ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 12 March 2013

" ముగ్ధమోహనం " (14th chapter )
(08-02-2013)
అప్పటి వరకూ దేవుడ్ని తలుచుకుని పళ్ళ బిగువున బాధను అనుభవించిన ఆ అమ్మాయి విప్పారిత నేత్రాలతో చూస్తోంది.
ఆదిశక్తి రూపం లో సాక్షాత్తు ఆ దేవుడే వేన వేల బాహువులతో.విశ్వరూపుడై దుష్ట శిక్షణకై కదిలి వచ్చినట్టు అనిపించింది.
కార్తికేయ చేతిలోని యాసిడ్ బాటిల్ యాసిక్ మొహమ్మీద పడింది.నిప్పుల వర్షం కురిసినట్టు పెద్ద గావుకేక...చావుకేక అతని గొంతులో నుంచి బయటకు వచ్చింది.
"ఇది ఇండియన్ పీనల్ కోడ్ లో లేని శిక్ష...ఎవిడెన్స్ ఆక్ట్...సాక్ష్యాలు...వాయిదాలు లేని శిక్ష.ఇది ఒక హెచ్చరిక."
యాసిక్ అరుస్తున్నాడు..మొదటి సారి అతనిలో ప్రాణభయం.కార్తికేయ ఆ అమ్మాయి వైపు తిరిగి "మిమ్మల్ని ఈ స్థితికి తెచ్చిన వాళ్ళ మీద మీకు కోపం లేదా ?అడిగాడు.
"వుంది...వాళ్ళ (ఎడిట్) ఏడుస్తూ చెప్పింది.
"నీ లాంటి వాళ్ళు ఇక్కడ ఎంత మంది వున్నారు?అడిగాడు కార్తికేయ.
"నలభై మందికి పైగా వున్నారు"చెప్పింది.
"బయట వంద యాసిడ్ బాటిల్స్ వున్నాయి...అవి తీసుకోండి.మిమల్ని ఈ స్థితికి తెచ్చిన వారి మీద యాసిడ్ గుమ్మరించేయండి."చెప్పాడు కార్తికేయ ,
బయట యాసిడ్ బాటిల్స్ తో సిద్ధం గా వున్నాడు శ్యాంసన్.
క్షణాల్లో ఆ ప్రాంతం నైసర్గిక స్వరూపం సమూలంగా మారిపోయింది.ఇన్నాళ్ళ వాళ్ళ కసి...కన్నీళ్లు...భయం...బాధ...
అన్నీ యాసిడ్ రూపంలో బయటకు వచ్చాయి.ఆ ఏరియా లో కాపు కాస్తో తమని చిత్రవధ చేసిన గూండాలను యాసిడ్ తో కడిగి పారేశారు.స్త్రీ శక్తి స్వరూపాన్ని చూపించారు.
ఆ ప్రాంతమంతా హాహాకారాలు.అప్పటి వరకు తమకు పట్టనట్టు..తమకు మామూళ్ళు ఇస్తే చాలు అన్నట్టు ఆ ఏరియా వైపు కన్నెత్తి చూడని పోలీసులు పరుగెత్తుకొచ్చారు.
టీవీ చానెల్స్ లైవ్ మొదలు పెట్టాయి.బలవంతం గా ఈ వృత్తిలోకి నెట్టబడ్డ మహిళలు కార్తికేయ పాదాల మీద పడిపోయారు.
"ఈ రోజు నుంచి మీరు స్వేచ్చాజీవులు మీ మీ ఇళ్ళకు వెళ్ళండి.ఒక వేళ మీకు అక్కడ నిరాదరణ ఎదురైతే మీకు అండగా, ఓ సోదరుడిగా నేను వున్నాను."
********* ******************* **************************
ఆ ఏరియా ఇన్ స్పెక్టర్ వచ్చాడు...వస్తూనే నానా హంగామా చేసాడు.గుండాలు ,రౌడీలు హాహాకారాలు చేస్తూనే వున్నారు.అంబులెన్స్ వచ్చింది."ఏం జరుగుతుందిక్కడ? లా అండ్ ఆర్డర్ ని చేతిలోకి తీసుకుంది ఎవరు? రెచ్చగొడుతూ యాసిడ్ దాడి చేయమన్నది ఎవరు?
తన దర్పాన్ని చూపిస్తూ అడిగాడు.
"నేనే "అంటూ ముందుకు వచ్చాడు తాపీగా కార్తికేయ.
జనాన్ని రెచ్చగొట్టి ఉద్రిక్త వాతావరణాన్ని సృస్తిస్తావా? కోపం గా అని కార్తికేయ చేయి పట్టుకుని "స్టేషన్"కు నడువ్ అన్నాడు. అప్పటి వరకు తమకీ దుస్థితి కలిగించిన గూండాల మీద యాసిడ్ దాడి చేసిన అమ్మాయిలు దండులా కదిలారు..కార్తికేయ ను అరెస్ట్ చేస్తే వూర్కోమన్నారు.కార్తికేయ వాళ్ళను సమాధానపరిచాడు..
"చట్టాన్ని తన పని తానూ చేసుకోనివ్వండి."అంటూ పోలీస్ జీపు వైపు నడిచాడు.యాసిక్ ,అతనితో పాటు ఆ ఏరియా లో వున్నా గూండాలను అంబులెన్స్ లో .హాస్పిటల్ కు తరలించారు.
ఆ ఏరియా ని ప్రభుత్వం తన స్వాదీనం లోకి తెచ్చుకుంది.అకడ మహిళా ఉపాధి కేంద్రం
ప్రారంభం కాబోతుంది.నరక కూపంలోకి నెట్టబడ్డ మహిళలకు ఉపాధి కలుగుతుంది.

********** ********************* **********************************
కార్తికేయ పోలీస్ స్టేషన్ కు వెళ్తోన్న దృశ్యం చూసి షాక్ అయింది ముగ్ధ.తను చూస్తున్నది నిజమేనా?కార్తికేయను పోలీసులు పట్టుకు వెళ్ళడం ఏమిటి?
ఆమె మనసులో ఆందోళన..ఇప్పుడు తనేం చేయాలి.పోలీసులు కార్తికేయను కొడతారా?
ఆమె చిన్ని ప్రపంచం లో చూసిన సినిమాలు...పేపర్ లలో వచ్చే వార్తలు...భయాందోళనకు గురి చేసాయి.
"అయ్యో దేవుడా ...కార్తికేయ లాంటి మంచి మనిషికి ఇన్ని కస్టాలు పెడతావా? తనకి ఏమీ కాకుండా చూడు స్వామీ "మనసులోనే దేవుడికి మొక్కుకుంది.
అమాయకత్వం , మనుష్యులను ప్రేమించడం,స్వచ్చంగా బ్రతకడమే తెలిసిన అమ్మాయి.
తనను ఎలాగైనా కాపాడుకోవాలి.తన స్నేహితురాలికి చెబితే..ఊహూ ...కార్తికేయ పోలీస్ స్టేషన్ లో ఉన్నదంటే తన గురించి మరోలా అనుకోవచ్చు.
తనే వెళ్తే సరి.పోలీసులకు డబ్బులిస్తే వదిలేస్తారని ఆమెకు పత్రికలు చదివిన జ్ఞానం.తన పర్స్ లో వున్నా డబ్బులు తీసుకుంది.
ఇవి కూడా సరిపోకపోతే? వెంటనే చెవులకు నాన్న ప్రేమగా చేయించిన జూకాలు తీసేసింది.
అదీ సరిపోకపోతే మెడలో సన్నటి చెయిన్ వుంది .అన్నే ఇచ్చికార్తికేయను కాపాడుకోవాలి.
పోలీస్ స్టేషన్ కు బయల్దేరింది.
************************ ************************* **********************
సరిగా గంట తర్వాత ముగ్ధ పోలీస్ స్టేషన్ లో వుంది.అడ్రెస్ కనుక్కుని వచ్చేసరికి ఆ టైం అయింది.
"ఏం కావాలి ?తన ఎదురుగా వున్నా ముగ్ధను అడిగాడు ఇన్స్పెక్టర్ .
"మీరు ఇందాక అరెస్ట్ చేసారే......వారిని విడిచిపెట్టాలి "
"ఎవరు?ఇన్స్పెక్టర్ అడిగాడు.ఇంట రాత్రి వేళ ఓ అమ్మాయి వచ్చి ఇలా అడిగేసరికి ..?
"కా...కార్తికేయ..చాలా మంచివారు ...ప్లీజ్ అతన్ని వదిలేయండి."రెండు చేతులు జోడించింది.
కార్తికేయ అన్న పేరు వినగానే ఇన్ స్పెక్టర్ లోపలి పరుగెత్తాడు.రెండు నిమిషాల తర్వాత వచ్చాడు.
"ప్లీజ్ ఇన్ స్పెక్టర్ గారు..వారిని వదిలేయండి "బ్రతిమిలాడుతూనే వుంది.ఇదిగోండి డబ్బు..నా చెవి జూకాలు,చెయిన్ ...అంటూ అతని ముందు పెట్టింది.అప్పుడే ఆమె వెనుక అలికిడి.
తలతిప్పి చూసింది.అలిసిపోయిన మొహం తో కార్తికేయ .పరుగెత్తుకు వెళ్ళింది.అతడ్ని గట్టిగా పట్టుకుంది.
మీకు మీకేమీ కాలేదుగా..ఇన్ స్పెక్టర్ గారికి చెప్పాను...డబ్బు,నా చెవి జూకాలు.మెడలో చెయిన్ కూడా ఇచ్చేశాను..నాకు నాకెంత భయమేసిందో తెలుసా...వీళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేదు కదా.."చెబుతూ,ఏడుస్తూ,సంతోషం,బాధ, దుఖం..
కార్తికేయ కు మాటలు రావడం లేదు.వారథి కడుతుంటే ఉడత సాయం గుర్తొచ్చింది.తన కోసం తెలియని ఢిల్లీ లో పడ్డ పాట్లు.
ఇంకా తనెంత తపించిపోయిందో చెబుతూనే వుంది.తన ఒంటిని తడిమింది.పోలీసులు చేయిచేసుకున్నారేమో..నని.
ఇన్ స్పెక్టర్ కళ్ళూ చెమర్చాయి. టేబుల్ మీద ముగ్ధ పెట్టిన డబ్బు,జూకాలు,చెయిన్ తీసుకువచ్చి ముగ్ధ చేతిలో పెట్టాడు.స్టిఫ్ గా నిలబడి కార్తికేయ కు సెల్యూట్ చేసాడు.
"అయాం సారీ సర్ "అన్నాడు.
కార్తికేయ ముగ్ధ చేయి పట్టుకుని బయటకు నడిచాడు.
**************** *********************** ***************************
ఇంటికి వచ్చారు.ఇంకా ట్రాన్స్ లోనే వుంది ముగ్ధ.తను భయపడింది.కానీ పోలీస్ స్టేషన్ లో కార్తికేయ కు సెల్యూట్...ఆ విశ్వరూపాన్ని చిట్టెలుక లా తను కాపాడాలని వెళ్ళిందా?
"సారీ పిచ్చిదాన్ని ..మిమల్ని తక్కువగా అనుకును..అపోహపడి.భయపడి...పిచ్చిదానిలా .."ఆమె మాటలు పూర్తీ కాకుండానే..ఆమెను మంచం మీద కూచోబెట్టాడు.తను నేల నీడ కూచొని ఆమె ఒడిలో తలపెట్టాడు ...
అతనికిప్పుడు ఏడ్వాలనిపిస్తుంది. ఓ చిన్ని ప్రాణం విల విల్లాడి పోవడం చూసాడు.అదీ తన లాంటి ఓ అనాథ కోసం.రెండు చేతులతో ఆమె నడుం ని చుట్టేసాడు.
ముగ్ధ చేతులు కార్తికేయ తల మీద వున్నాయి.

No comments: