ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Sunday 18 January 2015

కవిత: కలే కవితైతే

కలత నిద్రలోనూ ఆతృతగానే
నిన్నే కలవరిస్తూ వుంటాను కవితా దేవి 
వద్దన్నా వీడక కలలోకి
మెల్లగావచ్చి అందిస్తావు నీ కవితల తావి .
అర్ధవంతమైన ఆ కవితలో
దాగున్న నువ్వు నీ నవ్వు
కళ్ళు తెరిచి నిను వెతక
నెమ్మదిగా నా నిదుర చెదిరేగా
కవితవై వచ్చి మమేకమై
నాతో ఏకమైన కవితే అయ్యింది 

కవితా శిల్పమైన "ఆమె" 
ఏ మత్తు ఇవ్వకనే గుండె కోస్తుంది
గుండెలో చేరి మెల్లమెల్లగా
రుధిర ప్రసరణతో అంతా తానై నిండుతుంది
నీతో నన్ను విహరింపచేస్తావు
ఎత్తైన శిఖరాలపై లోతైన లోయలలో
నన్నే అల్లరిగా ప్రవహింపచేస్తావు
గలగలాపారే నదిలా మార్చి ఏమార్చి
గాలిపటమై నను త్రిప్పితీసుకువస్తావు
అందని అంబరాన అల నీలిగగనాన
బ్రహ్మాండాన్ని నిమిషంలో చుట్టింపచేస్తావు
అనురాగ సమీరపు నావలో అలవోకగా
హిమశిఖరాలనీ చిటికెలో అధిరోహింపచేస్తావు
ఇష్టమైన వలపుపధంలో కష్టమైన ఓర్చుకుంటూ
పూలతోటల్లో ఓలలాడిస్తూ ఆటలాడింపచేస్తావు
విరులతేనెలత్రాగు భ్రమరాలతో నను చేర్చి
పరవశంతో చల్లనివెన్నెల్లో విహరింపచేస్తావు
మరులతో ప్రేమగీతాలు వినిపిస్తూ పాడపిస్తూ
చల్లనివేళ వేడిమిని అందిస్తావు ..
వెచ్చని ప్రేమరజాయిని పొగమంచులో కప్పి
ఒకే విషయం నీకు చెప్పాలని ఉంది
నేస్తమా నీతో మనసు పంచుకోవాలని వుంది .
జీవితాంతం నీతోనే ఉండనీ నన్ను
కవితై జనిస్తూ నీ పదాలతో రమిస్తూ ..
ఆత్మీయమైన మదీయకలవి నువ్వు
కలైన కవితే జీవితవరముగా అందివ్వు 

No comments: