ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 12 March 2013

" ముగ్ధమోహనం " (33rd chapter )
(27-02-2013)

ప్రమాదం ఎప్పుడు...ఎటు వైపు నుంచి దూసుకు వస్తుందో ఎవరూ ఊహించలేరు.
ముగ్ధ వర్షం పడక ముందే ఇంటికి చేరుకోవాలని పరుగు లాంటి నడక తో బయల్దేరింది.
మరో చినుకు..దట్టమైన మేఘాలు ఏదో చీకటి విపత్తు ను చూపిస్తున్నట్టు....
అదే సమయం లో ఆ వూరి పోలిమేరల్లోకి ఓ ఆకారం ప్రవేశించింది.చేతిలో అత్యాధునికమైన కెమెరా .

సందు మలుపు తిరుగుతుండగా పెద్ద మెరుపు...అది ఆకాశం లో నుంచి వచ్చిన మెరుపు కాదు...కెమెరా ఫ్లాష్.
అలాంటి మెరుపులు వస్తూనే వున్నాయి. ముగ్ధను వివిధ యాంగిల్స్ లో ఫోటో లు తీస్తుంది ఆ ఆకారం.

ఆ ఆకారం ముగ్ధను ఫాలో అవుతూనే వుంది.ఊరంతా చీకటి దుప్పటి కప్పుకున్నట్టు,మబ్బులన్నీ ఆ ఊరిని ఆక్రమించుకున్నట్టు...వుంది.
ముగ్ధ ఇంటికి చేరింది.అప్పటికే వర్షం మొదలైంది.ఆ ఆకారం వెనుతిరిగింది.
ఆ ఆకారం పేరు నిక్సన్.
**********************************************************************************************************
మోహన రెస్ట్ లెస్ గా వుంది.ఎలాంటి ప్రమాదాన్ని అయినా పేస్ చేయగల మోహన...

తనను పోలీసులు చుట్టుముట్టినా కూల్ గా వుండే మోహన ఆ క్షణం రెస్ట్ లెస్ గా వుంది.
టేబుల్ మీద ఫోటోలు...అవి ఫోటోలు మాత్రమె కావు...మృత్యువు చాయాచిత్రాలు.
ఆ ఫోటో లలో వుంది కార్తికేయ.
రాజస్థాన్ ఎడారిలో...మే నెల ఎండల్లో మిట్ట .మధ్యాహ్నం .ఎడారి మధ్యలో ఇసుక దిబ్బలు...
నాలుగు వైపులా రేకులు..పైన రేకు కప్పు....లోపల ఒంటికాలి మీద కార్తికేయ....సూర్యుడి తీక్షణత రేకుల మీదుగా లోపల వున్న కార్తికేయను మల మల మాడుస్తుంది.
బొబ్బలెక్కిన చేతులు...కాళ్ళు...అసలు మనిషేనా? బండ రాళ్ళ మీద పిడి గుద్దులు గుద్దుతూ,ఇసుక బస్తాలను టార్గెట్ చేస్తూ....యుద్ధం లో సైనికులకు ఇచ్చే శిక్షణ లా......
ఈ ప్రపంచానికి తెలిసి కార్తికేయ కస్టమ్స్ అధికారి....
సి బి ఐ దృష్టిలో తమ కోసం మోహన ను పట్టుకునే ఆఫీసర్....
కానీ...కానీ ప్రపంచానికి తెలియని...ప్రధానికీ తెలియని ,కేంద్రప్రభుత్వానికి తెలియని,నిజం....

కా...ర్తి...కే ...య ...ర...క్ష...కు...డు...
భారత రాష్ట్రపతి తనకున్న విశేష అధికారాలను ఉపయోగించుకుని భారత దేశాన్ని రక్షించడానికి సర్వ అధికారాలను కట్టబెడుతూ.....ఇచ్చిన రాజశాసనం.
మూడు వందల మంది...ఆరు నెలల పరిశోధన,గూడాచార సంస్థల రహస్య శోధన..చివరికి పాకిస్తాన్ గూడాచార సంస్థ కూడా శోధించి తెలుసుకున్న నిజం.
శాటిలైట్ ద్వారా తీయించిన చాయాచిత్రాలు.
యసిక్ ని చంపింది వ్యక్తిగత కోపం తో కాదు...శత్రువు బలాన్ని తగ్గించడానికి ...శత్రువును మానసికం గా బలహీన పరచడానికి...
కార్తికేయను ఎదురించడానికి ఆయుధాలు సరిపోవు....బుల్లెట్స్ పనిచేయవు...అతనికి బలహీనతలు లేవు...అతని బలం మొండితనం...
ఆ మొండితనాన్ని ఎదుర్కునే అస్త్రం ము...గ్ధ .
ఒక్క క్షణం తల విదిల్చింది మోహన.ఎదురుగా పేపర్...
ఆ పేపర్లో ఓ వార్త...
ప్రపంచం లోని ప్లాస్టిక్ సర్జరీ చేయగలిగిన అతి కొద్ది మంది సర్జన్స్ లో వున్న ఒకే ఒక మహిళా సర్జన్ డాక్టర్ రాధారాణి ని ఇంటర్ వ్యూ చేసిన వార్తా పత్రిక.
అచ్చమైన పదహారణాల తెలుగమ్మాయి...అతి చిన్న వయసులోనే కీర్తి ప్రతిష్టలు అందుకున్న వ్యక్తీ. అమెరికాలో డగ్లస్,రష్యాలో పెమ్లిట్ ,ఇండియా లో రాధారాణి...
ముంబై లో సెటిల్ అయింది.ముఖ్యమైన కాన్ఫరెన్స్ కు అటెండ్ అవ్వడానికి హైదరాబాద్ వచ్చింది.
మోహన రాధారాణి ఫోటో వైపు చూసింది.రెడ్ కలర్ మార్కర్ పెన్ తో రాధారాణి మొహం చుట్టూ రౌండప్ చేసింది.
********************************************************************************************************
సాదా కాటన్ చీర..మెడలో సన్నటి గొలుసు..పాపిట సిందూర్...వరల్డ్ బుక్ అఫ్ గిన్నీస్ లో చోటు సంపాదించిన ప్రముఖ సర్జన్ అంటే నమ్మలేనంత సింపుల్....
మొహం లో చెదరని చిరునవ్వు...కళ్ళలో ఎదుటివారికి ధైర్యాన్ని ఇచ్చే భరోసా...
రాధారాణి. కారు డోర్ ఓపెన్ చేసి కారు స్టార్ట్ చేసింది.
కారు బంజారాహిల్స్ మీదుగా వెళ్తోంది.
"గుడ్ మార్నింగ్ డాక్టర్..గ్లాడ్ టు మీట్యూ "
డ్రైవ్ చేస్తోన్న రాధారాణి ఉలిక్కిపడి మిర్రర్ లో నుంచి చూసింది.వెనుక సీట్ లో ఓ అపరిచిత వ్యక్తీ.చేతి లో సైలెన్సర్ అమర్చబడ్డ రివాల్వర్.ఆ వ్యక్తి మోహన
(వాట్ నెక్స్ట్ ? రేపటి సంచికలో )

No comments: