వరకు 
ఆగదేమో నా బ్రతుకు బరువు..
ఇంతేనేమో ..బ్రతికేస్తా..ఇలాగే ..కడదాక..

కవిత: రాధ బాధ

కళ్ళతో కావలిస్తావు
చూపుతో చుట్టేస్తావు
మాటతో ముద్దిస్తావు 
యిట్లయితే కృష్ణా ఎట్టాగమ్మ
ప్రేమ మనుగడ సాగేదెట్టామ్మ
శ్వాసతో శాసిస్తావు
పల్కుతో ప్రేమిస్తావు
నవ్వుతో నలిపేస్తావు
యిట్లయితే కృష్ణా కష్టవమ్మా 

వలపు కొలువు నిలవదమ్మా
పువ్వుతో లాలిస్తావు
వేణుతో వరమవుతావు
సిగ్గునే తొలిగిస్తావు
బుగ్గనే నిమిరేస్తావు
యిట్లయితే కృష్ణా ఒపేదెట్టామ్మా
దాచలేని ప్రేమను దాచేదెట్టామ్మా
నీ ప్రేమగంగలో నీటిబొట్టునయ్యా
అభం శుభమెరుగని బేలనయ్యా
పరువు గల పల్లెపడతినయ్యా
కొంటి చూపులతో కొలవమాకయ్యా
యిట్లయితే కృష్ణా తాళలేనయ్యా
బెదురుచూపుల బేలను బాధించకయ్యా
ఒడలంతా కళ్ళై కృష్ణా
ఈ రాధ నీ రాకకై వేచిచూసే
కడలంత ప్రేమ కృష్ణా
ఈ గుండె గూటిలో దాచుంచా
వేగరార వేగలేకవుంటిరా కృష్ణా
ఈ రమణిపై దయచూపరా 

కవిత: సిపాయి మనోభావన

మేమూ సైనికులమైన ఓ తల్లికి బిడ్డలం ఓ చెల్లికి అన్నలం 
దేశసౌఖ్యంకై వున్నవూరు సొంతవాళ్ళను విడిచివచ్చినవాళ్ళం 
మేము సైనికులం సరిహద్దుల కావలివాళ్ళం 

అన్నిటికీ మించి ఈ దివ్యధరిణికి రుణగ్రస్తులం
మేమూ సైనికులమైన ఆత్మీయతకు అనురాగానికి లొంగుంటాం
జాతికులమత నీచతత్వ భావనకు అతీతులం
స్వలాభం కంటే దేశహితాన్ని ముందుంచుతాం
అన్నిటికీ మించి ఈ భవ్యధరిణికి రుణగ్రస్తులం
మేము సైనికులమైన కట్టుబాటున్న సుశిక్షిత పహారాగాళ్ళం
యూనిఫార్మ్ లో యిమిడిన పోరువాళ్లకు నిలువెత్తు బాంబులం
కవాతుతో సవ్వడితో వైరిపక్షాలను బెంబేలెత్తిస్తాం
శాంతికపోతమైన ఈ పుణ్య భరతభూమి హృదయస్పందనలం
మేము సైనికులమైన సౌహార్ద వ్యవహారకుశలత కలవాళ్ళం
తన్ (హిందీ) కన్ను గన్నుబోర్డర్లో మొహరించినవాళ్ళం
కష్టాలకు వెరవనివాళ్ళం ఆపదలే చుట్టాలుగా పొందేవాళ్ళం
ఈ దేశపు ఆడపడుచుల నుదట మెరిసే సింధూరదీపాలం
మేము సైనికులమైనఈ పుణ్యపుడమి భాగ్యోదయపు రేఖలం
ఇంట్లోనూ బయటుండే వెధవలకు బుద్దిచ్చే టానికులం
వైరిపక్షాలకు అర్ధంకాని ఎత్తులేసే అనూహ్యమైన చాణుక్యులం
వెరసి మేమే మనసున్న మనుషులకు ప్రియబంధువులం
 

కవిత: బెంగ

తలచింది నేను
హృదయాంతరాళలలో దాగున్న తలపులను ఆర్తిగా తడిమింది నేను
వెలిగింది నేను
మనసుమిన్నుని మూసిన నిశిని చీల్చుకుని విచ్చినకిరణం నేను
గెలిచింది నేను
వెన్నువిరిచే ఓటముల బాధను తట్టుకుని నీకైపడిలేచింది నేను
కరిగింది నేను 
తడిమినతలపులే ఎదతలుపులను తీయిస్తే కూతపెట్టిన హృదిపొలికేక నేను
మిగిలింది నేను
రంగులీను చెలిమెడను నిత్యమూ రెండుచేతులతో బంధించదలచింది నేను
కలవని ప్రక్కప్రక్కనే వుండే రైలుపట్టాల్లా
పగటి వేళోచ్చే పూర్తికాని కలలా
విరులు పూయని సుమ వనంలా
సాన్నిహిత్యానికి సామీప్యానికి దూరమైన తలపులా
ప్రేమసామ్రాజ్యానికి నోచని ఒంటరి మనసులా
నాదు మది తపనపడే జంటనుబాసినపా
వురంలా