ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Sunday, 28 April 2013

ఆగష్టు1 (సీరియల్)
టాగ్ లైను ...డేట్ తో డిష్యుం...డిష్యుం
23-04-2013 (13th Chapter)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
******
పిన్ డ్రాప్ సైలెన్స్ కు అర్ధం ఏమిటో అక్కడి వాతావరణం చూస్తే తెలుస్తోంది. స్టీఫెన్ మాటలు విన్న తర్వాత వాళ్ళలో ఆలోచన మొదలైంది. స్టీఫెన్ గురించి అక్కడ వున్న వారికి బాగా తెలుసు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి అతను నిజాయితీతో కూడిన మార్గాన్ని కాక, రక్తపాతాన్ని, బలప్రయోగాన్ని నమ్ముకుంటాడు.
========
అక్కడ చాలా సేపు నిశ్శబ్దం తాండవించింది. దుబాయి నుంచి మాఫియా డీల్స్ చేస్తున్న ఖుర్షీద్ స్టీఫెన్ వైపు చూసి అడిగాడు."చంద్రహాస్ ప్లాన్ ఏమి వుంటుంది /?
"పుట్టలోని పాములను బయటకు రప్పించే ప్రయత్నం...ఒక వేల ప్రణవి బయటకు వస్తే......మన వాళ్ళ ప్రణవికి ఎటువంటి కీడు జరక్కుండా వేసిన ప్లాన్ .." స్టీఫెన్ చెప్పాడు.
"అదెలా? యుఎస్ నుంచి ఆయుధాలను సప్లయ్ చేసే కీవ్స్ సందేహం వ్యక్తం చేసాడు.
"ఇప్పుడు అందరి దృష్టి ప్రణవి మీదే...పోలీసులతో సహా...డిటెక్టివ్ ఏజెన్సీ లు రంగంలోకి దిగినట్టు సమాచారం...ఇంత పెద్ద భారీ అమౌంట్ ని ఎవరూ వదులుకోరు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ప్రణవి ని ట్రేస్ అవుట్ చేయాలంటే రిస్కే .. "
"ఇంత నెట్ వర్క్ వుంది కూడా మనం ఛా ప్రణవిని ట్రేస్ చేయలేకపోతున్నాం" స్టీఫెన్ అన్నాడు.
అతని అభిప్రాయం తో అంతా ఏకీభవించారు.
"సో...మనం ఇప్పుడు చేయవలిసింది మన నెట్ వర్క్ ని చంద్రహాస్ చుట్టూ బిగించాలి....ప్రణవి ఎక్కడుందో వెతకడానికి అన్ని మార్గాలనూ అన్వేషించాలి....అంత కన్నా ముఖ్యమైనది...సుపారీ మాట్లాడుకోవాలి. ప్రొఫెషనల్ కిల్లర్స్ తో...చంద్రహాస్ ని చంపడానికి..." స్టీఫెన్ చెప్పాడు.
ఒక్క క్షణం గాలి స్థంభించింది. ఇది ఇది సాధ్యమేనా? ప్రపంచంలోని అత్యధిక సంపన్నుల జాబితాలో వున్నా చంద్రహాస్ ని చంపడం సాధ్యమేనా?
"మరో విషయం...త్వరలో చంద్రహాస్ కు జెడ్ కేటగిరి భద్రతా కేటాయించనున్నారు...ఈ లోపే మనం చంద్రహాస్ ని ఫినిష్ చేయాలి. జెడ్ కేటగిరీ భద్రతా ఇచ్చారంటే మనం చంద్రహాస్ ని ఏమీ చేయలేము" స్టీఫెన్ చెప్పాడు.
"అంటే మనం సాధ్యమైనంత తొందరలో..." ఆగాడు ఖుర్షీద్ .
"యస్...ఎందుకంటే జెడ్ కేటగిరి వస్తే...ఇరవై నాలుగు గంటల సెక్యూరిటీ, చంద్రహాస్ ఎక్కడికి వెళ్ళినా పైలట్ వాహనం...బెటాలియన్ కు చెందిన దాదాపు ఇరవై ఎనిమిది సీఆర్పీఎఫ్ బృందం..జవాన్లు...కమెండోలు..." వీళ్ళందరినీ దాటుకుని మనం చంద్రహాస్ ని ఫినిష్ చేయడం కష్టం...చంద్రహాస్ ని ఏమీ చేయకపోతే..జనం, ముఖ్యంగా బిజినెస్ పీపుల్ మనల్ని చూసి నవ్వుతారు. మనకు భయపడడం మానేస్తారు. మన వసూళ్లు, దందాలు ఆగిపోతాయి." స్టీఫెన్ అన్నాడు.
అందరూ అతని వాదనతో ఏకీభవించారు.
చంద్రహాస్ ని చంపడానికి మార్గాలు అన్వేషిస్తున్నారు. ప్రపంచంలోని అత్యధిక సంపన్నుల జాబితాలో ఉండడమే కాదు....చంద్రహాస్ వ్యాపారాలకు సమాంతరంగా వ్యాపారాలు చేస్తూ, కల్తీ, మోసం, బెదిరింపులు, నకిలీ లేబుల్స్ తో వ్యాపారం, పన్నుల ఎగవేత లాంటి ఇల్లీగల్ వ్యవహారాలతో తన ఉత్పత్తులను అమ్ముకోవాలని చూసే స్టీఫెన్ కు ప్రధాన ప్రత్యర్ధి చంద్రహాస్..అతడిని దెబ్బ తీయాలంటే మిస్సయిన ప్రణవి తిరిగి కనిపించకూడదు..లేదా చంద్రహాస్ ని చంపేయాలి...ఆ రెండు పనులూ చేయడానికి ఆ రోజు ఏర్పాటు చేయబడిన సమావేశం నడుం బిగించింది. ఒక వ్యక్తిని చంపడానికి, ఒక మహిళను కనిపించకుండా చేయడానికి మాఫియా కదిలింది. మరణ మృదంగం మొదలైంది.
ఇలాంటి వాటిని డబ్బు కోసం ఎలాంటి నీచమైన పనిని అయినా చేసే వ్యక్తిని ఈ పనికి నియమించాలనుకుంది మాఫియా. అప్పుడు గుర్తొచ్చాడు...రామతీర్థం. స్టీఫెన్ సెల్ తీసాడు. ఓ నంబర్ డయల్ చేసాడు. అది రామతీర్థం నంబర్.

================
రామతీర్థం ఓ సారి తన చుట్టూ వున్న సెక్యూరిటీ వైపు చూసాడు.
తన చుట్టూ వలయం లా కూచున్నారు. "అదేమిట్రా నేను మీకు బాస్ ని ...నేల మీద అడ్డగాడిదలా పడుకున్నాను. మీరూ నాతో పాటు ఇక్వల్ గా కూచుంటారా? పోనీ నా పక్కనే పడుకోండిరా" అన్నాడు రామతీర్థం. వెంటనే అంతా లేచి నిలబడ్డారు. అతనిలో విపరీత మనస్తత్వం దాగి వుంది. ఎడారిలో ఒంటెల మీద చిన్నారులను కట్టి పడేసి పైశాచిక ఆనందం పొందే షేక్ లకు, ఇతనికీ పెద్ద తేడా లేదు.
రామతీర్థం కథ చెప్పడం మొదలుపెట్టాడు.
"అనగనగా ఓ అడవి...అందులో ఓ నీచ్, కమీనే కుత్తే లాంటిది జిత్తులమారి నక్క...నాలా...ఆ నక్క కింద కొన్ని గుంట నక్కలు కాపలా పని చేస్తున్నాయి మీలా.....ఆ గుంట నక్కల్లో ఓ పోలీసు గుంటనక్క వచ్చి చేరింది. ఆ విషయం జిత్తులమారి నక్కకు తెలిసింది. అప్పుడా నక్క పోలీసు గుంట నక్కను వేసేయమని మిగతా గుంటనక్కలకు చెప్పింది." అని ఆగాడు. తన సెక్యూరిటీ వంక చూసాడు. అందులో ఓ వ్యక్తి మొహానికి చెమట.
"ఇప్పుడు చెప్పండి..ఆ గుంట నక్క ఎవరు? మీలో ఈ ప్రశ్నకు ఎవరు సమాధానం చెబుతారు?
అంతా మొహామొహాలు చూసుకున్నారు.
"మీరు చెబుతారా? నా చేతిలో చస్తారా?"విషపూరితమైన నవ్వుతో అడిగాడు.
అక్కడున్న సెక్యూరిటీకి అర్ధమైంది. అయితే తమ సెక్యూరిటీలో చేరిన పోలీసు మనిషి ఎవరు ?
రామతీర్థం లేచాడు. అతని చేతిలో మెలి తిరిగిన కత్తి వుంది. అది పోట్టలోకి దిగితే పేగులతో సహా బయటకు వస్తాయి.
అందరినీ వరుసలో నిలబడమని చెప్పాడు. కళ్ళు మూసుకోమన్నాడు. రామతీర్థం విపరీత మనస్తత్వం తెలిసి సెక్యూరిటీ వణికిపోయింది.
కర్ర కాలిని నెలకు తాటిస్తూ నడుస్తున్నాడు. ఒక్కొక్కరిని దాటుకుంటూ ఆగిపోయాడు. ఒక వ్యక్తి ముందు. అతను ప్రమాదం ఊహించి తుపాకీ ఎక్కుపెట్టేలోగా రామతీర్థం చేతిలోని కత్తి అతని పొట్టలోకి బలంగా దిగింది. అతని అరుపు పెంట్ హౌస్ దాటి బయటకు వెళ్ళలేదు. కానీ అతని మృతదేహం పెంట్ హౌస్ నుంచి కిందపడింది. అతని తల పగిలిపోయింది .కత్తికి అంటిన నెత్తుటిని తన చొక్కాకు తుడుచుకున్నాడు.
"వీడి అడ్రెస్ కనిపెట్టి ఇప్పటివరకూ వీడికి రావలిసిన జీతం, ప్లస్ ఓ యాభై వేలు ఎక్స్ గ్రేషియా కింద ఇవ్వండిరా...నాకసలే హింస పడదు." చెప్పి చొక్కా జేబులో వున్న గుట్ఖా పాకెట్ తీసుకుని గుట్ఖాను
నోట్లో పోసుకున్నాడు.
అప్పుడే ఫోన్ వచ్చింది...స్టీఫెన్ నుంచి...
==============
నగరానికి దూరంగా వున్న ఓ పల్లెటూరు. పచ్చని పైరులు, వూటబావులు. చెట్లూ.చేమలు...పొలానికి నీళ్ళు వదిలారు. లావుపాటి గొట్టంలో నుంచి నీళ్ళు వస్తున్నాయి.
దానికి దూరంగా ఓ గుడిసె...అందులో నుంచి ఓ అమ్మాయి బయటకు వచ్చింది. భీతావహరిణిలా వుంది. ప్రకృతికి చీర కట్టినట్టు, పైరగాలితో ముంగురులు సృస్టించబడినట్టు.. పాతాళం నాభిగా మారినట్టు...హిందోళం నడుం వంపు అయినట్టు..తెల్లటి పొడవాటి పాదాలు హిమాలయ ముద్రలు అయినట్టు. ముఖారవింద...చంద్రబింబం స్త్రీలింగమైనట్టు..అందమంతా ఆమెకు దాసోహం అన్నట్టు....
ఆమె చంద్రహాసుడి మానస చోరిణి...యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుష అందాలను తనలో ఇముడ్చుకున్న సప్తవర్ణ శోభిత...స్వర్ణ వర్ణ ముదిత...ప్ర...ణ...వి
++++++++++++
(మీ గుండె వేగాన్ని రెట్టింపు చేసే ఉద్వేగం రేపటి సంచికలో)

No comments: