ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 12 March 2013

" ముగ్ధమోహనం " (20th chapter )
(14-02-2013)
మనసు...తనువూ అనే రెండు పట్టాలపై జ్ఞాపకమనే రైలు వెళ్తోంది.నిన్నటి అనుభూతుల స్టేషన్లూ దాటుతుంది.
కార్తికేయ అనే నాలుగు అక్షరాలు,నాలుగు దిక్కులా విస్తరించి...తనను చుట్టుముట్టేస్తుంది.
నా మనసును ఆహ్లాదపరిచే జ్ఞాపకమా...నీకు వందనం..కదులుతోన్న రైలు లో తన మనసులో కదలాడుతోన్న కార్తికేయను గుర్తుచేసుకుంటోంది.
ఈ క్షణం కార్తికేయ కనిపిస్తే....తన మనసును వినిపిస్తే ?
"కదిలివెళ్ళేపోయే చెట్లుచేమలు ..కార్తికేయ కానరాడు
కనుమరుగయ్యే కాంతిదీపాలు... కార్తికేయ అందిరాడు
ఎదకనుమలలో వేదనాఝరులు..కార్తికేయ అందనినాడు
కనుకొలనులలో నీటి వీచికలు...కార్తికేయని తలవంగా
మధనపడే మనసు మూగ రోదనలు..కార్తికేయని విడిచి రాగా
హృదిన వలపు పల్లవించిన వైనాలు..కార్తికేయ స్మృతి రాగా>>>"
ముగ్ధకు ఒక్క క్షణం ఏడవాలనిపించింది...కార్తికేయ గుండెల మీద తలపెట్టి....ఇప్పుడేం చేస్తున్నాడో?
అలా ఆలోచిస్తూ వుంటే అంజలి గుర్తొచ్చింది.అమాయకత్వం,ఆత్మవిశ్వాసం నిండిన చిన్నారి.ఇప్పుడేం చేస్తుందో?
*********************** ***************** *******************
యాసిక్ ని చూసి భయం తో వణికి పోయింది.సిగ్గుతో చితికిపోయింది.దగ్గరగా ముడుచుకుంది.
యాసిక్ లోని పైశాచికత్వం వికృతమైంది.ఓ సారి అంజలి చుటూ తిరిగి..
"ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ అంజలి వేర్ ?అంటూ సెల్ ఫోన్ లోని కెమెరా ఆన్ చేసాడు.
అంజలి తలను మోకాళ్ళ మధ్య పెట్టుకుంది.చచ్చిపోతే బావుందనిపిస్తోంది.
"వాహ్ ... మీ అమ్మ కన్నా బావున్నావ్....స్మైల్..."అంటూ కెమెరా ని అంజలి మొహం దగ్గరికి తెచాడు.
మనిషి లోని విచక్షణ లేని పశువు లా ప్రవర్తిస్తున్నాడు యాసిక్....
బస్సు లో ప్రవర్తించిన పైశాచిక ఉన్మాదానికి దీనికి పెద్ద తేడా లేదు.
"నిన్నేమీ చేయను ...జస్ట్ ఇప్పుడే వికసించిన నీ అందాన్ని నెట్ లో పెడతా....
రకరకాల యాంగిల్స్ లో నీ ఫీలింగ్స్ క్లిక్ చేస్తాను....అంతే సింపుల్ "అంటూ కెమెరా తో షూట్ చేస్తునాడు.
ఒకటి..రెండు..మూడు...పది నిమిషాల వికృత క్రీడ.ఆ తర్వాత తాపీగా వెళ్తూ
"ఇలాంటి క్లిప్పింగ్స్ కి బోల్డు డిమాండ్...నిన్ను యాసిడ్ తో చంపి ఆ కార్తికేయకు బుద్ధి చెప్పాలనుకున్నాను.
ఇప్పుడు ఈ క్లిప్పింగ్స్,ఫొటోస్ తో బుద్ధి చెబుతా...బై "అంటూ వెళ్ళిపోయాడు యాసిక్.
******************* **************** ************************
లేవలేని నిస్సహాయత...కడుపులో నొప్పి,రక్తసిక్తమైన స్త్రీత్వపు బేలతనం.చిన్నారి విలాపం.
దేవుడా...తెలియక నిన్ను తిట్టాను..అందుకే నాకీ శిక్ష వేసావా?అమ్మానాన్న లేని నన్ను ఇలా బాధ పెడతావా ?
నన్ను కాపాడడానికి ఏ దేవుడూ రాడా?
******************** *************************** ***********************
కార్తికేయ కారు అంజలి ఇంటిని సమీపించింది. కారు దిగుతూనే లోపలికి పరుగెత్తాడు.
లోపలి దృశ్యం చూసి షాక్ అయ్యాడు.ఆ గది మరుభూమిలా ,చితి పై పేర్చబడ్డ ప్రాణమున్న బొమ్మలా ...అం....జ...లి .
విషాదానికి తానే అర్ధమై,దుఖం తో చెలిమి చేస్తూ, భయం తో బాధించబడుతూ బేలగా...
కార్తికేయను చూడగానే ప్రాణం లేచివచ్చింది.ధైర్యం అమ్మయింది.లేవబోయింది...శరీరం సహకరించడం లేదు.
క్షణాల్లో కార్తికేయకు పరిస్థితి అర్ధమైంది.మనసు ఆర్ద్రమైంది.చిన్నారి అనుభవించిన క్షోభ కళ్ళ ముందు నిలిచింది.
పరుగెత్తుకు వెళ్ళాడు..అంజలిని గుండెలకు హత్తుకున్నాడు.కార్తికేయను గట్టిగా పట్టుకుంది..వెక్కుతోంది.
కార్తికేయలో అమ్మ లాలన కనిపిస్తోంది..నాన్న ప్రేమ కనిపిస్తుంది.అన్నింటికన్నా ఆ దేవుడే కనిపిస్తున్నాడు.
"ఏడవకు చిట్టి తల్లీ ...
నేనే నీకు అమ్మని,నాన్ననై., సోదరి నై ...నీ కంటి పాపనై నిన్ను నా బిడ్డలా చూసుకుంటాను."
ఆమెను ఓదారుస్తున్న కార్తికేయకు అంజలి పరిస్థితి చూస్తోంటే గుండె తరుక్కుపోతుంది.
అంజలి ఏడుస్తూనే యాసిక్ వచ్చివేల్లిన విషయం...అతను బెదిరించిన సంగతీ చెప్పింది.
ఆ క్షణం కార్తికేయకు విధాత పై కోపం వచ్చింది.
"విధాతా ఏమిటీ తలరాత...ప్రకృతి ధర్మాన్ని,వికసించే పుష్పాన్ని ఇలా రక్తసిక్తం చేస్తావా?
ఇంతటి వేదన కలిగిస్తావా?తల్లీ సరస్వతీ నువ్వు స్త్రీ మూర్తివే కదమ్మా?నీకీ చిట్టి తల్లి రోదన వినిపించలేదా ?
ఏమయ్యా బ్రహ్మయ్య ...నువ్వు స్త్రీ గా జన్మించు...అప్పుడు నీకు ఈ వేదనకు అర్ధం తెలుస్తుంది. "
కార్తికేయ ముగ్ధ స్నేహితురాలు హేమంతకు ఫోన్ చేసాడు.పరిస్థితి క్లుప్తంగా వివరించాడు.
ఇరవై నిమిషాల్లో హేమంత వచ్చింది.వస్తూ అంజలి కోసం దుస్తులు తెచ్చింది.
థాంక్ యూ హేమంతా...మీరు నా బిడ్డను చూస్తూ వుండండి.అంటూ జేబులో నుంచి డబ్బు తీసి ఇచ్చి చెప్పాడు.
"నా చిట్టి తల్లికి అమ్మ,నాన్న లేని లోటు తెలియకూడదు.జాగ్రత్తగా చూస్తూ వుండండి "
"మీరు ...మీరెక్కడికి వెళ్తునారు "కార్తికేయ ఆవేశాన్ని చూసి అడిగింది హేమంత.
"శత్రు సంహారానికి..."ఎర్రబడ్డ కళ్ళతో...త్రినేత్రాన్ని తెరిచిన ముక్కంటి అయి...
చేత సుదర్శన చక్రం ధరించిన జగన్నాథుడై కదిలాడు.
మరో కాసేపట్లో రుద్రభూమిలో మారణ హోమం మొదలవుతుంది.
***************** ***************** **************************
(ఢిల్లీ ని వణికించిన సంఘటన రేపటి సంచికలో )

No comments: