ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 12 March 2013

"ముగ్ధమోహనం" (23rd chapter)
(17-02-2013)
.....................
ఆ వూరు పచ్చదనంతో పెయింట్ చేసినట్టు వుంది. ఏసీల పొగరు ఆ వూరిలో పనిచేయదు....
చెట్లు చల్లదనాన్ని దాంతో పాటు చల్లగాలిని వూరి వారందరికీ సమంగా పంచుతుంది. కోవెల ఎదురుగా వున్నా కోనేరు లో కోవెల ప్రతిబింబం కనిపిస్తుంది. స్వచ్చమైన మనుష్యుల అచ్చమైన పదహారు అణాల పల్లెతనం ధనం అక్కడ సుసంపన్నమై వర్ధిల్లుతుంది.
******************** ******************** ***********************
చీర కొంగు బొడ్లో దోపి అటూ ఇటూ చూసి జామచెట్టు ఎక్కింది ముగ్ధ.
చిటారు కొమ్మన మిటాయి పోట్లంలా ఊరిస్తున్న ఒక దోర జామకాయ ముగ్ధను టెంప్ట్ చేస్తోంది. చేతికి అందడం లేదు....
పాదం మీద నిలబడింది. ఆమె తెల్లటి పాదాలు చూసి ఆ జామకొమ్మ కాసింత ఉద్వేగానికి గురైంది.
ఆమె నడుం మీద వున్న మడతని చూసి ఆ దోరజామ మోము కంది ఎర్రజామగా మారింది.
"దేవుడా దేవుడా దేవుడా" కళ్ళు మూసుకుని ఆ జామను అందుకునే ప్రయత్నం చేస్తోంది.
"అక్కా ఏం చేస్తున్నావ్? ఎక్కడున్నావ్?" తమ్ముడు చంద్రు అక్కని వెతుక్కుంటూ వచ్చాడు.
ఓ సారి కిందికి చూసింది. తమ్ముడు కనిపించాడు. ఇప్పుడు వాడు తనని చూస్తే
"ఏయ్ కోతీ ఏం చేస్తున్నావని ఆట పట్టిస్తాడు. అందుకే కామ్ గా వుంది. దృష్టిని జామకాయ మీద లగ్నం చేసింది.
ముగ్ధ ప్రయత్నాన్ని చూసి ఆ చిటారు కొమ్మకు జాలేసి, గాలి సాయం తీసుకుని కాస్త కిందికి వచ్చింది. ముగ్ధ చేతికి చిక్కింది.
ముగ్ధ చేతిలో దోరజామ. అదీ చిలుక కొరికిన జామ.
ఆ కొమ్మ చివర సన్నాయి నొక్కులు నొక్కుతూ బడాయి పోతూ ఓ చిలుక కులుకులు పోతోంది.
"ఏయ్ మాయదారి చిలుకా....దీన్ని కొరికావా? ఇప్పుడు నీ ఎంగిలి నా కార్తికేయకు ఎలా పంపేది...
ముద్దుగా ఆ చిలుకను చిరాకుపడుతు దులిపేసింది. కోపంతో చిలుకా ముక్కు ఎర్రబడింది. ఉక్రోషంతో చిలుక ముద్దు పలుకులు పలికింది.
"ఇంకోసారి నీ పెరట్లో జామ చెట్టు మీద వాలి, నీ జామకాయలు ముట్టుకుంటే ఒట్టు....
ఏదో నేను కొరికి చూస్తే తియ్యగా వుంటాయి కదానని...చిలుకు గొణుక్కుంటూ వెళ్ళింది".
ఎగిరిపోతోన్న చిలుక వంక చూసి గట్టిగా అరిచింది
"ఏయ్ చిలుకా, ఏమి నీ అలుకా...మనం చిన్నప్పటి నుంచి నేస్తాలంగా...నేనైతే నీ ఎంగిలి తింటాను..మరి నా కార్తికేయకు ఎలా ఇవ్వనే ..సారీ.."
అంటూ ఆ దొరజామను తన చీరకొంగుతో తుడిచింది. ఆపై తన గదిలోకి వెళ్ళింది....
మదిలోని కార్తికేయ గది తలుపు తెరిచి అతని తలపును ఆహ్వానించింది.
*********************** ************************** **************************
ముగ్ధ ఒళ్లో జామకాయ. చాలా పెద్దగా వుంది. చూస్తోంటే వెంటనే తినేయాలన్నంత బావుంది.
ఆ జామకాయను కార్తికేయకు పంపించాలన్న ఆలోచన. తన ఆలోచన తనకే గమ్మత్తుగా అనిపించింది. కార్తికేయ నవ్వుకుంటాడా?
నవ్వుకుంటే నవ్వుకోని...తన పెరట్లోని జామకాయ రుచిని కార్తికేయ ఆస్వాదించాలి. బొటనవేలి గోరుతో అక్షరాలను చెక్కుతోంది. ఆమె గోరే ఉలిగా మారింది.
"నా ప్రాణానికి ఈ ఫలం.. చిన్న కానుక", ఒక కన్నీటి చుక్క ఆ జామకాయ మీద, ఆమె నఖంతో చెక్కిన అక్షరం చెక్కిలి మీద పడింది.
"ఇది ఏ ప్రేమికురాలు తన ప్రియతముడికి ఇవ్వని అపురూపమైన కానుక..."
కొన్నింటికి లాజిక్కులు వుండవు...
ఇష్టానికి, అది వ్యక్తం చేసే మార్గానికి రహదారులు వుండవు...మనమే నిర్మించుకోవాలి."
జామకాయను భూగోళంగా పట్టుకుని, కుడిచేత్తో జామకాయను ప్రేమతో నిమిరింది.
తన పెదవులకు ఆన్చుకుంది. ఒక్క క్షణపు కిలికించితమా నాలో ఈ వుద్వేగమేలనో?
చిలుక కొరికిన జామకాయ తియ్యగా వుంటే, ఆ చిలుకతో పాటు తనూ...ఆమె బుగ్గల్లో
గులాబీ తోటలు...ఇదంతా ఆ ఇంటి కిటికీలో నుంచి చూస్తోన్న చిలుక సంబరపడి రివ్వున ఎగిరింది.
*********************** ***************** ****************************
ముగ్ధ పుస్తకాల అర దగ్గరికి వెళ్ళింది. చిన్నడబ్బా...అట్ట పెట్టితో తయారైన డబ్బా.
దాంట్లో జామపండు పెట్టింది. వేరే ఉత్తరం ఏమీ రాయలేదు.
తన మనసే ఎన్నో భావాలను అతనికి తెలియజేస్తుంది..అన్న నమ్మకం ఆమెది. ......
నీట్ గా ప్యాక్ చేసింది. దాని మీద కార్తికేయ చిరునామా రాసింది. ముత్యాల్లాంటి అక్షరాలు.
సిటిలో కెళ్ళి కొరియర్ చేయాలి. తను సిటికి వెళ్ళాలంటే తనకో సాయం కావాలి. ఆ సాయం చేసేది ఎవరు?
ఆ సాయం చేసే..తన ప్రాణ స్నేహితురాలు..పూర్ణిమ, ఇప్పుడెక్కడ వుందో?
************************ ************************** ******************
సాక్షాత్తు ఆ జగన్నాథుడు కొలువైన కోవెల...
భక్తి పారవశ్యంతో హారతి కైమోడ్పు అంటుంది.
పూజారి తీర్థాన్ని, ప్రసాదాన్ని అందజేస్తున్నాడు. అచ్చతెనుగు చీరకట్టులో, పదహారణాల కొంటెతనాన్ని మేళవించి పూజారితో
"పూజారి గారూ, నాదో ధర్మసందేహం..అడగమంటారా? అంది పూర్ణిమ.
"అమ్మా తల్లీ నీ ధర్మసందేహాలకు ఆ యక్షుడు కూడా సమాధానాలు చెప్పలేడు.
దేవుడిని నమ్మవు..తీర్థప్రసాదాలు స్వీకరిస్తావు..మనుష్యులను నమ్మనంటావు...
ఎవరికే సాయం కావాలన్నా చేస్తావు..స్నేహం, ప్రేమ ఒక ముసుగు అంటావు...
నీ ప్రాణ స్నేహితురాలి కోసం ప్రాణమైనా ఇస్తావు..ఇదంతా ఏమిటి తల్లీ? పూజారి అడిగాడు.
ఆ గుడికి వచ్చే భక్తుల్లో పూర్ణిమ గురించి తెలియని వారెవ్వరూ వుండరు.
పదహారేళ్ళ క్రితం ఏళ్ళ క్రితం ఇదే గుడి ఆవరణలో ముగ్ధ కంట పడింది రెండేళ్ళ వయసున్న పూర్ణిమ.
అప్పుడు ముగ్ధ వయసు అయిదేళ్ళు.అప్పటి నుంచి పూర్ణిమ బాగోగులు ముగ్ధే చూస్తోంది.
గుడి వదిలి ఇంటికి రమ్మని ఎన్ని సార్లు ముగ్ధ పోరినా రానంది.
తను చేసిన తప్పుకు ఈ దేవుడే పశ్చాత్తాపపడి తన తల్లిదండ్రుల దగ్గరికి చేర్చాలని అంటుంది. ఆ దేవుడు తనకు బాకీ అంటుంది.
ఈ ప్రపంచంలో వున్న ఒకే ఒక ఆత్మీయురాలు 'ముగ్ధ' అంటుంది పూర్ణిమ..
*************** ********************* *********************************
కోనేరు గట్టు మీద ముగ్ధ, పూర్ణిమ కూచున్నారు.
"ఇప్పుడు నీ ప్రాణానికి ఈ కొరియర్ పంపించాలంటావు...అందుకు నేను సిటికి రావాలి. యామై రైట్?" అడిగింది పూర్ణిమ.
అవునన్నట్టు బుద్ధిగా తలూపింది ముగ్ధ.
"అయినా నాకు తెలియక అడుగుతాను...నీకిలాంటి ఐడియాలు ఎలా వస్తాయే?
కాబోయే మొగుడికి జామకాయ గిఫ్ట్ పంపడమేమిటో? ఏమిటీ మాంచి జామకాయలా ఉంటాడా?
సరదాగా ఆట పట్టిస్తూ అడిగింది పూర్ణిమ.
ఇంకా బుద్ధిగా తలూపింది.
ఇంకా ముగ్ధను ఆట పట్టించాలని అనుకోలేదు పూర్ణిమ. ముగ్ధ చేతిలో జామకాయ ప్యాక్ చేసిన బాక్స్.
అప్పుడే రివ్వున ఎగిరి వచ్చి ఆ బాక్స్ మీద వాలింది చిలుక .
సీతాపహరణలో జటాయువు చేసిన మేలు మర్చిపోలేదు జానకిరాముడు.
ఆ జటాయువే ఈ చిలుక రూపంలో జన్మించిదేమో...
పూర్ణిమ లేచింది సిటికి బయల్దేరడానికి,...
ఆ క్షణం తెలియదు పూర్ణిమకు ఈ దేవుడు తనను ఈ గుడిలోనే ఎందుకు వదిలేసాడని ?
******************* **************************** ****************************
(రేపు ఏం జరుగబోతుంది? విషప్రయోగమా?)

No comments: