ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 18 June 2013

ఆగష్టు1 (టాగ్ లైన్ ...డేట్ తో డిష్యుం...డిష్యుం)
27-05-2013 (Chapter-47)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
******************
చంద్రహాస్ మోకాళ్ళ మీద కూచున్నాడు. అతని కళ్ళు వర్షిస్తున్నాయి. చిన్నప్పుడు చదివిన కథ ఒకటి గుర్తొచ్చింది. "తల్లి స్నానం చేస్తుంది...బిడ్డ గుక్క పేట్టి ఏడుస్తున్నాడు...అంతే ఆ తల్లి వున్నఫలానా అలాగే పరుగెత్తుకు వచ్చి, బిడ్డ ఆకలి తీర్చడానికి స్తన్యమిచ్చింది,

తనకేమీ కానీ ఓ స్త్రీమూర్తి తన ప్రాణాలు కాపాడడానికి. .అతని హృదయ తంత్రులు మూర్చిల్లాయి.
సాత్యకి, చంద్రహాస్ తల మీద చేయి వేసింది. "మేము ఎవరో తెలియకుండా మాకు ఆశ్రయమిచ్చారు...బ్రతుకుదారి చూపించారు...తండ్రిలా, సోదరుడిలా...అన్నింటికీ మించి దేవుడిలా...ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది. మీరు చూపించిన ఔదార్యం మా గుండెలో నిలిచిపోతుంది. మిమ్మలిని కాపాడగలిగిన ఆనందం మాకు జీవితకాలం గుర్తుంటుంది. ఇది నా మాట మాత్రమె కాదు, మా మాట..అంటూ భర్త వంక చూసింది.
సారథి, చంద్రహాస్ దగ్గరికి వచ్చి అతని రెండు చేతులు పట్టుకుని "మీరు దేవుడు...ప్రణవి మేడంకి బిడ్డ పుడితే, ఆడ బిడ్డ పుడితే, పుట్టిన ఆ పాపాయిని పొత్తిళ్ళలోకి తీసుకుని, గుండెల్లోకి హత్తుకుంటారు ...మా సాత్యకి ఆ పాటి ప్రేమకు నోచుకోలేదా?
సాత్యకి, చంద్రహాస్ వైపు నీళ్ళు నిండిన కళ్ళతో చూసింది.
"ఏ విధాత రాయగలడు ఇంతటి భావోద్వేగ కథనం...ఏ అక్షర విధాత మస్తిష్కాన ప్రభవించు ఈ కన్నీటి దృశ్య కావ్యం?"
సాత్యకిని గుండెలకు హత్తుకున్నాడు. "నువ్వు నా పెద్ద కూతురివి తల్లీ..." అతని కన్నీటి చెమ్మ చెంప నుంచి జారి పలికే అక్షరంతో కలిసి ధన్యమైంది.
(ఈ సన్నివేశాన్ని నాలుగు వెర్షన్స్ రాసాను...ఇది చివరి వెర్షన్...రాస్తోంటే ఎందుకో చిన్న ప్రకంపనం, నా చేతివ్రేళ్ళ చివర ...స్టోరీ బోర్డులో వున్న సన్నివేశాన్ని కీ బోర్డు మీద ప్రెజెంట్ చేస్తున్నప్పుడు అక్షరాలూ జలదరించిన ఫీలింగ్....ఈ సన్నివేశంలో రాసిన అమ్మ కథ బాగా గుర్తు...పాలరాతితో చేసిన ఆ బొమ్మ మొన్న మొన్నటి వరకు పదిలంగా వుంది. అమ్మ ప్రేమను, మనుష్యులలో వున్న మానవతను చెప్పే అవకాశం ఈ చాప్టర్ ద్వారా వచ్చింది. సాత్యకి లాంటి ఔన్నత్యం వున స్త్రీమూర్తులకు, స్ఫూర్తి ప్రదాతలకు మనసా స్మరామి. అలాగే సారథి లాంటి మనసున్న మారాజులకు అభినందనలు...భార్య వైపు కన్నెత్తి చూస్తేనే అనుమానించే దాష్టీక సమాజంలో, సారథి లాంటి పాత్రను తీర్చిదిద్దడం నా అక్షరాల సుభాద్యత. మూడు ముళ్ళు వేసేవాడే కాడు భర్తంటే....చివరి శ్వాస ముడి విడిపోయే వరకు భార్యను వెన్నంటి వుండేవాడే భర్త...అది సారథి పాత్ర ద్వారా చెప్పించ యత్నించాను.. ఇక దీనిపై మీ హర్షమో లేక మరేదైనా అనేది చెప్పేది మీరే ---రచయిత )
*******************
అందమైన జ్ఞాపకం శ్వాస లాంటిది...
శ్వాసించడం మర్చిపోవడం......జ్ఞాపకాన్ని విస్మరించడం ...
రెండూ మరణంతో సమానం...
**********
ప్రణవి వెల్లికిలా పడుకుంది. కళ్ళు అలసటగా వున్నాయి. ఏసీ చల్లదనం ఆమె శరీరాన్ని తగులుతున్నా ఆమె మనసులో జ్ఞాపకాలు తనని దాహించివేస్తోన్న ఫీలింగ్...ముగ్ధను కార్తికేయను చూస్తుంటే, వాళ్ళిద్దరి మధ్య అనురాగాన్ని చూస్తోంటే...ఏదో ఓ జ్ఞాపకం ఎదలో...హిమవర్షంలా స్పృశిస్తూ తనని నిలదీస్తోంది..
తనవాడు ఎక్కడో వున్నాడు..ఎక్కడున్నాడు?
******************
చంద్రహాస్ రోడ్డు చివరికి వచ్చాడు. అప్పుడే వెనక నుంచి వచ్చిన లారీ చంద్రహాస్ ని గుద్దేసింది.
(పిచ్చాసుపత్రిలో చంద్రహాస్? రేపటి సంచికలో)

No comments: