ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 23 March 2013

మాన్ రోబోలో "ముగ్ధమోహనం" విసురజ తొలి డైలీ సీరియల్
(Chapter---49 )
(15-03-2013)
బాధ,దుఖం రెండూ వేరు వేరు ఫీలింగ్స్....దుఖాన్ని కన్నీళ్ళ రూపం లో వ్యక్తం చేయవచ్చు...కానీ బాధను వ్యక్తం చేయడానికి కన్నీళ్లు కూడా సరిపోవు...మనసు భారమైంది...అనే మాటకు అర్ధం ఇదే.
ముగ్ధ, పూర్ణిమ ఇద్దరూ ఈ రెండింటినీ అనుభవిస్తున్నారు. పూర్ణిమ వీటితో పాటు మరో విషయాన్ని తలుచుకుని భయపడుతోంది. లక్ష్మి మరణం ప్రమాదవశాత్తు సంభవించింది కాదు....టార్గెట్ ఎవరు? ముగ్ధ వస్తున్న విషయం తెలుసుకుని ఎవరైనా...? అయినా ముగ్ధను చంపవలిసిన అవసరం ఎవరికీ వుంది? తమకు తెలియకుండానే ప్రమాదంలోకి అడుగు పెడుతున్న ఫీలింగ్ కలిగింది పూర్ణిమకు.
ముగ్ధ వైపు చూసింది. నిద్రలోకి జారుకుంది. గాలికి ముగ్ధ ముంగురులు బుగ్గలను తాకుతుంటే పూర్ణిమ వాటిని సరిచేయడానికి ప్రయత్నిస్తోంది. తన బుగ్గల మీద పడిన పూర్ణిమ చేతిని ముగ్ధ అలానే పట్టుకుని
"నాకు భయం గా వుంది. నన్ను మీతో పాటు తీసుకువెళ్ళండి " నిద్రలోనే మాట్లాడుతోంది.
ముగ్ధ కార్తికేయ మీద ఎంత ప్రేమను, నమ్మకాన్ని పెంచుకుందో అర్ధమైంది పూర్ణిమకు.
ఇంటికి వెళ్ళాక ముగ్ధ దగ్గర కార్తికేయ ఫోన్ నంబర్ తీసుకుని తనే మాట్లాడాలి. తన మనసులోని భయాన్ని కార్తికేయకు చెప్పి ముగ్ధను సేవ్ చేయమని చెప్పాలి....అనుకుంది. వీళ్ళ బస్సుకు పది కిలోమీటర్ల దూరంలో మరో బస్సులో వున్నాడు కపర్ది....శ్రీనివాస్ అసిస్టెంట్. ముగ్ధను ఫాలో అవ్వమని చెప్పాడు శ్రీనివాస్....లక్కీగా ముగ్ధ వెళ్ళిన బస్సు వెనుకే మరో బస్సు దొరికింది. ముగ్ధకు తెలియకుండా ఆమెను రక్షించవలిసిన బాధ్యత తనది.
ఆర్దర్లీ వ్యవస్థ కనుమరుగవుతున్న ఇంకా కొన్ని చోట్ల కొనసాగడం...రక్షించవలిసిన పోలీసు...పై అధికారుల ఇళ్ళలో పనులు చేయడం నచ్చని కపర్ది తన పోలీస్ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాడు....శ్రీనివాస్ లాంటి నిజాయితీ పరుడైన ఆఫీసర్ దగ్గర సహాయకుడిగా చేరాడు.
***************************************
కపర్ది గ్లాస్ డోర్ ని పక్కకు జరిపాడు. చల్లగాలి తగిలి హాయిగా అనిపించింది.చల్లగాలికి నిద్ర ముంచుకు వస్తోంది..కానీ విధి నిర్వహణలో చాలా ఎలర్ట్ గా ఉంటాడు కపర్ది. గ్లాస్ దగ్గరికి జరిపాడు. అప్పుడే కపర్ద్ సెల్ రింగ్ అయింది..నంబర్ కొత్తది...ఈ టైములో ఎవరు చేసి వుంటారు? వెంటనే ఆన్ బటన్ ప్రెస్ చేసి "హలో .
"కపర్ది నేను....నువ్వు వెంటనే బస్సు దిగు...నిన్ను మోహన గమనించింది...నువ్వు బస్సు దిగి వెనక్కి ఒక కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చి ...అక్కడ మన ఇన్ఫార్మర్
ఒకడు జీప్ తో రెడీగా ఉంటాడు. అతనితో కలిసి నువ్వు ముగ్ధ దగ్గరికి వెళ్ళు...నా ఫోన్ లో చార్జింగ్ లేదు..కమాన్ క్విక్ " అటు వైపు నుంచి బాస్ శ్రీనివాస్ గొంతు.
మరో ఆలోచన లేకుండా "ప్లీజ్ స్టాప్" అని అరిచాడు కపర్ది.
డ్రైవర్ బస్సు ఆపాడు.
"సర్...ఈ టైంలో ఇక్కడ దిగుతారేమిటి? కండక్టర్ అనుమానంగా అడిగాడు.
"అర్జెంట్ పని..మా వాళ్ళు వస్తారు" అంటూ అతనికి మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా బస్సు దిగాడు.
"సర్ మీ చిల్లర" అని కండక్టర్ అరుస్తున్న వినిపించుకోలేదు.
బస్సు కపర్దిని వదిలి వెళ్ళిపోయింది.
బస్సు కనుమరుగయ్యే వరకు వుండి...వెనక్కి నడవడం మొదలుపెట్టాడు.
అంతా నిర్మానుష్యంగా వుంది...అప్పుడు గుర్తొచ్చింది కపర్ధికి " బాస్ చెప్పిన ఇన్ఫార్మర్ ఎవరు?
అతను ఆలోచిస్తూ ఉండగానే అతని పక్కన జీప్ ఆగింది. చీకట్లో డ్రైవర్ మొహం స్పష్టంగా కనిపించలేదు."కపర్ది సర్ మీరేనా? డ్రైవర్ అడిగాడు.
"నేనే...సర్ పంపించారా?" అడుగుతూ జీప్ ఎక్కాడు. జీపు కదిలింది.
"ఇంతకీ మీ పేరు చెప్పనే లేదు...మిమ్మల్ని ఎక్కడా చూసిన జ్ఞాపకంలేదు? కపర్ది అని డ్రైవర్ మొహాన్ని పరిశీలనగా చూడబోయాడు...అప్పుడే డ్రైవర్ సడెన్ బ్రేక్ వేసాడు.దాంతో కపర్ది తూలిపడబోయాడు . అప్పటికే డ్రైవర్ కుడిచేయి ముందుకు కదిలింది.ఏదో తెలియని స్మెల్....కొద్ది క్షణాల్లోనే గుర్తించింది కపర్ది లోని పోలీస్ బుర్ర. కానీ అప్పటికే ఆలస్యమైంది. మెల్లి మెల్లిగా స్పృహ తప్పుతోంది.
రెండు నిమిషాల తర్వాత ఆ డ్రైవర్ ఫోన్ చేసాడు."మేడం ఆటను స్పృహ తప్పదు. అతడ్ని మీ దగ్గరికి తీసుకు రమ్మంటారా? అడిగాడు.
"వద్దు...తప్పించుకుపోకుండా చూడు...అతని సెల్ ఫోన్ తీసుకురా " అటువైపు నుంచి మోహన చెప్పింది.
"సెల్ ఫోనా? ఆశ్చర్యంగా అడిగాడు .
"అవును ఎవరికైనా అమ్మేద్దామని.." కూల్ గా చెప్పింది .
డ్రైవర్ కి చెమటలు పట్టాయి. చెప్పింది చేయడమే తెలుసు. మోహన దగ్గర నోరు జారితే ఎలా వుంటుందో తెలుసు.
"చూడు..ఈ లోగా ఏమైనా ఫోన్ కాల్స్ వస్తే నేను చెప్పిన నంబర్ కు కాల్ డైవర్ట్ పెట్టు.." అంటూ కాల్ డైవర్ట్ పెట్టవలిసిన నంబర్ చెప్పింది.
**************************
పోలీస్ జీపు స్పీడ్ గా వెళ్తుంది.మరో కాసేపట్లో ఊళ్ళోకి అడుగు పెడుతుంది. ఓ సారి రియల్ వ్యూ మిర్రర్ లో చూసుకున్నాడు ఇన్స్పెక్టర్ డ్రెస్ లో వున్న జర్దార్.మోహన ఫోన్ చేయగానే చార్టెడ్ ప్లయిట్ లో రాజమండ్రి వచ్చాడు..సిటికి దూరం లో దిగగానే పోలీస్ జీపు రెడీ గా వుంది పోలీసులతో సహా....కపర్ధిని తప్పించడానికి మోహన ప్లాన్ వేసింది..శ్రీనివాస్ గొంతుతో మాట్లాడింది.
ఇప్పుడు ముగ్ధను కిడ్నాప్ చేయడానికి ఎటువంటి ఆటంకం లేదు.
******************************* **************************
పూజగదిలో దేవుడి ముందు కూచోని వున్నాడు ముగ్ధ తండ్రి, గంభీరమైన రూపం...తెల్లటి మేనిచాయ.ఎన్నో అనుభవాలను చూసినట్టు ముడతలు పడిన శరీరం. ఉదయం నుంచి అతను పూజగదిలోనే వున్నాడు. ఎన్నడూ లేనిది అతని మనసు ఆ రోజు కీడును శంకిస్తుంది. సంప్రదాయాలను గౌరవించే ఆ పెద్దాయన సనాతన విషయాలనూ అంగీకరిస్తాడు. కూతురు తనప్రేమ గురించి చెప్పగానే " కూతురి వంక చూసాడు ...కూతురు మోహంలో ఆకర్షణ తాలూకు కోరిక కనపడలేదు...
సీతా స్వయంవరంలో రామచంద్రుడిని చూసిన సీత గుర్తుకు వచ్చింది. తన కూతురి గురించి తెలుసు.తను తప్పు చేయదు. తప్పుడు నిర్ణయాలు చేయదు.
హైదరాబాద్ నుంచి వచ్చిన కూతురి మొహంలో బాధ చూసాడు..భయం చూసాడు..పసి పిల్లలా పూజగదిలోకి వచ్చి తన ఒడిలో పడుకుని "నాకు భయం వేస్తుంది నాన్న గారు" అన్నప్పుడు తన మనసు చివుక్కుమంది...
తన కూతురికి ఏదైనా ఆపద సంభవించదు కదా...ఆ ఆదుర్దాతోనే ఉదయం నుంచి పచ్చి గంగ కూడా ముట్టలేదు.
చిలుక వచ్చి పూజగదిలోని దేవుడి పాదాల ముందు వాలింది.
***********************
పోలీస్ జీపు ఊళ్ళోకి ప్రవేశించింది. దేవాలయం ముందు ఆగింది. పూర్ణిమ, పోలీసు జీపు శబ్దం విని గుడిలోనుంచి బయటకు వచ్చింది. పోలీసు డ్రెస్ లో వున్న జర్దార్ జీపు దిగాడు. పూర్ణిమ వైపు చూసి" ఇక్కడ ముగ్ధ ఇల్లెక్కడ? అని అడిగాడు.
"ఎందుకు? అనుమానం ]\గా అడిగింది పూర్ణిమ.
"ఎందుకో చెబితేగానీ అడ్రెస్ చెప్పవా? అన్నాడు.అప్పుడే అటుగా వెళ్తోన్న రైతుని అడిగాడు డ్రైవర్.అతను చెప్పాడు. జీపు కదిలింది.
పూర్ణిమలో అనుమానం బలపడింది.వెంటనే ముగ్ధ ఇంటి వైపు పరుగెత్తింది.
*********************

ఎవరో తలుపులు దబ దబ బాదుతున్న చప్పుడు..అప్పటికే పూజగదిలో వున్న ముగ్ధ తండ్రి వెళ్లి తలుపు తీసాడు..ముగ్ధ బయటకు వచ్చింది. తమ్ముడు లేచాడు.ఎదురుగా పోలీసులు...
"ఎవరు మీరు..మీకు ఏం కావాలి ? ముగ్ధ తండ్రి అడిగాడు.
"మీ అమ్మాయిని అరెస్ట్ చేయడానికి వచ్చాం ...." జర్దార్ చెప్పాడు.
"చూడు బాబు...మీరు తప్పు అడ్రెస్ కు వచ్చారు..మా అమ్మాయి అలాంటిది కాదు...మీరు పొరపడి వచ్చారు" అన్నాడు ముగ్ధ తండ్రి.
"వారెంట్ తో వచ్చాం ..అంటూ పోలీసుల వైపు తిరిగి సైగ చేసాడు జర్దార్.
పోలీసులు బేడీలు తీసారు.భీతావహరిణి అయింది...బలవంతంగా ఒక చేతికి బేడీలు వేసారు.
ఒక్కసారిగా కింద కూలబడి పోయాడు ముగ్ధ తండ్రి ఆ దృశ్యం చూసి..తమ్ముడు "అక్కా "అంటూ అరుస్తున్నాడు...చుట్టుపక్కల వాళ్ళు వింతగా చూస్తున్నారు. ముగ్ధను జీపులోకి నెట్టారు.అలానే స్థాణువు అయింది ముగ్ధ.
జీపు కదులుతుండగా పరుగెత్తుకు వచ్చింది పూర్ణిమ.అప్పటికే జీపు కదిలింది...అయినా జీపు వెంట పరుగెత్తింది.

No comments: