ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 16 April 2013

కవిత: రామగానం
........................
దశరధ కౌసల్యల సుపుత్రుడే నీలమేఘశ్యాముడు రఘురాముడు
పిన్నికైకేయి మానసపుత్రుడే శ్రీరాముడు రవికులశ్రేష్టుడు కులదీపకుడు

ముగ్గురు తమ్ముళ్ళ ముద్దుల అన్నయ్య శ్రీరాముడు నీరజాక్షుడు
ముగ్గురు అమ్మల ముద్దుల కన్నయ్య రాఘవుడు సత్యనిష్టుడు

సుందర రాముడు మర్యాదా పురుషోత్తముడు మహనీయుడు
సౌమిత్రికి సోదరుడు మైత్రికి చిరునామనతడు మానవోత్తముడు

కులగురువు వశిష్టుడే ముందుగా విద్యావినయాలు నేర్పించే
జగద్గురువు విశ్వామిత్రుడే విలువిద్యలో నైపుణ్యం యిప్పించే

యాగ సంరక్షనార్ధం విశ్వామిత్రుని వెంట నడిచే రామ లక్ష్మణులు
రామపాదం తాకి రాయే అహల్యయై ఎదుటనిలిచే చేస్తూ వందనాలు

రక్కసులు మారీచి సుభాహులు యాగం ధ్వంసానికై వచ్చారు
రామలక్ష్మణుల చేతిలో చావుదెబ్బలు తిని చివరకు చచ్చారు

జనకుని పుత్రి సీతా స్వయంవరం చాటింపు జరిగే
మహిమాన్విత శివధనుస్సు ఎత్తిపెట్టితేనే జానకి దొరికే

సీతాస్వయంవరంకై ధరిణిలోని రాజులెందరో వచ్చిరి
శివధనుస్సు ఎత్తిపెట్టలేక నవ్వుల పాలైతిరి

అల్చిప్పలాంటి కళ్ళతో బేలగా చూసే సీత శివధనుస్సు ఎత్తే వీరునికై
అందాలరాముడిని అభ్యర్ధించే జానకి నయనాలు శివధనుస్సునెత్తి తనని చేపట్ట రమ్మని

గురువు విశ్వామిత్రుని ఆజ్ఞ మేరకు శివధనుస్సును చేరి నమస్కరించే సభకు
లలన సీతను చూస్తూ విల్లుకు నారికట్టి పెటాలున త్రుంచే మధ్యకు

సిగ్గుపడుతు సిగ్గరి సీత బుగ్గల్లో రోజలు మొగ్గలు వేయ
ఉరికే సీత మెచ్చిన శ్రీరాముని మెడలో వరమాల వేయ

పెద్దలే ఆనందించ దీవతలే దీవించ జరిగే సీతారాముల పరిణయం
ఇరు రాజ్యాల ప్రజలే జయజయధ్వానాలు పలికే మురిసే జగం

రాఘవుడే సాకేతపుర సామ్రాట్టని చేయ ముహూర్తం పెట్టించే దశరధుడు
పావని సిగ్గరి సీతే పట్టమహిషని సంబరాల్ని అంబరానంటించే జనకుడు

మంధర వుద్బోధ కర్కసి కైకేయి వరబాధే దశరధునికి గ్రహబాధయ్యే
తండ్రి ఆనతే లక్ష్మణ సహిత రామ సీతల అడవులకేగుటకు కారణమయ్యే

నారచీరతో సీత నారబట్టలతో రామలక్ష్మణులు కానలకేగే
అయోధ్య పురజనుల కన్నీళ్ళు హృదయఘోష నింగికెగసే

రామసీతల నామస్మరణే మోహావేశం తప్పించు
పరమపవిత్రుల నిత్యస్మరణే జీవన్ముక్తి కలిగించు
......
విసురజ

No comments: