ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 12 March 2013

"ముగ్ధమోహనం" (22nd chapter)
(16-02-2013)
......................................
పరమశివుడు ప్రళయకాలరుద్రుడైతే....మహావిష్ణువు సుదర్శనచక్రాన్ని ప్రయోగిస్తే....
దుష్టశిక్షణ...శిష్టరక్షణకు ఇది ఆ దేవదేవుడే నిర్ణయించిన ముహూర్తమే అనిపిస్తే..
కుండపోత వర్షంలో యాసిక్ రోడ్డు మధ్య ప్రాణభయాన్ని అనుభవిస్తూ యాసిక్. కార్లు. బైకులు. జనం...
కార్తికేయ పబ్లిక్ అడ్రెస్ సిస్టం దగ్గరికి వచ్చాడు. అతని గొంతు నలుదిశలను చేరుతుంది.
"ప్రజలారా..ఈ రోజు నేను యాసిక్ అనబడే ఈ నరరూప మదోన్మాద మృగానికి మరణశిక్ష విధిస్తున్నాను.
చట్టం మరణ శిక్ష విధిస్తే, రాష్ట్రపతి క్షమాబిక్ష వుంటుంది. వీడివల్ల ఎందరో మహిళలు ప్రాణాలు కోల్పోయారు....
వీడి అత్యాచారానికి బలయ్యారు. వీడి యాసిడ్ దాడికి గురయ్యారు. వీడికి నేను విధించే మరణశిక్షను క్షమాబిక్షగా మార్చమనే వారుంటే నేను వీడిని వ...ది ..లి...వే...స్తా..ను" అతని కుడిచేతిలో పొడవాటి కత్తి. ఈ దృశ్యాన్ని చూస్తోన్న ఓ ముస్లిం సోదరి కొద్దిగా బురఖాను తొలిగించింది.
ఆరు నెలల క్రితం యాసిక్ చేతిలో యాసిడ్ దాడికి గురైంది.
"భయ్యా..మార్ డాలో..." అరిచింది, ఆ అల్లా కూడా సంతోషిస్తాడు.
తోటి వారిని ప్రేమించమని చెప్పే అల్లా ఇలాంటి దుర్మార్గులను శిక్షించడానికి తన బదులు మరొకరిని పంపిస్తాడని ఆ సోదరి భావిస్తుంది.
జనంలో కదలిక వచ్చింది. నడి రోడ్డు మీద మానవత్వాన్ని హత్య చేస్తోంటే, నిర్దాక్షిణ్యంగా ఒకరిని చంపుతుంటే...అత్యాచారం చేస్తోంటే ...
భయంతో, నిర్లిప్తతతో, మిన్నకుండే జనం...ఓ వ్యక్తి కత్తి చేత పట్టి నరరూప రాక్షసుడు తల నరుకుతానంటే...ఇప్పుడైనా కదలిక రాకపోతే...
జనం కదిలారు. కార్తికేయ యాసిక్ ని సమీపించాడు. యాసిక్ రెండు చేతులూ పైకి లేపాడు దాడిని అడ్డుకోవడానికి. తెగబడి కార్తికేయ చేతిలోని కత్తి ఆ రెండు చేతులను అతడి శరీరం నుంచి వేరు చేసింది. రక్తం చివ్వున చిమ్మింది. రెండు చేతులూ రోడ్డు మీద పడ్డాయి. అదే సమయంలో వీధి దీపాల సాయంతో కొందరు కళాకారులు రుద్రతాండవం నృత్యరూపకం ప్రదర్శిస్తున్నారు. కత్తి చివర నుంచి రక్తం కారుతుంది. యాసిక్ కేక ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది.
రోడ్డు మీద పడ్డ తన చేతులను చూసుకున్నాడు. ఎందరినో యాసిడ్ చూపించి బెదిరించిన చేతులు...అత్యాచారం చేసిన చేతులు....కార్తికేయ వంక భయంగా చూసాడు. కార్తికేయ కత్తి మరో సారి గాల్లోకి లేచింది ...ఈ సారి మొండం నుంచి యాసిక్ తల వేరైంది....
కొన్ని గజాల ఆవల పడింది. కొద్ది క్షణాలే గిల గిల కొట్టుకుంది.
యాసిక్ చరిత్ర అతి భయానకం గా ముగిసిపోయింది.ఇదంతా కెమెరాలో రికార్డు అవుతుంది.
కార్తికేయ మొహం కనిపించకుండా జాగ్రత్తగా షూట్ చేసారు.
********************************************
ఆటో ఆగింది. అందులో నుంచి హేమంత, అంజలి దిగారు. కార్తికేయ యాసిక్ తల పడి వున్న ప్రాంతానికి వెళ్ళాడు.
ఇంకా రక్తం కారుతూనే వుంది. జుట్టుతో తలను చేతిలోకి తీసుకున్నాడు .
ఆ ఆదిశక్తి ఆ మహిషాసురమర్ధిని చేతిలో వున్న అసురుడి తలలా వుంది. ఆ మొండం లేని తలను అంజలి పాదాల ముందు పెట్టాడు.
అంజలికి యాసిక్ తన తల్లిదండ్రులను చంపిన దృశ్యం...తనను సెల్ లో షూట్ చేసిన సంఘటన కళ్ళ ముందు కదలాడింది.
కార్తికేయ మోకాళ్ళ మీద కూచున్నాడు. అంజలి కార్తికేయ చేతిలోని కత్తిని నేల మీద జారవిడిచింది.
కుండపోత వర్షంలో ఆ కత్తి కొట్టుకుపోతోంది. దుష్ట సంహారం చేసిన ఆ కత్తి కాలగర్భంలోకి వెళ్తోంది.
వర్షం వెలిసింది. ట్రాఫిక్ పోలీస్, పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసాడు.
"సార్...ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని దారుణంగా చంపేశారు" అంటూ సమాచారం అందించాడు.
ఆ హత్యకు, అది హత్య కాదు సంహారం...దానికి సాక్ష్యం లేదు.వున్నా ఎవరూ చెప్పరు.
ఢిల్లీ నగరం అంధకారం నుంచి వెలుగులోకి వచ్చింది.
సరిగ్గా అరగంట తర్వాత ఢిల్లీ లోని టీవీ సెట్ల ముందు కూచొన్న జనానికి ఫ్లాష్ న్యూస్...
"నడి రోడ్డుపై నరరూప మదోన్మాద మృగాన్ని సంహరించిన కల్కి అవతారం" అన్న వార్త ...
న్యూస్ రీడర్ స్క్రీన్ మీదికి వచ్చింది. ఢిల్లీ ప్రజలు ఈ రోజు దీపావళి జరుపుకుంటున్నారు.
నలభై మంది అమ్మాయిలను పాశవికంగా అత్యాచారం చేసిన కేసులో నిందితుడు...
ముప్పై మంది అమ్మాయిల మీద యాసిడ్ పోసిన కేసులో, ఇంకా పలు నేరాలతో పన్నెండు పోలీస్ స్టేషన్ లలో పలు కేసులు వున్న యాసిక్ కు గుర్తు తెలియని వ్యక్తి మరణ శిక్ష విధించాడు. జనం చూస్తుండగానే అతని చేతులు,తల నరికాడు, వీటి విజువల్స్ మేకు అందిస్తున్నాం.
ఇతన్ని అపర కల్కి అవతారంగా భావిస్తున్నారు. ఇప్పుడు ఈ సంఘటన గురించి జనం స్పందన తెలుసుకుందాం.
కెమెరా జనం మీద వుంది."ఈ హత్య ఎవరు చేసారో తెలుసా? యాంకర్ అడిగింది, ఓ అమ్మాయిని.
"ఇది హత్య కాదు..అల్లా సైతాన్ కు విధించిన శిక్ష" చెప్పిందా అమ్మాయి.
"యుగానికో అవతారం..ఈ యుగంలో వచ్చిన కల్కి దేవుడు విధించిన శిక్ష" మరొకరు చెప్పారు.
ఆ జనంలో ఏ ఒక్కరూ కార్తికేయ గురించి చెప్పలేదు.
*************** ************************
న్యూస్ రీడర్ స్క్రీన్ మీదికి వచ్చింది, "యాసిక్ మరణాన్ని ప్రజలు దీపావళి పండుగలా భావిస్తున్నారు.
ఈ సంఘటన మీద మీ అభిప్రాయాలు మాకు మెయిల్ చేయండి, లేదా ఫోన్ చెయ్యండి.
చానెల్ ఆఫీసు నుంచి బయటకు వచ్చింది న్యూస్ రీడర్. తర్వాత ఓ నంబర్ కు ఫోన్ చేసింది.
"సార్ మీరు చెప్పినట్టే న్యూస్ వచ్చింది. జనంలో స్పందన వుంది" అంది.
"థాంక్యూ ...మీరు చేసిన మేలు మర్చిపోలేను" అవతలి వైపు నుంచి కార్తికేయ అన్నాడు.
"నో సర్ ..ఇట్స్ మై ప్లెజర్" అంది ఆ న్యూస్ రీడర్ .
*******************************************
మోహన చేతిలోని ప్లవర్ వాజ్ టీవిని తాకింది. భళ్ళుమని శబ్దం. పిక్చర్ ట్యూబ్ పేలిన శబ్దం.
"ఇదంతా మీ వల్లే...చేతిలో రివాల్వర్ వుండీ కూడా చంపలేదు" సిక్వీ అన్నాడు.
మోహన్ వేగంగా లేచి సోఫాలో కూర్చున్న సిక్వీ గుండెల మీద కుడి పాదం పెట్టి రివాల్వర్ ని అతని కణత మీద ఆన్చి ట్రిగ్గర్ మీద వేలు బిగించింది.
******************************************************
(మోహన్ ఎందుకలా చేసింది? ఆ టీవీ న్యూస్ రీడర్ ఎవరు? రేపటి సంచికలో)

No comments: