ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday 12 March 2013

"ముగ్ధమోహనం" (19th chapter)
(13-02-2013)
.............................................
ఆకాశం మేఘావృతం కాలేదు...కానీ ఒంటరితనం మేఘాలు మనసు ఆకాశంలో ఆక్రమిస్తూ తిరుగాడుతున్నాయి. ఇంట్లోకి అడుగు పెట్టాడు. నిన్నటి జ్ఞాపకాలు..కన్నీటి తర్జని చూపి నిలదీస్తున్నట్టు, కాసేపటి క్రిందటి జ్ఞాపకం... గుండె గొంతుకలో విషాద స్వరమై ఆలపించినట్టు....విలపించినట్టు....
అలాగే నేల మీద కూచుండి పోయాడు. సర్వ సామ్రాజ్యాన్ని కోల్పోయిన సామ్రాట్టు శూన్య సింహాసనాన్ని అధిరోహించినట్టు...ముగ్ధ జ్ఞాపకం ఒక దృశ్యమై కనుల ముందట నిలిచినట్టు...
*******************************************
కార్తికేయ పక్కనే కూచుంది ముగ్ధ. "ఏమిటాలోచిస్తున్నారు? అతని నుదురు మీద చేయి వేసి అడిగింది.
ఆ చేతిని అలానే పట్టుకుని వదిలేస్తే ఎక్కడి వెళ్తుందేమో అన్నంత ఆర్తిగా ఆ చేతిని పట్టుకుని తన గుండెల మీద పెట్టుకున్నాడు. గుండెల మీద వుండాల్సింది చేయి కాదు అంటూ అతని చొక్కాకు వున్న మొదటి గుండీ తీసి అతని హృదయ భాగం మీద తల పెట్టి అంది. ఆమె ఉశ్చ్వాశ, నిశ్చ్వాసాలు, ఆరోహణ, అధిరోహణలు అయ్యాయి. అతని చెక్కిలిపై జాలు వారిన కన్నీటి చుక్క ఆమె బుగ్గని తాకి కుశలం అడిగింది. తన రెండు చేతులను ఆమె చుట్టూ బిగించాడు. ఇది దిగ్భందనం...ఇష్ట దిగ్భందనం.
"ఇది ధృతరాష్ట్ర కౌగిలి కాబోలు అనుకున్నాను...కానీ నా మనో హృదయాధినేత గాడాలింగనం అని అర్ధమైంది, అతని చెవి కొసని కొరికి" అంది ముగ్ధ. అతను ఆ భావాన్ని, ఆ ఊహను అనుభూతిస్తున్నాడు.
ఆ ఊహను డిస్ట్రబ్ చేస్తూ ఫోన్ కాల్. ఏషియన్ లాడ్జ్ లో ఓ హత్య జరిగింది. రాబర్ట్ అమెరికా నుంచి ఇండియా వచ్చాడు. ఈ రెండింటి కన్నా మూడవ సమాచారం అతడ్ని ఆందోళనకు గురి చేసింది.
యాసిక్ రాణా సర్కిల్ ప్రాంతంలో కనిపించాడు.
అంటే? అంజలిని ఏమైనా? దిగ్గున లేచాడు. బయటకు పరుగెత్తాడు.
యాసిక్ అంజలి ఇంటికి సమీపంలో వున్నాడు. కార్తికేయకు బుద్ధి చెప్పాలి. తన కాలిన మొహానికి ప్రతీకారం తీర్చుకోవాలి. అంజలి ఇంటిని సమీపించాడు.
************************************************
అంజలి తల్లిదండ్రుల ఫోటో ముందు నిలబడింది. మొన్నటి వరకు తనకు అమ్మ, నాన్న వున్నారు.
ఈ రోజు లేరు. తనను నిద్ర లేపేవారు, తన బాగోగులు చూసేవారు...ఎవరూ లేరు. అమ్మ,నాన్న ఫోటో పక్కనే దేవుడి ఫోటో. "దేవుడూ,నేను చిన్నపిల్లని కదా...నేనేం తప్పు చేసాను, నాకు అమ్మని ,నాన్నని లేకుండా చేసావు. నీకు ఎలాగు లేరని నన్ను అనాథను చేసావా? నువ్వు నాలా ఒంటరిగా ఈ భూమ్మీద బ్రతుకు...అప్పుడు తెలుస్తోంది ఆ బాధేమిటో...నా బాధేమిటో"...."ఆమె బుగ్గల మీద కన్నీళ్ళు చిరపుంజి వర్షపాతమైంది. ఒక్క క్షణం నొప్పి...కడుపులో మెలిపెట్టి తిప్పినట్టు....భరించలేని కడుపునొప్పి .
"ఆ...ఆ...మ్...మ్ ...మ్ మ్మా ...అమ్మా" ... మోకాళ్లను కడుపులో పెట్టుకుంది. అప్పుడే తలుపు దడేలుమని తెరచుకుంది.
ఎదురుగా యా...సి...క్....
**********************************************
కార్తికేయ కాలు యాక్సిలేటర్ని తొక్కి పెట్టింది. కారు డెబ్బై, ఎనభై దాటింది. విపరీతమైన ట్రాఫిక్ ని లెక్క చేయకుండా డ్రైవ్ చేస్తున్నాడు. అతని మనసెందుకో కీడును శంకిస్తుంది.
యాసిక్ ఎలాంటి క్రూరుడో తెలుసు. అసలు ఎలా తప్పించుకున్నాడు? అంజలికి ఏదైనా అపకారం తలపెడితే? మరో పది నిమిషాల్లో తను అంజలి ఇంటిని చేరుకుంటాడు.కానీ ఈ లోగా...?
************************************************
తలుపు తోసుకుని వచ్చిన యాసిక్ వైపు భయంగా చూసింది అంజలి.
రక్తంతో తడిసిన దుస్తులు. భయంతో చెమట పట్టిన మొహం. నిస్సయతతో కూడిన చూపులు.
అతనిలో పైశాచిక, వికృతానందం. యాసిక్ జేబులో నుంచి సెల్ ఫోన్ తీసాడు. మరో చేతిలో యాసిడ్ బాటిల్.
****************************************
(విధాత లలాట లిఖితాన్ని నిలదీసిన కార్తికేయ ...రేపటి సంచికలో )

No comments: