ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday 12 March 2013

"ముగ్ధమోహనం" (28thchapter)
(22-02-2013)
..................................................................
ఒక్క క్షణం ఆ గదిని విషాదం చుట్టుముట్టింది. మోకాళ్ళ మీద కూచుండి పోయాడు కార్తికేయ.
ఒక ప్రాణి...నోరు లేని ప్రాణి...
"భౌ" ఈ పదానికి శబ్దరత్నాకరం ఏమని అర్ధం చెబుతుంది. మాటలు నేర్చిన బిడ్డ అమ్మా అంటుంది....
మాటలే తెలియని ఈ జంతువు ఏమని పిలుస్తుంది."మిత్రమా నేను నీ జాతి కాదు...నీ మిత్రుడనీ కాను....అయినా మిత్రమా అని సంభోదిస్తున్నాను....మీ మనుష్యులకు విశ్వాసపాత్రమైన శునకాన్ని. నాకు తెల్సినదల్లా విశ్వాసంగా వుండడం.మీలా మాకు ఈర్ష్యాద్వేషాలు లేవు. నీ కోసం చనిపోవడం నాకు సంతోషమే...నా యాజమానిని వదిలి వెళ్ళిపోతున్నాను...ఒక రోజు నువ్వు కాపాడిన ప్రాణమే కదా ఇది, సెలవిక".
కుక్క పిల్ల తలను నిమిరాడు."భౌ" చిన్న శబ్దం ఆ చిన్న ప్రాణిని భౌతికంగా దూరం చేసింది. ఎదురుగా పంజాబీ ఆవిడ. "ఏమని వోదార్చగలడు?
"అమ్మా నన్ను క్షమించు" రెండు చేతులు జోడించాడు కార్తికేయ.
ఆ రెండు చేతులు పట్టుకుని "వద్దు బేటా.... ఒక విధంగా సంతోషంగా వుంది. నీ ప్రాణం ఎంతో విలువైనది. నీ ప్రాణాన్ని కాపాడి ఆ చిన్నిప్రాణం మంచి పని చేసింది. చిన్న కోరిక బేటా...దీన్ని పాతిపెట్టిన చోట ఒక గులాబీ మొక్క నాటించు" గద్గద స్వరంతో చెప్పింది ఆవిడ.
కార్తికేయ అలాగే అన్నట్టు తలూపాడు.
(నిన్నటి అధ్యాయం రాసేటప్పుడు కొద్ది నిమిషాల శూన్యం నన్ను ఆవరించింది. ఒక ప్రాణిని నేనే చంపేస్తున్నానా? అన్న భావం అపరాధభావంలా వెంటాడింది. మా ఇంట్లో మూడు చిన్న చిన్న కుక్క పిల్లలు. నన్ను చూడగానే ఎదురొస్తాయి.
వాటికి బాంధవ్యాలు తెలియకపోవచ్చు...కానీ మన భావాలు అర్ధమవుతాయి. కేవలం కథాగమనం కోసమే ఓ ప్రాణిని అర్దాంతరంగా పంపించాలనుకోలేదు.
ఈ ప్రపంచంలో విశ్వాసం ఆనే పదానికి అర్ధం చెప్పగల జంతువు కుక్క. బాంబు పేలుళ్లను పసిగట్టడంలో, నేరస్థులను గుర్తించడంలో శునకాలు చేసే సేవలు చిరస్మరణీయం. నిలువెత్తు విశ్వాసాన్ని అక్షరాల్లో చూపించే ప్రయత్నం. కుక్క పిల్ల మరణానికి నివాళిగా ఎన్నో అక్షర సందేశాలు...ఒక్కరా? ఇద్దరా? అందరికీ కృతఙ్ఞతలు.___రచయిత )
*********************************************************************************************************************************************************************************************************
ఓ ప్రాణికి వీడ్కోలు చెప్పాడు.కొద్ది క్షణాల అటాచ్మెంట్ ....అంతలోనే సెలవంది. తన ప్రాణాలు కాపాడింది.
లైటు కూడా వేసుకోవాలనుకోలేదు. అలానే కూచుండిపోయాడు. విషాదం అనుభవించిన కొద్ది మనల్ని నిస్తేజులను చేస్తుంది. జామకాయలో విషం ఇంజక్ట్ చేసింది ఎవరు? అతి ప్రమాదకరమైన విషం. ఎంతో ప్లాన్డ్ గా చేసిన పని. కార్తికేయ అనుమానం కొరియర్ బాయ్ మీదికి వెళ్ళింది. అతనికి మాత్రమె అవకాశం వుంది. కానీ ఇంత తెలివిగా తనని చంపాలని చూసే తెలివి, అవసరం అతనికి లేవు. ఈ కొరియర్ విషయం ఎవరికి తెలుసు?
అప్పుడే సెల్ రింగ్ అయింది. ఆ నంబర్ ల్యాండ్ ఫోన్ ది. ముగ్ధ నుంచి వచ్చిన ఫోన్...జరిగినదంతా తెలిస్తే తను తట్టుకోలేదు. చెప్పకూడదు. ఓ నిర్ణయానికి వచ్చాడు. ఆన్ బటన్ నొక్కాడు.
"నేను ముగ్దని " గొంతులో అమృతం గాలిలో తేలి వస్తోన్న ఫీలింగ్.
"చెప్పు ముగ్ధ ...ఎలా వున్నావ్? నాన్న, తమ్ముడు బావున్నారా?
"బావున్నారు. తమ్ముడితో మీ గురించి చెప్పాను. అప్పుడే బావగారిని ఎప్పుడు చూపిస్తావు?" అని అడుగుతున్నాడు. సంబరంగా చెప్పింది.
"త్వరలో మీ వూరికి వస్తాను...మీ నాన్నగారితో మాట్లాడుతాను.మా ఫ్రెండ్ పూర్ణిమకు చెప్పను. మీ గురించి" అంది కాసింత సిగ్గుపడుతూ ముగ్ధ.
"ఇంకా ఎవరెవరికి చెప్పావ్? నవ్వుతూ అడిగాడు కార్తికేయ.
"మా వూరి కోవెల్లో వున్న జగన్నాథుడికి నాక్కాబోయే నాథుడి గురించి చెప్పాను....మా వూరి పంట పొలాలకు చెప్పాను. కొబ్బరి తోటలకు చెప్పాను. గోధూళికి, గోవన్నలకూ చెప్పాను.మా పెరట్లో వున్న జామచేట్టుకీ, ఆ చెట్టు కాయలు ఎంగిలి చేసి, చిలుక కొరికిన పండు తీయనా ....అని గారాలు పోయే మా ఇంటి చిలుకకు..." చెప్పాను.
ఆ క్షణం ముగ్ధను దగ్గరికి తీసుకోవాలని అనిపించింది. ఎంత గొప్ప ఆలోచన.
బంధుమిత్రులకు కాదు...అందమైన ప్రకృతిలోని ఎన్నింటికో తమ ప్రేమ కథ చెప్పిందిట...
ముద్దుగా అనుకున్నాడు.
"నేను పంపిన..." ఆగి సిగ్గు పడింది.
"నీ ప్రేమ నైవేద్యాన్ని ఆరగించాను".
"ఎలా వుందో చెప్పనే లేదు?
"గుండె గొంతుకలో కొట్టు మిట్టాడుతూంది. నీ జ్ఞాపకాన్ని గొంతులో నుంచి హృదయానికి చేర్చి వస్తానని చెబుతోంది"
ల్యాండ్ ఫోన్ ఆమె గుండెల మధ్య కూచుంది. ఆమె ఎద సవ్వడి వైబ్రేషన్స్ గా మారి, టెలిఫోన్ తీగల ద్వారా అతని చెవులను చేరి ప్రబంధాన్ని ప్రవచిస్తున్నట్టు వుంది.
"ఇంకా మాట్లాడాలని వుంది. నాన్న గారు చూస్తె బావోదు. ఉండనా మరి" అంది ముగ్ధ .
"సరే మరి ...శుభరాత్రి" నవ్వుతూ అన్నాడు కార్తికేయ.
"మీ జ్ఞాపకాలు ఎప్పుడూ నాకు శుభప్రదమే ..." అనుకుంది. ఈ లోగా తండ్రి లేచిన అలికిడి కావడంతో ఫోన్ పెట్టేసి అటు తిరిగి పడుకుంది.
వచ్చింది తండ్రి కాదు ...ఓ అపరిచిత వ్యక్తి.
************************************************************************************************
కొరియర్ ఆఫీసు ముందు నిలబడ్డాడు."లోపలికి వెళ్లి ఎంక్వయిరీ చేయడం, అందరి ముందే ఆ కుర్రాడిని బెదిరించడం కన్న, ఆ కుర్రాడి ద్వారా జరిగింది ఏమిటో తెలుసుకోవాలి" అనుకున్నాడు. మరో అయిదు నిమిషాల తర్వాత ఆ కొరియర్ బాయ్ వచ్చాడు. మొహాన విభూది. కార్తికేయను చూస్తూనే సంతోషంగా దగ్గరికి వచ్చాడు.
"నమస్కారం సార్..ఇప్పుడే గుడికి వెళ్లి మీ పేరు మీద అర్చన చేసి వస్తున్నాను. మీకు తెలుసా సార్...ఎప్పుడో చిన్నప్పుడు గుడికి వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు" సంతోషంగా చెప్పాడు.
"నా పేరు మీద అర్చన ఎందుకు?" అర్ధం కాక అడిగాడు కార్తికేయ .
"ఎందుకంటే నేను మీ వల్లనే మారాను సార్...ఒకరి కవర్ లు విప్పడం ఎంత తప్పో తెలిసింది. ఇక జీవితంలో ఏ తప్పూ చేయను సార్." అన్నాడా కుర్రాడు.
"కవర్ విప్పావా?" ఆశ్చర్యంగా అడిగాడు కార్తికేయ.
నిన్న జరిగినదంతా చెప్పాడు ఆ కుర్రాడు.
"నువ్వు చాలా పెద్ద పొరపాటు చేసావు. ఒక ప్రాణం పోయింది" అంటూ నిన్న జరిగిన ఇన్సిడెంట్ చెప్పాడు కార్తికేయ.
"సార్ ప్రామిస్ గా చెబుతున్నాను...నేనే తప్పూ చేయలేదు...అని ఆగి "సార్ నా ఎదురుగా కూచున్న యువకుడు...నన్ను వాటర్ బాటిల్ కోసం పంపించాడు" అని చెప్పాడు.
"యువకుడా" ?
"అవును సార్...పాతికేళ్ళు వుంటాయి..అందంగా వున్నాడు...అతని దగ్గర బోల్డు డబ్బు వుంది. నాకు అయిదు వందలు ఇచ్చి వాటర్ బాటిల్ తెప్పించుకుని చిల్లర కూడా నన్నే వుంచుకోమన్నాడు" చెప్పాడు.
"షిట్" నుదురు మీద కొట్టుకున్నాడు కార్తికేయ.
ఆ యువకుడి వేషంలో వచ్చింది మోహనే...ఇదంతా ఆ కొరియర్ కుర్రాడికి చెప్పినా అర్ధం కాదు.
"నువ్వు చేసిన పని వాళ్ళ ఒక మూగజీవి ప్రాణం కోల్పోయింది" చెప్పాడు కార్తికేయ. ఆ కొరియర్ కుర్రాడి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. జేబులో నుంచి నిన్న మోహన వేషంలో వున్న యువకుడు ఇచ్చిన డబ్బులు వున్నాయి. ఎదురుగా రెడ్ క్రాస్ వాళ్ళు విరాళాలు సేకరిస్తున్నారు. ఆ డబ్బు తీసుకు వెళ్లి విరాళాల బాక్స్ లో వేసాడు. రెండు చేతులు జోడించాడు క్షమించమన్నట్టు కార్తికేయ వైపు చూసి.
చేసిన తప్పు తెలుసుకుని మారిన అతడ్ని క్షమించాడు కార్తికేయ.
అప్పుడే హైదరాబాద్ నుంచి ఓ విషాదకరమైన వార్త ...
హైదరాబాద్ లో దిల్ షుక్ నగర్ ప్రాంతం లో బాంబ్ పేలుళ్లు ...చాలా మంది మరణించారు అన్న వార్త.
(మృతులకు, క్షతగాత్రులకు ప్రగాడ సంతాపం .......మిగితా రేపటి సంచికలో)

No comments: