ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 1 May 2013

""ఆగష్టు1""......
టాగ్ లైను....డేట్ తో డిష్యుం...డిష్యుం
26-04-2013 (16th Chapter)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
******
షవర్ ధార క్రింద రాధాచంద్రిక...
ఆమె మనసు ఆందోళనతో నిండి వుంది. ఎప్పుడే క్షణం ఏమవుతుందో....ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే భర్త సాన్నిహిత్యాన్ని తను శాశ్వతంగా కోల్పోతుంది. తనకు తన భర్త కావాలి. అతను లేని ప్రపంచం తనకు వద్దు...పోనీ తను నిజం చెప్పేస్తే...? ఆ నిజం భర్త తట్టుకోగలడా? అసలు ఆ బ్లాక్ మెయిలర్ తన నుంచి ఆశిస్తున్నది ఏమిటి?
ఇలా ప్రతీ క్షణం తను భయపడుతూ, తన భర్తను మనస్ఫూర్తిగా దగ్గరికి తీసుకోలేకపోతున్న తన నిస్సహాయత మీద తనకు కోపం వస్తుంది. తను ఇంతగా భయపడడానికి కారణమైన ఆ సంఘటన ఆమె కళ్ళ ముందు ఇంకా కదలాడుతూనే వుంది.
ఆ రోజు...
===========
మంచం మీద వెల్లికిలా పడుకుని "ముగ్ధమోహనం" నవల చదువుతోంది రాధాచంద్రిక...ఆ నవల ఇప్పటికే మూడు సార్లు చదివింది. అయినా మళ్ళీ, మళ్ళీ చదవాలనిపించే నవల..అందులో కార్తికేయ పాత్ర రాధా చంద్రికకు బాగా నచ్చింది.కేవలం కథల్లో కనిపించే హీరో పాత్రలా అనిపించలేదు. బహుశా తను అమ్మాయి కావడం వల్ల, ప్రతీ అమ్మాయి ఊహల్లో ఒక ధీరోదాత్తుడైన హీ మేన్ వెంటాడుతూ ఉంటాడు. అలాంటి వాడు భర్తగా రావాలని అనుకుంటుంది. ఆ క్వాలిటీస్ వున్న హీరో కార్తికేయ. అయితే ఆ క్వాలిటీస్ తన భర్తలోను వుండడం వల్ల ఆ నవల మరింత నచ్చింది.
చిత్రంగా తన భర్తకు ముగ్ధ పాత్ర నచ్చింది. అబ్బాయిల ఊహల్లో వుండే అమ్మాయిలా వుంది కదా...మరి తనలో భర్త ముగ్ధను చూసుకున్నాడా? అదే ప్రశ్న భర్తని అడిగితే నవ్వి "చూసుకోవడం ఏమిటి? నువ్వే నా ముగ్ధవి అయితే.." అన్నాడు.
వెంటనే భర్తని గట్టిగా వాటేసుకుంది. ఎక్కువ బాధ కలిగినా, సంతోషం కలిగినా ఆమె చేసే మొదటి పని అది. ఫీలింగ్ ఎలాంటిది అయినా తన భర్త స్పర్శతో ప్రతీ క్షణం టచ్ లోనే వుండాలన్నది ఆమె ఫీలింగ్ .
నవల మంచి సస్పెన్స్ లో వుండగా ఆమె జీవితాన్ని సస్పెన్స్ లోకి నెట్టే సంఘటన జరిగింది.
ముగ్ధ కార్తికేయ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్న ఎపిసోడ్ చదువుతుంది. అప్పుడే ఆ ఇంట్లో బెడ్ రూంలో వున్న ల్యాండ్ ఫోన్ మోగింది. ఒక్కక్షణం ఆశ్చర్యపోయింది. ల్యాండ్ ఫోన్ మ్రోగడం తక్కువ. మొబైల్ కల్చర్ వచ్చేక, కేవలం అలంకారప్రాయంగా వున్న ల్యాండ్ ఫోన్...ఇప్పడు సడెన్ గా మోగడంతో వెంటనే లిఫ్ట్ చేసింది.
"బెడ్ రూంలో ఒంటరిగా వెల్లికిలా పడుకుని నవల చదువుకుంటున్న అందమైన అమ్మాయికి శుభోదయం.." అవతలి వైపు గొంతు విచిత్రమైన ధ్వనిలా వుంది.
ఒక్క క్షణం చీర కొంగు సరిచేసుకుంది. ఎవరో తనని గమనిస్తోన్న ఫీలింగ్. చుట్టూ చూసింది. తనని చూస్తూ మాట్లాడుతున్నట్టు...
"ఎ..ఎ..ఎవర్నువ్వు? కోపంగా అడిగింది.
"నీ నీడననుకో...నీ ప్రియమైన శత్రువుని అనుకో.." అవతలి గొంతు పలికింది.
"షిట్..మొబైల్ అయి వుంటే నంబర్ డిస్ ప్లే అయి వుండేది ..ల్యాండ్ ఫోన్..అందులోనూ ఓల్డ్ మోడల్ .."
"అసలు ఎవర్నువ్వు..నీకేం కావాలి? ఈ న్యూ సెన్స్ ఏమిటి? ఈ విషయం మా ఆయనకు తెలిస్తే..." ఆమె మాట పూర్తి కాకుండానే అవతలి వైపు నుంచి తెరలు తెరలుగా నవ్వు వినిపించింది.
"పూర్ రాధాచంద్రికా ..మీ లాంటి భార్యలు ఇలా అమాయకంగా ఉన్నంతవరకూ...భర్తలు హ్యాపీ గా వుంటారు.."
"ఏం వాగుతున్నావ్..నా భర్త గురించి నాకు బాగా తెలుసు .." కోపంగా అంది .
"ప్రతీ భార్య తన భర్త గురించి అలానే అనుకుంటుంది. ఓకే ...ఇది నీ పర్సనల్ మేటర్ ...ఓ పని చేయి...గోల్డెన్ హిల్స్ లో వున్న మై హోం గెస్ట్ హౌస్ కు వెళ్ళు. అక్కడ ఫ్లాట్ నంబర్ పదమూడుకు వెళ్ళు. అందులో వున్న బెడ్రూమ్ కు వెళ్ళు...బెడ్ రూం లో వున్న డబల్ కాట్ దగ్గరికి వెళ్ళు...ఆ తర్వాత ...అక్కడి దృశ్యం చూసిన తర్వాత...నీ భర్త దగ్గరి వెళ్తావో విడాకుల కోసం కోర్ట్ కు వెళ్తావో నీ ఇష్టం.." అవతలి వైపు లైన్ కట్ అయింది.
ఒక్క క్షణం రాధాచంద్రిక షాకైంది. కథలో ఇది కొత్త మలుపా? తన భర్త గురించి...ఛ... ఛ ..ఇలాంటివి తను నమ్మడమా? తల విదిల్చింది. కానీ మనసులో ఏదో తెలియని అనీజీ ....
=============
గంట గడిచింది...రెండు గంటలు గడిచాయి..మూడు గంటలు....ఈ సస్పెన్స్ టెన్షన్ తన వల్ల కాదు. పోనీ భర్త కు చెబితే? వద్దు...తన మీద ప్రేమతో బ్లాక్ మెయిలర్ తో గొడవ పెట్టుకుంటాడు. పైగా తన భర్త గురించి చెడుగా చెప్పిన వాడి చెంప తనే పగలగొట్టాలి.
అయినా ఇలాంటివి పట్టించుకోకూడదు...అనుకుంది. మౌనంగా ఉండిపోతే...ఫ్రిజ్ దగరికి వెళ్లి చల్లటి వాటర్ తో మొహం కడుక్కుంది. భర్తకు ఫోన్ చేసింది.
"ఆందోళనలో వున్నప్పుడు, సంతోషంలో వున్నప్పుడు, బాధలో వున్నప్పుడు భర్తతో మాట్లాడుతుంది. ఏ ఫీలింగ్ లో వున్నా భర్త గొంతులోని మాటని మిస్సవ్వకూదదన్న" స్ట్రాంగ్ ఫీలింగ్.
సెల్ స్విచాఫ్ లో వుంది. మొదటి సారి ఆశ్చర్యపోయింది. తన భర్త సెల్ స్విచాఫ్ లో ఉండడమా?నో .నెవర్ అనుకుంది. మళ్లీ చేసింది..మళ్లీ మళ్లీ చేసింది. అప్పుడు మరో సారి మోగింది, ల్యాండ్ ఫోన్...ఉలిక్కిపాటుతో ఒక్క అంగలో ల్యాండ్ ఫోన్ దగ్గరికి వెళ్లి వణుకుతోన్న చేతితో రిసీవర్ తీసింది.
"గుడ్ ఆఫ్టర్ నూన్ ఫ్రెండ్..ఏమిటి నువ్వింకా ఇంట్లోనే వున్నవా? నీ భర్త సెల్ స్విచాఫ్ లో ఉందా? వుంటుంది...పక్కన అమ్మాయితో మాంచి...వద్దులే..సెన్సార్ ప్రాబ్లం...ఒక సారి అనుమానం కలిగాక తప్పక నివృత్తి చేసుకోవాలని లేకపోతే అది మదిని కాల్చేస్తుందని చిన్నప్పుడు తెలుగు మాస్టారు, హిందీలో గట్టిగా నొక్కి వక్కాణించేడు/చెప్పాడు...ఓకే బై" ఫోన్ కట్ అయింది.
"లాభం లేదు ...తను వెళ్ళాలి. భర్త మీద అనుమానంతో కాదు...తన భర్త అలాంటి వాడు కాదు అన్న నమ్మకం కోసం వెళ్ళాలి..." వెంటనే అపరిచితుడు చెప్పిన అడ్రెస్ కు బయల్దేరింది.
======================
గోల్డెన్ హిల్స్
మై హోం గెస్ట్ హౌస్...
ఫ్లాట్ నంబర్ పదమూడు...
మెల్లిగా తలుపు తెరిచింది...లోపల గది చీకటిగా వుంది. కిటికీ కర్టేన్స్ తీసింది...బయట నుంచి వెలుతురు లోపలి వచ్చింది. ఆ వెలుతురులో...బెడ్ రక్తంతో తడిసిపోయింది.ఆ రక్తంలో ఓ మహిళ మృతదేహం...డెడ్ బాడీ...గుండెలో దిగిన కత్తి ...పక్కనే పర్సు...తన భర్త పర్సు...చిన్న ఫ్లాష్, ఆ కంగారులో బేలైన రాధాచంద్రిక బలిఅవుతున్నదని గుర్తించలేదు.
చాలా పాత టెక్నిక్కు..కానీ సరి కొత్త క్రిమినల్ మైండ్.
===========
(ఈ సస్పెన్స్ రేపటి వరకూ...)

No comments: