ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday 30 March 2013

విసురజ "ముగ్ధమోహనం" తొలి డైలీ సీరియల్
(Chapter---64)
(30-03-2013)
..............................
నన్ను చంపేస్తారా? ఎవరు?" మోహన అడిగింది.
"ఇంటర్ పోల్ ...మిమ్మల్ని అరెస్ట్ చేయడం...కోర్ట్ లో ప్రవేశపెట్టడం..వాళ్లకు ఇష్టం లేదు."
'అంటే ఎన్ కౌంటర్ అన్న మాట " నవ్వి అంది.
అవునన్నట్టు తల ఊపాడు కార్తికేయ.
"అదీ ఒకందుకు మీకు మంచిదేగా ...లేక వాళ్ళు నన్ను ఎన్ కౌంటర్ చేస్తే మీ ముగ్ధ, మీ వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోలేరన్న భయమా?" మోహన అడిగింది.
"వాళ్ళను కాపాడుకోగలనన్న నమ్మకం వుంది...నా ఆశ్రయంలో వున్న మనిషిని కాపాడుకోవాలన్న తాపత్రయం....అందులోనూ నా ముగ్ధ రూపంలో వున్న మిమ్మల్ని ఎన్ కౌంటర్ చేస్తే ఎలా ఊరుకుంటాను..అదీ కాక నేను ప్రాణంగా ప్రేమించే నా ముగ్ధను రక్షించారు"
"సో..ఇన్ని కారణాల వల్ల నన్ను కాపాడుతున్నారు..."ఇందులో మరో కారణం" ఏమైనా వుంటే మరింత సంతోషించేదానిని .." మనసులో అనుకుంది మోహన.
"మీరు ఈ బురఖా వేసుకోండి.నాతో పాటు రండి...."
"మరి ఈ అమ్మాయి?
"మనం వెళ్ళాక వస్తుంది...అప్పటికే మీరు సేఫ్ జోన్ లోకి వెళతారు"
మోహన కార్తికేయ చెప్పినట్టు చేసింది. బురఖాతో బయటకు నడిచింది. మోహనకు కావాల్సిందీ అదే...
వీళ్ళు వెళ్ళిన కాసేపటికి హేమంత బయటకు నడిచింది. ఇంటర్ పోల్ ఈ పరిణామాన్ని ఊహించలేదు.
***************
సత్తార్ ఒక్కక్షణం సందిగ్ధంలో పడి ఎడమ చేతిలో రివాల్వర్ పట్టుకుని తలుపు తెరిచాడు. ఎదురుగా కనిపించిన అపరిచిత వ్యక్తీ.
"హలో...నా పేరు రాజేష్ ...పెన్ డ్రైవ్ డీకోడ్ ..." "పెన్ డ్రైవ్ ఏమిటి? మిమ్మల్ని ఎవరు పంపించారు? మీ ఐ.డి. చూపించండి? సత్తార్ అనుమానంగా అడిగాడు.
"అదేమిటి సార్? అంటూ అతడు లోపలికి వచ్చాడు.
సత్తార్ రివాల్వర్ ని అతడి వైపు గురి పెట్టాడు...
అతడు "కూల్ సాబ్...కూల్ ...మీక్కావలిసింది నా ఐ.డి. నే కదా ...ఇదిగోండి" అంటూ చేతులు ప్యాంటు జేబులో పెట్టి బయటకు తీసాడు. అతని చేతిలో రివాల్వర్ ప్రత్యక్ష్యమైంది. సత్తార్ తేరుకునేలోగా రివాల్వర్ సత్తార్ కణతకు గురిపెట్టబడివుంది.
"పూర్ సత్తార్ నీ మెమోరీ దెబ్బ తిన్నది...ఇప్పుడు గుర్తొస్తుంది.." అంటూ కుడి చేయి పిడికిలి బిగించి అతని దవడ మీద కొట్టాడు.
"శ్రీనివాస్ ...సిట్ ఆఫీసర్ " కింద పడ్డ తన రివాల్వర్ ని చూసి అన్నాడు. అప్పుడు ప్రవేశించింది అతనిలో భయం. శ్రీనివాస్ తో తలపడితే పులితో తలపడినట్టే...
"గుడ్ మెమోరీ...అదే మెమోరీతో నాకో ఇన్ఫర్మేషన్ ఇవ్వు...." అతని చేతులు వెనక్కి విరిచి కట్టి అడిగాడు.
సత్తార్ తన నాలుకను పళ్ళ మధ్యకు తీసుకు వచ్చాడు. ఏ క్షణమైనా ఆ నాలుక సగ భాగం తెగి పడడానికి సిద్ధంగా వుంది.

No comments: