ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 16 April 2013

ఆగష్టు1 (సీరియల్ )
టాగ్ లైను ...... డేట్ తో డిష్యుం..డిష్యుం
by మెస్మరైజింగ్ మేగ్నటిక్ ఎనర్జీ రైటర్..
"విసురజ"
14-04-2013
(4th chapter)
..............................
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
సంధ్యాజ్యోతి...జర్నలిస్ట్...
తను సముద్రంలో ఒక సునామీ...ఎడారిలో ఒక ఇసుక తుఫాన్, చిరపుంజీలో కురిసే ఎడతెగని వర్షపాతం.....కాశ్మీర్ లో మంచు వర్షం...గాలిలో కూడా స్కేటింగ్ చేసే/చేయించగల క్యారెక్టర్. ఇన్ని సూపర్ క్వాలిటీస్ ని భరించే ధైర్యం లేని ఏ సంస్థ ఆమెకు ఉద్యోగం ఇచ్చే ధైర్యం చేయలేదు.
సినిమాల్లో జర్నలిస్ట్ చేసే సాహసం తనూ చేయాలని ఓ పత్రికలో చేరి మొదటి రోజే "ఓ మంత్రి గారి అవినీతి భాగోతం" అంటూ ప్రకంపనాలతో వార్త వండేసింది. పత్రిక ఎడిటర్ దోమకాటుతో, డెంగ్యూ బాధితుడుగా వున్న సమయంలో అత్యుత్సాహంతో ప్రింటింగ్ కి పంపించేసింది. నిద్రమత్తులో ఎడిటర్ సంతకం చేసేసాడు.
ఆ వార్త అగ్నిపర్వతంలా బద్దలైంది. ఆ అగ్నిపర్వతం తాలూకు లావా ఆ పత్రిక ప్రమోటర్స్ లో ఒకరని ఎక్కువ వాటాలున్న తలకాయ అని తేలింది. ఎడిటర్ హాస్పిటల్ నుంచి ఇంటికే వెళ్ళాల్సివచ్చింది. సంధ్యాజ్యోతి లోని జ్యోతి వెలిగించిన మంట మండి, సంధ్యలోని మలి సంధ్య ఒక్క రోజు ఉద్యోగంతో బయటకు వచ్చింది.
తనకు ప్రింట్ మీడియా అచ్చి రాలేదని ఎలాక్ట్రానిక్ మీడియాను ఉద్దరిద్దామని వెళ్ళింది. ఉద్యోగంలో చేరే ముందే ఆ టీవీ చానెల్ ప్రమోటర్స్ ఎవరో, ఓనర్ ఎవరో, అతనికి వున్న వ్యాపారాలు ఏమిటో తెలుసుకుంది....కానీ ఆ టీవీ చానెల్ కు కొత్తగా చేరిన క్రియేటివ్ హెడ్ ఎవరో తెలుసుకోలేదు. తన వల్ల ఉద్యోగం పోగుట్టుకున్న ఎడిటర్ టీవీ చానెల్ లోకి వచ్చాడని తెలిసింది. సంధ్యాజ్యోతికి ఉద్యోగం ఇస్తే సన్యాసుల్లో కలిసిపోతానని తేల్చి చెప్పేసాడు.
చివరిగా తన టాలెంట్ కు, తన క్వాలిటీస్ కు సరిపోయే ఉద్యోగం ఆన్ లైన్ లోనే అని డిసైడై మేన్ రోబోలో చేరింది. మొదటి రోజే సంచలనం అని హడావుడి చేస్తే ఎడిటర్ కు ఎక్కడో మండి తనను ఏ ముగ్గుల పేజీనో చూసుకోమంటాడని ఆలోచించి మొదటి రెండు రోజులు కామ్ గా వుంది. మూడో రోజు "మురికి వాడలో మురికి బ్రతుకులు,మురికి కూపంలో నిరుపేదల బాధలు" అని ఓ స్టొరీని వండింది. చీఫ్ ఎడిటర్ "కీపిటప్" అనడంతో ఇక కీప్ క్వయిట్ గా వుండడం అనవసరం అని రెచ్చిపోయింది.
**************
అప్పుడే ఆమె బ్యాడ్ లక్ సబ్ ఎడిటర్ శర్మ రూపంలో వచ్చింది. తన పర్మిషన్ లేకుండా ఇష్టమొస్తున్నట్టు రాయడం చీఫ్ ఎడిటర్ మెచ్చుకోవడంతో కాస్త మండి ఆమెను వంటల పేజీ చూసుకోమన్నాడు. అక్కడే వచ్చింది ఆమెకు శర్మతో పేచీ...
ఉగ్యోగంలో జాయిన్ అయిన మొదటే రోజే శర్మని చీఫ్ ఎడిటర్ పిలిచి "కొత్తగా చేరిన జర్నలిస్ట్" అని చెప్పాడు.
ఆ రోజు శర్మ సీట్ దగ్గరికి వెళ్ళింది. ఏదో సీరియస్ గా రాసుకుంటున్నాడు. పది నిమిషాల తర్వాత తను రాసింది చదువుకుని, తన భుజం తనే తట్టుకుని సంధ్యాజ్యోతి వైపు చూసి..."ఇది టైపు చేసి పట్రా అమ్మాయి..." అని తన చేతిలోని కాగితాలు ఇచ్చాడు. అతనికి టైపు చేయడం రాదనీ ఒక్కో అక్షరాన్ని ఒక్కో నిమిషం టైపు చేస్తాడని అర్ధమైంది.
తనలాంటి ఫ్యూచర్ సెన్సేషనల్ జర్నలిస్ట్ కు ఇలాంటి పని చెప్పడమా? డ్యాం ఇన్సల్ట్ అనుకుంది. అయినా కొత్తలో ఇలా ఎదురుతిరిగితే బావోదని వెళ్లి కంప్యూటర్ ముందు కూచుంది. అతనేం రాసాడా అని చూసింది .
"రామ్ గోపాల్ వర్మకు ఊర్మిళతో "కుచ్ కుచ్ హోతాహై" ఏమైంది? హీరోయిన్ అంజలికి ఓ తమిళ హీరోతో "సంథింగ్ సంథింగ్ ఉందా? నయనతార లేటెస్ట్ గా (ప్రభుదేవాతో కటీఫ్ అయ్యాక) గోకింది ఎవరిని?
షకీలా ఇప్పుడు నువ్వెక్కడ? లాంటి గాసిప్స్ వున్నాయి.
వీటిలో కొన్ని సి గ్రేడ్ పత్రికల్లో వచ్చాయి. "మన ఆన్ లైన్ మేగజైన్ లో ఇతరుల పర్సనల్ లైఫ్ లోకి తొంగిచూసే గాసిప్స్" ఉండవని చీఫ్ ఎడిటర్ చెప్పిన గుర్తు.
తన సీట్ లో నుంచి లేచి శర్మ గారి సీట్ దగ్గరికి నడిచి "సర్ మీరేమీ అనుకోనంటే...ఈ గాసిప్స్ లో ఉన్నదంతా గ్యాసే సర్" అంది.
ముందు అర్ధం కానట్టు చూసాడు. తర్వాత సంధ్యాజ్యోతి క్యారెక్టర్ అర్ధమైంది అన్నట్టు చూసాడు.
"మసాలా అంటారు...ఇలాంటి వాటి కోసమే వీక్షకులు మన వెబ్ సైట్ చూస్తారు" రాత్రే కొత్తగా మన వెబ్ సైట్ ని ఎలా పైకి తీసుకు వెళ్ళాలా అని ఆలోచించి రాసాను. అయినా నువ్వు జూనియర్ వి ..నేను చెప్పింది చేయాలి..గో.." అన్నాడు శర్మ.
వెళ్ళింది సంధ్యాజ్యోతి అక్కడనుంచి తిన్నగా..చీఫ్ ఎడిటర్ ఛాంబర్ లోకి...
**************
"శర్మ గారు ఏమిటిది? అతను రాసిన గాసిప్స్ పేపర్ చూపిస్తూ అడిగాడు, చీఫ్ ఎడిటర్.
"సర్ రాత్రంతా ఆలోచించి మన ఆన్ లైన్ మేగజైన్ ని ఎక్కడికో తీసుకువెళ్లాలని ఇది రాసాను. గాసిప్స్ ని చదవని వారెవరు సర్..." అతి వినయంగా అన్నాడు.
"గాసిప్స్ ఇతరులు హర్ట్ అయ్యేలా వుండకూడదు. అయినా గాసిప్స్ రాసి, ఇతరుల లైఫ్ లోకి తొంగి చూడ్డం మంచిది కాదు. అయినా మన మేగజైనుని ఎక్కడికో తీసుకువెళ్ళే పని నేను చూసుకుంటాను. మీరు సిటిలో వున్న హాస్పిటల్స్ గురించి ఒక ఆర్టికల్ తయారు చేయండి. సిటిలో ఎన్ని కార్పోరేట్ హాస్పిటల్స్ వున్నాయి? ప్రభుత్వ ఆసుపత్రులెన్ని? అక్కడ వున్న సౌకర్యాలు ఏమిటి? పూర్తి వివరాలు కావాలి.. " చెప్పాడు ఎడిటర్.
**************
శర్మకు ఎసిడిటీ మొదలైంది. అది జెలసీ, కోపంతో వచ్చిన ఎసిడిటీ ....సంధ్యాజ్యోతికి లెస్సన్ చెప్పాలనుకున్నాడు. వెంటనే తనే ఆమె సీట్ దగ్గరికి వెళ్లి, "చూడమ్మాయి...." అని పిలిచాడు.
"సర్ నా పేరు "చూడమ్మాయి" కాదు, సంధ్యాజ్యోతి. మీకు
అంత
పెద్ద పేరు పిలవడం కష్టమనుకుంటే "సంధ్య" అని పిలవండి లేదా జ్యోతి అని పిలవండి.
"సరే నమ్మా...ఇకమీదట అలాగే పిలుస్తాను..నువ్వు అర్జెంటుగా ఓ మాంచి వంటకం గురించి రాయి..శ్రీరామనవమికి స్పెషల్ గా వుంటుంది. నువ్వు రాసింది ,చదివి, నేను ఆ వంటకం ట్రై చేసి, బావుంటే పబ్లిష్ చేద్దాం" అన్నాడు.
సంధ్యాజ్యోతికి సీన్ షాట్ టు షాట్ అర్ధమైంది."పగ ప్రతీకారం "స్టొరీ తెలిసింది. ఏ దావూద్ ఇబ్రహీం గురించో, గాలి మైనింగ్ మాఫియా కధనో రాయాల్సిన తన చేతులతో ఈ వంటల పేజీకి రాయమంటాడా? వెంటనే రాసేసింది. రాయడమే కాదు ...రాసింది శర్మకు ఇచ్చేసింది.
"ఈ అమ్మాయిని ఇలాంటి వాటికే పరిమితం చేసి తనతో పెట్టుకుంటే ఏమవుతుందో చెప్పాలనుకున్నాడు...ఆ వంట అప్ డేట్ అయింది.ఒక్కసారిగా గొడవ. చీఫ్ ఎడిటర్ బెంగుళూరులో వుండగా జరిగిన సంఘటన.
సంధ్యాజ్యోతి కచ్చగా రాసిన ఆ వంటకం వీక్షక ప్రపంచంలో చిన్నపాటి
మినీయెచర్
సునామీని సృష్టించింది.
సంధ్యాజ్యోతి రాసిన వంటకం పేరు...
"గన్నేరు పప్పుతో గన్నేరు మాస్ మసాలా 99...తయారు చేయడం ఎలా? సబ్ ఎడిటర్ శర్మగారితో కలిసి..సంధ్యాజ్యోతి.
మేగజైనులో పబ్లిష్ అవుతుననుకోలేదు. కానీ శర్మ నిర్లక్ష్యం వల్ల పబ్లిష్ అయింది. చీఫ్ ఎడిటర్ దృష్టికి వచ్చింది.
******************
(వాట్ నెక్స్ట్? చంద్రహాస్ ని కలిసిన సుకన్య? ఇంతకీ ఎవరీ సుకన్య ..? రేపటి సంచికలో)

No comments: