ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 29 June 2013

జై షిర్డీ సాయినాధ 
 అష్టమ అంకం..


బాయిజాబాయి సేవా తత్వం

షిర్డీ సాయి బాలుడిగా మొట్టమొదటసారి షిర్డిలోవచ్చినప్పుడూ యోగిలా, విరాగిలా, భయరహితగా, ప్రాపంచిక విషయాలు పట్టని మౌనిలా, ఎప్పుడు ఎక్కడో అడవుల్లో/తుప్పల్లో ఒక చెట్టుక్రింద కూర్చుని తపస్సు చేసుకుంటూ ధ్యానంలో నిమగ్నమై వుండేవారు..వారు అకలిని జయించనవారై ఎవరింటికి వెళ్లక దేహి అనకుండా వుండేవారు.. చలికి, వానకి, ఎండకి దేనికి వెరవక నిత్యం ధ్యాన ముద్రలో వుండేవారు..ఆ సమయంలో సాయిబాబాకి బాయిజాబాయి చేసిన సేవ అద్వీతీయమైనది. బాయిజాబాయి మరియు ఆమె కొడుకైన తాత్య కోటే పాటిల్ లిద్దరికీ ఫకీర్ సాయిబాబా సాక్షాత్ భగవంతుడేనని అపార నమ్మకం. ఆమె భక్తివిశ్వాసాలు చిత్రంగ అపారమైనవి. సాయిబాబా అప్పటికి ఏమి మహత్యాలు చూపక పోయినా వారిని నిత్యం సేవించే అమృతమయి. ఆమె ఒక వకుళ మాతలా, ఒక శబిరిలా షిర్డీ సాయిని అనునిత్యం సేవించేది. బాలుడిగా వెళ్ళిపోయి తరువాత పెండ్లి వారితో తిరిగి షిర్డీ వచ్చిన సాయిని, అంతకుముందు షిర్డీలో వుండే వెళ్ళిన బాల తపస్విగా గుర్తించిన ఆ సాధ్వి, మహాతల్లి, తన భవ్య సేవను ఎన్నడు వీడలేదు. ప్రతిరోజు తలపై గంపలో రొట్టె, కూర పెట్టుకొని అడవంతా తిరిగి సాయిబాబాను వెతికి ఆయన తపస్సు చేసుకుంటున్న చోటికి వెళ్లి, నిత్యం అడవిలో మధ్యాహ్నం 12 గంటల సమయానికి చాలా సార్లు మైళ్ళకొలది ముండ్లపొదలను దాటి సాయిబాబాను వెదికి పట్టుకొని, సాయిబాబాకు సాష్టాంగ నమస్కారము చేసి విస్తర్లో భోజన పదార్దాలు, రొట్టె, కూర మొదలగునవి పెట్టి సాయిబాబా వద్దన్న వినక విసుక్కున్నా, కసురుకున్నా లెక్కచేయక బలవంతంగానైనా బాయిజాబాయి సాయికి నిత్యం తినిపించుచుండే. సాయిఫకీరు అవేమి పట్టనట్టు కదలక మెదలక ధ్యానంలో నిమగ్నమైవుండే. ఆ మమతామూర్తి, ఆ నారీమణి అద్వీతీయ సేవను సాయిబాబా తను మహాసమాధి వరకు మరువలేదు. బాయిజాబాయి నిశ్వార్ధ సేవకు ప్రతిఫలంగా బాయిజాబాయి కొడుకైన తాత్యాపాటిల్ కు సాయిబాబా ప్రతిరోజు ఆజన్మాంతం రూ.25/- కానుకగా ఇస్తుండే. చివరాఖరికి ఆ తల్లి బాయిజాబాయి చేసిన సేవకు ప్రతిఫలంగా తనను మావయ్య అంటూ ఆప్యాయంగా పిలిచే తాత్య కోటే పాటిల్ ప్రాణ రక్షణకై తన ప్రాణాన్ని త్యజించిన మహానాత్మ, శ్రీ షిర్డీ సాయిబాబా. అట్టా బాయిజాబాయి తనకు చేసిన నిస్వార్ధ సేవకు బడలు తీర్చుకున్నారనేటట్టు అలాగే నిస్వార్ధ సేవకు తప్పక మంచి ఫలం వుంటుందని చెప్పకనే చెప్పిన మణిపూస శ్రీ షిర్డీసాయిబాబా. సాయిబాబా తనకు ఫకీరు పదవే పరమార్ధమని, షిర్దియే తన సామ్రాజ్యమని, భక్తుల హృదయాలే తను పాలించే రాజ్యమని భావించే. వారికి స్వలాభాపేక్ష, వంటి మీద, వస్తువుల మీద మమకారం, ప్రేమ లేకుండే. లోకులు తపనపడే ధనం వట్టి తుచ్చమని, బూటకమని, అంతరాత్మ ఆత్మ నడుమ యాత్రకు పనికిరాని ద్రవ్యమని చెప్పుచుండే. మహాతల్లి జాయిజాబాయి తనకై పుట్టలంట, తుప్పలంట, గుట్టలంట తిరుగాడు బాధలు చూడలేక కొంతకాలానికి సాయిబాబా అడవులకు వెళ్ళుట మాని మసీదులోనే కూర్చుండి భోజనము చేయువారు. అప్పటినుంచి తుప్పల వెంబడి తిరుగు కష్టము బాయజాబాయకి తీరింది. బాలుడిగా సాయిబాబా 16 యేండ్ల వయస్సులో షిర్డిలో ప్రకటమయ్యే. మూడు సంవత్సరాలు పాటు అక్కడ వుండి హఠాత్తుగా అక్కడ నుండి అదృశ్యమయ్యారు. తరువాత కొంతకాలానికి అప్పటి నైజాం ప్రాంతమైన ఔరంగాబాద్ కు సమీపాన తోటలో చెట్టు కింద చాంద్ పాటిల్ కు కనిపించే. గుర్రం పోయి బాధపడుతున్న చాంద్ పాటిల్ గుర్రం ఆచూకి తెలిపిన తరువాత గుర్రం దొరికిన మీదట చాంద్ పాటిల్ ఈ ఫకీర్ సామాన్యుడు కాదని సంబరంతోతనతో ఇంటికి రమ్మనే. అట్లా చాంద్ పాటిల్ గృహానికి వెళ్లి అక్కడనుండి 20 సంవత్సరముల వయస్సులో చాంద్ పాటీల్ వాళ్ళ ఇంట్లో పెళ్ళికి పెండ్లి గుంపుతో బయలుదేరి పెళ్ళికూతురు వూరైన షిర్డీ చేరిరి. అప్పటినుంచి 60 సంపత్సరాలు షిర్డీ వీడక మహాసమాధి (1918వ సంవత్సరం) చెందేవరకు అక్కడనే మసీదులోనే వుండిరి.

........................
ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।

No comments: