ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 8 May 2013

ఆగష్టు1(టాగ్ లైను...డేట్ తో డిష్యుం...డిష్యుం)
05-05-2013
(25th Chapter)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
++++++++
మొదటి సారి భయాన్ని కళ్ళ ఎదురుగా చూసింది సంధ్యాజ్యోతి. మసక వెలుతురూ.అదో లాంటి పొగ వాసన.విశాలమైన గది మధ్యలో పెద్ద ముగ్గు...ఆ ముగ్గులో తలుచుకుంటేనే ఒళ్ళు గగుర్పొడిచే దృశ్యం.ఒక శవం ఆ ముగ్గు మధ్యలో వుంది.
చాలా కాలం క్రితం చదివిన ఒక ఆర్టికల్ గుర్తొచ్చింది. అఘోరాలకు సంబంధించినది. వాళ్ళు చేసే శవ సాధన. ఒక సీరియల్ లో చదివిన చాప్టర్...శవం మీద కూచొని శవసాధన చేసే అఘోరాలు. కాశీలో ,వారణాసిలో కనిపించే దృశ్యాలు వేరు...ఇప్పుడు ఇక్కడ....లోపల విద్యుత్తు దీపం లేదు. లాంతరు వెలుతురు..ఆ వెలుతురులో శవం నీడ గదిని ఆక్రమించుకుంది.
ఆ శవం ఎదురుగా క్షుద్ర మాంత్రికుడు. అతని కళ్ళు నెమ్మది నెమ్మదిగా తెరుచుకుంటున్నాయి. సంధ్యాజ్యోతి కి ఒక్క క్షణం అక్కడి నుంచి పారిపోతే బావుండు...అనిపించింది.
అఘోరాలకు సంబంధించిన వివరాలు రీకలెక్ట్ చేసుకుంటుంది. కొందరికి అఘోరాలు అంటే భయం. వాళ్ళు కోపంగా చూస్తె రక్తం కక్కుకుని చచ్చిపోతారన్న ప్రచారం. ఇవి మూడ నమ్మకాలా?
********************
క్షుద్రమాంత్రికుడు కళ్ళు తెరిచి సంధ్యాజ్యోతి వంక చూసాడు. అతని చూపులు భయం కలిగించేలా వున్నాయి.
"ఎవర్నువ్వు...సామాన్యులు రావాలంటే భయపడే ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చావు?"అతని గొంతులో అదో లాంటి జీర.
"చే...చేతబడుల గురించి తెలుసుకుందామని?"మెల్లిగా చెప్పింది సంధ్య.
"చేతబడులా? నేను చేతబడులు చేస్తానని నీకు ఎవరు చెప్పారు? అతని గొంతులో కోపం ధ్వనించింది.
సంధ్యాజ్యోతి మాట్లాడలేదు.
"వెళ్ళు వెంటనే ఇక్కడిని నుంచి వెళ్ళు...లేదంటే...? అని తన ఎదురుగా ముగ్గు మధ్య వున్న శవం వంక చూసాడు.
శవం తల సంధ్యాజ్యోతి వైపు తిరిగింది. ఒక్క క్షణం ఆమె గొంతులో నుంచి కేక రాబోయి గొంతులోనే వుంది పోయింది. శవం తల తిప్పడం ఏమిటి? తన భ్రమా?
ఇప్పుడు తనేం చేయాలి? ఒక వేల నిజంగా శవం కళ్ళు తెరిచిందా?
"వెళ్ళు...వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళు...వెళ్ళు...వెళ్ళూ.." అతని గొంతు స్థాయి పెరిగిపోతూ వుంది.
వెంటనే వెనుతిరిగి వడి వడిగా ముందుకు నడిచింది. డ్రైవర్ ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. సంధ్యాజ్యోర్హి సేఫ్ గా రావడంతో ఊపిరి పీల్చుకున్నాడు.
"హమ్మయ్య వచ్చారా మేడం...మీ గురించే ఎదురు చూస్తున్నాను. అయినా ఈ క్షుద్రమాంత్రికుడి తో మీకు పనేమిటి? ఇతడిని కలవడానికే చాలా మంది భయపడుతారు....పైగా ఒకప్పుడు పిచ్చివాడు..."
"ఏమిటీ ఇతడి గురించి నీకు తెలుసా? అడిగింది సంధ్య.
"అదేమీ లేదు.పదండి మేడం " అన్నాడు.
"కాదు కాదు ..నాకు చెప్పాలి "
డ్రైవర్ ఒక్క క్షణం సంధ్యాజ్యోతి వంక చూసి చెప్పాడు.
"ఒకప్పు అతడు పిచ్చివాడు...ఎప్పుడూ శ్మశానంలో ఉండేవాడు శ్వవాలు దహనం అయ్యాక అందులో నుంచి ఏమైనా దొరుకుతాయేమోనని ఏరుకునేవాడు. ఓ సారి సరిగ్గా కాలని శవం నుంచి అతనిలో ఏదో క్షుద్రశక్తి ఆవహించిందని చెబుతారు. ఆ తర్వాత చాలా కాలం కనిపించలేదు..
హటాత్తుగా ఓ రోజు కనిపించాడు... క్షుద్రమాంత్రికుడిగా ...
*************
(ఆ తర్వాత ...రేపటి సంచికలో)

No comments: