ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 18 June 2013

ఆగష్టు1(టాగ్ లైను ...డేట్ తో డిష్యుం...డిష్యుం)
22-05-2013 (Chapter-42)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
++++++++
(ఒక పాపులర్ నవలలోని పాత్రలు మరో నవలలోకి ప్రవేశించడం అరుదైన, అద్భుతమైన ప్రయోగం...ఈ ప్రయోగ నేపథ్యం రచయిత విసురజ త్వరలో మీకు తెలియజేస్తారు -చీఫ్ఎడిటర్)
ఈ మధ్య కాలంలో భర్తకు అబద్దాలు చెప్పడం అలవాటు చేసుకుంది. అలాంటి పరిస్థితి వచ్చింది. కొద్దిగా తడబాటు...ఇంకొద్దిగా గిల్టీ ఫీలింగ్. " రాంగ్ కాల్స్ బెడద ఎక్కువైంది...అందుకే..." సంజాయిషీ ఇస్తున్నట్టు చెప్పింది...రాదాచంద్రిక.
అలాగా అన్నట్టు చూసి..." నీ ఫోన్ కు చాలా సార్లు ట్రై చేశాను. లిఫ్ట్ చేయకపోఎసరికి కంగారు ఎక్కువైంది ..అందుకే వచ్చేసాను" చెప్పి ఓ సారి భార్య వంక పరిశీలనగా చూసాడు. తనకు కావలిసిన భావం భార్యలో కనిపించింది కాబోలు...సంతృప్తిగా నిట్టూర్చాడు.
"నేను వెళ్తాను రాధీ...అర్జెంటు వర్క్ వుంది" అంటూ వెళ్ళిపోయాడు.
మామూలుగా ఇంటికి వచ్చినప్పుడు వెంటనే వెళ్ళే అలవాటు లేని భర్త ఇపుడు వెంటనే వెళ్తానని అన్నా కామ్ గా వూర్కుంది రాధాచంద్రిక. ఆమె టెన్షన్ లో వుంది. ఓ సారి ల్యాండ్ ఫోన్ వంక చూసింది. రిసీవర్ ని క్రెడిల్ చేసి వెళ్ళాడు భర్త.
మళ్ళీ ఫోన్ రింగ్ అవుతుందన్న భయంతోనే బాత్ రూం వైపు నడిచింది. షవర్ ధారా కింద నిలబడింది. షవర్ ఆన్ చేస్తోండగా చిన్న అనుమానం. వెంటనే అలానే బెడ్ రూం లోకి పరుగెత్తింది. తన సెల్ ఫోన్ తీసింది. మిస్సిడ్ కాల్స్ చెక్ చేసింది. ఆ లిస్టు లో కాల్స్ లేవు. తన సెల్ కు భర్త కాల్ చేయలేదు. మరి చేసానని ఎందుకు చెప్పినట్టు...ల్యాండ్ ఫోన్ కు ఫోన్ చేసే అలవాటు లేదు. అయినా తన సెల్ కు చేయకుండా?
అలానే ఉండిపోయింది. ఏదో చిన్న ఫీలింగ్ ఆమెను ఆక్రమిస్తోంది. అది అనుమానంగా మారబోతుంది.
**************
ఒక అనూహ్యమైన మలుపుకు కాలం సమాయాత్తం అవుతుంది. ఒక జ్ఞాపకాల పేటిక స్వరం విప్పబోతుంది. అందుకు హస్తిన వేదిక కాబోతుంది. దేశాన్ని కాపాడిన ఒక ధీరోధాత్తుడి ఆగమనం చారిత్రాత్మక సంఘటనకు, ఈ కథ మలుపుకు కారణం కాబోతుంది.
****************
న్యూ ఢిల్లీ...
జనసమ్మర్ధమైన దేశ రాజధానిలో, నిత్యం క్రైమ్ రేటింగ్ తో పోటీ పడే సమస్యలతో నిద్రలేచిన ఢిల్లీ నగరం.
ఆ జనారణ్య నగరంలోకి అడుగు పెట్టింది ప్రణవి. ఎక్కడెక్కడో ప్రయాణించి, ఏదో రైలు ఎక్కి అలిసి వచ్చింది. ఆమె మొహం వడలిపోయి వుంది..ప్రపంచంలో అత్యధిక సంపన్నల జాబితాలో వున్న వ్యక్తి ప్రణవి జీవిత భాగస్వామి అని ఎవరికీ తెలియదు...తనకూ తెలిసే అవకాశమూ లేదు. తానెవరో తెలుసుకునే ప్రయత్నంలో ఆమె ప్రయాణం యాధ్రూచ్చికమే ...కానీ అనివార్యం.
****************************
స్టీఫెన్ ఢిల్లీ లోకి అడుగుపెట్టాడు. చంద్రహాస్ అనే బలమైన శత్రువును ఎదుర్కోవాలంటే రాజకీయం అనే అస్త్రాన్ని సంధించాలని ఢిల్లీ వచ్చాడు. ఓవైపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కి వున్నాయి. ఐ పి యల్ గొడవ సద్దుమణగలేదు. సిబీఐ కి స్వయం ప్రతిపత్తి గురించి వార్తలు విహరిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ రాజకీయ నాయకుడితో తనకు వున్న పరిచయాన్ని ఉపయోగించుకుని వ్యాపారపు నిచ్చెనలు ఎక్కాలని అనుకుంటున్నాడు. స్టీఫెన్ కు అన్ని పార్టీల్లోనూ మిత్రులు వున్నారు. ఎప్పుడే ఏ పార్టీ అధికారం లోకి వస్తుందో...ఏ పార్టీ ప్రతిపక్షంలో వుంటుందో అంచనా వేస్తాడు. ఇద్దరితో సఖ్యంగా ఉంటాడు. అవసరమైతే ఇండిపెండెంట్ ను కూడా వదలడు.
చంద్రహాస్ గత కొద్ది రోజులుగా కనిపించడం లేదు. అతనెక్కడ ఉంటున్నది తనకు మాత్రమే తెలుసు. చంద్రహాస్ లేకుండా ఏ పనీ అంగుళం కూడా జరగదు...అలాంటిది ప్రణవి ఎంపైర్ లో ఇప్పటి వరకూ ఏ ఆటంకం లేకుండా వ్యాపారం ముందుకు సాగుతుంది. ఆర్ధిక లావాదేవీలు సజావుగానే వున్నాయి,
చంద్రహాస్ వ్యాపార సామ్రాజ్యాన్ని పడగొట్టడానికి అనువైన సమయమిదే.
చంద్రహాస్ ని మానసికంగా దెబ్బతీయాలి. అందుకు సరిపడా వ్యూహంతో వచ్చాడు.
******************
ఆ ఇల్లు సుస్వర రాగాల ఆలాపనలో ముగ్ధమనోహరంగా వుంది. బ్రహ్మదేవుడు తనే చిత్రకారుడై చిత్రించిన ప్రకృతి శోభ లా వుంది. పూజగదిలో సుఫ్రభాతం దేవదేవుడిని మేల్కొలుపుతున్నట్టు వుంది. ధూపం ఆ ఇంట్లో ఆనంద నర్తనం చేస్తోంది. దీపం పసిడి కాంతులీనుతుంది.
పూజగదిలో నుంచి బయటకు వచ్చింది ముగ్ధ. సరాసరి తన అంతరంగిక మందిరమైన పడగ్గదిలోకి వెళ్ళింది.
"జగాలనేలు జగన్నాథుడు మేల్కొన్నాడు...నన్నేలు నా ప్రాణనాథుడు మేల్కోలేదు" అన్నట్టు చూసింది.
"నీ కోసం సదా మేల్కొనే వుంటాను ...మేలుకునే వున్నాను..నిన్నేలుకున్న నేను నీ రాక కోసం కాచుకునే వున్నాను" అన్నట్టు కళ్ళు తెరిచాడు కార్తికేయ.
"శ్రీవారికి శుభోదయం..." వంగి అతని పెదవులకు గుడ్ మార్నింగ్ చెప్పింది.
"ఉదయమే...నా హృదయాన వున్న నువ్వు పెదవుల స్పర్శతో కరచాలనం చేస్తుంటే ...ఎన్ని వేన వేల ఉదయాలు మంచులో కరిగినట్టు...హిమమై నన్ను చుట్టేసినట్టు అనిపిస్తుంది"ముగ్ధను చుట్టేసి అన్నాడు.

ముగ్ధ భర్త వంక చూసింది. అదే ప్రేమ..అదే ఇష్టం..అదే ప్రాణం..కొన్ని భావాలకు లాజిక్కులు వుండవు. ప్రేమ.ఇష్టం....ఒక మేజిక్ లా పనిచేస్తుంది. అప్రయత్నంగా ఆమె చేయి తన పొట్ట మీదికి వెళ్ళింది...కార్తికేయ ప్రతిరూపం ఊపిరి పోసుకుంటున్న ప్రపంచం...
ఆమె భావాలను చదివినట్టు ...కార్తికేయ తన పెదవులను ఆమె లేత పొట్ట మీద ఆన్చాడు. అద్దంలా మెరిసిపోతున్నట్టు...ఆ నాభిలో తన ప్రతిబింబం కనిపిస్తోన్నట్టు...
"తల్లి గర్భంలో నిద్రపోతోన్న ఓ పసికూనా ....అభిమన్యుడివై ఆ మాటలు వింటున్నావా? "కార్హికేయ చేతులు ముగ్ధ నడుంని చుట్టేసాయి.
"బిడ్డ మాటలు వింటూ మురిసిపోతున్నారా? భర్త తల మీద పెదవులు ఆన్చి
"అయినా వాడి తండ్రి పద్మవ్యూహాన్ని చేధించి రావడమేలాగో కూడా చెబుతాడు" అంది కాసింత గర్వంగా.
"ముగ్దా...ఈ రోజు ఏదో జరుగబోతుంది...కానీ అదేమిటో తెలియడం లేదు" అన్నాడు.
"నా కన్ను కూడా అదురుతోంది ...నమ్మితే నమ్మకం..లేకపోతె సైన్స్ ...సిక్ష్త్ సెన్స్" నవ్వి కొనసాగించింది ముగ్ధ..." ఆ రోజు నిండు కొలువులో ద్రౌపది శ్రీకృష్ణుడిని పిలవగానే వెళ్ళాడు...ఈ రోజు పిలవకపోయినా ఈ కృష్ణుడు వెళ్తాడు..."
కార్తికేయ భార్య వంక గర్వంగా చూసాడు. భర్తల అంతరంగాన్ని, ఆంతర్యాన్ని అర్ధం చేసుకునే భార్యలు ఎంత మంది వుంటారు?
కార్తికేయ లేచాడు...తలదిండు కింద వున్న రివాల్వర్ ని తీసుకున్నాడు.
సరిగ్గా అదే సమయంలో...
********************
ప్రణవి ఓ హోటల్ ముందు ఆగింది...ఆ హోటల్ కు కూతవేటు దూరంలో నలుగురు ఆగంతకులు ...వాళ్ళ చేతుల్లో పదును తేలిన కత్తులు.
*************
(ఆ ఆగంతకులు ఎవరు? స్టీఫెన్ ప్లాన్ ఏమిటి? కార్తికేయ ఏం చేయబోతున్నాడు ?రేపటి సంచికలో)

No comments: