ఆగష్టు1...డేట్ తో డిష్యుం...డిష్యుం
12-06-2013 (chapter-63)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
******************
కొన్ని సంఘటనలకు లాజిక్కులు వుండవు...కొన్ని స్వార్ధాలకు విచక్షణ,మానవత్వం
లాంటివి వుండవు...రాదాచంద్రిక జీవితంలో జరిగిన సంఘటనలకు విషాదమే సాక్షి
సంతకం.
గుండె పగిలినప్పుడు శబ్దం రాదు...ఎందుకంటే గుండె గాజుతో తయారు
చేయబడలేదు...అది లోహం కాదు...వస్తువూ కాదు...బ్రహ్మదేవుడు సృష్టించిన ఒకే
ఒక ప్రాణం...అది మనసైన వాడి కోసమే నిరంతరం కొట్టుకుంటుంది.ఆ గుండె సవ్వడే
మనిషిని బ్రతికిస్తుంది.
రాదాచంద్రిక గుండె పగిలింది..సుకన్య "భర్త
గురించి చెప్పినప్పుడు"..తనను ల్యాండ్ ఫోన్ ద్వారా భర్తే బ్లాక్ మెయిల్
చేస్తున్నాడని సుకన్య ఆధారాలతో సహా నిరూపించింది.తన ఆస్తి కోసమే ఈ పని
చేసాడు అనుకుంటే కొద్దిగానైనా తృప్తిగా వుండేది. కేవలం మరో స్త్రీ కోసం
,తనను మోసగించాడు.తన నమ్మకాన్ని తన ఆయుధంగా మార్చుకున్నాడు.
ఈ
ప్రపంచంలో తన భర్తకు మించిన ఆస్తి మరోటి లేదని నమ్మింది.కానీ మరో స్త్రీ
పొందు తన భర్తకు ముఖ్యమని తెలిసింది.ఆ రోజు మనసు బాగాలేక గుడికి వెళ్తుంటే
దారిలో భర్త ,ఓ స్త్రీ...
గెస్ట్ హౌస్ కు వెళ్ళినప్పుడు శవంలా
నటించిన స్త్రీ...ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తున్నారు...తనకు నిజం తెలిసిన
విషయం భర్తకు ఇంకా తెలియదు.
ఎంత స్వార్ధం...ఒక శరీరం మీద
వ్యామోహం...రక్తమాంసాల దేహం...సిరలు,ధమనులు....రక్తం...కేవలం ఊపిరి ఉన్నంత
వరకు మాత్రమే వుండే దేహం...కొన్ని క్షణాల లేదా నిమిషాల
రాపిడి...ఉద్వేగానికి గురి చేసే స్పర్శ...డబ్బుకు అమ్ముడు పోయింది.
"అందమైన ,అనుకూలమైన భార్య..ఏ క్షణమైనా, మీ సన్నిధిలో,మీ సాంగత్యంలో కరిగి
కలిసి పోవడానికి,ఈ శరీర్తాన్ని పాన్పుగా మీ ముందు పరచడానికి సిద్ధం "అని
చెప్పే భార్య,,,శయనేషు రంభలా,కార్యేషు దాసిలా వుండే భార్య వున్నా, మరో దేహం
పై ఈ మమకారం ఎందుకు ? భర్త ను చూస్తే
అసహ్యం కన్నా ,జాలి ఎక్కువ కలిగింది....ఎందుకంటే తనలాంటి భార్యను అతను మిస్సవుతున్నందుకు...
ఒక్క క్షణం చనిపోవాలన్న ఆలోచనా వచ్చింది.ఒక పుస్తకంలో చదివిన కొన్ని వాక్యాలు గుర్తొచ్చాయి.
"మరణం పరిష్కారం కాదు...అనివార్యమైన చివరి వీడ్కోలు...అది మృత్యువు తనంతట
తానూ వచ్చినప్పుడే వెళ్ళాలి.మనకై మనం వెల్ల కూడదు....నీ కోసం మిగిలి
వున్నా అనుభవాలు ప్రోది చేసుకో...అనుభూతులు పదిలపర్చుకో...ముందు నిన్ను
నువ్వు ప్రేమించుకో..నీ కన్నా నిన్ను ఎక్కువ ప్రేమించేవారు వచ్చినప్పుడు
నువ్వు వారికి దాసోహమవ్వు..."
తను చనిపోకూడదు...ఒక బాలీ వుడ్ తార మరణం
ఏం చెప్పింది? ఆమె ఆత్మహత్య ఎవరికీ లాభించింది ?అతను అన్నీ
మర్చిపోతాడు...మరో స్త్రీ అతని జీవితంలోకి ప్రవేశిస్తుంది.ఆమె మరణం ఒక
వాక్యంగా మిగిలిపోతుంది.
*******************
రాదాచంద్రిక ఆత్మహత్య చేసుకుంది.రైలుపట్టాల మీద శరీరం నుజ్జు
నుజ్జయింది...గుర్తు పట్టడానికి వీల్లేకుండా...తన వీలునామాలో తన యావదాస్తి
నిరుపేదల కోసం ఓ ట్రస్ట్ కు రాసింది.రాదాచంద్రిక భర్తకు ఇది కోలుకోలేని
షాక్...భార్య మరణంతో ఆమె ఆస్తి దక్కలేదు...ఆమే దక్కలేదు...ఆస్తి లేని
అతడిని అతని తాజా ప్రియురాలు వదిలేసింది.అతనిప్పుడు తన జీవితాన్ని జీరో
నుంచి మొదలుపెట్టాలి..అతనిప్పుడు ఒక జీరో...అతని పక్కన ఒకటిగా నిలిచిన
రాదాచంద్రిక విలువ ఇప్పుడు తెలిసివస్తుంది.
అప్పటికే ఆలస్యం
అయింది..కాలచక్రంలో వర్తమానాన్ని ,భవిష్యత్తును పదిలపర్చుకుని
జాగ్రత్తపడవచ్చు...గతాన్ని,గడిచిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేము.
******************
ఆ రాత్రి రాదాచంద్రిక సుకన్యకు థాంక్స్ చెప్పింది.అనాథ శవాన్ని తన శవంగా ఈ
ప్రపంచాన్ని నమ్మించినందుకు... ట్రస్ట్ వ్యవహారాలూ సుకన్య పర్యవేక్షణలో
కొనసాగుతాయి.
"నేను విరక్తి తో వెళ్ళడం లేదు...జీవితంలో మగవాడు అంటే
అసహ్యంతో వెళ్ళడం లేదు.నేను కోల్పోయిన ప్రేమను అన్వేషిస్తూ
వెళ్తున్నాను..."ఆమే సెలవు తీసుకుంది.ఆమే ఇప్పుడు బేల కాదు...ఆమె
మేలుకుంది...ఆమె చేతిలో మేలుకొలుపు ముచ్చట్లు పుస్తకం వుంది...
(తొందరపాటుతో మృత్యువును ఆహ్వానించిన జియాఖాన్ కు ఈ అధ్యాయం
అంకితం...ఆత్మహత్య ఆలోచన వచ్చిన మరుక్షణం ఈ అధ్యాయం మీకు గుర్తుకు
వస్తే...మీలో స్ఫూర్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తే...మీకు హేట్సాఫ్
...రచయిత )
***************
కార్తికేయ చేతిలోని చెట్టు కొమ్మ మహా అస్త్రమై గాలిలోకి లేచింది.సమస్త
క్షుద్ర శక్తులు ఏకమైన క్షణం...మరియప్ప తన రక్తంతో నిక్శూచిని సంతృప్తి
పర్చాలనుకున్న క్షణం...ఉగ్రమై...మహోగ్రమై...భీకరమై...విలయ
విధ్వంసమై....గాలిని చీల్చుకొని,భీభత్సాన్ని వెంటపెట్టుకుని..సమాధులను
చీల్చుకుని ...కదిలిన నిక్శూచి...
(ఈ సస్పెన్స్ రేపటి వరకూ ..)
No comments:
Post a Comment