ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 18 June 2013

ఆగష్టు1(టాగ్ లైన్ ...డేట్ తో డిష్యుం...డిష్యుం)
26-05-2013 (Chapter-46)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
***********************
ఆ విధాత మనం తినే ప్రతీ బియ్యపు గింజ మీద మన పేరు రాస్తాడని అంటారు. గడిచే ప్రతీ క్షణం మీద తల రాతను కూడా లిఖిస్తాడా? కొన్ని క్షణాలు ఉద్వేగభరితంగా, మరి కొన్ని క్షణాలు విషాదభరితంగా ఎలా మారుతాయి. ఏ క్షణం తలరాత ఎలా వుంటుందో ఎవరికి తెలుస్తుంది?
**************
ఒక అపూర్వ దృశ్యం..ఒక అద్భుత కలయక....ప్రణవి....ముగ్ధ ....ఈ సృష్టిలో రెండు కళ్ళు అందమైనవే అని చెప్పడానికి అన్నట్టు...ఆ ఇద్దరూ...ఒకరినొకరు చూసుకున్నారు..ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.
కార్తికేయ ఆ ఇద్దరి వైపు చూసాడు. ఒకే ఆత్మ రెండు శరీరాలుగా అనిపించింది. క్షణకాల పరిచయం వాళ్ళని ఎంతో దగ్గరికి చేసింది. ఆ క్షణం కార్తికేయకి పూర్ణిమ గుర్తొచ్చింది. అనుబంధాలు, ఎంత గొప్పగా వుంటాయి? ప్రణవి ముగ్ధతో మాట్లాడుతుంది. తన గురించి చెప్పుకుంటుంది. తనెవరో తెలియదని వాపోతుంది. ప్రణవిని హాస్పిటల్ కు తీసుకువెళ్ళాలి.
***************
స్టీఫెన్ ఎదురుగా రామతీర్థం వున్నాడు...అతను ఢిల్లీ వచ్చి రెండు గంటలు అయింది. స్టీఫెన్ మొహం కోపంతో ఎర్రబడింది. టేబుల్ మీద రివాల్వర్ వుంది. రామతీర్థానికి సీన్ అర్ధమైంది.
"స్టీఫెన్ జీ మీరు కంగారు పడవలిసిన అవసరం లేదు. మాఫియాలోని మూడు గ్రూపులు వైజాగ్ వెళ్ళాయి. అతను ఎటువంటి పరిస్తితిలోనూ తప్పించుకోలేడు." రామతీర్హం చెప్పాడు.
"ఇలాంటి కథలు సినిమా డైరెక్టర్స్ కి చెప్పు ...వాళ్ళు సినిమాలు తీస్తారు. చంద్రహాస్ మామూలు మనిషి కాదు. అతను తన భార్య కోసం వెతుకుతున్నాడు. అతని మైండ్ లో అతని భార్య తప్ప మరొకరు లేరు. ఒక్క క్షణం అతను మన మీద దృష్టి పెట్టాడంటే మనం ఇలా
ఉండం.
అతను నిరాయుధుడిగా ఉన్నంత వరకే మనం ఇలా ఉండగలం..." స్టీఫెన్ చెప్పాడు.
రామతీర్థం క్షణకాలం మౌనం వహించాడు. స్టీఫెన్ సెల్ తీసి ఓ నంబర్ డయల్ చేసాడు.
"చంద్రహాస్ సెక్యూరిటీ చీఫ్ ఎక్కడున్నా వెంటనే ఇక్కడ వుండాలి" చెప్పాడు.
***********************
చంద్రహాస్ సారథి ఇంట్లోకి రావడం...ఆ వెనుకే మాఫియా దండు కదలడం ఒకే సరి జరిగింది. చంద్రహాస్ ఆ ఇంట్లోకే వెళ్ళాడని వాళ్ళ అనుమానం. వాళ్లకు భయం అంటే తెలియదు. అనుకున్న పని ఫినిష్ చేయాలి. సారథి ఇంటి తలుపులు దబ దబ బాదారు.
***************
చీర మార్చుకోబోతున్న సాత్యకి ఉలిక్కిపడింది. ఎదురుగా చంద్రహాస్...చేతిలో వున్న చీరతో శరీరాన్ని కప్పుకుంది కంగారుగా...బయట తలుపుల మీద శబ్దం ఎక్కువైంది. అది మామూలు శబ్దం కాదు.
ఏ క్షణమైనా తలుపు విర్గిపోతాయి. చంద్రహాస్ మొహంలో చెమట...ప్రాణాలు పోయినా అక్కడ ఉండకూడదని నిశ్చయించుకున్నాడు. క్షణాల్లో పరిస్థితి అర్ధమైంది. తలుపులు తెరుచుకోబోతున్నాయి .
సాత్యకి ముందుకు కదిలింది. చంద్రహాస్ ని మంచం మీదికి లాగింది. దుప్పటిని గొంతు వరకూ కప్పింది. తలుపులు తెరుచుకున్నాయి. ఆగంతకులు లోపలికి ప్రవేశించారు. లోపలి దృశ్యం చూసి ఆగిపోయారు. నేల మీద చీర...మంచం మీద స్త్రీ,పురుషులు ..సాత్యకి భయంగా వాళ్ళ వైపు చూసింది.,
అప్పుడే లోపలి వచ్చాడు సారథి. ఆగంతకులు, వాళ్ళ చేతుల్లో మారణాయుధాలు, మంచం మీద తన భార్య సాత్యకి, చంద్రహాస్....
"ఎవరు మీరు..కొత్తగా పెళ్ళయిన ఇల్లు ఇది...." వాళ్ళ వైపు చూసి అన్నాడు.
మాఫియా మనుష్యులు వెనక్కి తిరిగారు. ఇలాంటి చోట న్యూ సెన్స్ చేయరు. మంచం మీద వున్నది జంట అనుకున్నారు. చుట్టుపక్కల వాళ్ళు వస్తే అనవసరంగా సీన్ క్రియేట్ అవుతుంది. అందుకే జారుకున్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు. సాత్యకి లేచింది.
ఏడుస్తున్నాడు చంద్రహాస్..మొదటి సారి గుక్క పట్టి ఏడుస్తున్నాడు. చిన్నప్పుడు పుట్టగానే తను ఏడిచాడో లేదో తెలియదు. కానీ ఇప్పుడు ఏడుస్తున్నాడు.
సారథి చంద్రహాస్ భుజం మీద చేయివేసాడు. సాత్యకి చంద్రహాస్ వంక చూసింది. అతని కన్నీళ్లు తుడిచింది. ఆ రెండు చేతులు అలాగే పట్టుకున్నాడు.
"ఎవరు తల్లీ నువ్వు...జన్మనివ్వని అమ్మవా? రక్తం పంచుకు పుట్టని చెల్లివా? ఉద్వేగంతో కదిలిపోతూ కన్నీటి గోదావరిని ఆహ్వానిస్తూ..
( ఈ భావోద్వేగం రేపటి వరకూ...)

No comments: