ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday 16 April 2013

ఆగష్టు1 (సీరియల్ )
టాగ్ లైను ......డేట్ తో డిష్యుం..డిష్యుం
by మెస్మరైజింగ్ మేగ్నటిక్ ఎనర్జీ రైటర్..
"విసురజ"
15-04-2013 (5th chapter)
.....................
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...

చీఫ్ ఎడిటర్ చాంబర్...
సంధ్య, శర్మ ఇద్దరూ బుద్ధిగా చీఫ్ ఎడిటర్ ఎదురుగా నిలబడ్డారు. శర్మ తల వంచుకుని కొద్దిగా తల పక్కకి తిప్పి కోపంగా సంధ్య వైపు చూస్తున్నాడు.
కంప్యూటర్ ని వాళ్ళ వైపు తిప్పి చీఫ్ ఎడిటర్ "ఏమిటిది? అని అడిగాడు...
"అది... అది.... ఈ అమ్మాయి రాసిన వంట సర్" చప్పున అన్నాడు శర్మ.
"అది వంట కాదు పెంట...నీ పాలిట మంట" మనసులో అనుకుంది సంధ్య.
సంధ్య వైపు చూసి "ఇదేమిటో ఓ సారి చదువు" అన్నాడు.
ఓ సారి శర్మ వైపు చూసి, ఎడిటర్ వైపు చూసి "ఎక్స్ క్యూజ్ మీ సర్...కూర్చుని చదవనా? అని అంటూనే కుర్చీలో కూచుంది, స్క్రీన్ మీద ఉన్న తను రాసిన "గన్నేరు పప్పుతో గన్నేరు మాస్ మసాలా 99...తయారు చేయడం ఎలా? అన్న ఆర్టికల్ ని చదవడం మొదలు పెట్టింది.
"మీరిది వరకు ఎన్నో అద్భతమైన వంటకాలు రుచి చూసి వుంటారు...ఇప్పుడు మీ కోసం సరి కొత్త వంటకం పరిచయం చేస్తున్నాం ..."గన్నేరు పప్పుతో గన్నేరు మాస్ మసాలా 99...తయారు చేయడం ఎలా? వెరీ సింపుల్ "గుప్పెడు గన్నేర్ పప్పు చేతుల్లోకి తీసుకోండి...అబ్బో అవి చాలవు అనుకుంటే మరిన్ని గుప్పిట్లోకి తీసుకోండి....వాటిని బండరాయితో ముక్కలు చేసి మూకుట్లో పోసి, కాసింత నెయ్యి పోసి టేస్ట్ కోసం కావాలంటే తేనే కలుపుకొని, చాలినంతగా ఫ్రై చేయండి. తర్వాత ఫ్రిజ్ లో పెట్టి , వీలయితే ఫ్రీజర్ లో పెట్టండి. మీ వారు రాగానే కొసరి, కొసరి తినిపించండి...మీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు వారికీ సర్వ్ చేయవచ్చు...""గన్నేరు పప్పుతో గన్నేరు మాస్ మసాలా 99...తయారు చేయడం ఎలా?" చేయడాని కావాల్సిన మసాలా దినుసులు...అంటూ గబా గబా చదవసాగింది.
శర్మ మొహం డబుల్ రోస్ట్ అయినట్టు ఎర్రబడి, మాడిపోయింది . పైగా "" సబ్ ఎడిటర్ శర్మగారితో కలిసి..సంధ్యాజ్యోతి, అని చివర్లో రాసింది. తను పిచ్చి ముండావాడిలా అప్ డేట్ చేసాడు.
చదవడం ఆపి కొద్దిగా తల పైకెత్తి ఎడిటర్ వైపు చూసింది.
"అసలు మీరేం అనుకుంటున్నారు"
సంధ్యాజ్యోతి తన తలను నేలను తాకే రేంజ్ లో వంచింది.
"సర్...ఇందులో నా తప్పేమీ లేదు. ఈ అమ్మాయి నన్ను ..."
"స్టాపిట్ శర్మ గారు...ఇలా ఎస్కేప్ అవ్వడం తప్పుగా అనిపించడం లేదా? అని సంధ్య వైపు తిరిగి "ఏమిటిది? ఇది కాలేజ్ కాదు...వృత్తిలో సీరియస్ నెస్ లేక పోతే....వేరే జాబ్ లోకి వెళ్ళాలి. రోజు కొన్ని వేల మంది చూసే మేగజైన్...."
"నేను చాలా సీరియస్ గా చర్లపల్లి జైలులో ఉన్న సెలబ్రిటీల ఇంటర్ వ్యూ చేద్దామనుకున్నాను సర్...మన సబ్ ఎడిటర్ సర్ వంటల గురించి రాయమంటే, ఆ మంటతో సరదాగా రాసాను సర్...ఇలా చూడకుండా...గుడ్డెద్దు చేలో పడ్డట్టు అప్ డేట్ చేస్తారనుకోలేదు సర్..." బుద్ధిగా లెస్సన్ అప్పచెప్పినట్టు చెప్పేసి...టేబుల్ మీద ఉన్న నీళ్ళు గట గట తాగేసింది.
చీఫ్ ఎడిటర్ శర్మ వైపు చూసాడు....శర్మ కామ్ గా వున్నాడు..."ఇలా మీరు కామ్ గా వుంటే...అది బాధ్యతారాహిత్యం అవుతుంది. చేసే పనిని తపస్సులా భావించే వాళ్ళే జీవితంలో సక్సెస్ అవుతారు....ఇంకో సారి ఇలాంటివి రిపీట్ అవ్వకూడదు..మీరు అప్ డేట్ చేసే ప్రతీది నాకు చూపించాకే అప్ డేట్ చేయండి...మీరు వెళ్ళండి" అన్నాడు.
శర్మ వెళ్ళిపోయాడు. సంధ్య చల్లగా తను కూడా జారుకోబోయింది.
"నువ్వాగు" అన్నాడు చీఫ్ ఎడిటర్.
"అయిపోయాను" మనసులో అనుకుని బుద్ధిగా ఎడిటర్ ముందు నిలబడింది.
"ఇప్పుడు ఈ ఆర్టికల్ ని ఏం చేద్దాం? అడిగాడు ఎడిటర్
"తీసేద్దాం సార్..లేకపోతే ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్న వాళ్ళంతా మన గన్నేరుపప్పు 99 తింటారు. పోలీసులు మనల్ని బొక్కలో..." అని ఎడిటర్ సీరియస్ నెస్ చూసి ఆగింది.
"కీ బోర్డు నీ ఎదురుగా పెట్టుకుని టైపు చెయ్యి" అంటూ చెప్పసాగాడు.
"మేన్ రోబో వీక్షకులకు చిన్న మనవి...నిన్నటి "గన్నేరుపప్పుతో 99 ని వంటకాన్ని చదివి చాలా మంది భార్యామణులు ఇలాంటి వంటకాన్ని "భార్యలను వేధించే మగపురుగు పురుషులతో తినిపించాలి...అంటూ మెయిల్స్ పంపించారు. ఇది ఓ సరదా వంటకం..ఇవి చదివి ఎంజాయ్ చేయడానికే కానీ ప్రాక్టికల్ గా ఇతరుల మీద ప్రయోగించడానికి కాదు. ఇలాంటి సరదా వంటలు...మీరూ పంపించవచ్చు....వంటల మంటలు శీర్షికతో ఈ సరదా వంటల శీర్షిక కొనసాగుతుంది. ఒళ్ళు మంట పుట్టించే వంటకు ఓ బహుమతి కూడా వుంటుంది-ఎడిటర్"
చెప్పడం ఆపి "నిన్నటి నీ వంట కింద ఈ ఐటెం బాక్స్ లో వచ్చేలా పబ్లిష్ చేయండి, అన్నాడు.
ఒక్క క్షణం అలానే చూస్తోందిపోయింది.ఒక నెగిటివ్ అంశాన్ని ఇలా పాజిటివ్ గా మార్చవచ్చా?
"సర్...అంటే ఈ ఫీచర్ >?
"ఈ వంటల మంటలు రెగ్యులర్ గా వస్తుంది. నీలా ఒళ్ళు మండిన వాళ్ళు పంపించే వంటలు సెలెక్ట్ చేసే బాధ్యత నీదే...అప్పటి వరకూ కొన్ని వంటలు రాసి ఫీచర్ కంటిన్యూ చేయాలి." చెప్పాడు ఎడిటర్.
విభ్రాంతిగా చూసింది. ఎడిటర్ అంటే ఆమెకు ఒక అపోహ వుండేది. అంతా సబ్ ఎడిటర్ లు చూసుకుంటారు, అని...కానీ ప్రతీ చిన్న విషయాన్ని ఇంత కేర్ ఫుల్ గా చూసుకుంటారని అనుకోలేదు. తను రాసిన పనికిరాని విషయాన్ని కమర్షియల్ గా మార్చిన తెలివిని చూసింది.
"సర్ చిన్న డౌట్ ..అడగమంటారా? అడిగింది సంధ్య
ఏమిటన్నట్టు చూసాడు ఎడిటర్
"నన్ను ఈ వంటల మంటలుకే పరిమితం చేయరుగా, అడిగింది.
"యూ ...గెటవుట్" కోపంగా అన్నాడు ఎడిటర్
అంతే ఉక్రోషంగా బయటకు వచ్చింది. శర్మ ఆమెనే చూస్తున్నాడు. తన టేబుల్ దగ్గరికి వచ్చి ఓ వైట్ పేపర్ తీసుకుంది. గబా గబా పెన్నుతో గెలికింది.
"ఏం చేస్తున్నారు సంధ్యా ...బాస్ తిట్టారా? అడిగింది ఉమెన్స్ పేజి చూసే సత్య.
"తిడితే...ప్చ్...అని వూర్కునేదాన్ని ..గెటవుట్ అన్నాడు. నాకే పౌరుషం లేదా..నాకేం డబ్బు లేక కాదు. అప్పటికీ మా ఢిల్లీలోని బావ.."సంధూ "వచ్చేయ్.....అన్నాడు. నేనే "కుదర్దు బావా"..అన్నాను. నన్ను ఫ్రిజ్ లో పెట్టుకుని చల్లగా చూసుకుంటాడు. బావా ఢిల్లీ వచ్చేస్తున్నా...అక్కతో చెప్పు...సంధూ కూడా మనతోనే ఉంటుందని...అని ముక్కు చీది....రాజీనామా కాగితాన్ని శర్మ టేబుల్ మీద పెట్టి "ఇదిగో ఇది మీ బాస్ కు ఇవ్వండి. నేను ఒక్కసారి రాజీనామా చేస్తే మూడుసార్లు చేసినట్టు అని చెప్పండి. ...అంతగా నాతో పని ఉందనుకుంటే నా నంబర్ కి ఫోన్ చేయమని చెప్పండి" చెప్పి బయటకు నడిచింది.
ఆఫీసు బయట ఓ అరగంట వెయిట్ చేసింది. ఎడిటర్ వెనక్కి పిలిచి బ్రతిమిలాడుతాడు కాబోలు అనుకుంది. ఆ తర్వాత షాప్ కు వెళ్లి కూల్ డ్రింక్ తాగి ఇంటికి వెళ్లి అర్ధరాత్రి తన రాజీనామా లెటర్ వెనక్కి తెచ్చుకోవాలని డిసైడ్ అయింది.
**********************
అలా అర్ధరాత్రి అడ్వంచరస్ గా ఆఫీసులోకి ప్రవేశించింది.
ఆమె అదృష్టం బావుంది ఎడిటర్ చాంబర్ తాళాలు టేబుల్ మీదే వున్నాయి. వాటిని తీసుకుని లోపలి అడుగుపెట్టింది. ఒక్క క్షణం చిన్న జలదరింపు తను తప్పు చేస్తుందా? ఇలా ఎడిటర్ చాంబర్ లోకి దొంగతనంగా రావడం? ఈ
విషయం
ఎడిటర్ దృష్టికి వెళ్తే? ఆలోచిస్తూ ఎడిటర్ టేబుల్ మీద ఉన్న రెడ్ కలర్ ఫైల్ చూసింది.
దాని మీద బ్లూ స్కెచ్ తో "కాన్ఫిడెన్షియల్ "అని రాసి వుంది. చిన్న ఆసక్తితో ఓపెన్ చేసింది ఫైల్..చంద్రహాస్...అన్న పేరు రాసి వుంది...కింద మిస్సింగ్ ప్రణవి అని వుంది...ఒక్కో పేజీ తిరగేస్తుంటే సంధ్య మొహంలో చెమటలు.
అప్పుడే ఎవరో వస్తోన్న అడుగుల శబ్దం.
(ఆ అడుగుల శబ్దం ఎవరిదీ? ఆ ఫైల్ లో ఏముంది? రేపటి సంచికలో )

No comments: