ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 26 June 2013

ఆగష్టు1...డేట్ తో డిష్యుం...డిష్యుం
18-06-2013 (chapter-69)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
******************
సూర్యుని తీక్షణత ఆమె ఏకాగ్రతను ఏమీ చేయలేకపోతుంది.సూర్యుని తేజస్సు ఆమె వర్చస్సుని చూసి నివ్వెరపోతుంది. మానవమాత్రులు భరించలేని శిక్షణ. ఇలాంటి అతి భయంకరమైన శిక్షణ పొందిన ఆరుగురిలో ఒక వ్యక్తి.మహిళగా ఒకే ఒక వ్యక్తి.
దూరంగా ఒక డేరా....ఆ డేరాలో వున్న అతి శక్తివంతమైన వాకీటాకీ నుంచి సిగ్నల్స్ వస్తున్నాయి.ఎమర్జెన్సీ సిగ్నల్స్.మోహన డేరా దగ్గరికి వెళ్ళింది.
అటు వైపు నుంచి వినిపించిన గొంతు...వేల మైళ్ళ దూరంలో వున్న,సప్తసముద్రాల ఆవల వున్న...శబ్దాన్ని చేధించుకుని గుండె పొరలను తాకే స్వర ధ్వని. అవతలి వైపు నుంచి కార్తికేయ గొంతు వినిపించింది. గాలి హిమాలయాలకు వెళ్లి హిమాన్ని తోడు తీసుకుని వచ్చినట్టు....చెవి దగ్గర పెదవులు ఆన్చి మాట్లాడినట్టు....
"మోహనా ఎలా వున్నారు...మీరో సాయం చేయాలి..."కార్తికేయ చెప్పసాగాడు.
*****************
"మీరు ఆజ్ఞాపించండి...శిరసావహిస్తాను...నేను బయల్దేరుతున్నాను " వాకీటాకీ ఆఫ్ చేసింది. కొద్ది సేపటిలో నిరంతరం సిద్ధంగా వుండే ప్రత్యేక హెలికాప్టర్ వచ్చింది.అది గగనతలం లోకి దూసుకు వెళ్ళింది.
ఒకప్పుడు తన కోసం వేటాడిన హెలికాప్టర్ ఇప్పుడు తనను సగౌరవంగా తీసుకువెళ్తుంది.ఒక మంచికి,దేశభక్తి కి దక్కే గౌరవం ఇలానే వుంటుంది.
మోహన కు చాలా సంతోషంగా వుంది.ఆ దేవుడే తనని సాయమడిగాడు. ఈ విధంగా తను కార్తికేయ ఋణం తీర్చుకోబోతుంది.
***********************
చంద్రహాస్ ఆ ఆసుపత్రి నుంచి బయటకు వచ్చాడు తలుపులు బద్దలు కొట్టుకునివచ్చాడు..బయటకు వచ్చాక అర్ధమైంది కేవలం తన కోసం చేసిన ఏర్పాటు అని.తనని పిచ్చివాడిగా చిత్రీకరించే ప్రయత్నం. ఒకప్పుడు వ్యాపారంలో ఆరోగ్యకరమైన పోటీ వుండేది.ఇప్పుడు మోసమే వ్యాపారమైంది. స్టీఫెన్ ఎంతగా దిగజారాడో అర్ధమైంది.
ఆ ఆసుపత్రిలో ఓ మూల గదిలో దొరికిన బాంబులు ఇప్పుడు అతని స్వాదీనంలో వున్నాయి. అతని చేతిలో క్షణాల్లో బుల్లెట్స్ కురిపించే అత్యంత ఆదునాతనమైన మారణాయుధం.అంటే ఈ స్థావరాన్ని వాళ్ళుఅసాంఘీక కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు. కూని రోజుల క్రితం చదివిన ఓ వార్త గుర్తొచ్చింది.సముద్రమార్గం ద్వారా అక్రమ ఆయుధాలు వైజాగ్ తీరానికి చేరుతున్నాయని.వీటిని డిస్ట్రాయ్ చేయాలి. కార్తికేయ ఇచ్చిన సలహా కూడా అదే .వీటితో పాటు వీటిని రవాణా చేసిన వారిని కూడా....
చంద్రహాస్ ఎప్పుడైతే బయటకు వచ్చాడో మాఫియా అతడిని చుట్టుముట్టింది.ఈ పరిణామం చంద్రహాస్ ఊహించినదే. చంద్రహాస్ చేతిలోని మారణాయుధం నిప్పులు కక్కింది. ఎదుటివారికి ఎటువంటి అవకాశం లేకుండానే ,నేర చరిత్ర కలిగి దేశ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే యాంటీ సోషల్ ఎలిమెంట్స్,మాఫియా భూస్థాపితమైంది.కొద్ది సేపటిలో దేశాద్రోహులకు షెల్టర్ ఇచ్చిన ఆ భవనం పాపా ప్రక్షాళన గా పేలిపోయింది.అగ్నితో పునీతమైంది. తన అన్వేషణ ముగిసింది.ప్రణవి ఎడబాటు తనతో ఒక మంచి పని చేయించింది.
******************
కార్తికేయ డ్రైవ్ చేస్తూనే వాళ్ళని ఓ కంట కనిపెడుతున్నాడు. కారుని వెనక్కి తిప్పాడు.కారు అడవి మార్గానికి మళ్ళింది. అతడిని కార్నర్ చేస్తూ రౌండప్ చేసింది మాఫియా. కార్తికేయ వాళ్ళ కదలికలను గమనిస్తూనే వున్నాడు. కుడికాలు యాక్సిలేటర్ మీద బలంగా పడింది. అది స్పెషల్ గా డిజైన్ చేయబడిన కారు. వేగంగా దూసుకు వెళ్ళిన కారు ఎదురుగా వచ్చిన మాఫియా వాహనాన్ని డీ కొట్టింది.
కొద్ది నిమిషాల వ్యవధిలోనే మాఫియా కు సంబంధించిన వాహనాలు తుక్కు తుక్కయ్యాయి. కార్తికేయ చేయి డాష్ బోర్డు లోకి వెళ్ళింది.అందులో నుంచి అతి శక్తివంతమైన బాంబ్ బయటకు తీసాడు.సేప్తీ పిన్ లాగాడు...బలంగా గురి చూసి విసిరాడు. పెద్ద విస్పోటనం...ఏనాద్రో పోలీస్ ఆఫీసర్లను బాలి తీసుకున్న మాఫియా. బ్లాక్ మెయిల్స్...నది రోడ్డు మీద నరకడాలు..బాంబ్ పేలుళ్ళలో ఉగ్రవాదులతో చేతులు కలిపిన
మాఫియా...శరీరాలు గుర్తుపట్టలేనంతగా చెల్లాచెదురయ్యారు.
************
స్టీఫెన్ కు క్షణ క్షణానికి టెన్షన్ పెరిగిపోతుంది. ప్రణవి,ముగ్ధ,సంధ్య మాత్రం హ్యాపీ గా మాట్లాడుకుంటున్నారు.సంధ్య ఇదే చాన్స్ అన్నట్టు ప్రణవి కిడ్నాప్ తర్వాత జరిగిన సంఘటనలను రికార్డ్ చేస్తుంది.తనే సీరియల్ రాస్తానంటోంది. ఇదంతా చూస్తోన్న స్టీఫెన్ కు పిచ్చెక్కిపోతుంది. ఆ బిల్డింగ్ చుట్టూ సాయుధులు కాపలా వున్నారు.కార్తికేయ ఏమయ్యాడో ఇంకా తెలియడం లేదు.చంద్రహాస్ పొజిషన్ అర్ధం కావడం లేదు.పైగా సంధ్య మాటి మాటికి క్రికెట్ స్కోర్ ఎంత అని అడిగినట్టు..."మీ వాళ్ళు ఎంత మంది పోయారు ?అని అడుగుతూ ఇరిటేట్ చేస్తుంది. ఏ ఫోన్ పని చేయడం లేదు. ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఏ ఒక్కరూ బ్రతికి లేరన్న విషయం ఇంకా స్టీఫెన్ కు తెలియదు.
సరిగా అదే సమయంలో తన బిల్డింగ్ పైన హెలికాప్టర్ శబ్దం వినిపించింది. సిసి టీవీలో ఆన్ చేసాడు.హెలికాప్టర్ నుంచి వేలాడుతూ కిందికి దిగుతోంది మోహన.
****************
(సీరియల్ ముగింపు ...రచయిత విసురజ చివరిమాట రేపటి సంచికలో )

No comments: