ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 20 April 2013

విసురజ (సీరియల్ )ఆగష్టు1...డేట్ తో డిష్యుం...డిష్యుం
21-04-2013 (11th chapter)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
******
"ఒక జ్ఞాపకాల వీణ లోని రాగాల తీగలు తెగినప్పుడు....స్మృతులతో వాటిని అతికించే ప్రయత్నం చేసినప్పుడు...అతికిన తీగల రాగాలు గాద్గధికమై,స్వరాల గాంభీర్యం వణికి,నేలరాలే నిన్నటి గతం....నేటి వర్తమానాన్ని ప్రశ్నార్ధకం చేసినప్పుడు ..,కాలం విడిచే నిట్టూర్పులు మిగిల్చిన వేదన అక్కడ ఒంటరితనాన్ని అతనికి కాపలా పెట్టి తను వేదన ఒడిలో సేదతీరుతుంది "
==============
విశాలమైన ఆ గది అతడి ఒంటరితనాన్ని చూసి నిట్టూర్చింది.మొన్న మొన్నటి వరకు జంటతో సహవాసం చేసిన ఆ గది,ఆ ఇద్దరి కిలికించితాలను,మధురోహలను ఆస్వాదించి సాక్షిగా నిలిచిన ఆ గది,ఇప్పుడతను ఒంటరిగా,తన మదిలోని హృది ని తలుచుకుంటూ,మౌనం గా రోదిస్తుంటే....కంట తడి పెడుతోంది.
"నా ప్రియాతి ప్రియమైన ప్రణవి...నీ సమక్షం లో చీకటి రాత్రులు కూడా వెన్నెల కురిపించాయి....వేదన క్షణాలు ఓదార్పును అందించాయి.అలాంటి నీ సమక్షం ఇప్పుడు శూన్యమైన అగాథం అయింది.నీ అన్వేషణలో నా చివరి శ్వాస ఆగిపోవాలి...నీ సమక్షం లో నా చివరి స్పర్శ మిగిలిపోవాలి...." అతని గుండె తడి కంటి తడిని చేరి పరామర్శిస్తుంది.
తన ప్రణవి ఎక్కడున్నా తనని చేరుతుంది...ఈ ప్రపంచం లో డబ్బి ప్రేమను,ఇష్టమైన మనిషి ఇష్టాన్ని,స్పర్శను ఇవ్వకపోవచ్చు...కానీ వాటిని దూరం చేస్తుంది...అదే డబ్బు ఒక్కోసారి దగ్గరికి చేరుస్తుంది.చంద్రహాస్ బిజినెస్ మేన్....క్షణాల్లో కోట్ల రూపాయల డీల్ సెటిల్ చేయగల సమర్థుడు...లాభ,నష్టాల బేరీజు వేయగలడు.
ఉదయం పీఆర్వో తయారు చేసిన యాడ్ గుర్తొచ్చింది....సంధ్య చెప్పిన ఆలోచన నచ్చింది...కానీ అంత కన్నా ముందు సంధ్య ను వెతకాలంటే...జనం లో కదలిక రావాలి..ఆశ కలగాలి..అంత కన్నా ఆసక్తి కలగాలి.
ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు.ఇన్నాళ్ళు డబ్బుతో బిజినెస్ చేసాడు...వినియోగదారుల అవసరాలతో బిజినెస్ చేసాడు.ఇప్పుడు తన ప్రణవి కోసం బిజినెస్ చేస్తున్నాడు.అతనిలోని బిజినెస్ మేన్ బయటకు వచ్చాడు.టేబుల్ మీద ప్యాడ్ వుంది.పక్కనే పెన్ స్టాండ్.ఒక్కో కలం ఖరీదు వేలల్లోనే వుంటుంది. అతని ఓ రచయిత రాసిన ఓ వాక్యం గుర్తొచ్చింది.
"పావలా ఖరీదు చేసే రిఫిల్ తో ఒక కథ పూర్తిచేసాను...అర్ధరూపాయి పెన్ తో ట్యాంక్ బండ్ దగ్గర శ్రీ శ్రీ విగ్రహం ముందు కూచోని ఓ నవల రాసాను...రాయడానికి పెన్ను,అందులో ఇంకు వుంటే చాలు "
(ఈ వాక్యం ఓ ప్రముఖ రచయిత పుస్తకం లో నుంచి ఉదాహరిస్తున్నాను...చిన్నప్పుడు ఇంకు పెన్నుతో ,మూడు పైసలు ఇచ్చి ఇంకు పోయించుకున్న సందర్భాలు గుర్తొచ్చాయి.ఇప్పటికీ నా దగ్గర ఖరీదైన పెన్నులున్నా,మామూలు పెన్ ... బాల్ పెన్ ఉపయోగిస్తాను --రచయిత )
చంద్రహాస్ పెన్ స్టాండ్ అడుగున ఉన్న మామూలు బాల్ పెన్ తీసాడు.ప్యాడ్ మీద ఉన్న కాగితం మీద అతని చేతి వ్రేళ్ళు కదులుతున్నాయి. కదిలే అక్షరాల్లో,కనిపించకుండా పోయిన ప్రణవి కనిపిస్తోంది.
చంద్రహాస్ రాయడం పూర్తి చేసాడు. ల్యాప్ టాప్ లో నుంచి ఓ ఇమేజ్ ప్రింటవుట్ తీసాడు.రెండింటినీ జత చేసి చదువుకున్నాడు
-------------------------------
కనబడుట లేదు..
-------------------------------
పై ఫోటోలోని అమ్మాయి కనబడుటలేదు.
పేరు ...ప్రణవి
ఎత్తు అయిదు అడుగుల మూడు అంగుళాలు..
రంగు...పాల సముద్రాన్ని చిలికినట్టు వుంటుంది.
వచ్చిన భాషలు...తెలుగు..,కన్నడ,ఇంగ్లీష్,హిందీ,
ఆచూకీ చెప్పిన వారికి... అయిదు ప్రధాన పట్టణాల్లో విలాసవంతమైన భవనాలు,
ఒక దీవి బహుమతిగా ఇవ్వనడును...
ఆ ప్రకటన కింద ప్రపంచ దేశాల్లో తన వ్యాపార కేంద్రాల అడ్రెస్ లు,ఫోన్ నంబర్లు ఇచ్చాడు.
ప్రణవి ఫోటో ని జతచేసాడు.వెంటనే పిఏ కి కాల్ చేసాడు...ఇరవై నిమిషాల్లో అతను వచ్చాడు. పిఏ వైపు చూసి,తన చేతిలోని ప్రకటన అతనికి ఇచ్చి చెప్పాడు
"రేపటి అన్ని పత్రికల్లోనూఈ ప్రకటన మొదటి పేజీలో అన్ని ఎడిషన్లలో రావాలి.టీవీ చానెల్స్.వెబ్ సైట్స్ అన్నిట్లో ఈ యాడ్ రావాలి."
పిఏ ఆ ప్రకటన చదివి షాకయ్యాడు. ఆఫర్ చేసిన అమౌంట్ అతని బుర్రను పెల్చేసేలా అనిపించింది.
"సర్ ఈ ప్రకటన లో ఇచ్చిన అమౌంట్..." ఆ పై అడిగే సాహసం చేయలేదు.
"యస్...చెప్పింది చేయండి "చెప్పాడు చంద్రహాస్.
ఆ ప్రకటన ఆ అర్ధరాత్రి ఆగమేఘాల మీద అన్ని పత్రికా కార్యాలయాలకు చేరింది. మొదటి పేజీలో కలర్ లో అన్ని ప్రధాన ఎడిషన్లలో రావడాని ముస్తాబు అవుతుంది.ఆ ప్రకటన సృష్టించబోయే సంచలం పెద్ద కలకలాన్ని రేపుతుందని ఎవరికీ తెలియదు. ..చంద్రహాస్ తో సహా....
================
అతి పెద్ద వాణిజ్య కూడలి...పన్నెండు అంతస్తుల ఆ భవనం లో పదమూడవ అంతస్థు లేదు...కానీ పెంట్ హౌస్ వుంది.పన్నెండవ అంతస్థు వరకు లిఫ్ట్ లో వచ్చి పెంట్ హౌస్ కు మెట్ల ద్వారా నడుచుకుంటూ వెళ్ళాలి...అయితే పెంట్ హౌస్ కు చేరుకోవాలంటే మెట్ల దగర వుండే రాక్షసులలాంటి ధృడకాయులను దాటుకుని వెళ్ళాలి. వాళ్ళ చేతుల్లో వుండే మారణాయుధాలను తప్పించుకు వెళ్ళాలి.
ఆ పెంట్ హౌస్ ఎన్నో దారుణాలకు వ్రేదిక...సాక్షి.సౌండ్ ప్రూఫ్ గది...లోపల ఏం జరిగినా బయట ప్రపంచానికి తెలియదు. అది ఒక రక్తపుటేరులు పారే విధ్వంస రాజమందిరం.ఒక క్రూర నియంత సామ్రాజ్యం.ఆ సామ్రాజ్యానికి రాజు రామతీర్థం....
అయిదు అడుగుల తొమ్మిది అంగుళాల పొడవు.భారీకాయం....ఎప్పుడూ గుండు తోనే ఉంటాడు.చ్రేసిన పాపాలను కడిగేసుకోవడానికి తరుచూ పుణ్య క్షేత్రాలకు వెళ్తాడు.అతనికి దయాదాక్షిణ్యాలు వుండవు...తెలియవు.చిన్న వయసులోనే పారిపోయి దొంగలతో.ఖూనీకోరులతో కలిసి ఎన్నో నేరాలు చేసి ఎన్నో సార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చాడు.చివరికి అరబ్ షేక్ లకు "అమ్మాయిలను మాయమాటలతో నమ్మించి,షేక్ లకు అంటగట్టే" పని కూడా చేసాడు.నిఖా పేరుతొ చిన్నారుల తల్లిదండ్రుల ఆర్ధిక పరిస్థితి ని అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించాడు.పోలీసుల నిఘా పెరగడం తో చిన్న పిల్లలను కిడ్నాప్ చేయడం,.అనాథ పిల్లలను చేరదీసి వారిని కొందరు షేక్ లకు అమ్మడం చేసాడు.ఎడారి ప్రాంతాల్లో ఒంటె పందాలు.చిన్నారులను ఒంటెలకు కట్టి వేసి,ఒంటెలు ఎడారి ప్రాంతం లో పరుగెడుతుంటే చిన్నారుల ఏడుపు ఈ షేక్ లకు ఒక వినోదం..రామాతీర్థానికి డబ్బులు వచ్చే మార్గం.డబ్బులు వచ్చే ఏ మార్గమూ వదిలిపెట్టడు రామతీర్థం.అది ఎంతటి పాపమైనా సరే.
+++++++++++++++++
లిఫ్ట్ పన్నెండవ అంతస్తులో ఆగింది.లిఫ్ట్ తలుపులు తెరుచుకున్నాయి.ముందు సాయుధులైన బాడీ గార్డ్స్ బయటకు వచ్చారు,తర్వాత రామతీర్థం.అతను నడుస్తుంటే కర్ర చెక్క శబ్దం వినిపిస్తుంది.అతని వున్నది ఒకే ఒక కాలు.మరోటి క...ర్ర కా...లు. ఆ కర్ర కాలు శబ్దానికి అంతా ఎలర్ట్ అయ్యారు.
===================
(రేపటి సంచికలో ప్రణవి యాడ్ సృష్టించిన సంచలనం...రామతీర్థం క్రూరత్వానికి పరాకాష్ట )

No comments: