ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday 31 December 2013

స్వ'గతాలు' (4) 
..................
కాలెండర్ ఇయర్ 2013 చివరకు వచ్చేసింది. రేపటితో మనకి టాటాలు బై బై లు చెప్పేసి మరుగయిపోతుంది. మరి ఆంధ్ర మేలిమి రత్నం శ్రీ బాపు గారి సినిమా 'ముత్యాల ముగ్గు' లో స్వర్గీయ రావుగోపాలరావు గారిచే చెప్పించబడిన కీర్తిశేషులు ముళ్ళపూడి వారి సంభాషణల చెముకులను కాస్త నెమరేసుకుంటే .. "ఒరేయి సెక్రటరి.....................మనిషన్నాక కాసింత కళా పోషణ వుండాలి, ఓ ఊరికే తిని కూర్చుంటే మనిషికి గొడ్డుకి మరింకా తేడా ఏముంటుంది" అని........ మరి మీరందరూ ఈ అప్రస్తుత ప్రసంగం ఎందుకంటారా.. అదే ఆ పాయింట్ కే వస్తున్నా, వచ్చేస్తున్నా ... తిన్నామా, పడుకున్నామా లాంటి మన నిత్యకృత్యమైన పనులు చేసేసామా అన్నది కాదు, మనం ఈ సంవత్సరంలో ఎవరికైనా ఏమి సాయం చేసేము (అది మాట సాయమైనా సరే) అలాగే క్రొత్తగా, క్రొంగత్తగా ఏమి నేర్చేము, ఎవరికైనా ఏమి నేర్పేము అన్నది ఒకసారి అందరం అవలోకన చేసుకోవాలన్నదే నా సవినయ ప్రార్ధన. మీ మీ కామెంట్స్ ఈ పోస్టుకు అనుసంధానించగలరు. మరి అందరికి నేను చెబుతుంటిగా.. నా కాలెండర్ ఇయర్ 2013 కార్యక్రమాలలో గ్రహించిన సారం క్రింద అందిస్తున్నా.. నేను నేర్చింది నేర్పింది అన్నీ క్రింద వివరిస్తున్నా..
..................
1. చూడ్డానికి ఎంత దృడంగా వున్నామో కాకుండా నాలుగు/ఐదు పదులు దాటినాక రెగ్యులర్ గా అలాగే ఏమాత్రం కాస్త నలతగా కనబడినా అలక్ష్యం చెయ్యరాదు, వైద్య సహాయం తీసుకోవాలి.
2. ఎంత గొప్ప పేరున్న హాస్పిటల్ అయినా, మన ఇంటికి ఊరికి ఎంత దగ్గరగా వున్నా, ఫీజు రీతిలో ఎంత సావకాశంగా వున్నా హస్తవాసి మరియు డాక్టర్లపై నమ్మికే సరైన వైద్యానికి గీటురాయి .
(నా పెద్దన్నయ్య...కొమరేశ్వర సూర్య ప్రసాద్ ను పైన చెప్పిన అలక్ష్యాల వల్లనే ఫిబ్రవరిలో కోల్పోయం.. కారణాలు అవన్నీ ఇప్పుడు తవ్వడం అనవసరం)
3. మార్చిలో ప్రమోషన్ వచ్చినా ఆ ఆనందాన్ని పంచుకోడానికి నాపై సర్వదా గురి నమ్మకం వుంచిన తండ్రిని అలాగే తండ్రి తరువాత తండ్రైన పెద్దన్నయ్యను కోల్పోవడం ఆ లేమి ఎంత బాధిస్తుందో తెలిసింది.
4. మే నెలలో తండ్రి గారి సంవత్సరీకాల పూజలు రాజమండ్రిలో చేస్తూ వారి లోటును వారి తోడ్పాటును గమనించినా, అక్కడే అట్టహాసంగా జరిగిన నా పుస్తకాల ఆవిష్కరణ సభలో అమ్మానాన్నలలో అమ్మ ఒక్కరే వుండడం మిక్కిలి బాధ కలిగించింది. ఒక్కసారే 3 పుస్తకాలు, అవీ విభిన్నమైనవి .. విసురజ ఫ్రం న్యూ ఢిల్లీ (వ్యక్తిత్వ వికాసం), నవల..ముగ్ధమోహనం (ఫిక్షన్) మరియు పంచ రత్నాలు పేరిట రాసిన విసురజ శతకం విడుదల చేయబడిన ఆనందం నాకు అందలేదు. ఆ పుస్తక ఆవిష్కరణ సభ ఏర్పాట్లులలో తమ్ముళ్ళు దీక్షితుల సుబ్రహ్మణ్యం చేసిన సేవ , గీతాచార్యుల వేదాల చేసిన స్పీచ్ అలాగే మిత్రుడు/ లెక్చరర్ సంజీవరావు ఆ ప్రోగ్రాంకై అతి తక్కువ సమయంలో చేసిన ఏర్పాట్లు వారిలోని అంతర్వాహినిగా నిలవున్న వారి ఎనర్జీని నేను అలవరచుకోవాలని నిర్ణయించా..
5. అలాగే ఫేస్ బుక్ లో ఎంతో మంది సన్మిత్రులను పొందా, వారి కామెంట్స్ తో ఎట్లా ఇంకా బాగా రాయచ్చో కన్నా ఎట్లా రాయకుండా ఉండాలో కాస్త నేర్చా.. నేను సూటిగా పెట్టె కామెంట్స్ కన్నా దొంక తిరుగుడుగా కాస్త లౌక్యం కావాలని తెలిసా, అలవర్చుకునేందుకు చూసా, నా వల్ల అవ్వలేదు.. తిన్నగా రాయడమే మంచిది, అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మంచిదని అలా సెటిల్ అయిపోయా..
6. కొంచెం జెలసీ, కొంచెం వెనకెనకనే అనే మనుషుల మనస్తత్వాలను ఆకళింపు చేసుకున్నా..పేరుకి మన శ్రేయోభిలాషులం అంటూ చెప్పుకుంటూ వెనకాల ఆడే వారి నాటకాల తీరు తెన్నులు చూసా. అది మంచి పద్దతి కాదని వారికి చెప్పేసేసా..
7. అక్క సుజాతను, చెల్లెమ్మ సుకన్య లను ఇక్కడనే అందా.. అలాగే సునీల దిక్షిత్ అక్కా, నా గురువు/అక్కా అయిన జ్యోతిర్మయి మళ్ళ దక్షిణాఫ్రికా వెళ్ళడంతో వారి లోటును బాగా తెలిసా.. కాకపోతే అంటే సుజ్ఞానం వున్నా భావకవితల రాణి శ్రీమతి రాధారాణి గారి ద్వారా నాకు ఏదైనా డౌటు వస్తే తీర్చుకునే భాగ్యం అందా. నేను రాసింది నచ్చకపోతే నిర్మొహమాటంగా చెప్పేసే నా మొదటి శ్రేణి పాటకురాలు శ్రీమతి సంద్యారాణి గారిని ఇక్కడనే అందా. లక్ష్మి పిరాట్ల గారు గురించి ఏమి చెప్పిన తక్కువే,ఎంతో ప్రోత్సాహిస్తారు.. నేను రాసింది నచ్చితే ధైర్యంగా షేర్ చేసే పూర్ణిమ గారిని ఇక్కడనే కలిసా. నన్ను ప్రోత్సహించే సోదరుడు పార్ధసారధిని, rvss గారిని, రామం అన్నయ్యను, నేస్త్రి నండూరి సుందరి నాగమణి గారు, మాలతి గారు, శశిబాల గారు, మంజు గారు, జ్ఞానవల్లి గారు, వసంత గారు మరియు కల్యాణి గారిని ఇక్కడనే అందా.. తమ్ముళ్లు వెంకట మధు, సుబ్బు ఇంకా చాలా మంది వున్నారు..వీళ్ళందరిలో ఎదో ఒక స్పార్క్ నాకు బాగా నచ్చి అది నేను నేర్వాలనే తపనతో ముందుకు వెడుతున్నా.
8. ప్రఖ్యాత రచయత, సహృదయుడు విజయార్కే అన్నయ్య అంటే వల్లమాలిన అభిమానం.. వారి సింప్లిసిటీ, ఓపిక నేర్వాలి, ఆలాగే జ్యోతి కుచన వారి నిర్వేద కర్మేష్టి వ్యవహారం నేర్వాలి. బావాజీ శ్రీనివాస్ ఈడూరి హాస్య చతురత అంటే మహా ఇష్టం నాకు వీలయితే అది అలవర్చుకోవాలి. కంప్యుటర్ జ్ఞ్యానాన్ని ఉపదేసిస్తున్నా మాధవి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా.
9. ఆఫీసులో ఉద్యోగం చేస్తూ, అడపా దడపా ఎదో రాస్తూ, అలాగే కొత్త బాధ్యతలు కొంచెం వైవిద్యంతో కూడినవి.. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ తరుపున రంజీ ట్రాఫీ మ్యాచులకు మేనేజర్ గా అవతారమెత్తడం.. ఇదో కొత్త బాధ్యత ఎన్నో నేరుస్తున్నా నిత్యం.
10. చివరిగా ఇంకా నేను విసర్జించవలసినవి.. అతి మంచితనం, తొందరగా అందరిని నమ్మేయడం అలాగే ఒక్కోమారు భార్య మాట మంచిది కూడా గోరోచనంతో వినకపోవడం, అభాద్యతగా వ్యవహరించడం, మతిమరుపు ఇత్యాదివి.

మిత్రులారా ఈ కొత్త సంవత్సరంలోనైనా నా ఈ రుగ్మతలు అన్నీ దూరమవ్వాలని, నాకు మంచి జరగాలని మీరందరూ మీ కామెంట్స్ పెట్టి అట్లా విషెస్ చెబుతారని ఆశిస్తూ..అందరికి పేరు పేరునా కొత్త సంవత్సర 2014 శుభాకాంక్షలు.
.........

No comments: