ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday 12 April 2013

విసురజ "ముగ్ధమోహనం" తొలి డైలీ సీరియల్
(Chapter---71)
(06-04-2013)
.................................
డాక్టర్ సాకేత్ కార్తికేయ వైపు చూసాడు. కార్తికేయ మొహంలో ఆందోళన కనిపిస్తోంది. సెక్యూరిటీ సిబ్బంది భయం భయంగా చేతులు కట్టుకుని నిలబడ్డారు.
"సారీ కార్తికేయ గారు...మా హాస్పిటల్ లో ఇలా జరగటం మొదటిసారి...ఈ విషయంలో మీరు ఏం చేయాలని అనుకుంటున్నారు? అడిగాడు.
"మోహన తనకు తానుగా వెళ్ళింది. మా ఆందోళన అంతా మోహన గురించే...ఇలాంటి పరిస్థితిలో వెళ్ళడం గురించే ..." కార్తికేయ అన్నాడు.
జగన్నాథ్, కార్తికేయ భుజం మీద చేయివేసి "మీకు తెలియనిది కాదు...
"ఒక్కటి మాత్రం నిజం, మోహన వెళ్తూ, వెళ్తూ, తనకు సంబంధించిన "జ్ఞాపకాన్ని" మాత్రం ఇక్కడే వదిలి వెళ్ళింది. ఆమె మీ కోసం వదిలి వెళ్ళిన ఖరీదైన...కాదు కాదు విలువైన వస్తువు అదొక్కటే..." కార్తికేయకు మోహనకు సంబంధించిన విషయాలు చెప్పాక అన్నాడు జగన్నాథ్.
ఆ మాట అందరినీ కదిలించింది ...
అప్పుడే హాస్పిటల్ సెక్యూరిటీ చీఫ్ అక్కడికి వచ్చాడు.
"సర్ ఈ కవర్ మన సెక్యూరిటీలో వదిలి వెళ్లారు. కవర్ మీద కార్తికేయ గారి పేరు వుంది" అంటూ ఓ కవర్ ఇచ్చాడు.
కవర్ మీద మోహన దస్తూరీ...కవర్ విప్పాడు...లోపల వుత్తరం...వణుకుతున్న చేతులతో అక్షరాల వైపు కళ్ళని పరుగెత్తించాడు.
"చిన్నప్పుడు ఎప్పుడో పలక మీద నేర్చుకున్న అక్షరాలు....ఇంత కాలం ఒక యంత్రంలా బ్రతికిన నేను..ఈ యంత్రాన్ని మనిషిగా మార్చిన కార్తికేయ గారికి...మిమ్మల్ని ఎలా పలకరించాలి? యేమని సంబోధించాలి? ఎక్కడో ఎప్పుడో చదివిన గుర్తు "నిమిషానికి డెబ్భైరెండుసార్లు గుండె కొట్టుకుంటుంది ...ట...
నా శత్రువులు నాకసలు గుండే లేదని అంటారు....కార్తికేయ గారు...నా ప్రపంచంలో రక్తపాతాలు, చంపడాలు తప్ప మరేమీ లేవు. అసలు నేనో ఆడపిల్లని అన్న సంగతి మిమ్మల్ని కలిసేవరకూ గుర్తించలేదు. ముగ్ధలోని మీ మీద ప్రేమను చూసే వరకూ తెలుసుకోలేదు...మనసు అనే మాటకు అర్ధం తెలియనిదానిని...మనసకు ఏ ఆకారం వుంటుంది? ఎలాంటి రంగులో వుంటుంది?
నిన్న మొన్నటి వరకూ కరుడుగట్టిన ఈ మనిషి ఇప్పుడిలా బేలగా మారిపోయిందేమిటి? అనుకుంటున్నారా? లేదు ఈ మోహన ఎప్పుడు పులిలానే వుంటుంది.
"యుద్ధం తర్వాత రక్తపాతం, తెగిపడిన తలలు చూసి అశోకుడు శోకతప్తుడయ్యాడ......ట ....మరణ మృదంగ ధ్వనుల మధ్య బ్రతికిన నేను మీ సెంటిమెంట్స్ అనే అందమైన నేపథ్య సంగీతాన్ని విన్నాను. ఒక ఇష్టం ఇంత గొప్పగా ఉంటుందా?
నాకు మీరు అన్నం తినిపించినప్పుడు మా అమ్మను మీలో చూసుకున్నాను.
నన్ను నమ్మి ముగ్ధను కాపాడడానికి పంపించినప్పుడు ఒక మూర్తీభవించిన నిజాయితీని చూసాను.
ఒకే ఇంట్లో వున్నా, నన్ను కంటికి రెప్పలా చూసుకున్నప్పుడు ఒక మంచి స్నేహితుడిని మీలో చూసాను.
అన్నింటికీ మించి ఒక మగాడిని...ఒక స్త్రీ కోరుకునే క్వాలిటీస్ వున్న వాడిని చూసాను.
ఏ క్షణం మీ మీద ప్రేమతో నేను ముగ్ధను చంపేస్తానో అన్న భయం కూడా కలిగింది.
చివరికి....... నాకు క్షమాబిక్ష పెట్టమని మీరు రాష్ట్రపతిని అభ్యర్థించినప్పుదు మీలో ఒక దేవుడిని చూసాను.
మోహనలో పశ్చాత్తాపం కలిగింది...ప్రభుత్వానికి లొంగిపోయింది...అనే క్లయిమాక్స్ నా జీవితంలో, ఈ కథలో ఉండడానికి వీల్లేదు.
మోహన ఎప్పుడూ మోహనే...ఆ రోజు ముగ్ధను నేను కాపాడిన రోజు చిన్నపాటి బాధతో హాస్పిటల్ కు వెళ్ళినప్పుడు..
"క్యాన్సర్ అనే మరో శత్రువు కూడా ఇన్నాళ్ళు నన్ను అంటిపెట్టుకునే వుందని తెలిసింది."
మరణం అనివార్యం అని తెలిసినప్పుడు చిరునవ్వుతో దానిని ఆహ్వానించాలని ఎక్కడో ఎప్పుడో ఓ రచయిత రాసిన వాక్యాలు గుర్తొచ్చాయి...
నన్ను కాపాడిన డాక్టర్ సాకేత్ కు, నా వల్ల ఇబ్బందులకు గురైనా నన్ను ప్రేమిస్తున్నానని చెప్పక చెప్పి కంటతడి పెట్టిన డాక్టర్ రాధారాణికి, విద్యారణ్యకు.....ఇన్నాళ్ళు నా రూపాన్ని భరించి, ధరించిన ముగ్ధకు వీడ్కోలు...
నేను ఆత్మహత్య చేసుకోను...బాధతో జీవితాన్ని నరకం చేసుకోను..మీ జ్ఞాపకాల శ్వాసతో పాటు నెమరువేసుకుంటాను...
ది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మోహన పారిపోయింది. ఆమె కోసం ఇంటర్ పోల్ వెతుకుతుంది...అనే వార్తనే నాకు, నా ఈగోకు సంతోషాన్ని ఇస్తుంది.
కానీ ఒక్కటి మాత్రం నిజం. ఈ దేశాన్ని ప్రేమిస్తాను...ఎందుకంటే ఈ దేశంలో నేను ప్రే..మిం...చే కార్తికేయ వున్నాడు...నేను వదిలివెళ్తున్న నా కన్నీళ్లు వున్నాయి...ఎప్పుడైనా ఖాసిం లాంటి వాళ్ళు వస్తే అక్కడ ఈ మోహన వుంటుంది...మీ పనిని నేను చేస్తాను.
చివరిగా ఒక్క మాట...నా నలుపు తెలుపుల సంపాదన మీ పరం చేస్తున్నాను.
మరో మోహన తయారవ్వడానికి నేను ఒప్పుకోను. మోహన ఒక్కరే వుండాలి. నా రక్తపు సంపాదన...ఒక మంచి కోసం ఉపయోగపడాలి...క్యాన్సర్ తో బాధ పడే నిస్సహాయులకూ ఉపయోగపడాలి...
అదేమిటో కార్తికేయ గారు.....ఇలా రాస్తున్నప్పుడు, మీరు గుర్తోస్తున్నప్పుడు కళ్ళలో కన్నీళ్లు వస్తున్నాయి. ఘనీభవించిన కన్నీటి మేఘాన్ని కదిలించారుగా...అందుకేనేమో....
నేను ముగ్ధ రూపంతోనే వెళ్తున్నాను...ఎప్పుడైనా, ఎక్కడైనా మీలాంటి కార్తికేయ లాంటి వ్యక్తిత్వం వున్న మగాడు తారసపడితే...అతడిని కిడ్నాప్ చేసి...మీ రూపాన్ని ప్లాస్టిక్ సర్జరీ చేయిస్తాను..డాక్టర్ రాధారాణి గారిని కిడ్నాప్ చేసైనా సరే..అప్పటి వరకూ ఈ రూపంలోనే మీ మనసుకు దగ్గరగా వుంటాను.
వీడ్కోలు ...మిత్రమా...నా ప్రాణమా...నా కంటిలో వున్న కన్నీటికి గుర్తుగా మిగిలిన నా ఆత్మీయ అతిథికి వీడ్కోలు...మీ........ ముగ్ధమోహనం...
******************.
ఇది ఏ విధాత రాసిన లలాట లిఖితం ...వుత్తరం పూర్తయ్యేసరికి కార్తికేయ మనసు ద్రవించింది. తన శరీరం లోని ఒక భాగం తన భాగాన్ని తను తీసుకుని, కోసుకుని వెళ్ళిపోయిన ఫీలింగ్. ఒక శత్రువు..ఒక కరుడుగట్టిన తీవ్రవాది..ఇలా తన వీడ్కోలుని కన్నీటి పర్యంతం చేసి, ఇంత మందిని కన్నీటితో కదిలించి, ఆభిజాత్యాన్ని సైతం ఆర్ద్రతగా మార్చి...మోహనను పట్టుకోవడం అసాధ్యం..తనకు తానుగా దొరికితే తప్ప...
బరువైన హృదయాలతో బయటకు నడిచారు. జగన్నాథ్, డాక్టర్ సాకేత్ వీడ్కోలు చెప్పారు.
కార్తికేయ, ముగ్ధ, డాక్టర్ రాధారాణి, విద్యారణ్య కారు ఎక్కారు. వాళ్ళ కారు కదిలే సమయం లో....హాస్పిటల్ పైన టెర్రస్ లో వాటర్ ట్యాంక్ లో నీళ్ళ మధ్య చిన్న కదలిక..అప్పటివరకూ వూపిరి బిగపట్టి జల స్తంభన విద్యతో వాటర్ ట్యాంక్ లో నీళ్ళ
మధ్య వున్న మోహన పైకి వచ్చింది.తడిచిన దుస్తులతో....కిందికి చూసింది....విషాద వదనాలతో వెళ్తోన్న కార్తికేయ బృందం కనిపించింది...ఆమె చేయి గాలిలోకి లేచింది.

No comments: