ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday 12 March 2013

" ముగ్ధమోహనం " (12th chapter )
కార్తికేయ గది చూస్తోంటే...అది తన మదిని మాయ చేసి కట్టిన ప్రకృతి ఒడి లా వుంది.మొదటిసారి పరిశీలనగా చూసింది.మగవాళ్ళ గదులు..అందులో బ్రహ్మచారుల గదులు "సిగరెట్ పీకలతో,మందు బాటిల్స్ తో. మగువల అర్ధనగ్న చిత్రాలతో...చిందర,వందరగా ఉంటాయని అనుకుంది.కానీ కార్తికేయ గది ప్రకృతిని ఇటుకలుగా పేర్చి,ప్రశాంతతను గదిగోడలకు రంగులుగా వేసి ,అద్దాలను ప్రతీ అంగుళంలో బిగించినట్టు,అద్దం లా మెరిసేట్టు....
మంచులో తడిసిన అమ్మాయి సౌందర్యం లా ఎంత బావుందో.....
కార్తికేయ భావుకత్వానికి నగీశీలు చెక్కినట్టు....
ఓ పక్కన రంగులద్దిన వర్ణచిత్రం...కింద కార్తికేయ అన్న సంతకం.షాకైంది.కార్తికేయ చిత్రకారుడా?
అతని జ్ఞాపకాల అరని కదిలిస్తే ఆ దొంతరలో వుండే భావోద్వేగాలు ఎన్నో...ఉదయం జరిగిన సంఘటన గుర్తొచ్చింది.తనెంత అమాయకం గా ప్రవర్తించింది? తన అమాయకత్వాన్ని ఎంత ఇష్టంగా భరించాడు. ఓ మూలన ఉదయం ఉక్రోషం తో విసిరేసిన చీర వుంది.ఆ చీరను చేతుల్లోకి తీసుకుంది.గుండెలకు ఆన్చుకుంది.టేబుల్ మీద కార్తికేయ ఫోటో..తననే చూస్తున్నట్టు..ఆ ఫోటో ను తన చీర కొంగు తో తుడిచింది.ఫోటో టేబుల్ మీద పెట్టి...గది సర్దుతుంటే ఏదో అనుమానం..ఇంట్లోకి ఎవరో ప్రవేశించినట్టు.
*********** **************** ******************** ***********
కార్తికేయ లోపలి రాగానే సి బి ఐ చీఫ్ సుందర రామమూర్తి లేచి ఎదురొచ్చాడు.
"కమాన్ మై సన్ ...ఎలా వున్నావ్ కార్తి ?ఆప్యాయం గా అడిగాడు.
"మీరెలా వున్నారు నాన్నా ?అడిగి కింది వంగి చీఫ్ పాదాలకు నమస్కారం చేసాడు.
కార్తికేయను కార్తి అని ప్రేమతో పిలుస్తాడు చీఫ్,
గాడ్ బ్లెస్ యు ...అని కార్తికేయను గుండెలకు హత్తుకున్నాడు.కార్తికేయ అంటే ప్రాణం చీఫ్ కు...
ఎందుకంటే తన ప్రాణాలే కాదు...దేశాన్నీ కాపాడాడు.తను చేసిన సాహసాన్ని ఎవరికీ తెలియనివ్వకుండా తన దగ్గర మాట తీసుకున్నాడు.
తన చేతిలో వున్నా వాకింగ్ స్టిక్ ని మూలకు గిరాటు వేసాడు."నువ్వు వచ్చేక ఈ కర్ర తోడు అక్కర్లేదు "అన్నాడు.
"నాన్నా ..మీరే మాత్రం మారలేదు "మనస్ఫూర్తిగా అన్నాడు కార్తికేయ.
పంచభూతాలు మారాయా?నా కార్తి మారాడా? నేనెందుకు మారాలి...నవ్వి "కాఫీ తీసుకుంటావా?లేదా ఏదైనా జ్యూస్ ?అని ఇంటర్ కం నొక్కి "రెండు జ్యూస్ "చెప్పాడు.
*********** ************** ************ *************
"కార్తీ .ఇది నువ్వు కాపాడిన ప్రాణం "
"నాన్న గారు ఇప్పుడు ఇదంతా ఎందుకు?మొహమాటం గా అన్నాడు కార్తికేయ.
"లేదు కార్తీ...నీ గురించి తెలియాలి...ఆ రోజు నువ్వు చేసిన సాహసం ప్రపంచానికి తెలియాలి
"ఓ సారి టేబుల్ మీద వున్న భారతదేశ పటానికి తగిలించిన మెడల్ వంక చూసాడు.
సరిహద్దుల్లో దొంగతనం గా చొరబడిన పొరుగుదేశం ఉగ్రవాదుల ఆచూకి పసిగట్టడానికి వెళ్ళిన సి బి ఐ చీఫ్ ని చుట్టుముట్టారు.
తన దగ్గర వున్న శాటిలైట్ ఫోన్ ద్వారా ఎమర్జెన్సీ మెసేజ్ పంపించాడు.ఆ మెసేజ్ పొరపాటున కార్తికేయ కు చేరింది.
తనకు సంబంధం లేని విషయం అనుకోలేదు...ఎవరికో ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేతులు దులుపుకోవాలని అనుకోలేదు.
ఆఘమేఘాల మీద సరిహద్దులకు చేరుకున్నాడు.వన్ మేన్ ఆర్మీ గా మారాడు.
సింహం లా గర్జించాడు ...పులిలా కదిలాడు...మెరుపై విస్పులింగాల అగ్నికణాలు శత్రువుల శరీరాలను తూట్లుగా మార్చింది.
కరుడు గట్టిన సిక్వీ అనే తీవ్రవాది సిబి ఐ తలకు తల్వార్ గురి పెట్టాడు.
ఏ మాత్రం తొందర పడ్డా పదును తేలిన తల్వార్ చీఫ్ తలను మొండెం నుంచి వేరు చేస్తుంది.
గాలిని చీల్చుకుంటూ సిక్వీని చేరి తల్వార్ చివరను ఒడిసి పట్టుకున్నాడు.రక్తం ఏరులైంది
అయినా తల్వార్ వదలలేదు..వదిలితే చీఫ్ తల నేల రాలుతుంది.
కార్తికేయ పట్టు ముందు..పట్టుదల ముందు తల్వార్ తల వంచింది. అదే తల్వార్ తో సిక్వీ కుడి చేతిని నరికాడు.
"మా దేశాన్ని కన్నెత్తి చూసిన కత్తి దూసినా, పట్టుకోవడాని చేయి ఉండదని ఉగ్రవాదులతో చెప్పు "అంటూ తరిమేసాడు.
*********** ***************** ************* *********
ఎందుకింత సాహసం చేసావ్?నీకు సంబంధం లేని విషయం లో నీ ప్రాణాలను ఎందుకు ఫణం గా పెట్టావ్?
చీఫ్ అడిగిన ప్రశ్నకు కార్తికేయ చెప్పిన సమాధానం.
"ఎందరో ...ఎన్నో త్యాగాలు చేసి తెచ్చుకున్న స్వాతంత్ర్యం...మీ లాంటి వాళ్ళు ప్రాణాలు ఫణం గా పెట్టి ఈ వయసులో సరిహద్దుల్లో పోరాడుతున్నారు.మీ ప్రాణాలు మాకు అమూల్యం ."
ప్రభుత్వానికి తను చేసిన సాహసం చెప్పనివ్వలేదు.కార్తికేయకు దక్కవలిసిన మెడల్ తనకు దక్కింది.అదే విషయం కార్తికేయ దగ్గర ప్రస్తావిస్తే...
"నాకు మెడల్ వద్దు..మిమ్మల్ని నాన్న అని పిలిచే అవకాశం ఇవ్వండి "అన్నాడు.
"ఇది నేను నీకు ఇచ్చే అవకాశం కాదు...ఆ దేవుడు నాకు ఇచ్చిన వరం "అన్నాడు చీఫ్.
ఆ రోజు నుంచి వాళ్ళు తండ్రీ కొడుకులు.
**************** ************************* ************************
జ్యూస్ తాగుతూనే ఐ ఫోన్ ఓపెన్ చేసాడు.ఇంట్లో వున్న రహస్య కెమరాల్లొ అక్కడి దృశ్యాలు కనిపిస్తున్నాయి.
ఓ అపరిచిత వ్యక్తీ తన ఇంట్లోకి ప్రవేశించాడు.మొహం క్లియర్ గా కనిపించడం లేదు.
ఆ అపరిచితుడు ఇంటి వెనుక నుండి తన బెడ్ రూం లోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నాడు.
అతను....
************************* ***************** *********************
యాసిక్ కార్తికేయ బెడ్ రూమ్ వైపు అడుగులు వేస్తున్నాడు.ఉదయం నుంచి కాపుకాసాడు.
కార్తికేయ వుండగా ఆ ఇంట్లోకి వెళ్ళడం అసాధ్యం.తను కార్తికేయను ఏమీ చేయలేడు.
అతని దగ్గర ఆశ్రయం పొందుతున్న అమ్మాయిని ఏమైనా చేస్తే అది కార్తికేయను దేబ్బతీసినట్టే...
************* *************** ****************** *********************
"నాన్న గారు విత్ యువర్ పర్మిషన్ మన ఇంటికి దగ్గరలో మీకు తెలిసిన డిటెక్టివ్ ఎవరైనా వున్నారా?
చీఫ్ కి కొంత అర్ధమైంది.అవసరమైతే తప్ప ఎవరి సాయమూ తీసుకోడు.కార్తికేయ ఇల్లు ఎక్కడుందో తెలుసు.వెంటనే ఆ ఏరియా కు దగ్గరలో వున్న డిటెక్టివ్ ఏజెన్సీ కి ఫోన్ చేసాడు.కార్తికేయ ఐ ఫోన్ లో గమనిస్తూనే వున్నాడు.
"మిస్టర్ శ్యాంసన్ నేను చీఫ్ ని "
"చెప్పండి సర్ "వృత్తిపరమైన అనుభవం .అందుకే ఎలాంటి ప్రశ్నలూ వేయలేదు.
"జస్ట్ వన్ సెకన్...ఫోన్ మా అబ్బాయికి ఇస్తున్నాను.ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవండి "అంటూ ఫోన్ కార్తికేయకు ఇచ్చాడు.
"మిస్టర్ శ్యాంసన్ నేను చెప్పిన అడ్డ్రెస్ కు ఎన్ని నిమిషాల్లో వెళ్ళగలరు?అంటూ తన అడ్డ్రెస్ చెప్పాడు.
వెంటనే చెప్పాడు అతను...పదినిమిషాల్లో .
"ఓకే అంతకన్నా ముందు వెళ్ళడానికి ట్రై చేయండి,
సేఫ్ సైడ్ అంబులెన్స్ కి ఫోన్ చేయండి.క్విక్...అంటూ అక్కడికి వెళ్లి ఏం చేయాలో చెప్పాడు.
మరో ఫోన్ కాల్ చేసాడు...ముగ్ధకు ....
************ ***************** ***********************
హాల్ లో ల్యాండ్ ఫోన్ రింగ్ అవుతుంది .ముగ్ధలో సంశయం.తను తీయాలా?వద్దా?
ఫోన్ కట్ అయింది...మళ్ళీ రింగ్ అవుతుంది..ఏం చేయాలి ? తెస్తే ?
యాసిక్ హాల్ వైపు వచ్చాడు...ముగ్ధ హాలులోకి వస్తే అతని పని సులువు అవుతుంది.
కార్తికేయ లో టెన్షన్ ...ముగ్ధ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడాన్ని అతను అర్ధం చేసుకోగలడు.కానీ ఇప్పుడు ముగ్ధ తలుపు తీస్తే?
డోర్ బెల్ శబ్దం...ఒక్క క్షణం ముగ్ధ ఎలర్ట్ అయింది.కార్తికేయ వచ్చివుంటాడు.ఫోన్ రింగ్ అవుతూనే వుంది?ఫోన్ లిఫ్ట్ చేయాలా?ఎటూ కార్తికేయ వచ్చాడుగా ....ఆ వచ్చింది కార్తికేయ అని ఆమె అనుకుంటుంది..
యాసిక్ మరో సారి డోర్ బెల్ ప్రెస్ చేసి డోర్ పక్కకు వచ్చాడు.అతని చేతిలో యాసిడ్ బాటిల్ రెడీ గా వుంది.ఇదంతా ఐ ఫోన్ లో చూస్తూనే వున్నాడు....
శ్యాంసన్ కార్తికేయ ఇంటికి అతి దగ్గరలో వున్నాడు.
ఈ సారి డోర్ బెల్ నాన్ స్టాప్ గా వినిపిస్తుంది.ముగ్ధ డోర్ తీయడానికి వెళ్ళింది.మరో రెండు నిమిషాల్లో శ్యాంసన్ అక్కడికి చేరుకుంటాడు.లాంగ్ వ్యూ లో శ్యాంసన్ కారు కనిపిస్తుంది.
కానీ ఒక నిమిషం..ముప్పయి సెకన్లు...పది సెకన్లు..డోర్ బోల్ట్ మీద ముగ్ధ చేయి పడింది...
కార్తికేయ మెదడు కంప్యూటర్ కన్నా వేగం గా మెగాబైట్లు...గిగాబైట్లు...దాటింది.
బోల్ట్ తీసే చివరి క్షణం లో కార్తికేయ చేతివేలు చురుగ్గా కదిలింది...ఐ ఫోన్ మీద...
(ఆ తర్వాతేమైంది ?రేపటి సంచికలో )

No comments: