ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 19 January 2015

కవిత: ఆపగలనా/ఓపగలనా

ఏమని చెప్పి ఆపను
నీకై ఎగిరే పయటమ్మ వయ్యారాలను
ఎంతసేపు అట్లా ఓపను 
ఎదలో ఎగిసే కోలాహల ధ్వనులను
ఏమని చెప్పి ఊరడించను
నీకై రవళించే గుండె స్పందనలను
ఎంతసేపు అట్లా దాచను
మదిలో నర్తించే మధుర ఊహలను
ఎట్టా పగ్గాల్లాగి ఆపను
నీకై ఉరకే ప్రాయపు అశ్వాన్ని 

ఏమని చెప్పి మభ్యపెట్టను 
హృదిలో మెరిసే ప్రత్యూషపు వెలుగుల్ను
ఎంతకాలం యిట్టా భరించను
నీకై మ్రోగే పాంజీరాల సవ్వడులను
ఏ పాత్రలో దాచిపెట్టను
మురిపాలు వర్షించే ప్రణయ జల్లులను
ఎంతని ఎక్కడని దాచను
నీకై విరబూసే యవ్వన లావణ్యాన్ని
ఎంతసేపని గానం చేయను
మనసులో అనురాగ సంగమ కృతులను
ఏమని హృదితడిని ఏమార్చను
నీకై వెదికే తలపుల వాకిళ్ళలలో
మదిగదిలో ఎక్కడ పెట్టను
అంటుకట్టిన వలపు విత్తుల గుత్తులును
త్వరగా వచ్చి బ్రతికించు
కురచవుతున్న వలపుపై నమ్మకాన్ని
నీ ప్రేమని నిరూపించు
పలచనవుతున్న ప్రేమగౌరవాన్ని కాపాడి 

No comments: