ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 20 April 2013

ఆగష్టు1...

టాగ్ లైన్ : డేట్ తో డిష్యుం...డిష్యుం
20-04-2013
(10th Chapter)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
******
"ఒక అలజడి పడుతున్న మేఘం మనసును తాకి వెళ్లినట్టు, ఒక కంపనం వేన వేల ప్రకంపనాలుగా మారినట్టు...చిన్నగా వణికింది, బాగా వణికిపోయింది. ఒకప్పుడు డోర్ బెల్ శబ్దాన్ని తన గుండె సవ్వడిగా భావించేది..ఎప్పుడెప్పుడు ఎదురు వెళ్దామా ..అన్న ఆత్రం ఆమె కళ్ళల్లో, చేతల్లో కనిపించేది. అదే భర్త, అదే ఇష్టం..,అదే ప్రేమ...కానీ కొత్తగా భయం..."
భర్త ఫోటోని పదిలంగా టేబుల్ మీద పెట్టి మొహానికి పట్టిన చెమటను కొంగుతో తుడుచుకుని వెళ్లి తలుపుతీసింది.
ఎప్పుడూ చిరునవ్వుతో ఎదురు వచ్చే భార్య కంగారుగా తలుపు తెరవడం అతని నోటీసులోకి వచ్చింది.
"ఏమైందీ రాధీ...ఆర్యూ ఆల్ రైట్" భార్య నుదురు మీద చేయి వేసి అడిగాడతను.
"మీరు నా పక్కనుండగా నేనెప్పుడూ ఆల్ రైట్ గానే వుంటాను" భర్త చేతిని రెండు చేతుల్లోకి తీసుకుని అంది.
భార్య మొహంలోకి పరిశీలనగా చూసాడు. ఆమెలో ఏదో ఆందోళన..."రాధీ కప్పు కాఫీ ...వన్ బై టు" చెప్పాడు అతడు.
"వన్ సెకన్...వేడి వేడి పొగలు కక్కే ఫిల్టర్ కాఫీ" అంటూ కిచెన్ లోకి వెళ్ళింది.
రాధాచంద్రిక కిచెన్ లో కాఫీ కలుపుతూ హాల్ వంకే చూస్తోంది. ఎప్పుడూ లేనిది భర్త ఈ టైములో రావడం...ఒక వేళ ఫోన్ వస్తే? ఆ ఆలోచనే ఆమెను కలవరపాటుకు గురి చేసింది. కాఫీ కలిపి కప్పులో పోసింది.
ఆమె భయాన్ని రెట్టింపు చేస్తూ ఫోన్ మోగింది. అదీ ల్యాండ్ ఫోన్....
ఆటను ఫోన్ లిఫ్ట్ చేసాడు. అతని మొహంలోని భావాలను చదివే ధైర్యం కోల్పోయింది. ఆమె చేతిలోని కప్పు కిందికి జారిపోయింది.
ఫోన్ లో అవతలి వారి మాటలు వింటున్నప్పుడు అతని మొహంలో ఫీలింగ్స్, రంగులుగా రూపాంతతరం చెందుతున్నాయి.
============+++==============
"చెప్పండి....ఈ యాడ్ ని డిఫరెంట్ గా ఎలా తయారు చేస్తారు" చంద్రహాస్ ఆసక్తిగా అడిగాడు.
"అసలు యాడ్ ఇవ్వవలిసిన అవసరం ఉందా? సూటిగా అడిగింది సంధ్య.
షాకింగ్ గా చూసాడు."ఏమిటి మీరంటున్నది? అడిగాడు.
"ప్రణవి గారు తప్పిపోలేదు. మిస్సయ్యారు..మిస్సయిన వ్యక్తిని వెతికి తీసుకురమ్మని అంటున్నారు...ప్రణవి గారిని వెతికే తీరిక ఎవరికి వుంటుంది? ప్రణవి గారి గురించి అటెన్షన్ రావాలంటే ...? అని ఆగి చంద్రహాస్ వంక చూసింది.
"రావాలంటే...?" యాంగ్జయిటీగా అడిగాడు
"ప్రణవి గారి గురించి మీరు ఓ సీరియల్ రాయాలి " చెప్పింది సంధ్య.
"వాట్? ఒక్క సారిగా అన్నాడు. నేను సీరియల్ రాయడమేమిటి? ఓ వైపు నేను నా భార్య గురించి ఆందోళన పడుతుంటే...సీరియల్ రాయమంటారేమిటి? చంద్రహాస్ అసహనంగా అన్నాడు.
"ప్రజలంతా ఆసక్తిగా ప్రణవి గారి గురించి వెతకాలంటే...మీరు సీరియల్ రాయాలి. ప్రణవి గారి గురించి, తను మిస్సవ్వడం...మీ ఫీలింగ్స్ ఇవ్వన్నీ ప్రజలకు తెలిస్తే వారి స్పందన అద్భుతంగా వుంటుంది ..ఎలాగైనా ప్రణవి గారిని వెతకాలన్న ఆలోచన వారికి వస్తుంది. ఇంత గొప్పగా ప్రేమించే మీకు ప్రణవి గారు దొరకాలని కోరుకుంటారు." సంధ్య చెప్పడం ఆపి, చంద్రహాస్ మొహంలోకి చూసింది.
చంద్రహాస్ ఆలోచనలో పడిపోయాడు. సంధ్య చెప్పిన దాంట్లో కొంత నిజం వుందని అనిపించింది. కానీ ఇది ఇదెలా సాధ్యం? అదే ప్రశ్న సంధ్యను అడిగాడు.
"మీరు ఒప్పుకుంటే, సరేనంటే మా ఎడిటర్ గారితో మాట్లాడుతాను.."
"ఓకే మీ ఎడిటర్ గారితో నేను మాట్లాడుతాను..మరి ఈ సీరియల్ నేనెలా రాయగలను...నేను రైటర్ ని కాను..."
"మీరు ముగ్ధమోహనం సీరియల్ చదివారా? అడిగింది సంధ్య.
"లేదు...కానీ విన్నాను..అదే సమయంలో నేను నా ప్రణవిని మిస్సయ్యాను. ప్రణవికి ఆ సీరియల్లో కార్తికేయ పాత్ర అంటే చాలా ఇష్టం" సిన్సియర్ గా చెప్పాడు చంద్రహాస్.
"ఆ సీరియల్ రైటర్ తో మీ కథను సీరియల్ గా రాయించవచ్చు. మా ఎడిటర్ గారు చెబితే తను ఒప్పుకుంటారు..ఆఫ్ కోర్స్ నేను చెప్పినా కాదనరనుకోండి."
"ఓకే నేను ఆలోచిస్తాను...మళ్ళీ కలుద్దాం" చెప్పి లేచాడు చంద్రహాస్.
"ఓకే సర్....చిన్న రిక్వెస్ట్...ఈ సారి నేను వచ్చినప్పుడు..గౌరవంగా లోపలి పంపించమని మీ సెక్యూరిటీకి చెప్పండి సర్"
నవ్వి సరే అన్నాడు చంద్రహాస్..చాలా రోజుల తర్వాత అతని కొద్దిగా రిలాక్స్ గా వుంది.
=============++++ ===========
మిర్రర్ డిటెక్టివ్ ఏజెన్సీ...
చైర్మన్ మాళవిక బయటకు వచ్చింది. బిజినెస్ టైకూన్ చంద్రహాస్ తన ఆఫీసుకు వస్తున్నాడు. అతను తలుచుకుంటే తననే ఆఫీసుకు పిలిపించుకోవచ్చు. కానీ స్వయంగా తనే వస్తున్నారు. ఒక్కసారిగా కలకలం
...చంద్రహాస్ ఆఫీసులోకి వచ్చాడు. మాళవిక, సుకన్య ఎదురు వెళ్లారు. బొకే ఇచ్చారు. స్టాఫ్ ని పరిచయం చేసింది మాళవిక..ముఖ్యంగా సుకన్యను.
==============
"చెప్పండి సర్...మీకు మేము ఏ విధంగా సహాయపడగలం..." అడిగింది మాళవిక తన క్యాబిన్ లో కూచున్నాక.
"మీ డిటెక్టివ్ ఏజెన్సీలో ఒక చురుకైన, సిన్సియర్ డిటెక్టివ్ కావాలి" చెప్పాడు చంద్రహాస్.
"ష్యూర్ సర్...సుకన్య...మంచి బ్రిలియంట్...ఇప్పుడు తను ఓ కేసును డీల్ చేస్తోంది..అంటూ బజార్ నొక్కి సుకన్యను క్యాబిన్ కు పిలిపించింది.
"ప్రణవి మిస్సింగ్ గురించి మీకు తెలుసు కదా?
"యస్ సర్..వెరీ శాడ్....బిజినెస్ ప్రపంచంలో ప్రణవి గారి మిస్సింగ్ ఒక సంచలనం ..మిస్టరీ"
"యస్...ప్రణవిని వెతకాలి, ట్రేసవుట్ చేయాలి, ఎంత ఖర్చైన ఫర్లేదు కానీ చాలా సీక్రెట్ గా జరగాలి" చెప్పాడు
"తప్పకుండా...మీకు వర్క్ చేయడం మా అదృష్టం...కానీ ప్రణవి మేడం కేసు టేకప్ చేయడం బాధగా వుంది" సిన్సియర్ గా అంది మాళవిక.
"ఇట్స్ ఓకే .." అంటూ ప్రణవికి సంబంధించిన వివరాలు వున్నా కవర్ ఇచ్చాడు.
"ఒక కేసు తాలూకు వర్క్ వుంది..అది ఫినిష్ చేసి..మేడం ఫైల్ చూస్తాను" చెప్పింది సుకన్య,
కానీ ప్రణవి మిస్సింగ్ కు, రాధాచంద్రిక కేసుకు లింక్ వుందని ఆ క్షణం సుకన్య కు తెలియదు.
===============
(రేపటి సంచికలో...చంద్రహాస్ అన్వేషణ? రామతీర్థం ఆగమనం)

No comments: