ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 12 April 2013

విసురజ "ముగ్ధమోహనం" తొలి డైలీ సీరియల్
(Chapter---72)
(07-04-2013)
...........................................................................
"ఎక్కడో మొదలైన నా ప్రయాణంలో ఉనికిని కోల్పోయిన మోడుబారిన చెట్టుని....మమకారపు నీరు పోసి, ఆర్ద్రతను ఎరువుగా మార్చి, నాలోని అట్టడుగు పొరల్లో వున్న భావోద్వేగపు కంట తడిని చిగురింపజేసిన ప్రాణమా...నాలోని మనసును నా నుంచి వేరుచేసి తీసుకువెళ్తున్నావు....రక్తపాతమే నా జీవితమనుకున్న నాకు జీవితంలో రక్తపాశం ప్రేమావేశం ఎలా వుంటుందో చూపించావు. అమ్మవయ్యావు, స్నేహితుడివయ్యావు... చివరికి నా ప్రాణమే నువ్వయ్యావు ...ఇన్నీ అయిన నువ్వు ఇప్పుడు నా నుంచి దూరం అవుతున్నావు. .." ఆమె చేయి గాలిలో అతనికి వీడ్కోలు చెబుతోంది...అది చూసిన మనసున్న మేఘం తోటి మేఘాలతో చెప్పి, చెమ్మగిల్లి ఆమె తల మీదుగా వ్యాపించాయి....ఆకాశంలో మేఘాలు కలిసాయి...వీచే గాలి కన్నీటితో చల్లబడి చల్లగా మరుమెల్లగా ఆమె భావాలను మోసుకుని కార్తికేయ వైపు వెళ్తోంది.
నువ్వు చూపించిన నిజాయితి, ఆప్యాయత, ప్రేమ..మానవత్వం...నీ ఉన్నతమైన వ్యక్తిత్వం....నాలోని దాగున్న నన్ను నిలదీసి, కొత్త నన్నుగా మార్చాయి. ఇది నిజం...
ఆమె దుస్తులు నీళ్ళతో తడిసాయి...ఆమె నల్లటి కళ్ళు కన్నీళ్ళతో స్నానించాయి....
జనన-మరణాల మధ్య ఇంత గొప్ప అనుభూతి ఉంటుందా?
కనురెప్పల మధ్య ఇంత గొప్ప తడి తపనగా తచ్చట్లాడుతుందా?
*********************
కారులో కూచోబోతున్న కార్తికేయలో చిన్న ఉలికిపాటు...ఎవరో తనను పిలుస్తోన్నట్టు...ఎవరో తనని వెంటాడుతున్నట్టు...ఓ నీడ తన వెంబడి వస్తున్నట్టు...చిన్న ఉలిక్కిపాటు....తల వెనక్కి తిప్పాడు.....
మోహనను ఎవరో వెనక్కి లాగారు. ఒక్క క్షణం అటు ఇటు అయితే కార్తికేయ మోహనను చూసేవాడే...
మోహన తనను లాగిన జగన్నాథ్ వైపు చూసింది. రెండు చేతులు జోడించింది. ఆ రెండు చేతులను ఆప్యాయంగా తన చేతుల్లోకి తీసుకున్నాడు.
"మీరే లేకపోతే కార్తికేయను చివరిసారిగా, కనులారా చూసేదానిని కాదు" అంది మోహన.
"రాగద్వేషాల, రక్తపాతాల ఈ జీవితంలో నువ్వు ప్రేమరాహిత్యంలో దెబ్బ తిన్న పక్షివి...నా జీవితంలో ఒక మంచి పని కోసం ఒక చిన్న అబద్ధం ఆడాను. నిన్ను కొందరి మనస్సుల్లో నిలిపి ఉంచడానికి, ఈ నీళ్ళ ట్యాంక్ లో నీ కన్నీళ్లను కలిపి దాచాను. వెళ్ళు మోహనా...ఇన్నాళ్ళు దిక్కులేని దానిలా ఏదో దిక్కులో వున్న నువ్వు ఇప్పుడు సూర్యుడు ఉదయించే తూరుపు దిక్కుకు వెళ్ళు...ఇక నీకు సూర్యాస్తమయం వుండదు, వుండకూడదు ..నీ రాక కోసం కార్తికేయ మాత్రమే కాదు...నేను...నా లాంటి చాలా మంది ఎదురుచూస్తారు. ఆల్ ది బెస్ట్..." ఆమె చేతిని స్నేహపూర్వకంగా నొక్కి వదిలి చెప్పాడు.
మోహన అక్కడి నుంచి కదిలింది.
***************
మోహన వెళ్ళిన కాసేపటికి జగన్నాథ్ RAW ("రిసెర్చ్ & ఎనాలిసిస్ వింగ్") కు ఫోన్ చేసాడు. డైరెక్టర్ తో మాట్లాడాడు.
"థాంక్యూ సర్ ...నా మీద గౌరవంతో మోహనను ఒక గొప్ప 'రా' ఆఫీసర్ గా తీర్చిదిద్దడానికి ఒప్పుకున్నందుకు...జీవితంలో ఏ తప్పూ చేయని వాడు తప్పు చేస్తుండవచ్చు..కానీ ఒకసారి చేసిన తప్పును గుర్తించిన వ్యక్తీ మళ్ళీ ఆ తప్పు చేయరు...మోహన గొప్ప ఆఫీసర్ అవుతుంది. ఈ దేశాన్ని కబళించే వారి పట్ల సివంగిలా మారుతుంది. ఎందరు ఉగ్రవాదులకో, బందిపోట్లకో క్షమాబిక్ష పెట్టిన మనం ఒక మారిన మనిషిని అస్త్రంగా మారుద్దాం.
కార్తికేయ ఏ ఆశయం కోసం అహరహం తపించాడో, తన ప్రాణాలను పణంగా పెట్టాడో....ఆ ఆశయాన్ని నెరవేర్చే ఆయుధంగా మోహనను మార్చి కార్తికేయ దేశభక్తికి కానుకగా ఇద్దాం, జై హింద్" అంటూ
జగన్నాథ్ ఫోన్ పెట్టేసాడు..
అతని కళ్ళ ముందు ముగ్ధ రూపంలో వున్న మోహన "దేశాన్ని కాపాడే యోధురాలిగా కనిపిస్తోంది... " ఈ మహిలో ధరిత్రి ఎరుగని మహత్తర
చరిత్ర...
ఒక రచయిత సృజించిన పాత్ర..త్రివర్ణ పతాకంలో సప్తవర్ణశోభితమయ్యే రోజు దగ్గలోనే వుంది....అస్తూ...తథాస్తు.
*********************
ఆ గదిలో తన మది తలుపు తెరిచింది. గుండె బరువు దిగేవరకూ కార్తికేయ హృదయానికి కన్నీటి అభిషేకం చేసింది. క్షణాలు, నిమిషాలు...గంటలు గడిచినా ముగ్ధ కార్తికేయను వదిలిపెట్టలేదు.
వూళ్ళో వున్న పూర్ణిమకు ఫోన్ చేసింది ముగ్ధ.
పూర్ణిమకు ఏడుపు తన్నుకు వస్తోంది.ఎంతకాలమైంది?
"పూర్ణీ... నేను, నా కార్తికేయ కలిసివస్తున్నాం. నా పెళ్లి కన్నా ముందు నీ దత్తత స్వీకారం జరగాలి. నిన్ను నా చెల్లెలుగా, మా నాన్నకు చిన్నకూతురిగా...నా తమ్ముడికి అక్కగా స్వీకరించే శుభలగ్నంతో వస్తున్నాను...ఎందుకంటే ఇక నుంచి నాన్నను, తమ్ముడిని చూసుకోవలిసింది నువ్వే కదా"
ముగ్ధ అంది.
పూర్ణిమ ఫోన్ పక్కన పెట్టి గుడికి పరుగెత్తింది. గుడి తలుపులు మూస్తున్న పూజారిని వారించింది. జగన్నాథుడి ముందు మోకరిల్లింది.
"నిన్ను రోజు తిట్టి పోస్తున్నానని భయపడి, అనాథనైన నన్ను ఓ ఇంటికి కూతురిగా పంపిస్తున్నవా? ఇందుకే నన్ను అనాథను చేసి నాతో తిట్లు తిన్నావా ? సారీ..నన్ను క్షమించు. ఇక నిన్నెప్పుడూ తిట్టాను...కాకపోతే నాకూ కార్తికేయ లాంటి మంచి మొగుడిని వెతికిపెట్టు ..లేదంటే నిన్ను వదిలిపెట్టను...నిన్నే.." అని చెంపలు వేసుకుని బయటకు పరుగుపెడుతుంటే పూజారి మొదటి సారి ఏడ్చేశాడు.
"స్వామీ ఆ అమాయకురాలిని మన్నించు...ఇకనైనా ఆ తల్లిని చల్లగా చూడు" అని వేడుకున్నాడు.
***************
ముగ్ధ కార్తికేయల పెళ్లికి దేవతలంతా ఆహుతులే...రాష్ట్రపతి ప్రత్యేక కానుక పంపించాడు. సి బి ఐ చీఫ్ తరలివచ్చాడు...
అదే సమయంలో మోహన రాజస్థాన్ ఎడారిలో ఒకప్పుడు కార్తికేయ పొందిన శిక్షణ పొందుతుంది...దేశద్రోహులపై ఎక్కు పెట్టిన ఆయుధంగా మారబోతుంది. ఏదో ఓ రోజు మోహన కార్తికేయను తప్పక కలుస్తుంది.... మోహనగా, ముగ్ధమోహనంగా, మనోహరంగా..../
(అయిపోయింది )
ముగ్ధమోహనం...ఒక వీడ్కోలు/చివరి మాట....
"నా కలం కాలయంత్రమై, పాత్రల భావోద్వేగాలను, భూత, భవిష్యత్తు, వర్తమానాల వైపు తీసుకు వెళ్తూ,
నా స్వరం మీ పరమై, పాత్రల గళమై...అభిమానపు యవనికపై, అందమైన స్మృతి సంతకమై...
నా ప్రతీ అక్షరం...మీ ఆదరణలో తడిసి ముద్దయి, మీ అభిమానంతో ధన్యమై...వర్ధిల్లి, పరిఢిల్లి....
మీ మస్తిష్కపు ఆత్మీయ అతిథి అయిన వేళ...ఈ చివరి వీడ్కోలు మాట...పల్లవించిన చరణపు పూదోట....
ఇది కలా? నిజమా? నిజం లాంటి కలా?
సస్పెన్స్ ని కంటిన్యూ చేస్తూ నిర్వివిరామంగా దాదాపు డెబ్భై రోజులు...డైలీ ధారావాహిక...నా ప్రపంచంలో నిశ్శబ్ద అక్షర శ్రామికుడినై, కవన సేద్యం చేసుకుంటున్న వేళ ....ఈ విశ్వమనే కాన్వాసుపై, సాహితీ యవనికపై...విశ్వమంత విస్తరించిన నవలిక...
అసలు నేను రాయగలనా? మొదట రాయగలనా అనుకున్నా!
మనసులోని భావాలను అలతి అలతి పదాలతో కవితను మాలగా అల్లగలనేమో...కానీ, కొన్ని పాత్రలు ఆ పాత్రల తీరుతెన్నులు, పాత్రల భావోద్వేగాలు, మంచి చెడులు, యివన్నీ ఒక ముడి వేసి, మరో కొసమెరుపుతో ముడి విప్పి...ఏ రోజుకా రోజు వీక్షకుల కళ్ళు అక్షరాల వైపు పరుగెత్తేలా చేసి....కధా, కధన కుతూహలాన్ని......అందించడం..నా వల్ల అవుతుందా? సందిగ్దంలో పడ్డా, మధన పడ్డా..
ముగ్ధమోహనం (టైటిల్ నుంచి) ప్రారంభంతో మొదలైన యజ్ఞం...ముందుగానే స్క్రిప్ట్ మొత్తంగా ఇచ్చినా, కొన్ని తాజా సంఘటనలు వచ్చి చేరడంతో ఒకొక రోజు మరి ఆ రోజు స్క్రిప్ట్ ని అర్ధరాత్రి వేళ మార్చి, ఏ తెల్లవారు ఝామునో మెయిల్ చేయడం...
ఈ సీరియల్ లో ప్రతీ ప్రయోగం వెనుక అక్షర ప్రసవ వేదన వుంది. ఆహ్లాదం కలిగిస్తూనే, ఆలోచన కలిగించాలి...సమస్యను చర్చించాలి...భావుకత్వం, భావోద్వేగ ఆవిష్కరణ...సమపాళ్ళలో వుండాలి...
రచయితకు స్వేచ్చ వుంటుంది...ఆ స్వేచ్చ చుట్టూ సన్నని సరిహద్దు రేఖ వుంటుంది. ఆ రేఖ దాటకుండా నేను అనుకున్నది అనుకున్నట్టుగా చెప్పగలగాలి.
మోహన పాత్రలో ఎన్నో షేడ్స్ ...ఒక చట్రంలో వుండి రాసిన రచన కాదు. కొన్ని సార్లు పాత్రలు నన్ను డామినేట్ చేసాయి...నా ప్రమేయం లేకుండానే నేను మోహన పాత్ర మీద మమకారం పెంచుకుంటున్నానా
? అన్న సందేహం కలిగింది ..ప్రతీ పాత్ర నన్ను హాంట్ చేస్తూనే వుంది...
ముఖ్యంగా క్లయిమాక్స్ ఎపిసోడ్...దాదాపు పదహారు గంటల సమయం పట్టింది. ఒక్కోసారి కళ్ళలో కన్నీళ్లు తిరిగేవి...
ఫస్ట్ అటెంప్ట్...ఒక కథను సీరియల్ కాన్వాసుపై చిత్రించడం ఎంత కష్టమవుతుందో అనుభవవేద్యమైంది.
ఒక సీరియల్ పూర్తవ్వక ముందే మరో సీరియల్ ప్రకటన..మర్చిపోలేని అనుభవం...అందుకు కారణమైన మేన్ రోబో వీక్షకులకు, ఏ రోజుకా రోజు నా సీరియల్ మిస్సవ్వకుండా చదివి, కామెంట్ చేసి, నాకు అక్షర ఆక్సిజన్ అనే అభిమానపు ప్రాణవాయువుని ప్రేరణగా అందించిన పేస్ బుక్ మిత్రులకు శత కోటి కృతఙ్ఞతలు.
'దేశాన్ని పాదాక్రాంతం చేసుకోవాలని మహా విధ్వంసాన్ని సృష్టించడానికి సిద్ధపడ్డ మోహన అదే దేశాన్ని కాపాడడానికి ఆయుధంగా మారింది....కొన్ని పాత్రలు రచయిత ప్రమేయం లేకుండా వర్ధిల్లుతాయి. ఓ చిన్న ఆలోచన నుంచి ఊపిరి పోసుకున్న జగన్నాథ్ పాత్ర ఈ కథ కీలకమైన మలుపు తిరగడానికి కారణమైంది...ప్రేరణ అయింది."
ధన్యవాదాల క్రమంలో...మొదటగా...నాకు తెలుగు భాష మీద మమకారాన్ని కలిగించిన మా మాస్టారు...దత్తాత్రేయ మాస్టారుకు ....
అభిమన్యుడు తల్లి కడుపులో వుండి పద్మవ్యూహాన్ని తెలుసుకున్నాడు..ట.....ఈ సంస్కారాన్ని, ఈ విద్వత్తుని, ఈ జన్మని ప్రసాదించిన మా అమ్మా నాన్నల పాదపద్మాలకు ఈ అక్షర పుష్పాలు పాదాభివందనం చేస్తున్నాయి. మా తండ్రి గారు ఈ మధ్యనే పరమపదించారు, వారి సంవత్సరికాలు ఈ నెలాఖరులో వున్నాయి, అయినా ఆయనా పైనుంచి వారి అందించే ఆశీర్వాదం నా వెన్నంటి వుంది నన్ను నడిపిస్తూనే వుంది అని గట్టిగా నమ్ముతున్న.
"అర్ధరాత్రి సీరియల్ రాస్తున్నప్పుడు...ఉదయమే పిల్లలను స్కూల్ కు తీసుకువెళ్ళే పని వాయిదా వేసినప్పుడు, నేను అలిసినప్పుడు, నా పని ఒత్తిడిలో, ఈ అక్షర యజ్ఞంలో వున్నప్పుడు నన్నర్ధం చేసుకుని నా ఒత్తిడిని గుర్తించి సహకరించి సర్దుకుపోయిన "నాలో సగమైన నా జీవిత భాగస్వామి శ్రీలక్ష్మికి, నా రెండు కళ్ళు...నా పిల్లలు/బిడ్డలు చిరంజీవి అనిల, చిరంజీవి సాకేత్ లకు... ప్రేమతో వారికి ఎంత చెప్పిన తక్కువే అనురాగ కృతఙ్ఞతల మన్ననలు".
ముగ్ధమోహనంలో ముగ్ధత్వంతో పాత్రలుగా ఒదిగిపోయిన...నిజ జీవిత ఆత్మీయ మిత్రుల పేర్లు పాత్రలుగా అచిరకాలం ఊపిరి పోసుకుంటాయి...వారిని మనసా స్మరామి...స్మరామి అని తలుచుకుంటున్నాను, వారికి థాంక్స్ తెలుపుకుంటున్నాను.. బహుశా నిజ జీవిత మిత్రులను పాత్రలుగా సీరియల్ లో ప్రవేశ పెట్టి ఒప్పించడం అనుకున్నంతా సులువు కాదని తెలిసినా మొండి ధైర్యంతో ముందుకెళ్ళా... చాలా రోజుల తర్వాత...ఒక అద్వితీయమైన ఆనందాన్ని, అబ్బురాన్ని అనుభూతిస్తున్నాను. ఒక మహారచయత విజయార్కె లాంటి పెద్దవారి పద చిహ్నాల మద్దతుతో సాగడం వల్ల అక్షర జర్నీ సులువయ్యింది. అంతటి మేధావిని కధతో ఒప్పించడం నా సుకృతం. అలాగే వారి పరిచయంకు దోహదపడిన శ్రీమతి జ్యోతి కూచన గారికి (M.D. ...మాన్ రోబో గ్రూప్) కూడా అనేకనేక థాంక్స్ చెప్పుకుంటున్నా.
నా అక్షరాలకు వేదికై రచయితగా నా పాపులారిటీకి
కారణమైన మేన్ రోబో టీంకు కృతఙ్ఞతలు.
ఆగష్టు1 సీరియల్ తో త్వరలో మళ్ళీ మీ ముందుకు రాబోతున్నాను, స్వీకరించగలరు, సహకరించగలరు, ఆశీర్వదించగలరు.

No comments: