ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 16 April 2013

ఆగష్టు1...డేట్ తో డిష్యుం...డిష్యుం

13-04-2013 (3rd chapter)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
ఒక్క క్షణం గాలి స్థంభించినట్టు....ప్రకృతి ఆశ్చర్యం తో స్థాణువు అయినట్టు..ఆ అర్ధరాత్రి వేళ...అక్కడ...తన
ప్రణవి.కారులో నుంచి దిగాడు.వడి వడిగా వెళ్తోన్న ఆమె దగ్గరికి వెళ్తున్నాడు..పిలుస్తున్నాడు....ప్రణవి..తన ప్రణవి...అతను వేగం గా ఆమెను చేరి ఆమె భుజం మీద చేయివేయబోయాడు.అప్పటికే అక్కడికి వచ్చిన సెక్యూరిటీ చంద్రహాస్ ని ఆపారు.
"సర్..ఆవిడ మేడం కారు "సెక్యూరిటీ ఆఫీసర్ చెప్పాడు.
మరు క్షణం అతని చెంప చెళ్ళుమంది."ముందు నన్ను వదులు...హౌ డేర్ యు.."ఇంకా ఏదో అనబోయాడు చంద్రహాస్.అప్పటికే అక్కడికి ఓ వెహికల్ వచ్చి ఆగింది.చంద్రహాస్ పర్సనల్ డాక్టర్ అందులో నుంచి దిగాడు.దిగుతూనే ఓ ఇంజక్షన్ చేసాడు చంద్రహాస్ కు...
చంద్రహాస్ కు మెల్లి మెల్లిగా స్పృహ తప్పుతుంది.అతడిని జాగ్రత్తగా కారులోకి చేర్చారు.కారు ప్రణవి ఎంపైర్ వైపు కదిలింది.
"సర్ ...అంతా మీరు చెప్పినట్టే జరిగింది."చంద్రహాస్ కారు,డాక్టర్ కారు,వెళ్ళాక అక్కడే వున్న ఓ తోపుడు బండీ వాడు ఫోన్ లో చెప్పాడు.
"జాగ్రత్త వంద కోట్ల సుపారీ "అవతలి వ్యక్తి చెప్పాడు.
తోపుడు బండీ అతను సెల్ ఆఫ్ చేసి బండీ లో వున్న మామిడికాయల అడుగున వున్నా ఏకే-47 ను తీసి దగ్గరలో వున్న ఓ మ్యాన్ హోల్ దగ్గరికి వెళ్లి ,మూట ఓపెన్ చేసి అందులోకి ఏకే -47 ను జారవిడిచాడు.
తర్వాత తన చేతులకు వున్న సన్నటి గ్లవుజ్ తీసి అగ్గిపుల్ల గీసి వాటిని తగులబెట్టాడు.
పోలీసుల రికార్డ్స్ లో అతను చనిపోయి ఎనిమిది నెలలు అవుతుంది.జైలు నుంచి తప్పించుకుని,ఆ ప్రయత్నం లో ఇద్దరు సెంట్రీలను తుపాకీతో కాల్చి పారిపోతుండగా,ఓ లారీ గుద్దేసింది.ముఖం పచ్చడైంది...గుర్తుపట్టడానికి వీలు లేకుండా...వంటి మీద వున్న దుస్తుల ఆధారం గా శవాన్ని గుర్తుపట్టారు.అతని కేసు క్లోజ్ అయింది.జైలు లోని కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు భారీ ఎత్తున డబ్బు చేతులు మారింది.
అందరూ అతడిని సైకో జాన్ అంటారు.
*****************
అర్ధరాత్రి రెండు గంటలు.
ప్రణవి ఎంపైర్ అన్న రేడియం అక్షరాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. నగరంలో ఏ మూల నుంచి చూసినా కనిపించే పేరు. మూడంచెల భద్రత మధ్య ఆ ఎంపైర్ రాజకోటను తలపిస్తుంది.
ప్రపంచంలోని అత్యధిక సంపన్నుల జాబితాలో ప్రముఖంగా కనిపించే పేరు చంద్రహాస్...గుండు సూది నుంచి,ఉక్కు వరకూ అతని వ్యాపారం విస్తరించింది.రాజకీయ నేతల ప్రాపకం కోసం అతనెప్పుడూ వెంపర్లాడలేదు. ఆ మాటకొస్తే వాళ్ళే అతని ప్రాపకం కోసం ఎదురుచూశారు. ఓ పక్క తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూనే మరో పక్క ఎన్నో మంచిపనులు చేసాడు. విద్యార్థుల కోసం తక్కువ ధరలో పాకెట్ సైజు లో కంప్యూటర్స్ అందించాడు.చదువులో ప్రతిభ చూపిన వారికి ,కులమతాలతో,జాతులతో,దేశాలతో ప్రమేయం లేకుండా వాళ్ళ పై చదువుల కోసం వెయ్యి కోట్లు వెచ్చించాడు. అధికార పక్షమూ,ప్రతిపక్షమూ అతనికి సమానమే....కేవలం కొద్ది డబ్బుతో ముంబై వచ్చి,అచిరకాలం లోనే అత్యున్నత స్థాయికి చేరిన చంద్రహాస్ మీడియా కు,ప్రచారానికి ఎపుడూ దూరం గానే ఉంటాడు.
*******************
కళ్ళు తెరిచాడు చంద్రహాస్...ఎదురుగా అతని వ్యక్తిగత వైద్యుడు చతుర్వేది, సెక్యూరిటీ చీఫ్ మెహతా, పని వాళ్ళు వున్నారు. తలంతా దిమ్ముగా అనిపించింది. కొద్ది కొద్దిగా జరిగింది గుర్తుకు వస్తుంది.దిగ్గున లేచాడు.
"మిస్టర్ చంద్రహాస్...ప్లీజ్..."డాక్టర్ చతుర్వేదికి చంద్రహాస్ దగ్గర కాస్త చనువుంది.
"ప్రణవి కనిపించింది...ప్రణవి దగ్గరికి వెళ్తుంటే...ఎందుకు ఆపారు ?సెక్యూరిటీ చీఫ్ మెహతా వైపు సీరియస్ గా చూసి ప్రశ్నించాడు.
"సారీ సర్...డాక్టర్ చతుర్వేది గారు చెప్పినట్టు.."అని డాక్టర్ వైపు చూసి ఆగాడు.
'యస్...నేనే చెప్పను ...మీరు చాలా డిస్ట్రబ్ గా వున్నారు.మీరు అనుకుంటున్నట్టు ఆమె ప్రణవి గారు కాదు."చెప్పాడు చతుర్వేది.
"నా కళ్ళతో నేను స్వయం గా చూసాను ..కాదంటే ఎలా ...అయినా ఇదేమీ బాలేదు డాక్టర్.."సీరియస్ గా అన్నాడు చంద్రహాస్.
డాక్టర్ చరుర్వేది మాట్లాడే సాహసం చేయలేదు.చంద్రహాస్ అందరి వైపు ఓ సారి చూసిలేచాడు.వాళ్లకు అర్ధమైంది.ఒక్కొక్కరు బయటకు వెళ్ళిపోయారు.డాక్టర్ చతుర్వేది బయటకు వెళ్తుండగా పిలిచి అడిగాడు చంద్రహాస్ " ఇంకెన్నాళ్ళు ?
"ప్రణవి దొరికేంత వరకు "బయటకు వెళ్తూ చెప్పాడు చతుర్వేది.
******************
సాకేతపురి హిల్స్...
రోడ్ నంబర్ 63....
మేన్ రోబో కార్యాలయం...
www.manrobo.net ...
చాలా మందికి ఒక అపోహ..అన్ని వెబ్ సైట్లు ఒకేలా ఉంటాయని....గాసిప్స్ తో ,బ్లాక్ మెయిల్ తో బ్రతికేస్తాయని. అయితే సీరియస్ గా పని చేసే వెబ్ సైట్స్ కొన్ని వుంటాయి. స్ట్రింగ్ ఆపరేషన్స్ తో....సంచలనం సృష్టించి దేశరాజకీయాలను మలుపుతిప్పిన సంఘటనలు వున్నాయి.
మేన్ రోబో మామూలు వార్తలకు ప్రాధాన్యం ఇవ్వదు.పత్రికల్లో ఏ మూలో వచ్చే వార్తలను ఫిల్టర్ చేస్తుంది.ఒక వార్త ఇచ్చాక దాని తాలూకు ప్రతిస్పందన ఫోకస్ చేస్తుంది.ఒక హత్య కేసు మిస్టరీ వీడాక,హంతకుడు దొరికాక ఆ వార్త వేసి,అక్షరాలు దులుపుకోదు.ఆ తర్వాత చాలా తతంగం వుంటుంది.ఆ హంతకుడికి జైలు శిక్ష పడిందా ?బెయిల్ మీద బయటకు వచ్చాడా? సాక్ష్యాలు దొరక్క,విడుదల అయ్యాడా?
ఇలాంటి ఫీడ్ బ్యాక్ మీద ఫోకస్ చేస్తుంది.
మేన్ రోబో లో వున్న డైనమిక్ జర్నలిస్ట్ సంధ్యాజ్యోతి
అర్ధరాత్రి దొంగతనం గా ఆఫీసులోకి ప్రవేశించింది .ఆ రోజు ఉదయం చీఫ్ ఎడిటర్ గెటవుట్ అన్నాడు.
( సంధ్యాజ్యోతి రాక సృష్టించే సునామీ రేపటి సంచికలో ) **************

No comments: