ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday 12 March 2013

" ముగ్ధమోహనం " (27thchapter )
(21-02-2013)

శ్రీనివాస్ ఈడూరి...
హైదరాబాద్ లో గోకుల్ చాట్ లో బాంబు పేలుళ్ళ తర్వాత అదే తరహాలో రాష్ట్ర అసెంబ్లీ ని టార్గెట్ చేసారు కొందరు ఉగ్రవాదులు.
పార్లమెంట్ పై దాడితో దేశాన్ని,అసెంబ్లీ పై దాడితో రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసే ప్రయత్నాన్ని గమనించిన ప్రభుత్వం సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ) ని ఏర్పాటు చేసింది.
శ్రీనివాస్ ని ఆ టీం కు ఆఫీసర్ గా చేసింది.
కర్తవ్య నిర్వహణలో ముక్కు సూటిగా వ్యవహరించే శ్రీనివాస్ రాజకీయ నాయకులకు టార్గెట్ అయ్యాడు.
హోం మినిస్టర్ ని కూడా విచారించాలన్నాడు. ఇతర పార్టీల్లో వున్నా ఫాక్షనిస్తుల రక్తచరిత్ర వెలికి తీసాడు.
నిజాయితీని టిష్యూ పేపర్ లా వాడుకుని వదిలేయాలని అతని ఉన్నతాధికారులు సలహా ఇచ్చారు.
అది నచ్చని శ్రీనివాస్ ,తనలోని నిజాయితీని వదులుకోవడానికి ఇష్టపడని శ్రీనివాస్ ఉద్యోగాన్ని వదిలేసాడు.
అసెంబ్లీ ఎదురుగా చిన్న కిరాణా కొట్టు పెట్టుకున్నాడు.ఐ పి ఎస్ చేసిన ఆటను కిరాణా కొట్టు ఎందుకు పెట్టుకున్నట్టు?
ఆ విషయం తెలియాలంటే మనం ముందుకు వెళ్ళాలి.
*******************************************************************************************
డోర్ బెల్ విని తలుపు తీసాడు కార్తికేయ ...ఎదురుగా కొరియర్ బాయ్ .
"సార్ కొరియర్ " బాక్స్ ఇచ్చి కార్తికేయ చేత సంతకం పెట్టించుకున్నాడు కొరియర్ బాయ్.
ఫ్రమ్ ముగ్ధ అన్న అడ్రెస్ చూడగానే గొప్ప ఫీలింగ్ అతని హార్ట్ ని టచ్ చేసింది.ఆ బాక్స్ ని అపురూపంగా పట్టుకున్నాడు.
వెంటనే డోర్ తీసి కొరియర్ బాయ్ ని కేకేసాడు.అప్పటికే అతను బైక్ స్టార్ట్ చేసాడు.
కార్తికేయ పిలువగానే ఒక్క క్షణం భయపడిపోయాడు. తను కవర్ ఓపెన్ చేసిన విషయం తెలిసిపోయిందా?
మెల్లిగా బైక్ ఆపి భయం గా కార్తికేయ దగ్గరికి వచ్చాడు.కార్తికేయ జేబులు ఎంత డబ్బు వుందని చూడలేదు.మొత్తం ఇచ్చేసాడు.
"థాంక్యూ మై బాయ్ "అన్నాడు.కార్తికేయ మొహం లో చూసిన ఆనందానికి కొరియర్ బాయ్ కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
తను చాలా పొరపాటు చేసాడు.ఇంకా నయం ....అందులోని జామకాయని ఏమీ చేయలేదు.ఒక్కో సారి చిన్న సంఘటన మనిషిని మారుస్తుంది.
కొరియర్ బాయ్ ని కూడా ఆ సంఘటన మార్చింది.ఇంకెప్పుడూ కొరియర్ కవర్ లు ఓపెన్ చేయకూడదు...అని నిశ్చయించుకున్నాడు.
మోహన విషం ఇంజెక్ట్ చేసిన విషయం తెలియని కొరియర్ బాయ్ కార్తికేయ కు థాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు.
అతను ఎంట్రీ గేటు దాటుతుండగా ఒక పంజాబీ ముసలావిడ చిన్న కుక్కపిల్లతో ఎదురైంది.
*******************************************************************************************
గది తలుపులు మూసి ముగ్ధ జ్ఞాపకాల తలుపులు తెరిచి జామకాయను చేతిలోకి తీసుకున్నాడు.
చిన్నప్పుడు చూసిన జానపద సినిమాల గుర్తొచ్చాయి.కథానాయకుడు...కథానాయిక పరకాయ ప్రవేశం చేయడం..,
అవును ఇప్పుడు కూడా తన ముగ్ధ ఈ జామకాయలోకి పరకాయ ప్రవేశం చేసిందా? దాన్ని పెదవులకు ఆన్చుకున్నాడు.
చాకు కోసం కిచెన్ లోకి వెళ్ళాడు.చాకు తీసుకు వచ్చి జామకాయను చేతిలోకి తీసుకున్నాడు.
ఒక్క క్షణం కార్తికేయ మనసు విల విల్లడింది.ముగ్ధ పంపిన జామకాయను చాకుతో ముక్కలు చేయడమా?
చేత్తో కలుప్కు తినే అన్నానికి, స్పూన్ తో తినడానికి ఎంత తేడా వుంటుంది?
దాన్ని తన పెదవుల మధ్య బందించి పళ్ళ తో కొరికి తినాలి.చాకు టేబుల్ మీద పెట్టి కాయను చేతిలోకి తీసుకున్నాడు.
*******************************************************************************************
పంజాబీ ముసలావిడ ఒక్క క్షణం రోడ్డు మీదే నిలబడి ఆయాసం తీర్చుకుంది.
ఆమె ఎడమ చేతిలో అడ్రెస్ కాగితం...కుడి చేతిలో కుక్క పిల్లను కట్టేసిన గొలుసు.ఆ రోజు కార్తికేయ చేసిన మేలు మర్చిపోలేదు పంజాబీ ముసలావిడ...
కార్తికేయ అడ్రెస్ వెతికి పట్టుకుని కార్తికేయకు కృతజ్ఞతా చెప్పడానికి బయల్దేరింది. ఒక్కర్తే వద్దామనుకుంటే కుక్క పిల్ల కూడా వెంట పడింది...
విశ్వాసం అలాంటిది.
"ఇదిగో అబ్బాయి కాస్త ఈ అడ్రెస్ చెబుదూ "అంది బైక్ మీద కొరియర్ అన్న అక్షరాలూ చూసి.అడ్రెస్ కాగితం మీద కార్తికేయ అన్న పేరు చూసాడు..అప్పటికే అతనికి కార్తికేయ మీద అభిమానం పెరిగింది.
వెంటనే బైక్ ఆపి కార్తికేయ ఇంటి దగ్గరికి తీసుకు వెళ్లి అడిగాడు బాయ్.."సార్ మీకు ఏమవుతారు?
"నాకు బిడ్డ లాంటి వాడు...అంటూ ఆ రోజు తన కుక్క పిల్లను కార్తికేయ కాపాడిన విషయం చెప్పింది " దానితో అతనికి కార్తికేయ అంటే మరింత ఇష్టం పెరిగిపోయింది.
*******************************************************************************************
జామకాయను కొరుకబోతుండగా డోర్ బెల్ శబ్దం...ఈ టైం లో ఎవరొస్తారు?ఎవరో చూస్తె సరి...అనుకుని జామకాయను టేబుల్ మీద పెట్టాడు.
వెంటనే జేబులో నుంచి కర్చీఫ్ తీసి టేబుల్ మీద పెట్టి దాని మీద జామకాయ పెట్టాడు.
హాలు లోకి వచ్చి తలుపు తీసాడు.ఎదురుగా పంజాబీ ఆవిడ..."మీరా ?ఆశ్చర్యం గా అన్నాడు.
"అవును బేటా...కొడుకుని వెతుక్కుంటూ తల్లి వచ్చింది. "చెప్పింది ఆవిడ.
"చాలా సంతోషంగా వుంది అమ్మా "అంటూ వంగి ఆవిడ పాదాలకు నమస్కరించబోయాడు
మధ్యలోనే అడ్డుకుని పైకి లేపి ప్రేమగా ఆలింగనం చేసుకుంది.కుక్క పిల్ల ఆమె చేతిలో వున్నా గొలుసును వదిలించుకోవడానికి పాట్లు పడుతుంది.
కార్తికేయ ఒళ్లోకి వెళ్ళడానికి నానా పాట్లు పడుతుంది...
"చూసావా బేటా...దీనికి నువ్వంటే ప్రాణం..తన ప్రాణం కాపాడింది నువ్వేగా."మనస్ఫూర్తిగా అంది ఆవిడ.
కార్తికేయ ప్రేమగా కుక్కపిల్ల తల నిమిరాడు.కుక్క పిల్ల లోపలి పరుగెత్తబోయింది.
తన యజమాని మందలించడం తో గుర్రుగా చూస్తోంది. "వెళ్ళనీ అమ్మా "అంటూ కుక్కపిల్ల గొలుసు తీసేసాడు.అది లోపలికి పరుగెత్తింది..
సరాసరి జామకాయ వున్న గదిలోకి.
**************************************************************************************
కార్తికేయ కిచెన్ లోకి వెళ్లి కాఫీ కలుపుకొని వచ్చాడు..,దాదాపు అరగంట సేపు మాట్లాడుకున్నారు.ముగ్ధ గురించి అడిగింది ఆవిడ....
తన ఇంటికి ఆహ్వానించింది.తన పిల్లలు విదేశాల్లో వున్నారని తనకు తోడూ కుక్కపిల్లే అని చెప్పింది.
అప్పుడు గుర్తొచ్చింది.ఏ మాత్రం అలికిడి లేదు...ఎప్పుడూ సైలెంట్ గా వుండడం అలవాటు లేదు.
ఇద్దరూ వెళ్లి వెతుకుతున్నారు.కార్తికేయ తన గదిలోకి వచ్చి అక్కడి దృశ్యం చూసి స్థాణువు అయ్యాడు.
పంజాబీ ఆవిడ స్పృహ తప్పి పడిపోయింది....కారణం...
కుక్కపిల్ల నేల మీద పడి చనిపోయి వుంది.దాని నోట్లో నురగలు.
తన ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతగా ,కార్తికేయ ప్రాణాలు కాపాడి తన ప్రాణాలు వదిలింది

No comments: