ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday 18 December 2014

కవిత: "హృది" పలుకు

నవ్వులు నజరానాలు రువ్వుతావని
ముత్యాల పలువరుస చూపుతావని
కన్నుల వెల్గుపూలతో స్వాగతిస్తావని 
హృదయ సడిచప్పుళ్ళు వినిపిస్తావని
దరిచేరా
నవ్వక పలకక హృదినివిప్పక కంటినీటితో
ఇలా అభిషేకిస్తావేమి హలా ఏమయ్యేనీవేళ
కళ్ళల్లో మదిపాశాల చిహ్నాలుంటాయని
మాటలో కోటిరతనాల వెల్గులుంటాయని
వంటిలో సొబగుసోకుల పరిమళాలుంటాయని
పాటలో తీపికోకిలమ్మల మధురిమలుంటాయని
దరిచేరా
చూడక మాటాడక శోభించక పాడకుండా
ఇలా మూగనోము పడితివేమి హలా ఏమయ్యేనీవేళ
బెడద లేదు బెంగ వలదు
సమాజపు ఆరళ్ళపై అస్సలు భయం కూడదు
లొంగితే దంచేను వంచేను వంచించేను ఈ సమాజం
కంగారు వలదు కన్నీరు కార్చరాదు
మనసైన సరిజోడు నీ తోడుండంగా
వంచిదంచితే లొంగి వంగి సలాంచేసేను ఈ జగం
చెలి
మతాబుల వెలిగే నీ మోమే
నా లోకానికిచ్చు కాంతులు
కిలకిలా సాగే నీ నవ్వులే
నా జీవితానికిచ్చు సంబరాలు
కన్నులతో మాటాడు నీ వైనమే
నా జీవననావకు చుక్కాని
హృదయంలో తారాడు నీ భావాలే
నా భవితకిచూపే మార్గదర్సకాలు
ఆడిపాడి నడయాడే నీ సోకులే
నా ప్రేమజగత్తుకు ఆలంబనలు
ఆటైన పాటైన మాటైన
మోమాటమైన అన్నీ నీతోనే
ఒప్పినా ఒప్పకున్నాఏమన్నా
నా జగములో సగము నీదేనే
................. 

No comments: