ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday 12 March 2013

"ముగ్ధమోహనం" (24thchapter)
(18-02-2013)
.......................
ఎన్నో ఉగ్రవాద సంస్థలతో పరిచయం....నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోసిన రాక్షసత్వం వున్న సిక్వీ రెండవ సారి భయంతో వణికిపోయాడు. దేశసరిహద్దుల్లో కార్తికేయ తల్వార్ తో తన కుడి చేతిని ఒకే వేటుతో నరికేసినప్పుడు.....ఇప్పుడు మోహన పాయింట్ బ్లాక్ రేంజ్ లో రివాల్వర్ పెట్టి ట్రిగ్గర్ మీద వేలు బిగించినప్పుడు. ఒకరు దేశం కోసం ప్రాణాలిచ్చే వ్యక్తి అయితే....మరొకరు ఆ దేశాన్ని....?
"చావు నీకు వెంట్రుక దూరంలో వుంది. తల వుంటే సరిపోదు సిక్వీ...తలలో ఉండాల్సిన మొదడు కనీసం వంద గ్రాములైనా వుండాలి. నీ మెదడు బోర్డర్ లో పాతిపెట్టి వచ్చావా?
"యాసిక్ ఢిల్లీలో వున్న నాలుగు వేల మూడు వందల నలభై మంది గూండాలలో ఒకడు. కేవలం అతనికి వున్న అమ్మాయిల పిచ్చి వల్ల వార్తల్లోకి వెళ్ళాడు. వాడు కాకపొతే మరొకడు. వాడిని కాపాడితే కార్తికేయ దృష్టి మన మీద పడుతుంది." అతడి గుండెల మీద కాలు తీసి అంది.
"కానీ నాకు అర్ధం కాని విషయం ఒకటుంది మేడం" పలకరింపులో భయంతో కూడిన గౌరవం వచ్చింది.
"మీలాంటి వ్యక్తి కార్తికేయ లాంటి ఒక కస్టమ్స్ ఆఫీసర్ కు ఎందుకు భయపడుతున్నారు?ఎఫ్ బి ఐ ని ముప్పతిప్పలు పెట్టారు. రష్యా కె జి బి కూడా మిమ్మల్ని ఏమీ చేయలేక పోయింది. అలాంటిది ఆఫ్ట్రాల్..." అతని మాట పూర్తీ కాక ముందే, అరిచింది మోహన "స్టాపిట్ "
"అసలు కార్తికేయ గురించి నీకేం తెలుసు? బోర్డర్ లో వున్న నువ్వు సి బి ఐ చీఫ్ ని చంపుతుంటే రెక్కలు కట్టుకుని వచ్చి నీ చేయి నరికాడని అనుకుంటున్నావా? పులి కళ్ళు, ఉడుం పట్టు...మెరిసే మెరుపులోనే విద్యుత్ శక్తి...పిడుగుపాటు పవర్ ఇలాంటివన్నే కలిస్తే 'కా...ర్తి..కే...య"
చెప్పడం ఆపి, సిక్వీ వంక చూసింది.సిక్వీ. ఆశ్చర్యంగా మోహన వంక చూస్తున్నాడు.
ఎవరి గొప్పతనాన్ని అంగీకరించని మోహన...ఎవరినైనా నిర్లక్ష్యం చేసే మోహన ఓ వ్యక్తి గురించి అదీ శత్రువు గురించి ....అతని ఉద్దేశం అర్ధమైనట్టు కొనసాగించింది.
"యుద్ధంలో శత్రువును ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు....సైనికుడిని నిర్లక్ష్యం చేయవచ్చు...
కానీ సైనికుడి చేతిలో వున్న ఆయుధాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.ఎందుకంటే ఆయుధానికి దయాదాక్షిణ్యాలు వుండవు. కార్తికేయ బలమైన ఆయుధం లాంటివాడు. అతడే ఆయుధం...అతనే సైన్యం..."
**************************************************
ఒక్క క్షణ ఊపిరి పీల్చడం మర్చిపోయాడు సిక్వీ...శత్రువులను అంచనా వేయడంలో మోహనకు వున్న తెలివితేటలూ చూసి విస్తుపోయాడు. శత్రువు గురించి తెలుసుకోవడం వేరు....తెలుసుకున్న దానిని ఎనలైజ్ చేయడం వేరు. మోహన కొనసాగించింది." దేశరాజధాని నడిబొడ్డులో యాసిక్ ని అతి కిరాతకంగా చంపితే...ఆ దృశ్యాలు టీవీ చానెల్ లో కూడా వచ్చాక కూడా పోలీసులు పట్టించుక్వడం లేదనే అనుకుంటున్నావా? ఢిల్లీ పోలీసులను తక్కువ అంచనా వేస్తున్నావా? ఆలోచించు సిక్వీ? ఆగింది మోహన. అక్కడ వాతావరణం ఉద్విగ్నంగా వుంది. ఇప్పుడు మోహన చెప్పబోయే విషయం సిక్వీ వెన్నులో చలి పుట్టించబోతుంది.
********************************************
కార్తికేయ షవర్ కింద నిలబడ్డాడు. షవర్ ధారలో తడిసిపోతున్నాడు. యాసికి చంపాక అతనిలో కొంత రిలాక్స్ కనిపించింది. అంజలిని పట్టుబట్టి హాస్టల్ లో చేర్పించాడు. అంజలి ఆచూకి తనకు, హేమంతకు తప్ప మరెవ్వరికీ తెలియదు. అంజలి శ్రేయస్సు దృష్ట్యా ఆ పని చేసాడు. షవర్ కట్టేసి డ్రెస్సింగ్ మిర్రర్ దగ్గరికి వచ్చాడు. అద్దంలో ముగ్ధ కనిపించింది. తన ఆలోచన ప్రతిబింబమే అది. తన వంకే చూస్తోంది. ముగ్ధ మాటలు గుర్తొచ్చాయి. ఇన్నాళ్ళు తాజ్ మహల్ లోనే వున్నాను....షాజహాన్ సమక్షంలోనే వున్నాను. ఎంత గొప్ప భావం. ముగ్ధ జ్ఞాపకం అతనికి మండువేసవిలో మలయమారుతంలా వుంది.
అతని ఆలోచనలకు బ్రేక్ వేస్తూ...సెల్ రింగ్ అయింది. డిటెక్టివ్ శ్యాంసన్ దగ్గరి నుంచి వచ్చిన ఫోన్ కాల్ .
ఓకే బటన్ ప్రెస్ చేసి "చెప్పండి శ్యాంసన్ " అన్నాడు.
"సిక్వీ అడ్రెస్ ట్రేస్ చేసాం..." అంటూ అడ్డ్రెస్ చెప్పాడు .
"థాంక్యూ శ్యాంసన్ "చెప్పి సెల్ ఆఫ్ చేసాడు.
*********************************************
ఒక్క క్షణం సిక్వీ వంక చూసి దీర్ఘంగా నిశ్వసించి "సారీ సిక్వీ ఇప్పుడు నీకో భయంకరమైన నిజం చెప్పబోతున్నాను ..విని తట్టుకోగాలవా? అంది మోహన.
సిక్వీ షాకింగ్ గా చూసి "ఏమిటది? అని అడిగాడు.
కార్తికేయ నెక్స్ట్ టార్గెట్ నువ్వే....సి బి ఐ చీఫ్ మీద హత్యాప్రయత్నం చేసాక నీ గురించి వేట మొదలైంది. నిన్ను ఫినిష్ చేయాలనే నిర్ణయించుకున్నాడు. పార్లమెంట్ దాడి సంఘటన సమయంలో నువ్వు ఢిల్లీలోనే వున్నావన్న ఆధారాలు సంపాదించాడు. నిన్ను అరెస్ట్ చేయడం....కోర్ట్ లో ప్రొడ్యూస్ చేయడం వాయిదాలు..వురి ..ఆ తర్వాత క్షమాబిక్ష ...ఇవ్వన్నీ కార్తికేయకు నచ్చావు. డైరెక్ట్ గా నిన్ను చంపాలనే నిర్ణయించుకున్నాడు. మరో ప్రక్క మీ సంస్థ కూడా నీ గురించి వెతుకుతుంది. నీ వల్ల ఉపయోగం లేకపోవడమే కాదు. నిన్ను పట్టుకుంటే మీ సంస్థ రహస్యాలు ఎక్కడ చెప్పేస్తావేమోనని వాళ్ళ భయం.
తాపీగా చెప్పింది, మోహన.
"నేను నమ్మను" గట్టిగా అరిచాడు సిక్వీ.
"గట్టిగా అరిస్తే నిజం అబద్దం అయిపోదు సిక్వీ...ఒకటి నీ వాళ్ళ చేతిలో చస్తావా?
రెండు..కార్తికేయ చేతిలో చిత్రహింసలు అనుభవించి చస్తావా?
లేదా..అని ఆగి"
"సింపుల్ గా పాయింట్ బ్లాక్ రేంజ్ లో ఒకే ఒక బులెట్ తో నా చేతిలో చస్తావా?"
సిక్వీ హిస్టీరియా వచ్చినట్టు ఊగిపోయాడు.
టైం లేదు సిక్వీ ....నీ ఇష్టం ..ఓ సారి అటు చూడు...అంటూ తన చేతిలో వున్న రిమోట్ బటన్ ప్రెస్ చేసింది.
ఎదురుగా సి సి టీవీలో దృశ్యం..కార్తికేయ ఎంట్రన్స్ లో వున్నాడు. లోపలికి నడిచి వస్తున్నాడు.
అటు చూడు అంటూ మరో బటన్ ప్రెస్ చేసింది, ఉగ్రవాద సంస్థకు చెందిన కరుడుగట్టిన ఉగ్రవాదులు...
చేతిలో ఆయుధాలతో లోపలి ప్రవేశిస్తున్నారు. టైం లేదు సిక్వీ...మరణం అనివార్యం అనుకున్నప్పుడు....సులువైన మరణాన్ని కోరుకోవాలి...రివాల్వర్ ని ముద్దు పెట్టుకుంటూ అంది.
సిక్వీ మెదడు పనిచేయడం లేదు. అతనిలో మొదటి సారి పశ్చాతాపం...తనేం సాధించాడు...
అనుక్షణ భయపడుతూ. ఇతరులను భయపెడుతూ...కుటుంబానికి దూరంగా .....తను ఎవరి చేతిలో మరణించాలి? భయం స్థానంలో వైరాగ్యంతో కూడిన నవ్వు...భయం...అయోమయం...వైరాగ్యం అతని ఆలోచనను మోద్దువారేలా చేసాయి.
"నిర్ణయించుకో సిక్వీ టైం లేదు "
నిర్ణయించుకున్నాడు సిక్వీ ...
"మీరు వెళ్ళండి మోహన ...నా ప్రాణం ఎవరి చేతుల్లో పోతుందో అల్లా నిర్ణయిస్తాడు"
***************** ********************* ********************
(సిక్వీ నిర్ణయం ఏమిటి? రేపటి సంచికలో)

No comments: