ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 12 March 2013

" ముగ్ధమోహనం " (34th chapter )

(28-02-2013)

ముగ్ధ "ఆ గదిలోకి వెన్నెలను స్వాగతించింది....తన మదిలోకి కార్తికేయ ను ఆహ్వానించింది...రెండు మోకాళ్ళ మధ్య చుబుకాన్ని ఆన్చి కార్తికేయ రూపాన్ని కళ్ళ ముందు ఆవిష్కరించింది. తన ఎదురుగానే వున్నాడు...తననే చూస్తున్నాడు.

తపన కంటి చూపయింది....తనువూ వెన్నల్లో తడిసిన మంచు పుష్పం అయింది.

తన రెండు చేతులతో ముగ్ధ మొహాన్ని బంధించేసాడు.నుదురు మీద చుంబనం కుంకుమ సూర్యోదయమైంది.

నా పెదవుల స్పర్శనే కాటుకగా దిద్దనా? కను రెప్పలను పలకరించిన పెదవుల మాటలు అవి.
కళ్ళు తెరిచే ధైర్యం చేయలేదు ముగ్ధ.కళ్ళు తెరిస్తే ,ఇది కల అని తెలిస్తే తను భరించగలదా? ఎదురుగా పెద్ద బల్ల....దాని మీద వీణ .అమ్మ చేతి వ్రేళ్ళతో పులకించిన వీణ. ముగ్ధకు వీణ నేర్చుకోవాలని అనిపించింది.ఎప్పటి నుంచో వున్న కోరిక ఇప్పుడు ఇప్పుడు బలం గా మారింది.
తొలి రేయి...తన కార్తికేయ సమక్షం లో తన భావాలను..తన లోని ఫీలింగ్స్ ను వీణ లోని రాగాలతో...రోమాంచిత గారాలు పోతూ...చెప్పాలి.ఒక్క క్షణం తన ఆలోచన తనకే చిత్రం గా అనిపించింది.జీవితంలో కొన్ని సంఘటనలు మెలోడ్రామా గా ఉంటేనే భావుంటుదేమో....కార్తికేయ కోసం వీణ నేర్చుకోవాలి...
ఐ ఫోన్ లో పాటలు,మిడ్ నైట్ ప్రోగ్రామ్స్ ఇవ్వలేని ఆనందం తన వీణాగానం అందించాలి.తను వీణ నేర్చుకోవాలి.
అప్పుడు గుర్తొచ్చింది లక్ష్మి...లక్ష్మి పిరాట్ల ....
ఎవరిచేతి వ్రేళ్ళ స్పర్శ తగిలి వీణ లోని తీగలు పులకరించిపోతాయో.ఏ ..స్వరరాగామ్ర్తుతాన్ని చూసి నారద తుంబరులు పరవశమైపోతారో...సంగీతం అజరామరమైన చోట...పాట పల్లవించి..స్వరం కోయిలతో కలిసి ఆలపించి....సప్తస్వరాలు ఆమెకు సంగీత ఆభరణాలు అయి , వినమ్రమై కొలువైన చోట....ఒక విధి అనే తీగ, ప్రమాదం అనే అపశ్రుతిని ఆలపించి,విలపించి..ఆమె గొంతును మూగగా మార్చిన సంగీత వాగ్దేవి కొలువైన చోటు అది.
*********************************************************************************************
హైదరాబాద్....
రవీంద్రభారతికి కూతవేటు దూరంలో ....
లక్ష్మీ స్వర నిలయం.
అక్కడ గాలిలో స్వరాలు వినిపిస్తున్నాయి.పూల మొక్కలలో రాగాలు గారాలు పోతున్నాయి.
నేల మీద పరిచిన తివాచీ ఆ సంగీత సామ్రాజ్ఞి రాకను ఆహ్వానిస్తుంది.
కంచి పట్టు చీరలో.సత్యలోకం నుంచి వస్తోన్న వాగ్దేవిలా వుంది .
మూడు సంవత్సరాల క్రితం న్యూ ఢిల్లీ లో జరిగిన సంగీత కచేరిలో జరిగిన అగ్నిప్రమాదం లో ,మంటల్లో కాలిపోతోన్న తన వీణ ను చూసి తన ప్రాణమే దహించుకుపోతుందన్న షాక్ తో మాట మరిచింది...స్వరం అపస్మారకంలోకి వెళ్ళింది.
******************************************************************************************
"నమస్తే మేడం.."ముగ్ధ,పూర్ణిమ చేతులు జోడించి నమస్కరించారు.
కూచోమన్నట్టు సైగ చేసింది.ఇద్దరూ కూచున్నారు.పూర్ణిమ వచ్చిన విషయం సూటిగా చెప్పింది.ముగ్ధ తన మనసులోని మాట చెప్పింది.
లక్ష్మి ముగ్ధ వైపు చూసింది.ఆమె సంగీతం నేర్పించడం మానేసి చాలాకాలమైంది.
"స్వరాలు పలకలేని మూగను...నేనేం నేర్పించగలను?పలక మీద రాసింది.

"మీ చేతి వ్రేళ్ళ కదలికకు తీగలే గొంతెత్తి పాడుతాయి.మీ కంటి కదలికలు సప్తస్వరాలై వర్ధిల్లుతాయి...సరిగమపదనిసలు సప్తవర్ణాల శోభితమై మాకు స్వరాలు నేర్పుతాయి."
ముగ్ధ అంది.
చిన్నగా నవ్వింది...వెన్నల పుష్పం అరవిరిసిన నవ్వు.స్వచ్చమైన నవ్వు.
"బ్రహ్మ దేవుడు సృష్టిని కొనసాగిస్తూ,లలాట లిఖితాలను అలిసి లిఖిస్తూ వుంటే ఆ సరస్వతీదేవి "బ్రహ్మ అలసట తీర్చడానికి సప్తస్వరాలను ఆలపించిందిట...నీకా స్వరం నేర్పుతాను...నీ పెళ్ళికి నేనిచ్చే స్వర కానుక...."పలక మీద రాసింది.
ముగ్ధ లక్ష్మి పాదాల కు నమస్కరించింది.ఎక్కడి నుంచో రివ్వున వచ్చిన చిలుక లక్ష్మి పిరాట్ల పాదాల మీద వాలి తన ముక్కుతో ఆమె పాదాలకు నమస్కారాలు తెలియజేసింది.చిన్న జామ పిందె, చిలుక చిట్టి పెదవుల నుంచి జారిపడింది.
ఆ జామ ముగ్ధ పెరట్లో వున్న జామ చెట్టుది.
"చిలుక పలుకులే తప్ప కోయిల కూజితాలు తెలియవు..మా ముగ్ధకు నేర్పించండి "అని చెబుతున్నట్టు వుంది.
స్వరమే ప్రాణమైన సంగీతం...మౌనం గా తీగల సరాగాలతో స్వర శిక్షణ మొదలైంది.
మరో వైపు మరణ మృదంగ ధ్వనులు మొదలైన విషయం తెలియదు వారెవ్వరికీ ...
****************************************************************************************
"గుడ్ మార్నింగ్ సంద్యారాణి గారు...ఏమిటి ఈ వేళ విశేషం...మేమంతా న్యూస్ వండుతాం...మీరేమో న్యూస్ ను వెతుక్కుంటూ వెళ్లి తయారు చేస్తారు,"కాస్త వ్యంగ్యం జోడించి అన్నాడు సబ్ ఎడిటర్.
ఇలాంటి కామెంట్స్ ఎక్కడైనా సర్వసాధారణమే...జెలసీ...ఒక కవి కవితలు రాసుకుంటూ,ఆసక్తితో ఓ కథో,సీరియలో రాస్తే వెంటనే కడుపుమంట కలం మంట గా మారుతుంది.వ్యంగ్య బాణాలు మొదలవుతాయి.
విలన్ వేషాలు వేసే వ్యక్తి హీరో అయితే అదో టాపిక్...అభద్రతా హావం...సెక్యూర్డ్ ఫీలింగ్ లో నుంచి బయటకు వచ్చే అభద్రతాభావం. సంధ్యా రాణి ఇలాంటి కామెంట్స్ ని డస్ట్ బిన్ లో వేయడం మొదలుపెట్టి చాలా కాలమైంది.
తను చేయవలిసిన ముఖ్యమైన పనులు రెండు.ఒకటి డ్రగ్స్ రాకెట్ వివరాలు సేకరించడం.
రెండు డాక్టర్ రాణి సంధ్యను ఇంటర్ వ్యూ చేయడం.తెలుగు వారే కాదు...ప్రపంచం గర్వపడే సర్జన్ రాణి సంధ్య ఇంటర్ వ్యూ చేయాలి.
****************************************************************************************
విశాలమైన గది...ఓపక్కన ఆపరేషన్ టేబుల్...ఆ గది అండర్ గ్రౌండ్ లో వుంది.మోహన చేతిలో రివాల్వర్...మరో చేతిలో ముగ్ధ ఫోటో...ఎదురుగా కుర్చీలో డాక్టర్ రాణి సంధ్య .
(ఇప్పుడు రాణి సంధ్య ఎక్కడుంది? సంధ్యా రాణి మీద ఎటాక్ జరుగుతుందా?రేపటి సంచికలో ...)

No comments: