ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Sunday, 28 April 2013

విసురజ (సీరియల్ )ఆగష్టు1...డేట్ తో డిష్యుం...డిష్యుం
24-04-2013 (14th chapter)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
******
స్టీఫెన్ నుంచి ఫోన్ రాగానే మ్యాటర్ సీరియస్ అనుకున్నాడు.ఓకే బటన్ నొక్కి "చెప్పు స్టీఫెన్ భయ్యా...చాలా రోజులుగా మర్డర్స్ చేయక అలవాటు తప్పిపోయింది.ఇప్పుడే ఒక మర్డర్ ట్రై చేశా...ఆఫ్ కోర్స్ ...జీవుడు పైకి వెళ్ళిపోయాడు ."అన్నాడు.

"అది సరేగానీ నీ బిజినెస్ ఎలా వుంది? అటువైపు నుంచి స్టీఫెన్ అడిగాడు
"భయ్యా..సూటిగా మ్యాటర్ లోకి రా..ఎవర్ని వేయాలి? చాలా పెద్ద తలకాయ అయి వుంటుంది. నీ చేతికి బ్లడ్ అంటుకోకుండా...నా చేతికి కరెన్సీ అందిస్తావు.నే పాలసీ బావుంది భయ్యా " రామతీర్థం అన్నాడు.
స్టీఫెన్ అనవసర సంభాషణ పొడిగించుకోదల్చుకోలేదు.
"నువ్వు వెంటనే మన ఆఫీసుకు వచ్చేయ్.. .అక్కడ మాట్లాడుకుందాం "చెప్పి ఫోన్ కట్ చేసాడు.
తర్వాత అసిస్టెంట్ ని పిలిచాడు."రామతీర్థం వస్తాడు.అతను నా ఎదురుగా కూచుంటాడు.మా సంభాషణ అంటా రికార్డు అవ్వాలి...అతని వీడియో మాత్రమే కనిపించాలి. " చెప్పాడు స్టీఫెన్.
ఎవర్నీ నమ్మడు.చాలా ముందు చూపు ఎక్కువ.
==========
మేన్ రోబో కార్యాలయం...
సంధ్యాజ్యోతి లోపలికి అడుగు పెట్టగానే గుర్రుగా చూసాడు సబ్ ఎడిటర్ శర్మ. సరాసరి ఎడిటర్ చాంబర్ లోకి వెళ్ళింది.ధైర్యం గా లోపలి వచ్చింది గానీ కొద్దిగా వణుకు మొదలైంది . ఎడిటర్ తలెత్తి సంధ్య వంక చూసాడు.
"గుడ్ మార్నింగ్ సర్ " గొంతు పెగుల్చుకుని అంది.
"వెరీ గుడ్ మార్నింగ్ ...కూచోండి "అన్నాడు.
కుర్చీ అంచున కూచుంది."సర్ చంద్రహాస్ గారి యాడ్ చూసారా?
"చూసాను..."
"నేను ప్రణవి మిస్సింగ్ స్టొరీ రాద్దామన్న ప్రపోజ్ పెట్టాను...కానీ ఇంతలోనే ఈ యాడ్ ఇచ్చారు "
"అది చంద్రహాస్ గారి ఇష్టం...ఇందులో మనం చేయగలిగింది ఏముంటుంది ?
సంధ్యాజ్యోతి మౌనాన్ని ఆశ్రయించింది. ఎడిటర్ ఆమె వంక చూసి...."చూడండి సంధ్యా..ఉత్సాహం ఒక్కటే సరిపోదు..ఆలోచన వుండాలి.చంద్రహాస్ గారి ప్లాన్ ఏమిటో తెలియదు...కాకపొతే మీ సీరియల్ ఐడియా బాగానే వుంది.నేను మాట్లాడుతాను.అప్పటి వరకూ మీరు చంద్రహాస్ ను ఫాలో అవుతూనే వుండండి."చెప్పాడు.
"ఓకే సర్" అని లేచింది.బయటకు వస్తూ శర్మ వైపు చూసింది.తన మీద శర్మకు కోపం పీకల వరకూ వుందని అర్ధమైంది.
=================
ప్రణవి బయటకు వచ్చింది.ఆమె మోహంలో అలసట...వేన వేల మైళ్ళ ప్రయాణం చేసి,అలిసిన బాటసారిలా వుంది.తనెక్కడ ఉన్నదో తనకే తెలియదు.తనకు ఆశ్రయం ఇచ్చిన అరవై ఏళ్ళ వృద్దుడు కన్న తండ్రిలా చూసుకుంటున్నాడు.తను వెళ్లి పోవాలి..ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి. ఎక్కడికి వెళ్లి పోవాలి..?ఇంతకూ తనెవరు ? అవును తను తను ఎవరు ? తల విదిల్చింది.తలంతా దిమ్ముగా వుంది.తను కట్టుకున్న చీర చాలా మామూలు చీర..మరి తన చేతికి వున్న ఉంగరం ?గొలుసు?
దాహం గా అనిపించింది. పంపు దగ్గరికి వెళ్ళింది.పైరగాలికి,ఆమె ముంగురులు గాలిలో నాట్యం చేస్తున్నాయి.
పొడవాటి పైపు..ఆ నీళ్ళను ఎలా తాగాలో అలవాటు అయింది.పంపు చివర చేతి వ్రేళ్ళను గుండ్రం గా బిగించి ఆ వ్రేళ్ళ ద్వారా వచ్చే నీటిని తాగుతుంది. ఆమెకు గుర్తు లేదు.మినరల్ వాటర్ తో మొహం కడుక్కునేదని,స్నానం కూడా చేసేదని....
"అమ్మా తల్లీ ఎక్కడున్నావమ్మా ? అది ఆమెకు ఆశ్రయమిచ్చిన వృద్ధుడు గొంతు
"ఇక్కడే వున్నాను తాతా "చెప్పి కొంగుతో మొహం తుడుచుకుని వచ్చింది.
అరవై ఏళ్ళ ఆ వృద్ధుడు జొన్న రొట్టెలు ఓ సత్తు పళ్ళెం లో తీసుకు వచ్చాడు. ఉల్లిపాయలు,పచ్చికారం వుంది.
నులక మంచం మీద కూచోని ఆ పల్లెన్ని ఒడిలో పెట్టుకుని తింటుంది.ఒక్కసారి కారం నాలికకు తగిలింది.
కళ్ళలో నీళ్ళు తిరిగాయి.అమ్మా కారం అంది.
"అయ్యో తల్లీ అంటూ ఆ వృద్ధుడు గుడిసె లోకి పరుగెత్తి వెన్న వున్న చిన్న నల్లటి మట్టి కుండ తెచ్చాడు
"ఈ వెన్న తిను తల్లీ...మంట పోతుంది " అన్నాడు ప్రేమగా ఆమె తల నిమిరి.
"తాతా...నేనెవరిని ? అడిగింది జొన్న రొట్టె తిని మట్టి కుండలోని వెన్న కూడా తిన్నాక .
ఆ వృద్ధుడు మౌనం గా వున్నాడు.
"చెప్పు తాత...నేనెవరిని ?
"నాకెలా తెలుస్తాది తల్లే...ఆ దేవుడు నిన్ను నా దగ్గరికి పంపించాడు "
"ఎక్కడి నుంచి పంపించాడు తాతా...చాలా రోజులుగా అడుగుతున్నాను...చెప్పడం లేదు..అసలు నా పేరేమిటి తాతా ?
ఆ వృద్ధుడు ఆకాశం వంక చూసాడు.
ఆంధ్రప్రదేశ్ లోని ఓ పల్లెటూరు అది.
===========
హోండా ఆక్టివా ను ఆ ఆఫీసు ముందు పార్క్ చేసి లోపలి నడిచింది సుకన్య.తనకు కావలిసిన వ్యక్తి కోసం అన్వేషించింది.పది నిమిషాల తర్వాత అతను వచ్చాడు.
"గుడ్ మార్నింగ్ మేడం..చెప్పండి నాతో ఏదో పని వుండే వచ్చి వుంటారు "అతను నవ్వుతో అన్నాడు.
"అవును...ఈ నంబర్ కు వచ్చే ఫోన్ కాల్స్ లిస్టు కావాలి "నవ్వి చెప్పింది.
ఆ నంబర్ ఓ సారి చూసి "ప్రాబ్లం ఏముండదు కదా మేడం /అడిగాడు మరో సారి.
హ్యాండ్ బ్యాగ్ లో నుంచి కొంత డబ్బు తీసి అతనికి ఇచ్చి "మీ ప్రాబ్లానికి సొల్యూషన్ "అంది.
"థాంక్యూ మేడం...రేపీపాటికి మీకు కాల్ లిస్టు ఇస్తాను "చెప్పాడతను.
అతనికి థాంక్స్ చెప్పి ఆక్టివాను బయటకు తీసింది.రాధా చంద్రిక ఇంటి వైపు వెళ్తుంది.
(ఈ సస్పెన్స్ రేపటి వరకూ ..)

No comments: