ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday 30 March 2013

విసురజ "ముగ్ధమోహనం" తొలి డైలీ సీరియల్
(Chapter---63) (29-03-2013)
.........
ఒక అనూహ్య కలయిక...ఒక విచిత్ర వీడ్కోలు....విధి వైచిత్రి అనుకోవాలా? విధాత లలాట లిఖితం అనుకోవాలా? కార్తికేయ కుడిచేతిలో మహామాన్వి ఖడ్గం ....కళ్ళు పెద్దవి చేసి చూసింది మోహన...తనపై దూయవలిసిన ఖడ్గం...?
కార్తికేయ మోహన వైపే చూస్తున్నాడు...ఉదయమే తలారా స్నానం చేసి దేవుడి గదిలో దీపం వెలిగించి, ధూప, నైవేద్యాలతో...పూజగదిని కోవెలగా మార్చింది. ఈ యుద్ధంలో తను గెలిస్తే మోహన ఏమవుతుంది?
"మోహనా నేను ఓడిపోతే...ఈ యుద్ధంలో మరణిస్తే...ముగ్ధను వాళ్ళ తండ్రి దగ్గరికి చేర్చుతావు కదూ...."
"అక్షరమా కన్నీటి చుక్కవై...మెరిసావా? పదమా గొంతు భారమై మౌనమయ్యావా? వాక్యమా మూగవై పోయావా? నిన్నటి జ్ఞాపకం...ఇప్పటి వర్తమానం...రేపటి భవిష్యత్తును శాసిస్తుందా?"
కార్తికేయను చేరింది. అతని కుడి చేతిని కొద్దిగా పక్కకు జరిపింది. అతడిని గట్టిగా పట్టుకుంది.
ఒక చేతిలో ఖడ్గం...మరో చేయి అలానే ఉండిపోయింది.
"మీరు ఓడిపోతే ధర్మం తల దించుకుంటుంది...రాజసం తల వాలుస్తుంది. మీరెప్పుడూ తూర్పున ఉదయించే సూర్యుడే...పశ్చిమాన అస్తమించే భాస్కరుడు కాదు....
ఇది మీరు యుద్ధభూమిలోకి అడుగుపెడుతున్నప్పుడు మీ ముగ్ధ ఇచ్చే కౌగిలి...ఈ ఆలింగనం మీకు విజయకేతనం...నాలో ముగ్ధను చూసుకోండి. ఇది స్వార్ధంతో చెప్పడం లేదు...ఒట్టు..."
కార్తికేయ ఎడమ చేయి (అ)ప్రయత్నంగా మోహనను చుట్టేసింది. ఆమె ఉచ్వాస, నిశ్వాసాలు అతని ఎదను తాకుతున్నాయి.
"ఇది మోహన అనబడే ఒక నిజమైన ప్రాణ నేస్తానికి మనస్ఫూర్తిగా ఇస్తోన్న వీడ్కోలు. విజయంతో తిరిగివస్తే...ప్రాణాలతో నిన్ను చట్టానికి అప్పగిస్తాను, నిన్ను మార్చుకుంటాను...నాతో గడిపిన కొద్ది రోజులు నిజాయితీగా వున్నావు..నా ముగ్ధను కాపాడావు...నా మనసులో ఒక ఆత్మీయ అతిథిగా వున్న నా నేస్తానికి ఈ కౌగిలి ఒక అందమైన వీడ్కోలు......ఇందులో కోరిక లేదు...కృతజ్ఞత వుంది..నమ్మకం వుంది...." ఆమె నుంచి విడిపడ్డాడు.
కార్తికేయలో మొదటి సారి కన్నీళ్ళ మెరుపును చూసింది మోహన.
ఆ క్షణమే నిర్ణయించుకుంది. ఆ నిర్ణయం మోహన జీవితాన్నిఅనూహ్యమైన మలుపుకు తీసుకు వెళ్ళింది.
*********************
కార్తికేయ మోహన వైపు చూసాడు.
ఆమెలో ఏ భావమూ కనిపించడం లేదు. ఎన్నో భావాలను బంధించింది...
మనసులోని ప్రేమను..కళ్ళలోని కన్నీళ్లను...ఓటమిలోని గెలుపునూ ...చివరికి తన ప్రాణాన్నీ .....
మరో పది నిమిషాల తర్వాత కార్తికేయ ఇంటి ముందు ఓ కారు ఆగింది. అందులో నుంచి బురఖా ధరించిన మహిళ దిగింది. లోపలికి వచ్చింది.
బురఖా ధరించిన మహిళ లోపలి రాగానే కార్తికేయ తలుపు వేసాడు. ఆ మహిళ బురఖా తొలిగించింది.
"ఈ అమ్మాయి ముగ్ధ స్నేహితురాలు...పేరు హేమంత...అని హేమంత వైపు తిరిగి ...తను మోహన ...అని పరిచయం చేసాడు.
స్నేహపూర్వకంగా చేయి చాచింది హేమంత. మోహన అలానే చూస్తూ ఉండిపోయింది.
"థాంక్యూ మోహన గారూ...మీరు మా ముగ్ధను కాపాడినందుకు..." సిన్సియర్ గా అంది హేమంత.
"నేను మీ ముగ్ధను కిడ్నాప్ చేసినందుకు కోపంగా లేదా? మోహన అడిగింది.
"ఉంది...దానికన్నా కృతజ్ఞత ఎక్కువగా వుంది"
కార్తికేయ మోహన వైపు తిరిగి..."మీరు ఈ బురఖా ధరించండి ...మీ స్థానంలో హేమంత వుంటుంది " చెప్పాడు.
"ఎందుకు...నన్ను అరెస్ట్ చేస్తున్నారా? పారిపోతానని భయమా? అడిగింది మోహన.
"కాదు మిమ్మల్ని చంపేస్తారన్న భయం " చెప్పాడు కార్తికేయ.
విభ్రాంతిగా, అపనమ్మకంగా చూసింది మోహన.
ఈ క్షణం బ్రతకాలని ఉంది...ఒక్కక్షణం కార్తికేయ మనిషిగా...ముగ్ధకు ఆత్మీయురాలిగా, ఈ ప్రపంచాన్ని ప్రేమించే మోహనగా బ్రతకాలని ఉంది. తనను చంపడానికి ఒకరు సిద్ధంగా వున్నారు...ఆ ఒక్కరు ఎవరో తెలుసుకోవాలంటే...మోహన ముగ్ధను కాపాడిన రోజు ఏం జరిగిందో తెలుసుకోవాలి.
********************

No comments: