ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday 30 March 2013

విసురజ "ముగ్ధమోహనం" తొలి డైలీ సీరియల్
(Chapter---60)
(26-03-2013)
..........................
"చందమామ కథలో చదివినట్టు జ్ఞాపకం లేదు...గాడ నిద్రలో కమ్మని కలగన్న గుర్తు లేదు..పిండారబోసిన వెండి వెన్నెల్లో, నీలి నీలి మబ్బుల్లో నుంచి రెక్కల గుర్రమెక్కి వచ్చిన వూహ లేదు...రివాల్వర్స్, పదునైన బాకులు, కరుడుగట్టిన ఆలోచనలు, ఇంకిపోయిన కన్నీటి చెమ్మ...ఉరుకులు పరుగులు, రక్తసిక్త దేహాల మధ్య రాటుదేలిన యాంత్రిక జీవితంలో...అభిషేకించబడిన హిమక్షీరధారలో ఈ దేహం పునీతమైనదా?"
******************
మోకాలి మీద చుబుకాన్ని ఆనించి, ఎడమ చేతిని కార్తికేయ చేతికి అప్పగించి అలానే చూస్తోండిపోయింది మోహన. ఆమె చీర కుచ్చెళ్లు కొద్దిగా పైకి వెళ్ళాయి. ఆమె లేలేత తెల్లటి పాదాలు మెరుస్తున్నాయి. ఆమె ఎడమ చేతిని తన చేతిలోకి తీసుకుని గిన్నెలోని గోరింటని ఆమె చేతికి అలంకరిస్తున్నాడు.
ఇదో అద్భుత సన్నివేశం. ఇంటరాగేషన్ చేయవలిసిన చేతులు గోరింటను పెడుతున్నాయి.
కరుడుగట్టిన నేరస్థురాలు గోరింట పెట్టించుకుంటోంది.
ఆమె అరచేతిలో గోరింట పూచినట్టు.....ఆ క్షణం అతనికి, ముగ్ద గుర్తుకు వచ్చింది. ఇలాంటి విచారణ ఏ కథలోనూ చదివిన జ్ఞాపకం లేదు.
"చెప్పండి మీరు అడిగిన మీకు కావాల్సిన సమాచారం మాట ప్రకారం ఇస్తాను...మీకిచ్చిన మాట నిలబెట్టుకుంటాను...ఆ రోజు రావణుడి మృత్యురహస్యం విభీషణుడు చెప్పాడు సాకేతపుర సామ్రజ్య క్షితిపాలుడికి, శ్రీరాముడికి..
వెరైటీగా, ఈ రోజు, నా మృత్యు రహస్యం నేనే చెబుతున్నాను."
"మీ ప్లాన్ ఏమిటి?" గోరింట పెడుతూ అడిగాడు.
మత్తు ఇవ్వకుండా డాక్టర్ గుండె ఆపరేషన్ చేస్తున్న ఫీలింగ్ కలిగింది మోహనకు...
"విధ్వంసం " చెప్పింది మోహన.
"అదే ఎలాంటి విధ్వంసం? ఎక్కడ జరిగే విధ్వంసం?
"ప్రపంచమంతా పూజించే తిరుమల తిరుపతి తిరుమలేశుడి సన్నిధిలో....జరగబోయే, జరిగే విధ్వంసం"
గగుర్పాటు పడిన కార్తికేయ చేతిలోని గోరింట గిన్నె కింద పడి గోరింట నేల ఒలికింది.
"సరిగ్గా ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్రపతి తిరుపతి వస్తున్నాడు. దైవభక్తి పరాయణుడు అయిన రాష్ట్రపతి తన హోదాలో చేసే చివరి పర్యటన....తిరుపతి పరిసర ప్రాంతాన్ని నో ఫ్లైయింగ్ జోన్ గా మార్చారు. ఆత్మాహుతి దళం...వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద జరిపిన పద్దతిలో దాడి చేస్తుంది. రాష్ట్రపతిని మొదటిసారి టార్గెట్ చేస్తూ చేస్తోన్న దాడి...అదే సమయంలో మిలిట్రీ స్థావరాలకు సంబంధించిన వివరాలు వున్న పెన్ డ్రైవ్ లోపాయికారిగా సంపాదించి దాని సాయంతో రూపుదిద్దుకున్న ప్లాన్ ప్రకారం మిలిటరీ స్థావరాల మీద దాడి జరుగుతుంది. ఓ వైపు రాష్ట్రపతి మీద ఎటాక్...మరో వైపు మిలిట్రీ స్తావరాల పైన...దాడి...ఆపై శాంతిభద్రతల సమస్య ...ఇదే అదునుగా ప్రధాన నగరాల్లో విధ్వంసం కొనసాగుతుంది."
ఊపిరి బిగపట్టాడు...మొహమంతా చెమట పట్టింది. కార్తికేయ ఇంత ఆందోళనకు ఎప్పుడూ గురి కాలేదు.
"ఇంత ఇంత విధ్వంసం అవసరమా? భరతభూమిని మరుభూమిగా మార్చి ఈ దేశాన్ని పరిపాలిస్తావా? ఆవేదనగా అడిగాడు.
"ఇప్పటి వరకూ మరుభూమిలోనే బ్రతికాను...ఎవరూ లేని అనాథను...ఇప్పడైనా నియంతనై పాలిస్తాను"
కార్తికేయ మనసు భారమైంది. ఒక నిజాన్ని నిజాయితీగా చెప్పినందుకు మోహనను అభినందించాలో ఒక మహావిధ్వంస రచన చేసినందుకు శిక్షించాలో అర్థం కావడం లేదు.
"మోహనా, ఈ విధ్వంసాన్ని ఆపలేవా" మొదటి సారి బేలగా అడిగాడు.
"నువ్వు నన్ను జీవితాంతం నీ భార్యగా చూసుకోగలవా? నా మెడలో మూడు ముళ్ళు వేసి నీ అర్థాంగిగా స్వీకరించగలవా?" మోహన సూటిగా అడిగింది.
కార్తికేయ బదులివ్వలేదు...నవ్వింది మోహన...
"నిన్న పరిచయం అయిన అమ్మాయిని ఆ ప్రేమను మర్చిపోయి నన్ను చేసుకుంటావా? అని అడిగితే అంత ఆలోచిస్తున్నావు...ఇరవై ఏళ్ళకు పైగా నాతో పాటు నీడగా పెరిగిన నా కోరిక...నా జీవిత లక్ష్యాన్ని నేనెలా వదులుకుంటాను....నాకంటూ ఎవరూ లేరు...వేదనలు...ఇంకిన కన్నీళ్లు...ఘనీభవించిన విషాదాలు...వీటి నుంచి నన్ను తరిమేసి...నేను కోరుకున్న స్వర్గానికి నన్ను చేర్చే లక్ష్యం..ఇది..."
"ఇది లక్ష్యం కాదు మోహనా...మహా విధ్వంసం....ఈ సృష్టిలో వేల సంవత్సరాలు మనుష్యులు బ్రతికిన దాఖలాలు లేవు...ఆ దేవుడే యుగంతో పాటు అవతారాన్ని చాలించాడు..ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు బ్రతుకుతావు మోహనా...బ్రతికినా ప్రతీ క్షణం శత్రువుల నుంచి నీ ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో మనశ్శాంతి కోల్పోయి బ్రతకాలి...నీ కోసం బ్రతికే మనిషి అసలు ఎవరైనా వున్నారా? నీ కోసం కన్నీళ్లు కార్చే ప్రాణి ఉందా?"
కార్తికేయ ఉద్వేగంగా అన్నాడు.
"అందుకే..అందుకే ఈ విధ్వంసరచన .." మనసులో అనుకుంది మోహన.
***************************
రాత్రి పదకొండు దాటుతుండగా వచ్చాడు కార్తికేయ..డిటెక్టివ్ శ్యాంసన్ తో కలిసి ముగ్ధను ట్రేస్ అవుట్ చేయడానికి ప్రయత్నించాడు. రాష్ట్రపతికి పొంచి వున్న ప్రమాదం గురించి ఇప్పుడే చెప్పకూడదు.
మోహనను తను హౌస్ అరెస్ట్ చేసినా ఆమె చేసిన స్కెచ్ ప్రకారం అంతా జరుగుతుంది. మోహన శత్రువు అయినా ఆమె తెలివిని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు.
ఇంట్లోకి అడుగు పెట్టి ఇంకా లైట్లు వెలుగుతూ వుండడం చూసి ఆశ్చర్యపోయాడు. డైనింగ్ హాల్ లో డైనింగ్ టేబుల్ మీద తల పెట్టి కళ్ళు మూసుకుంది మోహన. ఆమె రెండు చేతులు గోరింట చెదరకుండా చేతులను క్రాస్ ఆకారం లో పెట్టుకుంది.
తను శ్యాంసన్ తో పాటే హోటల్ లో భోం చేసాడు. కళ్ళు తెరిచింది మోహన. ఎదురుగా కార్తికేయ...
"భోం చేస్తారా? అడిగింది..తన ప్రశ్న తనకే చిత్రంగా అనిపించింది, మోహనకు..ఇదివరకెప్పుడూ లేనిది..
"నేను తినే వచ్చాను..మీరు తిన్నారా?
తలూపింది మోహన...కార్తికేయకు అలసటగా వుంది."గుడ్ నైట్ " చెప్పి తన గదిలోకి వెళ్ళాడు.
**********************
అర్థరాత్రి పన్నెండు దాటింది. సడెన్ గా మెలుకువ వచ్చింది. ఫ్రిజ్ దగ్గరికి వెళ్లి చల్లటి నీళ్ళు తాగి, అప్రయత్నంగా మోహన గది వైపు చూసాడు. తలుపులు వేసుకోలేదు...వెళ్లి ఏసీ ఆన్ చేసి తలుపులు దగ్గరగా వేయబోయి ఆగిపోయాడు.
రెండు చేతులు వెనక్కి పెట్టుకుని నిద్రపోతుంది. అదికాదు అతను ఆలోచిస్తుంది...మోహన రెండు చేతులకు పట్టి వున్న గోరింట..అంటే దీన్ని బట్టి చూస్తే మోహన భోజనం చేయలేదు, చేసే అవకాశం లేదు..ఉదయం నుంచి...చివుక్కుమంది కార్తికేయ మనసు. తనతో పాటు తన ఇంట్లో వున్న మనిషి ఎంత శత్రువైన సరే, తను భోజనం చెయ్యకుండా వుంటే తను బయట బోంచేసి వచ్చి యింట్లో వున్న తన ఆకలి విషయం మార్చాడు. ఆనాదిగా పేరుగాంచిన భారతీయుల ఆదరణ ఆకలి దప్పుల తీర్చే ఆప్యాయతకే తీరని మచ్చ. ఏదో గిల్టీ ఫీలింగ్. వెంటనే కిచెన్ లోకి వెళ్ళాడు.
అయిదు నిమిషాల తర్వాత కంచంలో అన్నీ వడ్డించుకుని, అన్నం కలుపుకుని, మొహనకై తెచ్చాడు కార్తికేయ...లోన చూస్తె బెడ్ మీద మోహన కనిపించలేదు.
డంగై పోయాడు కార్తికేయ, ఇప్పుడుదాక పడుకున్న మోహన ఏమైనట్టో?

No comments: