ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday 16 December 2014

అశాంతి నిండిన జీవితాలు ..పర్యవసనాలు నేను గమనించిన వాస్తవాలు..
మిత్రులారా
నా చిన్నప్పుడు విశాఖపట్నంలో ప్రభుత్వ క్వార్టర్స్ లో ఉండేటప్పుడు మా ఇంటికి ఎదురుగా సత్యనారాయణ గారి కుటుంబం వుండేది..ఆయన ఆర్&బి లో వర్క్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తుండేవారు..వారికి ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు.. ఇంటికి పెద్ద.అబ్బాయి పేరు.పంతూ అనే వాళ్ళం, తను నా రెండో అన్నయ్య తోటివాడు, అస్సలు పేరు నాకు గుర్తు లేదు, తరువాత అమ్మాయి పేరు పద్మ. నా మూడో అక్క తోటిది.. తరువాత అమ్మాయి పేరు జోగులాంబ.. జోగ అని పిలిచేవాళ్ళం, నా కన్న ఒకేడు చిన్నది, తరువాత అమ్మాయి పేరు కృష్ణవేణి... వేణి అని పిలిచే వాళ్ళం, మా తమ్ముడి తోటిది, ఆఖరున అబ్బాయి పేరు నారాయణ... అందరికంటే చిన్నవాడు సుమారు ఆరేళ్ళు చిన్న నాకన్నా.. ఇంతకీ సత్యనారాయణ గారి భార్య పేరు చెప్పలేదు కదూ ఆవిడ పేరు గున్నమ్మ గారు....
గున్నమ్మ గారు పేరుకు తగ్గట్టే గుండ్రంగా వుండేది...పూజలు, వ్రతాలు చేసినట్టే వుండేది.. మాటలు చాలా నెమ్మదిగా వుండేది, కానీ ప్రతి రెండు మూడు నెలలకు యాత్రలు పేరుతో ఇంట్లోంచి వెళ్ళిపోయి ఒక రెండు నెలలు తరువాత వస్తుండేది.. అప్పుడు అక్కడ అమ్మలక్కలు, ఇరుగుపొరుగు వారు.. ఈవిడ ఒంటరి యాత్రలు మహిమేమిటి అని బుగ్గలు నొక్కుకునేవారు..పాపం ఆ పేద బ్రాహ్మడు సత్యనారాయణ గారు పిల్లల్ని కనిపెట్టుకుని ఉండేవాడు.. ఆయనే వంట వార్పునూ... ఆ రోజుల్లో గున్నమ్మ గారి ప్రవర్తనను అందరు తప్పు పడ్తుంటే చిన్నవాడిని నాకు అర్ధం అయ్యేది కాదు.. జోగ నా వయసుది అప్పుడే మేమిద్దరం 10/11 వయసులో అరమరికలు తెలీని వయసులో ఇద్దరం స్నేహంగా వుండేవాళ్ళం.. తను నాతో ఇంటి బాధ చెప్పుకునేది..తల్లికి ఇంటి విషయం పట్టటం లేదని..తన తల్లి తండ్రి చెప్పుచేతల్లో లేదని, తన తండ్రి తల్లిని కంట్రోల్ చెయ్యలేకపోతున్నాడని ...
ఈ భార్యాభర్తల జీవనశైలితో వారి వైషమ్యాల వైరంతో ఆ ఇంటి వాతావరణంలో పడిన మొదటి వికెట్.... పంతూ..... బాగా చదివే పంతూ వున్నట్టుండి చదువులో డీలా పడుతూ, స్కూల్ కి వెళ్ళడం మానివేసి అటుఇటు తిరుగుతూ తండ్రికి దొరికేడు, తండ్రైన సత్యనారాయణ గారు విషయమేమిటి దాని వెనుక అస్సలు కారణమేమిటి అన్నది ఆలోచించకుండా గట్టిగా కొడితే ..పంతూ ఇల్లొదిలి పారిపోయేడు.. ఇంట్లో వాళ్ళు మేము ఎంత వెతికినా కనబడలేదు, ఎక్కడెక్కడో తిరిగి రెండు నెలల తరువాత ఇంటికి పిచ్చోడిలా వచ్చాడు...ఇలా తండ్రి దండన పొందిన ప్రతీసారీ పారిపోయేవాడు.. మళ్ళీ వచ్చేవాడు.. వాళ్ళమ్మకు ఇవన్నీ పట్టేవి కావు.. ఆవిడ యాత్రలు/తిరుగుళ్ళు ఆవిడవి.. ఈ వింత ప్రవర్తనతో.. వాళ్ళింట్లో పిల్లలు ఎవరూ పదో తరగతి దాటి చదవలేదు.. వారికి చదువబ్బలేదు.. ఆడపిల్లలకు వయసు రావడం..వారిని కంట్రోల్ చెయ్యడం కష్టమయ్యేది సత్యనారాయణ గారికి.. నాకు తెలిసి అతి కష్టం మీదా పద్మకి, జోగకి ఇద్దరికీ ఆయన ఎలాగో 16 ఏళ్ళ లోపే గంతకు తగ్గ బొంత లాంటి సంభంధం తెచ్చి వివాహం చేసేరు.. పద్మకి రెండో సంభంధం, వాళ్ళ ఆఫీసులో తన క్రింద పనిచేసే ఒక బ్రాహ్మల అబ్బాయిని మధ్యాహ్నం భోజనానికి తెచ్చేవాడు ఆయన, జోగ అన్నం వడ్డించడం చేసేది.. అట్లా ఆయన ఆ పిల్లవాడిని జోగకి, పిల్లవాడికి జోగని నప్పించేసి వివాహం జరిపించేసాడు....
చిన్నమ్మాయి వేణి కూడా చదువులో సున్నాగా వుండేది.. కాకపొతే అమ్మాయిలు అందరు నుదురుగా వుండేవారు.. వారికి ఎదో ఒకలా తన భాద్యత తీర్చుకున్నాడు.. ఆఖరు అబ్బాయి నారాయణ కాస్త చదువు అబ్బింది.. వాడు బాగున్నాడు, తండ్రిని వాడే చూస్తున్నాడు అని తెలిసింది.. వివాహం తరువాత పంతూ కూడా హైదరాబాద్ లో సెటిల్ అయ్యాడని విన్నాను, బాగానే వున్నాడని విన్నాను.. ఇక్కడ చెప్పొచ్చే మాట.. ఎప్పుడైనా గున్నమ్మ గారిని సత్యనారాయణ గారు దండించబోతే.. చోద్యం చూద్దును కదా ఎక్కడనించో ఆవిడని సపోర్ట్ చేసే మగవాళ్ళు పది మంది తయారయ్యేవారు.. వాళ్ళు మా కాలనీ వాళ్ళు కాదు.. అలాగే మరికొందరు ఆడవాళ్ళూ కూడా.. వారేవరో ఏమిటో నాకు ఎప్పుడు అర్ధం కాలేదు..వాళ్ళందరూ ఒకేలా ఆలోచించే దూర్తులని ఈనాడు గట్టిగా చెప్పగలను
ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే అశాంతి నిండిన జీవితాలు తమమే కాక మరెందరివో జీవితాలను కాల్చేస్తాయో, నష్టం చెయ్యయత్నిస్తాయో చూసాంగా...తము పచ్చగా లేమని మరొకరిని ఉండనివ్వరు..నెమ్మదిగా నైసుగా మాట్లాడినంత మాత్రాన మంచోళ్ళు కాదు, తమ ఇబ్బందులు, కష్టాలు.. డప్పు కట్టుకుని డప్పు కొట్టుకునే వాళ్ళు చెప్పేవి అన్నీ కూడా నిజాలు కావు.. రెండు చేతులు కలవనిదే చప్పట్లు రావని అందరికీ తెలుసు..నిష్కర్షగా మాట్లాడేవాళ్ళు చెడ్దోళ్ళు కాదు.. పది మందితో పలకరిస్తే మాట్లాడితే వ్రతభంగం అనుకుంటే ఇంట్లో కూర్చోవాలి.. బయట ఎందుకు తిరగడం అంటే అదీ కాదు ఇదీ కాదు......
ఏది ఏమైనా మరొకరిని జడ్జ్ చేసేటప్పుడు రెండు ప్రక్కలు విన్నామా లేదా...దానిలో చెప్పేవారి చోద్యం ఎంత, వారి జీవిత స్థాయి ఎంత, అసూయ అక్కసుల ఉన్నాయా.. ఇవనీ బేరీజు వేసుకుని ముందుకు సాగాలి లేకపోతే మనకు మహిషానికి తేడా ఏముంటుందిచెప్పుడు మాటలు చెప్పేవారికంటే చెప్పుడు మాటలు వినేవారికి మరింత పాపం (నమ్మేవాళ్లకు) చుట్టుకుంటుంది..ఎందుకంటే వినే వారు లేకుంటే చెప్పేవారు వుండరుగా.. అంటే అటువంటి వారి తయారినీ మనం ప్రోత్సహిస్తున్నట్టేగా..ఇకనైనా అంతర్మధనం చేసుకుని అంతరంగాన్ని సరిదిద్దుకుందాం.. తప్పుదారిలో నడవడం తప్పుకాదు, తప్పు తెలుసుకుని కూడా సరియైన దారిలో పడకపోడమే దుర్మార్గపు ధోరణిని సూచిస్తుంది..

No comments: