ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday 31 December 2013

స్వగతాలు (3)
..................
అవి 1973-78 కాలంలో విశాఖపట్టణంలో 1967లో పుట్టిన నేను రమారమిగా ఆరు నుంచి పదేళ్ళ వయసులో వుండే సమయంలో జరిగిన ఒక ఆశ్చర్యకరమైన నమ్మలేని విషయాన్ని చెప్పబూనాను. అక్కడ సీతమ్మధార గవర్మెంట్ క్వార్టర్స్ లో మేము వుంటున్నప్పుడు, చెప్పాలంటే సీతమ్మధార ఊరికి దూరంగా (ఈ రోజు అది చాలా వి.ఐ.పి. ప్లేస్) వుండేది. కొండకి ఆనుకుని వుండేది. అందరు వేసవి సెలవుల్లో మరియు కార్తీక మాసంలో అలాగే ప్రేమ జంటలు నిత్యం సందర్శించే స్థలమది. అక్కడ స్థలమంతా ఎత్తు పల్లాల తీరుతో, పచ్చని చెట్లతో, మామిడి తోపులతో, జామ చెట్లతో, రాగి పళ్ళ చెట్లతో, తాటి చెట్ల సమూహాలతో గుబురుగా బయపెట్టేటట్టుగా వుండేది.
ఆ రోజుల్లో అక్కడే వుండే ఒకళ్ళ ఇంట్లో నార్మల్ గా వుండే ఒకావిడపై ( మేము ప్రేమగా మామూలు సమయంలో) అత్తయ్యా అని పిలుచుకునే దేముడు (వెంకటేశ్వర స్వామి) పూనుతున్నాడని చెప్పేవారు. తరువాత్తారువాత ఆవిడని మేము అత్తయ్య అనడం మానేసి దేముడమ్మ అనడం పరిపాటి అయ్యింది. జనమంతా తండోప తండాలుగా క్యూలు కట్టి ఆవిడని దర్శించుకునే వారు. ప్రత్యేకంగా ఆవిడపై గురువారం నాడు, శనివారం నాడు స్వామీ వారు పూనుతారని నానుడి వుండేది. మామూలు రోజుల్లో నార్మల్ గా వుండే ఆవిడ పూనకం పూనితే వీరగా ఊగిపోయేవారు. పైగా ఆవిడది భారీ కాయం, పెద్ద బొట్టుతో, మెడలో దండలతో ఉచిత సింహాసనంపై వారిని కూర్చోబెట్టి ఆవిడకు హారతులు పాటలు పాడే వారు. ఆ దేముడు పూనిన సమయంలో దేముడమ్మ ప్రశ్నలకు జవాబులు యిచ్చేవారు, తాయత్తులు పంచేవారు, ఈ పూజలు చేయాలని చేయించుకోమని చెప్పేవారు. అప్పుడు నా వయసు 08 నుంచి 10 ఏళ్లు వుండడం మూలానా అది నిజమా కదా అని తర్కించే వయసు కాదు కాకపోతే వింతగా ఆశ్చర్యంగా వుండేది. అందరూ మా సీతమ్మధార వస్తుంటే గొప్పగా వుండేది. దేముడమ్మకు దగ్గరుండి సేవ చేసుకుంటూ వారి సైగలు, సంజ్ఞలు అర్ధం చేసుకునే తత్త్వం అలవడి, దేముడమ్మ గారి మనిషిగా తెలియపడిన
కళా శివరామరావు గారు మరియు వారి ధర్మపత్ని. అక్కడున్నప్పుడు వాళ్ళబ్బాయులలో ఆఖరి వాళ్ళు మణి, త్రినాద్ నాకన్నా కొంచెం పెద్ద కానీ నాతో పాటు క్రికెట్ ఆడేవాళ్ళు. త్రినాద్ ఫాస్ట్ బౌలర్, మణి మంచి రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్. త్రినాద్ మంచి బాటింగ్ చేసేవాడు, మణి హిట్టింగ్ చేసేవాడు. దేముడమ్మ గారి పైపూనే వెంకటేశ్వర స్వామీ గారి గురించి అక్కడే పక్కనే వున్నా సొంత వాళ్ళింట్లో ఒక గుడి కూడా కట్టించారు అలాగే కళా వారే ఆ గుడి నిర్వహణ చూసుకుంటున్నారు, ఇప్పటికీ ఆ గుడి అక్కడనే సీతమ్మధార నుంచి హౌసింగ్ బోర్డు కి వెళ్ళే దారిలో వుంది.
దేముడమ్మ గారి పై దేముడే పూనుతున్నాడని పైన చెప్పినానుగా, చాల మంది మాకు మంచి జరిగింది, మా కష్టాలు తీరాయి అని చెప్పుకునే వారు. మా కుటుంబం మరీ అంత వెళ్ళేది కాదు, అలాగని దూరంగా వుండేది కాదు. అప్పుడో ఎప్పుడో ఒకసారి వెళ్ళేవారు అనుకుంటాను.
ఒకసారి నేను మా తల్లి గారితో వెడితే నా ఎదురుగానే దేముడమ్మ గారు వెలుగుతున్న హారతిని తీసుకుని నోట్లో వేసుకుని మింగేసినారు, మరలా కొద్దిసేపటికే జ్యోతిని బయటకు తీసారు. నాకు భయం, అచ్చెరువుగా వుండేది. మరో విషయం అప్పుడు సీతమ్మధారలో దెయ్యాలు, రాక్షసులు మాటుగా వున్నారు వారిని మట్టుపెట్టాలి, వెంకటేశ్వర స్వామీ చెప్పారు అని దేముడమ్మ గారు అందరిని ఒకసారి రాత్రి 12 గంటలకు పిలిచి ఆవిడ బయటకు పరుగు బెడితే ఆవిడ వెనకాల జనం ఉంటూ, డప్పు కొడుతూ, భజనలు చేస్తూ..ఆవిడ పలుగు పార పట్టుకునే ఒక చోట సడన్ గా ఆగి గట్టిగా ఎదో అంటూ తవ్వేది, అక్కడ ఒకోసారి ఎర్రటి రక్తపు చారికలు కనబడేవి అని చెప్పుకునే వారు. ముఖ్యంగా మా ఇంటి దగ్గర కొండలపైకి ఆవిడ జనంతో సహా వెళ్ళేవారు. అక్కడే ఇట్లా చేసే వారు. అలాగే మా సీతమ్మధార వాటర్ టాంక్ దగ్గర ఆవిడ ఎదో అరుస్తూ తెల్లారగట్ల ఇటువంటి పని చేస్తే అక్కడ కూడా ఎరుపు చారలు కనబడ్డాయని చెప్పుకునేవారు. పైగా దేముడమ్మ గారి అరుపులకు జవాబుగా మరో గొంతు వినబడేదని నన్నేం చెయ్యకు నేను వెళ్ళిపోతాననేదని కాకపోతే దేముడమ్మ గారు నీవు ఇంకోచోట వెళ్ళిన నీ బాధలు వారికి తప్పవు అందుకే నిన్ను తప్పక నాశనం చేస్తాననేదని చెప్పుకునేవారు. నిజానిజాలు ఆ సర్వేశ్వరునికి తెలుసు కాకపోతే దేముడమ్మ గారి పాపూలారిటితో మా సీతమ్మధారకు కళ వచ్చేది.. అదే ఈ రోజు ఈ పోస్టు రాయడానికి ఉపయోగపడింది.
...........

No comments: