ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 12 April 2013

మాన్ రోబో పబ్లికేషన్స్ గర్వంగా అందించే
మెస్మరైజింగ్ మేగ్నటిక్ ఎనర్జీ రైటర్...
"విసురజ"
రెండవ డైలీ (కొత్త) సీరియల్ ప్రారంభం
నేటి ఉగాది నాడు అనగా విజయ నామ తెలుగు కొత్త సంవత్సరంలో ప్రాణం పోసుకుని మీ ముందుకు
ఇక చదవండి, ఆనందించండి
******************
...... "ఆగష్టు 1".............
.........................................
ఈ కొత్త సీరియల్ "ఆగష్టు 1" ప్రారంభానికి ముందు
...నేను.....
'వెన్నెలను పిలిచాను...భావుకత్వాన్ని విస్తరిగా పరిచాను....భావోద్వేగాల షడ్రుచులను వడ్డించాను. వెన్నెల దీవెనలందాను.
వర్షాన్ని దోసిట్లో పట్టి, హృదయాన్ని పాత్రగా చేసి, మమకారపు క్షీరసాగరాన్ని మథించి, కాసింత సృజనామృతాన్ని అర్ధించాను. అమరత్వపు ప్రేమతత్వాన్ని నా స్వంతం చేసుకోవాలని స్వప్నాన్ని మనసార ఆహ్వానించాను...అట్టా నా మనసుతో సంగమించాను".
ఇంతకీ నేనెవరినో చెప్పనేలేదు కదూ....ఈ రచయిత మస్తిష్కంలో మెరిసిన అక్షరాన్ని...మీ అభిమానానికి కన్నీటి పన్నీటి పదాలతో మురిసి, పదునైన వాక్యాలతో మెరిసి ధన్యమైన విరితేనెల అధ్యాయాలతో మీ ముందుకు వచ్చిన ధారావాహికను.
నా పేరు "ఆగష్టు 1".....
*******************
ఏప్రిల్ 10
అర్ధరాత్రి 11-59 నిమిషాలు ...
మరో నిమిషం గడిస్తే ఉగాది...
ఒక్క సారిగా ఆకాశంలో పెను మార్పులు....సాయంత్రం వరకు వడగాడుపులతో నిప్పు కణాలు కురిపించిన భానుడు...దీనుడైపోయాడు....కారు మబ్బులు కర్కశత్వాన్ని ప్రదర్శించాయి. ఈదురుగాలులు విర్రవీగుతున్నాయి. మెరుపులు కన్నెర్ర జేస్తున్నాయి. పిడుగులు పిడికిళ్ళు బిగించాయి.
ఇసుక తుఫాను, సముద్రంలో సునామీ. వాతావరణంలో బీభత్సం ...ఒక భయానక దృశ్యాన్ని చిత్రించడానికి పదును తేలిన విధ్వంసపు రక్తపు విషపు కోరలను చాచి ప్రకృతి...ఒక నిమిషాన్ని ముందుకు జరిపింది.
*****************
12 pm
ఒక్క సారిగా ఆకాశానికి చిల్లులు పడ్డట్టు, వేన వేల ఏనుగులు తమ తొండాలతో వర్షాన్ని కురిపిస్తున్నట్టు....
కుండపోత....ఒక్క సారిగా నగరాన్నే కాదు...సమస్త ప్రపంచాన్ని చుట్టుముట్టిన చిమ్మచీకటి....ఇది...యు...గాం...త...మా?
తీతువు పిట్టల అరుపులు...గుడ్లగూబల అరుపులు...ప్రమాదాన్ని సూచించే కుక్కల నక్కల రోదనలు...
ఒక్క సారిగా కట్టలు తెంచుకున్న సముద్రాల విశ్వరూపం....నదుల భయానక నృత్యం...కార్లు, ఇళ్ళు, వాకిళ్ళు...కొట్టుకు పోతున్నాయి. ఎవరెవరో అర్ధం కావడం లేదు. ప్రాణభయం...అమ్మ బిడ్డ, స్నేహితుడు, బంధువు...కానరాని కటిక చీకటి.
తెలుస్తోంది...యుగాంతం చివరలో తమ ప్రాణాలు వున్నాయని...విజయవాడ అమ్మవారి ముక్కు పుడకను నీళ్ళు ఏమన్నా తాకాయా?
ఉలిక్కిపడింది. చిమ్మచీకటి... పదుల సంఖ్యలో గదులు. నౌకర్లు...సెక్యూరిటీ...ఎవరూ లేరు. విపరీతమైన ప్రాణభయం...ఆమె భయంతో వణికిపోయింది. ఆమె శరీరం కంపించిపోయింది. తన పక్కనే వుండవలిసిన తన ప్రాణనాథుడు కనిపించడే...ఎదురుగా మునిగిపోతోన్న నగరం...శవాలు గుట్టలు గుట్టలుగా తేలుతున్నాయి....ఎవరెవరో తెలియదు.
ఆమె భయంతో అరిచింది. చివరిసారి తన ప్రాణాన్ని కనులారా చూసుకోవాలి. అతని ఒడిలో చనిపోయినా పర్లేదు. వేగంతో వచ్చే నీటి ప్రవాహం భయానకంగా వుంది.
ఆమె కళ్ళు మూసుకుంది. చివరిసారిగా దేవుడిని ప్రార్ధించింది.
*****************
మబ్బుల్ని చీల్చుకుంటూ, మెరుపులను చేదించుకుంటూ, ఆకాశం గుండెను చీల్చుకుని, శ్వేతాశ్వాన్ని అధిష్టించి, ఒరలో కరవాలంతో... యుగాంతాన్ని కాలయంత్రంతో కట్టి పడవేయాలని దూసుకు వస్తున్నాడు చంద్రహాసుడు.
*****************

No comments: