ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 20 June 2013

ఆగష్టు1(టాగ్ లైన్ ...డేట్ తో డిష్యుం...డిష్యుం)
04-06-2013 (Chapter-55)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ...
******************
స్వార్ధం...ఈ ఒక్క పదం ఒక్కోసారి మహావిధ్వంసాలను సృష్టిస్తుంది. విషాదాలను ఆవిష్కరిస్తుంది. ఈ ప్రపంచంలో మన ఉనికి ఎంత కాలం? మన శ్వాస ఎంత కాలం?అశాశ్వతమైన భౌతిక జీవితం కోసం చేసే భౌతిక దాడులు, ఈర్శాద్వేషాలు చివరికి విషాదాన్నే మిగులుస్తాయి...ఈ సత్యం తెలిసేసరికి, తెలిసేలోపే మనం ఈ ప్రపంచం నుంచి నిష్క్రమిస్తాం.
***************
స్టీఫెన్ లాప్ టాప్ లో కనిపించే దృశ్యాలు చూస్తున్నాడు. అతని పెదవుల మీద ఒక వికృతమైన, పైశాచిక ధరహాసం...డాక్టర్ మీద దాడి చేయబోతున్నాడు, చంద్రహాస్. చంద్రహాస్ లాంటి బిజినెస్ టైకూన్ ని తను పిచ్చివాడిగా చిత్రీకరించాడు. చాలా నాటకీయ సంఘటన.
ఒక సినిమా రచయిత సృజించినట్టు సృష్టించిన సన్నివేశం...
కథల కోసం పాత సినిమాలను వెతుక్కోవడం...సన్నివేశాల కోసం పాత సినమాల్లో వాటిని ముక్కలు ముక్కలు చేయడం...చంద్రహాస్ ని తెలివిగా ఎలా దెబ్బ తీయాలా? అని ఆలోచిస్తోన్న సమయంలో ఒక నిర్మాత, స్టీఫెన్ దగ్గరికి వచ్చాడు. అతని ఫైనాన్సు కావాలి...అతని కూడా ఒక రచయిత వచ్చాడు.
"సర్ మంచి కథ...హీరో డేట్లు వున్నాయి...అతనికి అడ్వాన్సు పే చేయాలి. హీరొయిన్ కి కొంత ఇవ్వాలి...మీరు దయ తలిచి..." ఆ నిర్మాత నీళ్ళు నమిలాడు. ఇలాంటివి స్టీఫెన్ కు కొత్త కాదు. ఆగిపోయిన సినిమాలకు ఫైనాన్సు చేసి..వాటి హక్కులను తీసుకోవడం అతనికి మామూలే
... కానీ ఇప్పుడు ఆ మూడ్ లో లేడు.
"సర్ ఇందులో మంచి మంచి ట్విస్ట్ లు వున్నాయి. హీరోని విలన్ ముప్పతిప్పలు పెడతాడు. పిచ్చివాడిగా తయారుచేస్తాడు. ఇది విలన్ ఆడే మైండ్ గేమ్ .." రచయిత చెప్పుకుపోతున్నాడు ..
స్టీఫెన్ ఒక్క సారిగా ఉలిక్కిపడ్డాడు...రచయితను తన చాంబర్ లోకి తీసుకువెళ్ళాడు..,
**************
విలన్ హీరోకి యాక్సిడెంట్ చేయిస్తాడు..హాస్పిటల్ ని సృష్టిస్తాడు...డాక్టర్స్, రోగులు...అంతా సెట్ చేస్తాడు...అతనికి పిచ్చి ఉందనే భ్రమను కలిగిస్తాడు...మానసికంగా దెబ్బ తెస్తాడు..." ఆ తర్వాత స్టీఫెన్ కు అక్కరలేదు...రచయిత తన కథను వింటున్న స్టీఫెన్ కు పూర్తీ కథ చెప్పాలని ఉత్సాహపడ్డాడు. కానీ స్టీఫెన్ కు కావల్సింది కథ కాదు...చంద్రహాస్ కధను ముగింపు చేయ సన్నివేశ కల్పన. రామతీర్థానికి ఇచ్చిన డబ్బులో పదవ వంతు రచయితకు ముట్టింది. కానీ స్టీఫెన్ ఆ కథ మొత్తం విని వుంటే ఈ కథ మరోలా వుండేది. అందుకే అంటారు పెద్దలు.. కంగారు పడితే గుడ్డు పెట్టడం పొదగడం అవుతుందా, అయినా విలనిజానికి విజయం వుంటుందా. మహా పండితుడు శక్తిశాలి రావణుడైన విజయం అందేడా.. అధర్మంచే ధర్మం చెర పట్టబడినా, అంతిమ విజయం ఎల్లప్పుడూ ధర్మందే కదా.
*****************
చంద్రహాస్ కు యాక్సిడెంట్ చేయించాడు..అతడిని ఇరిటేట్ చేయాలి...కన్ఫ్యూజన్ లో ఉంచాలి ...ఈ అవకాశాన్ని తను ఉపయోగించుకుని బిజినెస్ సర్కిల్ లో భార్య మరణంతో "పిచ్చివాడైన "చంద్రహాస్" అనే వార్త ను క్రియేట్ చేయాలి, సర్కులేట్ చేయించాలి.
****************
అక్కడ లాప్ టాప్ లో చూపుతున్న వైనమైన చంద్రహాస్ డాక్టర్ మీద ఎటాక్ చేయడం, అందరు అతనిని పట్టుకుని అతనికి మత్తు ఇవ్వడం జరిగిపోయాయి. తెల్ల వారితే అసలు డ్రామా మొదలవుతుంది.
*******************
ఇంకా పూర్తిగా తెల్లవారనే లేదు. ప్రణవి లేచింది. కిటికీ రెక్కలు తెరిచి బయటకు చూసింది. అక్కడ ఓ వ్యక్తి...తన వైపు చూసి చేతులు చాచాడు...నిర్మలమైన నవ్వు...కురిసే మంచులో నడుస్తూ తన వైపే వస్తున్నాడు. ఆ చిరునవ్వు చిరపరిచితమే....అతను కిటికీ దగ్గరికి వచ్చాడు. కిటికీలోనుంచి రెండు చేతులు లోపలి పెట్టాడు. ఆమె చెంపలను తాకాయి...చల్లగా...
*************
(ఈ భావోద్వేగం రేపటి వరకూ...)

No comments: