ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 12 March 2013

" ముగ్ధమోహనం " (18th chapter )
(12-02-2013)
ఒక అనాథ ఆకలితో అలమటిస్తూ,భుక్తి కోసం రోడ్డు మీద అందమైన బొమ్మలు వేసి యాచిస్తుంటే పెద్దగా పట్టించ్ఘుకొని జనం,
అక్కడే ఒక హత్య జరిగితే ఇసుక వేస్తే రాలనంతగా పోగవుతారు...అన్నదానికి నిదర్శనంగా వుంది అక్కడి దృశ్యం.
ఏషియన్ లాడ్జ్ అంటే ఓ పురాతనమైన అతి చవకైన లాడ్జ్...ఒకే సారి ఆ లాడ్జ్ వార్తల్లోకి ఎక్కింది.నెగటివ్ ఎప్పుడూ ఆకర్షణీయం గానే వుంటుంది.
డేవిడ్ హత్య ఆ పరిసర ప్రాంతాల్లోనే కాదు ఢిల్లీ లో సంచలనం సృష్టించింది.టీవీ చానెల్స్ లో స్క్రోలింగులు మొదలయ్యాయి.
ఇలాంటి నేరాలు సర్వసాధారణమే...క్రైమ్ రేటింగ్ లో ముందుంటుంది అనే అపవాదు మూట కట్టుకునే ఢిల్లీ లో ,
బస్సు లో అత్యాచార సంఘటన జనం మర్చిపోకముందే డేవిడ్ హత్య సంచలనం సృష్టించింది.
దానికి కారణాలు రెండు...ఒకటి హత్య చాలా ఘోరం గా జరిగింది.హతుడి కనుగుడ్లు పెకిలించి వేయబడ్డాయి.
రెండు...డేవిడ్ ఒక గే ....అన్న వార్త వెలికి రావడం.ఒక హత్య జరగగానే తమ రేటింగ్స్ పెంచుకోవడం కోసం కొన్ని చానెల్స్ (చాలా వరకు )చేసే ప్రయత్నం..
ఆ హత్య పూర్వాపరాలు సేకరించడం.ఆ విధంగా డేవిడ్ గురించి కనుక్కోవడం పెద్ద కష్టం కాలేదు.పైగా టీవీ చానెల్ లో పనిచేసే క్రైమ్ రిపోర్టర్ పూర్వాశ్రమం లో ఓ పోలీస్ అధికారి.
డేవిడ్ రూం లో దొరికిన ఆధారాలతో అతనో గే గా గుర్తించారు.
అయితే డేవిడ్ గురించి ఇన్వెస్టిగేట్ చేసిన ఆ రిపోర్టర్ హత్యచేసిన వ్యక్తి రిచర్డ్ అని.. డేవిడ్ రిచర్డ్ ని లైంగికం గా వేధించడం వల్లే ఆ హత్య జరిగిందని భావించారు...
వార్తా కథనాన్ని ప్రసారం చేసారు.రిచర్డ్ చిరునామా లభ్యం కాలేదు.చిన్న లాడ్జ్ కావడం, రికార్డ్స్ సరిగ్గా మెయింటేన్ చేయడం మరో లోపం.
ఆ హత్య చేసింది మోహన అని తెలిసిన వ్యక్తి రాబర్ట్
******************* ************************ ********************
ఒక్క క్షణం షాక్ అయ్యాడు రాబర్ట్ .
మోహన అంత త్వరగా ఎస్కేప్ అవుతుందని ఊహించలేదు.తనకు వచ్చిన సమాచారం ప్రకారం మోహన మరికొంత కాలం అక్కడే వుండాలి.
టీవీ చానెల్ లో వచ్చిన వార్త న్జం కాదని తెలుసు.బహుశా మోహన విషయం తెలిసినందుకే ఆ హత్య జరిగివుంటుంది.
అయితే అంత ఘోరంగా ఎందుకు చంపినట్టు?
ఇప్పుడు తనేం చేయాలి ?సి బి ఐ ని కలిస్తే ?ఈగో అడ్డొచ్చింది.మోహన ను తనే ట్రేస్ చేయాలి.తనే ఫినిష్ చేయాలి.
మోహన గురించి తెలిసిన వ్యక్తులు ఇద్దరే ఒకరు యాసిక్...మరొకరు సి...క్వీ. కరుడుగట్టిన ఉగ్రవాది.
**************** ************************ *******************
ఆ గదిలోకి రావడానికి గాలి సంశయిస్తుంది. ఉద్వేగం సైతం ఉగ్విగ్నభరితమ్ గా వుంది.చెలియ కట్ట దాటిన మౌనం వారిద్దరి మధ్యా వున్న బాధను పంచుకోవడాని విశ్వ ప్రయత్నం చేస్తుంది.
"అదేవిటి ..."అంతకు మించి ఏం మాట్లాడాలో తెలియలేదు కార్తికేయకు .
"ఈ రోజు సాయంత్రమే బయల్దేరుతున్నాను ..ఇప్పటికే ఆలస్యం అయింది."గొంతు పెగల్చుకొని బాధ గా చెప్పింది ముగ్ధ.
కార్తికేయ తో గడిపిన ఈ మూడ్రోజులూ మూడు జన్మల అనుబంధం గా అనిపించింది.
ఇష్టమైన వ్యక్తితో గడిపితే యుగాలు క్షణాలై మంచులా కరిగి,మనసులో అందమైన జ్ఞాపకాలు అవుతాయి.
అలాంటి జ్ఞాపకాలను తన మనసు గదిలో భద్రపరిచి ,తన మనసును మాత్రం ఇక్కడే వదిలి వెళ్ళాలని నిర్ణయించుకుంది ముగ్ధ.
"నువ్వు లేకుండా నేను ఉండగలనా ?కార్తికేయ అన్నాడు.
ఆమె పరుగెత్తుకు వచ్చిందో...అతనే ఆమెను చేరాడో...రెండు దేహాలు ఏకాత్మగా అనిపించింది.
ముగ్ధను కార్తికేయ చుట్టేసాడో...కార్తికేయను ముగ్ధ తన ఆలింగనం తో బంధించిందో...
కాసేపు అలానే వుండిపోయారు.
అతడి నుంచి విడిపడడానికి ఆమె మనసూ,తనువూ రెండూ సిద్ధంగా లేవు.
"వెళ్తున్నది ఈ శరీరం మాత్రమే...మనసు కాదు అది మీదగ్గరే వదిలి వెళ్తున్నా"ముగ్ధ చెప్పింది..
ఈ మూడ్రోజులూ వాళ్ళ మధ్య సాన్నిహిత్యం పెరిగింది.కార్తికేయ కోసం తనే వంట చేసింది.
సాయంత్రాలు అతని కోసం ఎదురు చూసింది.
అతనే ప్రపంచంగా గడిపింది.ఫ్రెండ్ నుంచి ఫోన్ వస్తే కూడా లిఫ్ట్ చేయడానికి ఇష్టపడనంత ఇష్టాన్ని కార్తికేయ మీద పెంచుకుంది.
************************* ****************** *********************************
రైల్వే స్టేషన్
కార్తికేయ,ముగ్ధ, ఆమె స్నేహితురాలు.
ముగ్ధ మనసు దిగులుగా వుంది.ఆ విషయం ఆ స్నేహితురాలికి అర్ధమవుతూనే వుంది.
ట్రైన్ అనౌన్స్ మెంట్ వినిపించింది.శరీరం లో ఒక భాగాన్ని కోసి,సగభాగాన్ని తీసుకు వెళ్తున్నట్టు వుంది.
"ఎక్కువగా హోటల్స్ లో తినకండి.ఫ్రిజ్ లో పెరుగు తోడేసి పెట్టాను.కిచెన్ లో స్టీల్ డబ్బాలో మీ కోసం స్వీట్స్ చేసి పెట్టాను.తినడం మర్చిపోకండి....
అని తన ఫ్రెండ్ వైపు తిరిగి "నువెటూ రావడం లేదు..రెంద్రిజులకోసారి వెళ్లి తనకు వంట చేసి పెట్టి రావచ్చుగా "
అంది.
కార్తికేయకు ఈ అనుభవం కొత్తగా వుంది.కొత్తగా పెళ్ళైన జంట...బార్య పుట్టింటికి వెళ్తూ భర్తకు జాగ్రత్తలు చెబుతున్నట్టు వుంది.
ట్రైన్ వచ్చింది.కంపార్ట్ మెంట్ లోకి ఎక్కిడోర్ దగ్గర నిలబడింది.

"నీకు ఇష్టమైన ఎప్పటి నుంచో నువ్వు చూడాలని అనుకుంటున్న తాజ్ మహల్ ని చూడకుండానే వెళ్తున్నావ్?అడిగాడు కార్తికేయ.
"చూడకుండా ఎందుకు వెళ్తున్నాను...అని కార్తికేయ కళ్ళలోకి చూసి...
"ఈ మూడ్రోజులూ తాజ్ మహల్ లోనే గడిపాను...షాజహాన్ సమక్షం లోనే గడిపాను.ఈ షాజహాన్ సమక్షం లో గడిపాను.
దేవాలయం లాంటి తాజ్ మహల్ లో గడిపిన నాకు ఆ సమాధి తో పనేమిటి?
రైలు కదిలింది..అతని గుండె చెమర్చింది.
************************** *********************** *******************
(మరి మీ మనసు? ముగ్ధను తిరిగి కలుసుకోగాలడా?వాట్ నెక్స్ట్ ?రేపటి సంచికలో )

No comments: