ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 12 March 2013

"ముగ్ధమోహనం" (25thchapter)
(19-02-2013)
చాలా తెలివిగా మైండ్ గేమ్ ఆడింది మోహన...ఆ గేమ్ లో ఆమె పందెం.... సిక్వీ ప్రాణం.
మోహన ఆ హాల్ లో వున్న సీక్రెట్ ద్వారం గుండా వెళ్ళిపోయింది. సిక్వీ ఒంటరిగా మిగిలాడు.
ఏ క్షణమైనా అటు కార్తికేయ...ఇటు తనను చంపడానికి వచ్చే తన వాళ్ళు.
మొదటి సారి అతనిలో పశ్చాత్తాపం మొదలైంది. అతని తన భార్యాబిడ్డలు గుర్తొచ్చారు.
ఏ చీకటిలోనో...ఏ రహస్య బంకర్ లోనో... కట్టుకున్న భార్యతో కూడా...
భయం భయంగా ఎప్పుడు ఎటు వైపు నుంచి ఎవరు దాడి చేసి చంపుతారో అన్న భయంతో కాపురం చేయాలి.
పుట్టిన బిడ్డల మొహం కూడా గుర్తు ఉండని పరుగుల జీవితం. భయంకరమైన శిక్షణ...
బంధాలు అన్నీ వదిలేసి ఎవరికోసం ఈ ఆత్మాహుతి జీవితాలు.?
ఇన్నాళ్ళు తను ఎవరికోసం పోరాడాడో వాళ్ళే తనను చంపుతారా? వాళ్ళ చేతిలో చచ్చిపోవాలా?
తన శత్రువు చేతిలో చచ్చిపోవాలా?
తన చావు రహస్యాన్ని చెప్పిన మోహన చేతిలో చచ్చిపోవాలా?
వీళ్ళ చేతిలో చచ్చిపోకూడదు.ఇన్నాళ్ళు తనకు ఈ జీవితాన్ని, జన్మని ఇచ్చిన అల్లాని తన తప్పు క్షమించమని, మరో జన్మలో తనను మంచివాడిగా పుట్టించమని అల్లాకు క్షమాపణలు చెబుతూ చచ్చిపోవాలి. సిక్వీ టేబుల్ మీద వున్న రివాల్వర్ తీసుకున్నాడు. తన కణతకు గురి పెట్టుకున్నాడు.
*******************************************************************************************
అసలు జరిగిందేమిటో తెలుసుకోవాలంటే కొద్ది గంటలు వెనక్కి వెళ్ళాలి.
కార్తికేయ సిక్వీ కోసం వేట మొదలుపెట్టడాని తెలిసింది మోహనకు.
ఖచ్చితంగా సిక్వీని పట్టుకుంటాడు. అతని నుంచి తన రహస్యాలు రాబడతాడు.
తన గురించి వివరాలు తెలిసిన వ్యక్తి సిక్వీ మాత్రమే.
***************************************************************************************
సిక్వీ బ్రతికి వుంటే ఎప్పటికైనా సమస్యే....మోహన శత్రువులనే కాదు...
తన ప్రాణానికి ముప్పు అని తెలిస్తే తన వాళ్ళనూ వదలదు. ఇప్పుడు సిక్వీ కార్తికేయకు దొరక్కూడదు...
అంటే సిక్వీ చచ్చిపోవాలి లేదా పారిపోవాలి....ఎంత దూరం పారిపోగలడు...ఉగ్రవాద సంస్థ సిక్వీ ప్రాణాలను కాపాడుతుందా? పోనీ తనే సిక్వీని చంపితే? అప్పుడు ఉగ్రవాద సంస్థ హిట్ లిస్టులో తను ఉండిపోతుంది. మరో వైపు కార్తికేయ...
ఉగ్రవాద సంస్థను కార్తికేయ మీదికి ఉసిగోల్పితే?
అప్పుడొచ్చిన ఆలోచన అమలు చేసింది. సిక్వీ ప్రాణాలు అపాయంలో వున్నాయని, కార్తికేయ అతడ్ని ఎన్కౌంటర్ చేయబోతున్నాడని ...
ఆ విషయాన్ని ఉగ్రవాద సంస్థకు చేరవేసింది. ఉగ్రవాదుల మూక కదిలివచ్చింది.
అదే సమయంలో సిక్వీతో పాటు తను ఇక్కడ వున్న విషయం కార్తికేయకు తెలిసేలా చేసింది.
సిక్వీ భయం మీద చిన్న ట్రిక్ ప్లే చేసింది.
తన చుట్టూ మృత్యు వలయం ఉందన్న భ్రమని కలిగించింది.
కార్తికేయ సిక్వీని చంపితే, ఉగ్రవాద మూక చేతిలో చావక తప్పదు...
లేదా ఇద్దరి మధ్య డెత్ గేమ్ మొదలవుతుంది. సిక్వీ ఒకరి చేతిలో చావడానికి ఇష్టపడడు...
తనను తానూ కాల్చుకొని....నవ్వుకుంది...మనిషి బలహీనత మీద గేమ్...
******************************************************************************************************
చనిపోయే ముందు మరోసారి అల్లాని ప్రార్ధించాడు.
"నేను చేసిన పాపాలకు శిక్షను నా కుటుంభానికి విధించకు....మతాన్ని ఉన్మాదంగా మార్చే మతోన్మాదులకు బుద్ధి చెప్పు.....
నీ బిడ్డలకు మంచి బుద్ధిని ప్రసాదించు...నా లాంటి చావు ఎవరికీ రాకుండా చూడు..అల్లా హో......"
బుల్లెట్ అతని కణతలో నుంచి దూసుకు వెళ్ళింది.
అతను పొరపడి తన ప్రాణాలు తీసుకున్నాడు...కానీ అతనిలోని పశ్చాత్తాపం కొందరినైనా ఆలోచింపజేస్తుంది....
ఎందుకంటే సిక్వీ చనిపోయే ముందు సూసయిడ్ నోట్ రాసాడు....
ఉగ్రవాదంతో మానవ సంబందాలను ఉరి తీయవద్దన్న కోరిక ఆ నోట్ లో వుంది.
సిక్వీ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి....
ఉగ్రవాద మూక లోపలి వచ్చేలోగా స్పెషల్ ఫోర్సు వాళ్ళని చుట్టుముట్టింది.
ప్రమాదాన్ని ముందే ఊహించి కార్తికేయ చేసిన ఏర్పాటు అది. కొందరు పారిపోయారు...కొందరు దొరికారు...
వాళ్ళలో ముఖ్యమైన వ్యక్తీ రజ్వీ .
****************************************************************************************************
సిక్వీ మృతదేహం ముందు కొద్దిక్షణాలు మౌనం పాటించాడు...
సిక్వీలోని పశ్చాత్తాపం అతడి మీద వున్న దేశద్రోహి ముద్ర చెరిపేసింది.
అతని కుటుంబానికి ఆసరా కలిపించవలిసిన బాధ్యత కూడా వుందని భావించాడు కార్తికేయ.
మోహన ఎస్కేప్ అయిన విషయం గుర్తించాడు కార్తికేయ...
రజ్వీని ఇంటరాగేట్ చేస్తే మోహన విషయం తెలిసే అవకాశం వుంది.
**********************************************************************************************************
న్యూ ఎక్స్ ప్రెస్ కొరియర్ సర్వీస్ ...
ఆ రోజు కొరియర్ చేయాల్సిన లిస్టులో వున్న బాక్స్ టేబుల్ మీద పెట్టాడు కొరియర్ బాయ్...
కార్తికేయ పేరుతో వున్న బాక్స్ అది.
(ఆ బాక్స్ కార్తికేయను చేరుతుందా? రేపటి సంచికలో)

No comments: