ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday 12 March 2013

" ముగ్ధమోహనం " (21st chapter )
(15-02-2013)
(చిట్టి తల్లులకు...
నిన్నటి అధ్యాయం వెనుక వున్న నా అక్షర వ్యథను మీతో పంచుకోవాలనే ఈ విన్నపం.
చిట్టి తల్లి అంజలి అనుభవించిన క్షోభ నా హృదయాన్ని మెలిపెట్టింది.
ప్రతీ పది నిమిషాలకో అత్యాచారం...ప్రతీ అరగంటకో మానభంగ పర్వం....గంటకో నేరం...
రోజులో లెక్కలేనన్ని దుస్సంఘటనల వ్యథాభరిత భారత భారతావని లో...
భారమైన హృదయ వేదన స్మృతి శకలాలు...మృతి వార్తాకథనాలు.
ఎటు పోతుందీ దేశం ?ఏమై పోతుందీ నా దేశం?అన్న ఆలోచనలో...ఈ వికృత క్రీడా నేపథ్యం మీ ముందుంచాలనే తాపత్రయం....
స్వతహాగా నాది సున్నిత మనస్తత్వం...రచయితగా పాత్రల దాష్టీకం ఎండగట్టే నేపథ్యం లో "నేను నేను కాదు."..ఆ పాత్రే పరకాయ ప్రవేశం చేస్తుంది.
మహా నటుడు శ్రీ కృష్ణుడి పాత్ర వేస్తే "ఆ లాలిత్యం..ముగ్ధత్వం...అదే నటుడు రావణ పాత్ర పోషిస్తే ఆ గాంభీర్యం ,ప్రతినాయక లక్షణాలు వేరే....
చిన్నారుల పై పాశవిక దాడులు..అత్యాచార వార్తలు చదివినా,విన్నా రక్తం లావా లా మారుతుంది.
ఈ సమాజం లో యాసిక్ లాంటి వాళ్ళు ఎందరో...అందరికి రేపటి ఈ అధ్యాయం ఒక భయంకరమైన హెచ్చరిక కావాలి.
కురుక్షేత్రం లో ఒకానొక సమయం లో శ్రీకృష్ణుడు చక్రం చేతపట్టాడు.
ఈ అభినవ వికృత నేర రణ రక్తసిక్త క్షేత్రం లో నేను కలమనే ఆయుధాన్ని ఎక్కుపెడుతున్నాను.
చిట్టితల్లి అంజలి ఆవేదనను ఆయుధంగా మార్చి ఎక్కుపెడుతున్నాను.
అమ్మా చిట్టితల్లీ నా కలం చేసిన సాహసాన్ని మన్నించి...నా గళాన్ని నీ మాటగా వినిపించు.
నిన్నటి నీ ఆవేదన ఈ ప్రపంచానికి చాటి చెప్పింది...ఈ వ్యవస్థలోని అవ్యవస్థను
అందరికీ తెలియ చెప్పాలనే ---రచయిత )
********************* ************************ ************************
హేమంత క్షణాల్లో రంగం లోకి దిగింది.కార్తికేయ బయట కూచున్నాడు.అరగంటలో కడిగిన ముత్యం లా తయారుచేసింది అంజలిని.
ఇల్లంతా నీట్ గా సర్దింది.కార్తికేయ లోపలి వచ్చాడు.అంజలి వచ్చి కార్తికేయ కాళ్ళకు నమస్కరించబోయింది.
చప్పున కిందికి వంగి అంజలిని లేపి దగ్గరికి తీసుకున్నాడు.
ఒక్క క్షణం తన మనసుకెవరో చేతబడి చేసినట్టు విల విల్లాడి పోయాడు.
తల్లి చెప్పాల్సిన మాటలు...దగ్గరుండి తల్లి చూడవలిసిన పనులు.
స్త్రీ ఔన్నత్యం ఇంత గొప్పగా ఉంటుందా?
ఒక చిట్టితల్లి అంజలి...ఒక నేస్తం హేమంత...ఒక తన ప్రాణం ముగ్ధ.
ఆ సృష్టికర్త స్త్రీని సృష్టించకపోతే ఈ సృష్టికి అర్ధం ఏముంది?
హేమంత వైపు తిరిగి రెండు చేతులు జోడించాడు.
అమ్మలా అంజలిన ఆదుకున్నారు..ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోను.?
హేమంత కార్తికేయ వైపు చూసి...
."ఈ ప్రపంచం లోని మగవాళ్ళంతా ఒకేలా వుంటారనే భ్రమలో వున్నాను.కానీ మిమ్మల్ని చూసేక...
మగవాళ్ళు అంటే గౌరవం పెరిగింది.స్త్రీని సెక్స్ సింబల్ గా చూసే మగవాళ్ళు తెలుసు...
స్త్రీని ప్రకృతి గా ,చూసే మిమ్మల్ని చూస్తె గర్వంగా వుంది.
ఒక చిన్నారి తపన చూసి తండ్రిలా తపించిన మీ లాంటి వారిని చూసి,
కాముకతతో కన్న కూతురిపై అత్యాచార ప్రయత్నం చేసే కామందులు సిగ్గుతో చచ్చిపోవాలి.
కృష్ణుడు కూడా నిండు కోలువులో "అన్నా నన్ను కాపాడు "అంటేనే వచ్చి కాపాడాడు..
కానీ ఈ కార్తికేయుడు అడగక ముందే ప్రాణాన్ని పణం గా పెట్టాడు.
మళ్ళీ జన్మ వుంటే నాకు అన్నయ్యగా పుట్టు...
ముగ్ధ మీమీద ఎందుకు ఇంత ప్రేమ పెంచుకుందో ఇప్పుడు అర్ధమైంది "మనస్ఫూర్తి గా అంది .
************************* ****************** *****************
టాప్ సీక్రెట్ నెట్ సర్వీసెస్
పాత ఢిల్లీ లో ఓ మారుమూల వున్న నెట్ సెంటర్ అది. పోర్నో సైట్స్ చూడాలనుకున్న వాళ్ళు...
సంతకాలను పోర్జరీ చేసే వాళ్ళు ,దొంగనోట్లు స్కాన్ చేసుకునే వాళ్ళ అడ్డా అది.
అందులోకి ప్రవేశించాడు యాసిక్. అతని చేతిలో సెల్ ఫోన్ వుంది.కార్తికేయను దెబ్బతీసే పథకం అతని మెదడు లో రూపుదిద్దుకుంది.
చాలా వికృతమైన ఆలోచన అది.
ఆ నెట్ ముందు కారు ఆపాడు కార్తికేయ.వాతావరం లో మార్పు చోటుచేసుకుంది.ఆకాశం మేఘావృతమైంది.ఢిల్లీ నగరం లో చాలా కాలం తర్వాత అంధకారం నెలకొంది.
ఓ పక్కన కొబ్బరి బొండాలు అమ్మే బండీ వుంది.కొబ్బరి బొండాలు నరికే కత్తి చేతిలోకి తీసుకున్నాడు.నెట్ లోకి అడుగు పెట్టాడు.
ఆకాశం ఉరిమింది.ఎక్కడో పిడుగు పడింది.ఓ మెరుపు..
ఆ మెరుపు లో ఎరుపు వర్ణం దాల్చిన రుద్రమూర్తిలా...అపర నరసింహావతారం లా...
ఆగ్రహోదగ్ర ఉగ్రమూర్తి.కాలయముడిలా నెట్ లోకి అడుగు పెట్టిన కార్తికేయను నిలువరించే సాహసం ఎవరూ చేయలేదు.
"నేను మూడవ అంకె లేక్కపెట్టేలోగా ఒక్కరు కూడా వుండకూడదు...వుంటే ఎవరూ ప్రాణాలతో మిగలరు."అనౌన్సు చేసాడు కార్తికేయ.
అది హెచ్చరిక కాదు...ఆజ్ఞ..
గ్రైనేడ్ పిన్ లాగాడు.అప్పటికే నెట్ లో వున్న జనం పరుగులు తీసారు.కొద్ది క్షణాల వ్యవధి.అంటే ...
పెద్ద విస్పోటనం.అంధకారమైన ఢిల్లీ నగరం పెద్ద వెలుగును చూసింది..పిడుగు లాంటి శబ్దాన్ని వింది.
ఆకాశం వర్షించి హర్షించినట్టు కుండపోత...అప్పుడే ఆ నెట్ లో నుంచి పరుగు తీస్తోన్న యాసిక్ కార్తికేయ కంట పడ్డాడు.
పెద్ద పెద్ద అంగలు వేస్తూ యాసిక్ ను వెంబడించాడు. ప్రాణభయం ఎలా వుంటుందో అనుభవం లోకి వచ్చింది యాసిక్ కి.
అప్పటికే ఆలస్యమైంది.
నరమాంస భక్షకుడిని వేటాడే పులిలా....సింహంలా ...కదిలాడు.ఆకాశమే భయం తో
వణికింది...
వేన వేల స్త్రీలా వేదనలకు,బలైన వాళ్ళ జీవితాలకు అంకితం గా యాసిక్ బలిని సమర్పించబోతున్నాడు.
నేర వ్యవస్థలోని ఒక రాచ పుండుకు తన కత్తితో శస్త్ర చికిత్స చేయబోతున్నాడు.
యాసిక్ ప్రాణభయం తో పరుగెడుతూనే మోహనకు ఫోన్ చేసాడు. ఆయాసం తో రొప్పుతున్నాడు.భయం తో వణికి పోతున్నాడు.
మరణశిక్షకైనా క్షమా బిక్ష వుంటుంది...కార్తికేయ శిక్షకు అపీల్ లేదని అర్ధమైంది.
నాలుగు రోడ్ల కూడలిలోకి వచ్చాడు.
నడి రోడ్డుపై వర్షం లో తడిసిపోతూ యాసిక్ ...అతని ఎదురుగా పొడవాటి కత్తితో కార్తికేయ...
అప్పుడే వ్యాన్ లో వచ్చింది మోహన ...ఆమె చేతిలో రివాల్వర్.
ఆ క్షణం ఏం జరుగబోతుంది ?
(రేపటి సంచికలో )

No comments: