ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Sunday 28 April 2013

విసురజ (సీరియల్ )ఆగష్టు1...డేట్ తో డిష్యుం...డిష్యుం
25-04-2013 (15th chapter)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
******
ప్రణవి ఎంపైర్ ...
చంద్రహాస్ తీవ్రం గా ఆలోచిస్తున్నాడు.రెండు వేలకు పైగా వచ్చిన ఫోన్ కాల్స్...దేశం నలుమూలలనుంచి...ఇంకా ఫోన్ కాల్స్ వస్తూనే వున్నాయి.ప్రతీ కాల్ ని రికార్డు చేయిస్తున్నాడు.తను వింటున్నాడు.అందులో ఆకతాయి కాల్స్ కూడా వున్నాయి.కొన్ని కాల్స్ "ఇదిగో పులి అంటే అదిగో తోక" అన్నట్టు వున్నాయి.
వెబ్ సైట్స్ లో యాడ్ చూసి చాలా మంది విదేశాల నుంచి ఫోన్ చేసారు.మేన్ రోబో లో ప్రకటన చూసి,దుబాయి నుంచి,మస్కట్ నుంచి ఫోన్ కాల్స్ చేసారు.అదే ప్రకటన వాళ్ళు పేస్ బుక్ లో పెట్టడం వల్ల మరింత రెస్పాన్స్ వచ్చింది. మేన్ రోబో ఆన్ లైన్ మేగజైన్ కు ఇంత రెస్పాన్స్ ఉందా ?ఇలాంటి ప్రకటన ఫేసు బుక్ లో పెట్టాలనే ఆలోచన,పేస్ బుక్ లో ప్రకటన చూసి స్పందించడం...చాలా గొప్పగా అనిపించింది.
ముంబై నుంచి పూర్ణిమ ఫోన్ కాల్...మెసేజ్ బాక్స్ లో మెసేజ్..."ఈ ముంబై లో మీ ప్రణవి ఎక్కడున్నా,మేము వెతుకుతాం ..".అన్న భరోసా .
చెన్నై నుంచి అనురాధ,పద్మావతి...చంద్రహాస్ గారు...ప్రణవి ని వెతికే ప్రయత్నం లో మేము మీ వెంటే..."ఎంత గొప్ప మానవత్వం ?
కలకత్తా నుంచి కమలిని "వుయ్ ఆర్ విత్ యు .."అన్న ధైర్యం..
ఢిల్లీ నుంచి బిందు మాధవి , రోహిణీ రాచూరి ...."ప్రణవి క్షేమం గా వుంటుంది..."అన్న ఆత్మీయ వాక్యం...
హైదరాబాద్ నుంచి మాలతి ...
"చంద్రహాస్ గారు...మీరంటే నాకు గౌరవం...మీ ప్రణవి ని వెతికే బాధ్యత మా ఆసరా తీసుకుంటుంది.మా ఆసరా ఎప్పుడూ మీ వెంటే.."ఎందుకో ఎప్పుడూ ఎక్కువగా ఎవరితో మాట్లాడే అలవాటు లేని తనకు...ఈ ధైర్యవచనాలు...ఎక్కడో ఓ రచయిత రాసిన వాక్యాలు గుర్తొచ్చాయి...ఒక మాట గొప్ప అనుభూతిని, నేనున్నాన్ననే ధైర్యాన్ని ఇస్తుంది.ఒక స్పర్శ వేన వేల భావాలను కమ్యూనికేట్ చేస్తుంది.ఇప్పుడు తన ప్రణవి వుండి వుంటే... ?ఒక మనిషిని చూడగానే ఇంతటి స్పందనా?
ఒక మనిషిని ఆదుకోవడానికి పేస్ బుక్ ఒక వేదికా ?మేన్ రోబో ఆలోచన కు మనసులోనే కృతఙ్ఞతలు చెప్పుకున్నాడు.ఎడిటర్ కు ఫోన్ చేసి థాంక్స్ చెప్పాలని అనుకున్నాడు.
+++++++
ఎక్కడో పిడుగు పడింది.
ఆకాశం లో మేఘాలు దాగుడు మూతల ఆట ఆడుతున్నట్టు వుండి.పంట చేలు..పైన మబ్బుల పహారా ...ఒక చినుకు ప్రణవి నుదురుని ముద్దాడింది. చిన్న ఉలిక్కిపాటు..ఎప్పుడో ఈ అనుభవం చవి చూసిన గుర్తు...ఎవరో తన బుగ్గలమీద పడిన వర్షపు చినుకును పెదాలతో ముద్దాడిన గుర్తు.ఎవరతగాడు ? వర్షపు చినుకు ,ఆమె కన్నీటి చినుకు తో కలిసిపోయింది.
దూరం గా ఆ దృశ్యం చూసిన వృద్దుడికి బాధ తన్నుకు వచ్చింది.ఆ చిన్నారి కూనను ఎలా ఓదార్చాలి....?
నేనెవరిని అని అడిగిన తనకు తనెవరని చెప్పాలి ? ఆ రోజు తనకు బాగా గుర్తు...తను ముంభై లో వున్న తన స్నేహితుడిని కలిసివస్తుంటే...
ఆ నాటి సంఘటన కళ్ళ ముందు కదలాడింది.
=============
ముంభై...
నిత్యం ప్రయాణీకుల రద్దీ తో బిజీ గా వుండే దేశ వ్యాపార రాజధాని.
అక్కడ భాషా బేధం లేదు,రాష్ట్రాలు,దేశాలు అన్న సమస్య లేదు.ఎక్కడెక్కడికో వెళ్ళే వాళ్ళు ,వచ్చేవాళ్ళు ,బ్రతుకు తెరువు కోసం, అందరినీ కలుపుకుపోయే రైల్వే స్టేషన్...
సమయం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు...
ప్లాట్ ఫాం నంబర్ 2...
ముంభై నుంచి హైదరాబాద్ వెళ్ళవలిసిన హుస్సేన్ సాగర్ ట్రైన్ కదలడానికి సిద్ధం గా ఉంది.అన్ని భాషల్లో అనౌన్స్ మెంట్ వినిపిస్తుంది.అరవై సంవత్సరాల ఆ వృద్ధుడు కిటికీ పక్కనే కూచున్నాడు. సిగ్నల్ పడింది.ఆ వృద్ధుడు మెల్లిగా కదులుతున్న ట్రైన్ వైపు,ఆదరాబాదరాగా ఎక్కుతున్న ప్రయాణీకుల వైపు చూస్తున్నాడు. ఎవరి కంగారు వారిది.
సరిగ్గా అప్పుడే ఒకమ్మాయి పరుగెత్తుకు వస్తుంది.ఆయాసం తో రొప్పుతుంది.
వృద్ధుడి లో కంగారు. తను ముసలివాడు.ఆ అమ్మాయిని కాపాడేది ఎవరు?" అయ్యో పరుగెత్తకు తల్లీ పడిపోతావు ..."అని చెప్పాలనుకున్నాడు.ఆ అమ్మాయి కదిలిన ట్రైన్ ఎక్కడానికి ప్రయత్నిస్తుంది.ఆ వృద్ధుడు తన ఎదుటి సీట్ లో వున్నా ఇద్దరి యువకులను చూసాడు..తెలుగు వాళ్ళలా కనిపించారు..వాళ్ళని అడుగుదామని అనుకునే లోగా వాళ్ళిద్దరిలో ఒక యువకుడు డోర్ దగ్గరకి పరుగెత్తి ఆ అమ్మాయి పడిపోకుండా తన చేతిని ఆసరాగా ఇచ్చాడు.ఆ అమ్మాయి లోపలి వచ్చింది.
=============
ఆ అమ్మాయి ట్రైన్ లోకి రాకపోయి ఉన్నట్టయితే,ఆమె ను వెంటాడుతూ వచ్చిన వారి చేతిలో చచ్చి వుండేది ..అన్న విషయం వారికి తెలియదు.
ఆ అమ్మాయి నుదురు మీది నుంచి రక్తం కారుతుంది.
ఆ వృద్ధుడు కంగారు పడిపోయాడు.ఆ అమ్మాయిని కాపాడిన యువకుడు తన లగేజ్ లో వున్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసి తలకు కట్టు కట్టాడు.తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్ ఇచ్చాడు.
ఆ అమ్మాయి కళ్ళు మూసుకుంది.తన సీట్ ఇచ్చి ఆ యువకుడు నిలబడ్డాడు.
+++++++++++
"చాలా థాంక్స్ బాబూ ..ఒకమ్మాయి ప్రాణాన్ని కాపాడావు సపరిచర్యలు చేసావు...నీ సీటు ఇచ్చావు...నువ్వు బావుంటావు ...ఆ దేవుడు నిన్ను చల్లగా చస్తాడు "ఆ వృద్ధుడు కృతజ్ఞతాపూర్వకం గా అన్నాడు.
"అదేమిటండీ...ఆ అమ్మాయి ఎవరో తెలియకపోయినా మీరు కాపాడాలని అనుకున్నారు.మేము అదే పని చేసాం.ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు.సాటి మనిషిని కాపాడడం మన కనీస ధర్మం..."నిజాయితీగా అన్నాడా యువకుడు.
"ఈరోజుల్లో ఎవరెట్లా పొతే మాకేమిటి అనుకుంటున్నారు...మీలాంటి యువకులు ఉండబట్టి ఈ ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది.ఇంతకీ మీ పేరేమిటి బాబు..." ఆ వృద్ధుడు అడిగాడు.
"నవీన్...ఇతను నా స్నేహితుడు వినోద్ ...తన పెళ్లి కార్డ్స్ ఇవ్వడానికి ఇక్కడి వచ్చాం."చెప్పాడా యువకుడు.
"మంచి స్నేహితుడివి...ఇట్లా వచ్చి కూచో..ఎంత సేపని నిలుచుంటావు ? అన్నాడు వృద్ధుడు.
రైలు వెళ్తోంది.ఆ అమ్మాయి ఆ సీటులో దగ్గరి కాలు ముడుచుకుని పడుకుంది.
============
దాదర్,కళ్యాణ్. పూణే...రైలు తన మానాన తను వెళ్తుంది.రైలు లో ప్రయాణించే ప్రయాణీకుల ఫీలింగ్స్ తో రైలు కు ఏం పని ? ఆ అమ్మాయి మధ్య మధ్య ఉలిక్కి పడుతోంది.భయం తో దిక్కులు చూస్తోంది.బిర్యాని,పావ్ బాజీ వచ్చింది.ఆ అమ్మాయిని లేపి పావ్ బాజీ ఇస్తే ఆకలితో అలమటించినట్టు గబ గబా తినేసింది.ఆ అమ్మాయిని చూస్తుంటే వృద్ధుడి మనసు ద్రవించి పోతుంది.చినప్పుడే చనిపోయిన తన కూతురు గుర్తొచ్చింది.
రైలు కర్నాటక లోకి ప్రవేశించింది...గుల్బర్గా దాటింది..తాండూర్ దాటింది...నాంపల్లి వచ్చింది.
++++++
ఆ ఇద్దరు యువకుల సాయం తో ఆ అమ్మాయిని బయటకు తీసుకువచ్చాడు ఆ వృద్ధుడు.టీసీ కి అమ్మాయి టికెట్ డబ్బులు ఆ యువకుడే చెల్లించాడు.
ఆ అమ్మాయిని ఎక్కడికి తీసుకు వెళ్ళాలి ?అసలా అమ్మాయికి గతమేమీ గుర్తు లేదని తెలుస్తుంది.వయసులో ఉన్న అందమైన ఒంటరి అమ్మాయిని వదిలివేసి ఎలా వెళ్ళడం ?తనతో పాటు పల్లెటూరికి తీసుకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు.అమ్మాయికి నయమయ్యాక అమ్మాయికి సంబంధించిన వాళ్ళు వస్తే అప్పగించడం...లేదంటే తన బిడ్డగా తనతో పాటే వుంటుంది.
===============
అలా ఆ అమ్మాయి తనతో వచ్చింది.ఇప్పటి వరకూ తన గతం తనకు గుర్తుకు రావడం లేదు.నేనెవరిని అని తను అడిగిన ప్రతీ సారి అతని గుండె తడిబారుతుంది.
ప్రణవి వెలుతురూ కప్పేసిన కరి మబ్బులను చూస్తూ అలానే ఉండిపోయింది.ఎక్కడో జ్ఞాపకాల పేటికలోని ,స్మృతుల మేఘం ఆమెను చుట్టు ముడుతోంది.అదే సమయం లో ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించింది డబ్బు కోసం హత్యలు చేసే సుపారీ గ్రూప్
=================
(ఈ మిస్టీరియస్ రొమాంటిక్ థ్రిల్లర్ లోని మరో ట్విస్ట్ రేపటి సంచికలో )

No comments: