ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 20 June 2013

ఆగష్టు1(టాగ్ లైన్ ...డేట్ తో డిష్యుం...డిష్యుం)

03-06-2013 (Chapter-54)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
******************
వాతావరణంలో ఏదో మార్పు ...అది సహజసిద్ధంగా వచ్చిన మార్పు కాదు...ప్రకృతికి చేతబడి చేసినట్టు...గాలిలో ఏవో వికృత శబ్దాలు...సంధ్యాజ్యోతి నొప్పి భరించలేకపోతుంది. డాక్టర్ చెప్పిన విషయాలు గుర్తొచ్చాయి." ఇది ప్రకృతి పరమైనదే...స్త్రీకి అనివార్యమైనది"...కానీ ఈ నొప్పి ఆ నొప్పి కాదు....
గాలి వేగానికి సాయి ప్రతిమ కింద పడబోతుంది...పడబోతోంది...మంచం మీది నుంచి అలానే కింది దొర్లి నేల మీద పడుతూ....సాయి ప్రతిమను అందుకుంది. చిత్రంగా గాలి స్తంబించింది. సంధ్యాజ్యోతి కనులు మూతలు పడుతున్నాయి.
*******************
ఎనిమిదవ అడుగువేయబోతున్న చంద్రహాస్ ఎవరో ఆపినట్టు ఆగాడు...ఆ పరిసర ప్రాంతంలోకి వచ్చిన గుడ్లగూబ తనకు కావలిసిన ఆహారం వెతుక్కుంటున్నట్టు వుంది. ఎక్కడి నుంచో గాలిలో ప్రయాణిస్తూ ప్రేతాత్మ అక్కడికి వచ్చినట్టు వుంది.
ఆసుపత్రిలో కరెంట్ పోయింది. చిమ్మ చీకటి...మరియప్ప చేస్తోన్న ప్రయోగంలో ఒక అంకం పూర్తవుతుంది. ఈ ప్రయోగాన్ని చూస్తోన్న మరియప్ప భార్య ఆత్మ దేవుడితో మొరపెట్టుకుంది .
"దేవుడా ఒక మనిషిని క్షుద్రశక్తితో బలి తీసుకునే ఇలాంటి వికృత చర్యలను నువ్వు అడ్డుకోలేవా? నువ్వు సృష్టించిన ప్రాణులకు నువ్వే రక్ష ...ఈ ఆత్మను బలిగా స్వీకరించి మంచి మనుష్యులను కాపాడు"
ఆ ఆత్మ మొరను దేవుడు ఆలకించాడా? అక్కడ మరియప్ప తదుపరి అంకానికి సిద్ధమవుతున్నాడు. ఈ అంకం ఏమిటంటే శరీరంలోని రక్తాన్ని పీల్చి, మనిషి జ్ఞాపకశక్తిని హరించి, ఒక్కో అవయవం పనిచేయడం మానేసి....మంచానికి అతుక్కుపోయి మరణాన్ని చేరుకునే తంతు....
****************
కలత నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచింది ప్రణవి. కలత నిద్రలో కలవరపెట్టే పీడ కలలు ...తనకు సంబంధించిన మనిషికి ఏదో కీడు జరుగబోతుంది. లేచి సింక్ దగ్గరికి వెళ్లి మొహం కడుక్కుంది. పూజగదిలోకి వెళ్ళింది. సాక్షాత్తు కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరుడు ఒక వైపు...షిర్డీ సాయినాథుడు మరో వైపు...సూర్యచంద్రులు ఆ దైవాల ముందు మోకరిల్లినట్టు...కాంతి పుంజాలు ఆ విగ్రహాల చుట్టూ పరిభ్రమిస్తున్నట్టు...
వారి ముందు నిలబడి రెండు చేతులు జోడించింది. "నేనెవరో నాకు తెలియని ఈ విచిత్ర, విషాద దుస్థితి నుంచి నన్ను బయటకు తీసుకురాకపోయినా,...నా వాళ్లకు, నా ప్రాణసమానమైన, నా వ్యక్తికీ ఏమీ కాకుండా చూసే భారం నీదే..."
హాలులో నుంచి ఇదంతా గమనిస్తూనే వున్న కార్తికేయ మనసు ఒక్క క్షణం బాధతో విల విల్లాడింది. ఒక్క క్షణం "చంద్రహా స్ గురించి చెప్పాలనిపించింది. కానీ ఇది తగిన సమయం కాదని" ఆగిపోయాడు.
********************
చంద్రహాస్ కు మెలుకువ వచ్చింది. తను మంచం మీద వున్నాడు...ఎవరో శరీరంలోని రక్తాన్ని తోడేసిన ఫీలింగ్...డాక్టర్స్ తిరుగుతున్నారు...తన పక్కన వున్న వాళ్ళు పిచ్చి పిచ్చి నవ్వులు నవ్వుతున్నారు.
"ఎక్స్ క్యూజ్ మీ ..." ఓ డాక్టర్ ని పిలిచాడు చంద్రహాస్ ..
ఆ డాక్టర్ ఆ మాటలు వినిపించుకోనట్టు ముందుకు వెళ్ళాడు. మరో సారి పిలిచాడు...అయినా నో రెస్పాన్స్ ...చంద్రహాస్ లేచి డాక్టర్ దగ్గరికి వెళ్లి అతని భుజాలు పట్టి కుదిపాడు. డాక్టర్ నిర్లక్ష్యంగా చూసాడు.
కోపంతో చంద్రహాస్ పిడికిళ్ళు బిగుసుకున్నాయి.

(ఈ సస్పెన్స్ రేపటి వరకూ)

No comments: