ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 17 November 2014

శ్రీమతే రామానుజాయ నమః
మహాకవి శ్రీశ్రీ గారు చెప్పినట్టు .. నేను సైతం సమిధనొక్కటి ఆహుతిచ్చాను...అన్నట్టుగా
ప్రతీసారి నా శ్రీమతి శరన్నవరాత్రులలో ఒకరోజు ఇంట్లో పూజ పెట్టుకోవడం..ఒక 25 మంది బలగాన్ని (ఆడవారు..ఆడించేవారు) పిలవడం పరిపాటే.. వీరందరూ కలిసి లలితావిష్ణు
సహస్ర నామ పారాయణ ఆపై భోజన చందన తాంబూలాది సేవలు వెళుతూ వెళుతూ వారిచ్చే దీవెనలు ఫ్రీ సలహాలు..చీరల, నగా నట్రా డిస్ప్లే లు అవీ కూడా షరా మామూలే..
ఆ రోజు ఉదయాన్నే మనం ఇంట్లోంచి గెటౌట్ అన్నమాట..పూజ ముగిసి వచ్చిన వారు, తిని, త్రాగి, త్రేన్చి వెళ్ళేదాకా తిరిగి ఇంట్లో ప్రవేశం వుండదు...అధమ పక్షాన ఇంట్లో ఉండవలసి వస్తే.. గదిలోంచి బయటకు రానేకూడదు ..ఇది ప్రతి మగవారికి వారి ఇంట్లో అందు సన్మానమే..షరా మామూలే..
మరి ఈ కధ ఏమిటా అంటారా ..ఈ రోజు రెండవ రోజు..బాలాత్రిపుర సుందరి అమ్మవారి అలంకారంలో దుర్గమ్మ కనిపిస్తుందని మా ఇంట్లో నా ధర్మపత్ని పెట్టుకుంది ఆ పూజ..వారి రాకముందే బయటపడదాము అనుకుంటే..శ్రీమతి ఒక ఆర్డర్ వేసే..ఏమి లేదు మరేమిటో అనేసేసుకున్నారు..చామంతుల కాడలను వలచి పెట్టమని..పూజా సామాగ్రిని సర్దిపెట్టమని..
స్నానం చేసేసి తయారై బయటకు వెళ్ళాల్సి వున్నా..స్వీయ శ్రేయస్సు, భోజన సౌలభ్యములు ఇత్యాదివి దృష్టిలో పెట్టుకుని బుద్దిగా కూర్చుని సదరు కుసుమాల కాడలను కసితీరా విరిచి 
పూలసజ్జను ఏర్పరచి శ్రీమతికి అంకితమిచ్చి బయటపడ్డా..వంటింట్లోంచి వచ్చే ఘుమఘుమలో తేలిందేమిటంటే..పరవాన్నం, కట్టే పొంగలి, పులిహోరా, బజ్జీలు, వడలు, ఇవిగాక మిగతావి అన్నం, కూర, పప్పు, సాంబారు, పచ్చడి (కొబ్బిరి) ఇవన్నీ ఉండనే వున్నాయి..మొన్ననే మా పిన్నిగారబ్బాయి ఆత్రేయపురం నుండి తెచ్చిచ్చిన 
పంచదార పూతరేకులు కూడా నేటి అమ్మలక్కల విందుకు తయారుగా వున్నాయి.
చివరగా మరోటి తేలిందేమిటంటే.. వచ్చిన వాళ్ళల్లో ముందుగా వచ్చే పెద్దముత్తయిదువకు చీరా జాకెట్, మిగిలిన వాళ్ళందరికీ ఉచిత గిఫ్ట్ + బ్లౌస్ పీసు టోకుగా ఇవ్వాల్సి ఉంటుందని.. అలాగే మనమిచ్చేది మరొకరి కన్నా కాస్త డిఫరెంట్ గా ఉండాలన్న తపన గమనిస్తే
ఈ పూజ ద్వారా పుణ్యం పురుషార్ధం మాటెలా వున్నా ఈ బక్కోడి (సైజు కాదు) జేబు ఖాళీ అవ్వేనని ఇందుమూలముగా సవినయముగా మిగిలిన మగ మిత్రులందరికీ సానుభూతి కొరకై తెలియచేసుకుంటున్నా..
పొరపాటున కూడా నేనిలా అన్నానని/రాసానని మాయావిడకు చెప్పబాకండి..బతుకు బస్టాండ్ అయ్యిపోతుంది..
అందుకే సదా శ్రీమతే రామనుజాయ నమః అనుకుంటూ సాగిపోతుంటా..బక్కోడిగానే మిగులుతూ ఆనందంలో (ఉత్తినే) మునుగిపోతుంటా..ఈ భజనలో రక్తి భక్తి రెండూ వున్నాయిగా