ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday 12 March 2013

మేన్ రోబో లో తొలి డైలీ సీరియల్
" ముగ్ధమోహనం " (16th chapter )
(10-02-2013)
ఎన్నో యుగాల అలసట...ఒక్క క్షణం లో,ముగ్ధ సమక్షం లో సేదతేరి,ఓదార్పు పొందినట్టుగా వుంది.
కళ్ళు తెరిస్తే ఇది కలలా మిగిలిపోతుందేమో అన్నంత భయం...
అతని చేతి వ్రేళ్ళకు ముగ్ధ నడుమును చుట్టేసిన స్పర్శ తెలుస్తోంది.మరింత గట్టిగా ఆ చేతులు ముగ్ధ నడుమును చుట్టేసాయి.
ఆ స్పర్శను మిస్ అయితే తన జీవిత కాల నిరీక్షణ వృథా అవుతుంది.ఇది వరకు ఎన్నడూ లేని స్వాంతన.ఒక స్పర్శ లో ఇంత గొప్పతనం ఉంటుందా?
ఒక స్పర్శలో ఇంత గొప్ప భద్రతా భావం ఉంటుందా?
"ముగ్ధా..."తొలి సారి ఏకవచన ప్రయోగం.
"చెప్పండి "ముగ్ధ అతని జుట్టులోకి చేతులు పోనిచ్చి అంది.
"ఇది కలా?నిజమా?భ్రాంతా? ఏమీ తెలియడం లేదు.మొదటి సారి నన్ను నేను ఆవిష్కరించుకుంటున్నాను .
నాకు ఊహ తెలిసాక ఈ ఢిల్లీ వీధుల్లో తిరిగాను.నేనెవరో నాకే తెలియదు.వీధి బాలలతో నా బాల్యం గడిచింది.
ఈ ఢిల్లీ నగరం ఎన్నో అనుభవాలు నేర్పింది.ప్రతీ అనుభవం ఒక జీవిత సత్యాన్ని నేర్పింది.పేపర్లు వేసాను...
రైల్వే స్టేషన్ లో నా మకాం.పనికి రాని బోగీ నా ఇల్లు...హోటల్ లో కప్పులు కడగడానికి కూడా సిగ్గు పడలేదు.
నా ధ్యేయం ఒక్కటే...అందరికీ ఉపయోగపడేలా బ్రతకాలని....కానీ ...కానీ ముగ్ధా..."
అతని గొంతు పూడుకు పోతుంది.మనసు లోని మాట గాద్గాదికం అవుతుంది.
"నాకంటూ ఒక ఓదార్పు...నాకంటూ ఓ మనిషి...నగరం నిద్ర పోయే వేళ నేనింకా మెలుకువ గానే వుంటాను.
ఎక్కడో ...ఎప్పుడో .ఎవరో...నా కోసం వస్తారని...మేఘాల్లో తేలి, వర్షం తో పాటు కిందికి దిగి వస్తారు...నన్ను వెతుక్కుంటూ ,నా కోసం వస్తారు '
ఇది నా వూహ ..నేను ఇంట్రావర్ట్ నా ?ఏమో నాకే తెలియదు.నాకు తెలిసిన ప్రపంచం ఈ ఇల్లు ... నా వుద్యోగం...ఈ అక్షరాలూ...
"ఇప్పుడు ఈ ప్రపంచం లోకి ,నా ప్రపంచం లోకి నువ్వే నా ప్రపంచమై...
జయ దేవుని అష్ట పదులో, సప్త పదిని నా ఇష్ట పది గా మార్చి ,నా మనసు గదికి సప్త వర్ణాలతో రంగులు వేసి,
ఇంద్ర ధనుసును,నేను విశ్రమించే పడక గా మార్చి,నా సాన్నిహిత్యాన్ని ఆకాశపు కప్పుగా చేసి,
హిమం సైతం అందించలేని చల్లదనాన్ని నీ మనసు,వెచ్చదనాన్ని నీ స్పర్శ అందిస్తుంటే...."
ఆగి తలెత్తి ముగ్ధ వైపు చూసాడు.
అతని ప్రమేయం లేకుండానే,అతని అనుమతి లేకుండానే రెండు కన్నీటి చుక్కలు .కనుకొలకుల సరిహద్దులు దాటి,బుగ్గల నుంచి జారి ఆత్మార్పణకు సిద్ధమయ్యాయి.
చప్పున తన తలను కిందికి వంచి ఆత్మార్పణకు సిద్ధపడ్డ ఆ కన్నీటి చుక్కలను బందించడానికి పెదవులను ఆశ్రయించింది.
పరమ శివుడు గరళాన్ని గొంతులో బందిస్తే...ముగ్ధ తన కార్తికేయుడి కన్నీళ్లను నేల పాలు కానివ్వకుండా,
వాటి ఆయుష్షు తీరిపోకుండా తన పెదవులతో అడ్డుకట్ట వేసింది.
అతని తల ముగ్ధ మొహం అనబడే ఆకాశాన్ని చూస్తోంది.
"ఆ దేవుడే...ఈ దేవుడే నా ముందు నిలిచి,తన భావాలను మంత్రాక్షరాలు గా వినిపిస్తూ వుంటే ...
ఈ దేవుడు నా దేవుడే అన్న అద్భతమైన భావం..వాస్తవం నా మనసు ను ఆక్రమించుకుంది.
నన్ను ధన్యురాలిని చేసింది.ప్రభూ ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోను ?"
ముగ్ధ మాటలు పెదవులు దాటలేదు...కానీ అవి అశ్వవేగాన్ని మించి ,మనో వేగాన్ని అధిగమించి కార్తికేయ హృదయాన్ని చేరి ఆమె సందేశాన్ని విన్నవించింది
ముగ్ధ లేచి అతని పక్కనే కూచుంది. అతన్ని చుట్టేసింది.అక్కడ రెండు మనసులు ముచ్చట్లాడుకుంటున్నాయి'
***********************************************************************************************************************************************************************
(ముగ్ధ,కార్తికేయ మధ్యన బలపడే సాన్నిహిత్యం,చిగురించే ప్రేమ మమేకమయ్యే దగ్గరితనం..రాయడానికి నాలుగు గంటల సమయం తీసుకున్నాను.
ప్రేమ ను సృష్టించలేము...ఎందుకంటే ప్రేమే ఓ సృష్టి.ఆ సృష్టి ఇదరు వ్యక్తులను దగ్గరికి చేసి...
తను (ప్రేమ )వారి చుట్టూ పూల తీగలా అల్లుకుంటుంది..నా ప్రమేయం లేకుండానే నేను ముగ్ధ ప్రేమలో పడిపోయాను.నేనే కార్తికేయను అయిపోయాను.
ఇది ఓ అందమైన అమ్మాయి నా దృష్టికి తెచ్చాక కలిగిన అందమైన ఫీలింగ్
ముగ్ధ పాత్ర చాలా మందిని హంట్ చేస్తుంది.ఐడెంటి ఫై .చేసుకునేలా చేస్తుంది.
కార్తికేయ పాత్ర "ఐడియల్ హీ " గా నిలిచింది.రచయిత ఓ సంఘటన సృష్టించడాని,ఆ సంఘటనకు అర్థవంతమైన నేపథ్యం సమకూర్చడానికి పడే పెయిన్ ,
చాప్టర్ పూర్తయ్యేక పూర్తయ్యేక మర్చిపోతాం.అలాంటి అందమైన బాధ ఈ చాప్టర్ లో ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని అక్షరాలతో పెనవేసినప్పుడు కలిగింది
-సమయం తెల్లవారు ఝాము ..అయిదు గంటలు...మరో గంటలో ఎయిర్ పోర్ట్ లో వుండాలి.ముంబై ప్రయాణం.చాప్టర్ రాయడం పూర్తయింది.నా అక్షరాలూ నాకు గుడ్ మార్నింగ్ చెప్పాయి.అవి మిమ్మల్ని పలకరించడాని సిద్ధమవుతున్నాయి .--రచయిత )
*********************************************************************************************************************************************************************

ఏషియన్ లాడ్జ్ ....
చాలా పురాతనమైన లాడ్జ్ ...ఢిల్లీ నగరం లో అతి చవకైన లాడ్జ్ అదే...చిన్న చిన్న గదులు....అటాచ్డ్ బాత్రూమ్స్...ఫ్యాన్ తిరిగిన చప్పుడు స్టీరియో ఫోనిక్ లో వుంటుంది.
ఇనుప మంచాలు శబ్దం చేస్తాయి...దోమలు...ప్లాస్టిక్ మగ్గులో నీళ్ళు...పోర్టబుల్ టీవీ...శిథిలావస్థలో వున్నా రిమోట్...
మోహన చికాగ్గా వుంది. ముప్పయేళ్ళ పురుషుడి గెటప్ లో వుంది. హాలీవుడ్ లో ఓ మేకప్ మాన్ దగ్గర పనిచేసింది..కేవలం మేకప్ మెలుకువలు తెలుసుకోవడాని..హెయిర్ స్టైల్ నుంచి నడక,ఆహార్యం,మాట తీరు వరకు...మిమిక్రి నేర్చుకుంది.
ఏదైనా వర్క్ చేసేప్పుడు మోహన లో వున్న (క్రిమినల్ మైండ్) డెడికేషన్ .ఎక్కడా నిర్లక్ష్యం వుండదు.
టీవీ ఆన్ చేసింది.పార్లమెంట్ మీద దాడి చేసిన అఫ్జల్ గురు ని వురి తీసిన వార్తా వస్తోంది.
ఈ సందర్భం గా చాలా చోట్ల రెడ్ ఎలర్ట్ ప్రకటించారు.టీవీ కట్టేసింది. లేచి బాత్ రూం వైపు నడిచింది.
*****************************************************************************************************
డేవిడ్ కు డ్యూటీ అయిపొయింది.అయినా ఇంకా లాడ్జ్ లోనే వున్నాడు.అతనో గే ....అతనికి రిచర్డ్ ని చూసినప్పటి నుంచి ఒక లాంటి ఫీలింగ్ కలుగుతుంది.అందుకే శబ్దం చేయకుండా రిచర్డ్ రూం లోకి అడుగుపెట్టాడు.అతని దగ్గర డూప్లికేట్ కీ వుంది.బాత్ రూం లో స్నానం చేస్తున్నట్ట శబ్దం .
బాత్ రూం లో వుంది రిచర్డ్ వేషం లో వున్న మోహన.
(ఆ తర్వాత ? రేపటి సంచికలో ..)

No comments: